అతిధి - అచ్చంగా తెలుగు
అతిధి
ఆదూరి. హైమావతి.

హిమాలయాల్లోని మానససరోవరంలో నివసించే హంసలు ఒకమారు ఆకాశంలో విహరిస్తూ వెళుతుండగా, ఒక హంస పొరపాటున గుంపు నుండీ తప్పిపోయింది . అది తన జాతి పక్షులను వెతుక్కుంటూ గంగానది ఒడ్డున తెల్లగా కనిపించిన పక్షు లను చూసి, తనజాతి వారిగా భావించి క్రిందికి దిగింది. 
          నది ఒడ్డుకు దిగగానే అక్కడున్న తెల్లని పక్షులను చూసి ఆశ్చర్యపో యింది. అవి తమ జాతి పక్షులు కావు,ఐతే అవి తెల్లగా ఉన్నాయి. వాటికేసి చూసింది హంస. అక్కడ నదిలో తమ ఆహారాన్ని వేటాడి తింటున్న బాతులు ,తమ రంగులోనే ఉండి తమకంటే పెద్దగా, అందంగా ఉన్న హంసకేసి ఆశ్చర్యంగా చూసాయి.
హంస వాటితో" మీరూ మాలా తెల్లగా ఉన్నారు ,మీజాతిపేరేంటీ? మాజాతి పక్షులను హంసలంటారు. నేను మాగుంపుతో తప్పిపోయి మిమ్ము చూసి మాజాతే అనుకుని ఆకాశం మీదనుంచీ క్రిందకు దిగాను." అంది.
దానికి బాతుల్లో నాయకుడైన పెద్దబాతు " ఓహ్! హంసలంటే మీరేనా! మీ పేరు విన్నాం కానీ చూట్టం ఇదే!ఎంత అందంగా ఉన్నారూ!మమ్మల్ని బాతులంటారు" అంది ఎంతో సౌమ్యంగా.                                                           హంస కూడా చాలాస్నేహంగా " మీరు మాత్రం తెల్లగా మల్లెపూలలాలేరూ! ఎంత బాగా ఈదుతున్నారు? క్యాక్‌ క్వాక్‌  అనే మీ అరుపుచాలా బావుంది." అంది మెచ్చు కోలుగా.  
     "ఎంతైనా మీ అందమే అందం , మీజాతి వాగ్దేవి ఐన పలుకులతల్లి వాహనంట కదా! మీ నడక కు హంసనడక అని గొప్పపేరుకదా!మిమ్ము చూడటం మా అదృష్టం. మాకెంతో సంతోషంగా ఉంది.మీ ధవళ  వర్ణం ఎంత బావుందీ!" అంది మృధువుగా .
" అందరం ఒకేరంగు పక్షులం ,ఇంకా కొంగలూ, తెల్ల కపోతాలూ కూడా మనలా తెల్ల గా ఉంటాయిట కదా! అందరం ఒకేజాతి. భగవంతుడు అంద ర్నీ సృష్టించాడు . మనమంతా ఆయన సంతానమేకదా ! ఒకరు గొప్పా ఒకరు తక్కువాలేదు బాతు మిత్రమా!"అంది హంస మృధువుగా.
" మా విందు సేవించాలి ఈ రోజు, మా అతిధులుమీరు" అంటూ ," పిల్ల బాతులూ ! మన అతిధి మనలాగా పురుగులనూ, గింజలనూ తినదు, వెళ్ళి కొద్ది దూరంలో ఎగు వన ఉండే తామర తూడులను కోసి తీసుకురండి."అని కోరింది. వెంటనే యువ బాతులన్నీ వేగంగా ప్రవాహానికి ఎదురు ఈదు కుంటూ వెళ్ళి కొద్దిసేపట్లోనే చాలా తామర తూడులను ముక్కుతో పట్టుకొచ్చాయి. 
      వాటిని హంస ముందు ఉంచాయి.హంస ఎంతో ఆశ్చర్యంగా వాటిని చూసి , "ఆహా! మీ స్నేహమూ, ప్రేమా   చాలా గొప్పవి."అంటూ తామర తూడుల్లోని గుజ్జు వల్చుకుని తింటుండగా, పైనుంచీ  గుంపుగా హంసలు ఎగరడం చూసి" అదో! మా జాతి నన్ను వెతుక్కుంటూ వచ్చింది. మీ ఆద రం ప్రేమా మరువలేనివి. ఎప్పుడైనా మీరు మానస సరోవరం కేసి వస్తే మా విందు సేవించండి. వస్తాను మిత్రులారా!ఈ రోజు నాకు సుదినం "అంటూ పైకెగిరి తన గుంపుతో కలిసింది. బాతులన్నీ రెక్కలూ పుతూ వీడ్కోలు చెప్పాయి. 
అతిధి అభ్యాగతులను గౌరవించడం ధర్మం. అందరితో స్నేహంగా ఉండటం గొప్పనైజం.   
 ****            

No comments:

Post a Comment

Pages