నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) -"పూర్ణాంగి" - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) -"పూర్ణాంగి"

Share This
నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) -"పూర్ణాంగి"    
శారదాప్రసాద్


ఇంతవరకూ నా జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను,ఉద్యోగ ,సంసార బాధ్యతలను,నన్ను ప్రభావితం చేసిన కొందరి మహానీయులను గురించి,పండంటి సంతానం, వారి ప్రవృత్తిని గురించి ....చెప్పటం జరిగింది.ఇప్పుడు నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి ,కష్టాల్లో,సుఖాల్లో నన్ను వెన్నంటి ఉన్న నా సతీమణిని గురించి చెప్పదలచుకున్నాను!30-03-1972 లో అభిజిత్ లగ్నంలో మాకు వివాహమైంది.దూరపు సంబంధమే!అప్పుడు ఆమెకు 18 ఏళ్ళు, నాకు 21 ఏళ్ళు.ఇది పెద్దలు నిర్ణయించిన పెళ్ళే !వివాహం సంప్రదాయ బద్ధంగానే జరిగింది .అప్పటికి నాకు ఇంకా ఉద్యోగం రాలేదు.భార్య కాపురానికి కూడా వచ్చింది!ఒంటరి వాడిని జంటగా అవటం వలన ,ఆవిడను గురించిన ఆలోచన కూడా మొదలైంది.ఉమ్మడి కుటుంబం,ఆవిడతో మాట్లాడటానికి కూడా బెరుకుగా ఉండేది.నిరుద్యోగిని కావటం చేత కోరికలను లోపలే దాచుకున్నాను.నా భార్యకు కావలసిన అవసరాలన్నిటినీ మా అమ్మ గారే చూసుకునేవారు!నాన్న గారు నా ఖర్చులకు పాకెట్ మనీని పెంచారు!ఆవిడ అడుగుపెట్టిన విశేషం వలన తొందరగానే ఉద్యోగం వచ్చింది.అప్పటికి ఆమె గర్భవతి!మొదటి కాన్పు కనుక ఇప్పుడు కొత్తగా సంసారం వద్దులే,ప్రసవం అయిన  తర్వాత ఆలోచిద్దాం అని అమ్మా,నాన్నలు చెప్పారు.  18 ఏళ్ళ వయసులో నా చిటికెన వేలు పట్టుకొని వచ్చిన ఆమె,జీవితంలో ఇప్పటివరకూ వేలూ,లక్షల ఖరీదుతో కూడిన ఏ కోరికలు కూడా కోరలేదు!ఇప్పటికీ అంతే!ఆరోగ్యం బాగాలేకపోయినా ,ముందర నా ఆరోగ్యం గురించి ఆలోచించేది.నేను వారి తల్లిని neglect చేశాననే భావం కూడా పిల్లల్లో ఏర్పడి ఉండొచ్చు !కానీ అది నిజం కాదు! అప్పుడప్పుడు చిన్న కలహాలు వస్తుంటాయి!అవి కూడా పిల్లలను గురించి,వారి అవసరాలను గురించే!వెంటనే మరచిపోయే వారం!ఇంతకన్నా అన్యోన్య దాంపత్యాన్ని ఊహించటం కష్టమేమో! నా భార్య  ఎక్కువగా బాధపడిన సందర్భాలు రెండున్నాయి!ఒకటి నాకు 1997 లో హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు.నన్ను చూసి బయటకు కనపడకుండా కన్నీళ్లు పెట్టుకుంది!అయితే అవి నాకు కనపడ్డాయి!మీకేమి కాదని ధైర్యం చెప్పింది. 'మంగళ సూత్రమును మదిని ఎంత నమ్మినదో !' ఆ ఆపద సమయంలో నాకు అత్యంత సేవలు చేసిన మరొక వ్యక్తి ,చంద్రుడు-నా రెండవ తమ్ముడు!వాడు డాక్టర్ తో "చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నాం!ఎట్టి పరిస్థితులలో కూడా నా అన్నయ్యను కాపాడాలి!"అని చెబుతున్న విషయాలు నా చెవిన పడి కళ్ళు చెమ్మగిల్లాయి!రాముడు లక్ష్మణుడికోసం పరితపించటం చూసాం కానీ,లక్ష్మణుడు రాముడి కోసం పరితపించటం అంటే ఇదేనేమో!వాడికి నాకు రెండేళ్లే తేడా!అందువల్ల స్నేహితుల్లాగా ఉండేవారం !నా భార్య అదృష్టం,పిల్లల అదృష్టం వల్ల కోలుకున్నాను!ఆ సమయంలో నాకు అది చేసిన సేవలు మరువలేనివి!వీటన్నిటినీ మించి ,పిల్లల పోషణ బాధ్యత అంతా అదే చూసుకునేది!వారి అవసరాలను మాత్రం నాకు తెలియచేసేది!ఆరోగ్య రీత్యా దానికి కొన్ని సమస్యలున్నాయి!వాటిని కూడా వెంటనే చెప్పదు!ఈ మధ్య ఎక్కడో ఒకచోట చదివాను!యవ్వనంలో భార్యాభర్తలు ఒకరినుంచి మరొకరు ఏదో ఒకటి ఆశిస్తారు.నడి వయసులో భర్తకు ఇది చేయాలని భార్య, భార్యకు ఇది చేయాలని భర్త  అనుకుంటారు.ఆ రెండు ఘట్టాలు అలా ముగుస్తాయి!ప్రాప్తం 
ఉన్నవారికి అవి సంభవిస్తాయి,లేని వారికి తీపి కోరికలుగానే మిగిలి పోతాయి!ఇక వృద్ద్దాప్యంలోకి వచ్చేటప్పటికి ,భార్యకు ఏమీ చేయలేకపోయానని భర్త,భర్తకు ఏమీ చేయలేకపోయానని భార్య బాధపడతారు!అదీ దాటిన తర్వాత,నాకంటే  ముందుగా భార్య చనిపోతే బాగుంటుందని భర్త,భర్తే చనిపోతే బాగుంటుందని భార్య అనుకుంటారు!పుణ్య దంపతుల భావనలు ఇలానే ఉంటాయి!పైన చెప్పిన భావాలన్నిటినీ కలిపి అద్భుతమైన పదచిత్రంగా శ్రీ రమణ గారు తన మిధునం కధలో అత్యద్భుతంగా చిత్రీకరించారు!విషయం వచ్చినప్పుడే రచయిత తన భావాలు చెప్పుకోవాలి!లేకపోతే  ,అవి అతనితోనే అలా చనిపోతాయి!సరే ఇక నా భార్య రెండవసారి బాగా బాధపడటం--అర కిలో బంగారాన్ని పోగొట్టుకున్నప్పుడు!బంగారం పోయినందుకు కాదు దాని బాధ!పెళ్లినాటి నగలతో సహా పోవటం వలన చాలా బాధపడింది.ఇప్పుడు దానికి బంగారం అంటేనే విరక్తి కలిగింది!సాధారణంగా ఉంటుంది నా ఇల్లాలు .జుట్టుకు రంగువేసుకోవటం,సౌందర్య పోషణ కోసం తిప్పలు పడటం దానికి పరమ అసహ్యం!నిజానికి అటువంటి వారిని చూస్తే నాకు కూడా అసహ్యమే!ముసలి గుర్రానికి ఎంత మేత పెట్టినా,అది తినలేదు సరికదా సరిగా పరుగెత్తలేదు కూడా!అలానే వయసు మళ్ళినవాళ్లు ఎన్ని బాహ్య సౌందర్యాలు చేసుకున్నా జవసత్వాలు పెరుగుతాయా?ఇన్నేళ్ల  దాంపత్యంలో మేము ఒకరిని విడిచి మరొకరం కనీసం ఒక వారం కూడా ఉండలేదు!ఇంటికి వచ్చిన అతిధి, అభ్యాగతులను సత్కరించి  పంపటం లాంటివి కూడా తానే గుర్తించి నాకు సూచిస్తుంది!ఇప్పుడు పూర్తిగా ఆధ్యాత్మిక ధోరణిలో పడింది!గురువుగారు చేసిన మంత్రోపదేశాన్ని శ్రద్ధగా చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటుంది.దాన్ని గురించి చెప్పాలంటే ,ఒక గ్రంధమే అవుతుంది!భర్తననుసరించి ఉండే భార్య 
ఉన్నవాడికన్నా అదృష్టవంతుడు వేరే ఎవరు ఉంటారు? ఆ విధంగా కూడా మళ్ళీ నాదే పై చేయే!ఇంతటి పరిపూర్ణమైన జీవితాన్ని నాతో పంచుకున్న ఆమె, నా అర్ధాంగి కాదు,పూర్ణాంగి!మానవుడు తనువు చాలించేవరకు మొత్తం 16 కర్మలు ఉంటాయి. వాటిల్లో వివాహం అతి ప్రధానమైనది, స్త్రీపురుషులు కలిసి ధర్మార్థకామమోక్షాలను సాధించుకోవడమే వివాహ పరమార్థం. రెండు ఆత్మలు ఏకమవ్వడమే వైవాహిక జీవితం.లౌకికంగా ఏర్పడే అన్ని అనుబంధాలలోకి వివాహబంధం అతి ముఖ్యమైనది, పవిత్రమైనది. 
మరికొన్ని ముచ్చట్లతో మరో సారి!
***

3 comments:

  1. Excellent narration

    ReplyDelete
  2. Inspirational message for the present generation.

    ReplyDelete
  3. నిజజీవితంలో జరిగిన కొన్ని విషయాలను నిర్భయంగా వ్రాసారు

    ReplyDelete

Pages