స్నేహానికన్న మిన్న... - అచ్చంగా తెలుగు

స్నేహానికన్న మిన్న...

Share This
స్నేహానికన్న మిన్న...
మధుపత్ర శైలజ 



(అర్చన ఫైన్ -ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబుల్ సొసైటి సంయుక్తంగా నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి పొందిన కధ )
అన్నయ్యా! బాగున్నారా? మన పిల్లలిద్దరు అమెరికా నుండి ఎల్లుండికి ఇక్కడకు చేరతారుట.  సూర్యా ద్వారా మీకు కూడా ఈపాటికి విషయం  తెలిసే ఉంటుంది. మరి రాత్రి రైలుకు వదినగారితోపాటు మా ఇంటికొచ్చేయండి. మనమంతా కలసి చాలా రోజులయ్యింది, సరేనా? ఉంటాను మరే విషయం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోను పెట్టేసింది ప్రభావతి.  
ఏలూరులో బ్యాంకాఫీసరుగా  పనిచేస్తున్న నరేంద్రగారితో మట్లాడింది ప్రభావతి. ఎనిమిదేళ్ళ క్రితం క్రిందట కామారెడ్డి దగ్గర ఉన్న ధరూర్ విలేజ్ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేసే సమయంలో నరేంద్రగారు ప్రభావతి వాళ్ళ ఇంట్లో పై పోర్షన్లో అద్దెకుండే వారు. ప్రభావతి యాదగిరి దంపతులకు చందు నిర్మల, నరేంద్రగారి దంపతులకు సూర్యా, కిరణ్మయి పిల్లలు.   ఉన్న నాలుగేళ్ళు రెండు కుటుంబాలు చాలా కలసి మెలసి ఉండేవి. అందరూ వీళ్ళది రక్తసంబంధమని అనుకొనే  వారు.
 పండుగలను కలసి ఆర్భాటంగా చేసేవారు. సంక్రాంతి పండుగకు నరేంద్ర గారి సొంత ఊరు గుడివాడ దగ్గరలోని పల్లెటూరు వెంట్రప్రగడకు వెళ్ళి   వచ్చేవారు. అక్కడ నరేంద్రగారి తల్లిదండ్రులు, ఓ పదెకరాల పొలం, సొంత ఇల్లూ ఉన్నాయి. పండుగకు పిల్లలొచ్చేసరికి కౌలురైతు భార్యతొ కలసి అరిశెలు, జంతికలు, బూంది లడ్డులు, వెన్న గవ్వలు, చేగోడీలు మొదలైన పిండివంటలు చేసి ఉంచేవారు నరేంద్రగారి అమ్మగారు. నలుగురు పిల్లలూ ఊరంతా చుట్టిపెట్టొచ్చేవారు.  టూరింగ్ టాకీస్ లో సినిమాకెళ్ళేవారు. నరేంద్రగారి బంధువుల ఇళ్ళకు వెళ్ళి వచ్చేవారు. ఆ నాలుగు రోజులు పండుగ సందడంతా నరేంద్రగారింట్లోనే కనిపించేది.  
భోగిపండుగరోజున ఉదయమే వేసే భోగిమంటలు, సాయంత్రంకాగానే బొమ్మలకొలువు పేరంటాలతొ ఇంటా బయిటా ఒకటే సందడిగా ఉండేది. సంక్రాంతి రోజున హరిదాసుల పాటలు, కోడిపుంజుల ఆటలు, ఎడ్లబళ్ళ పందాలు జరిగేవి. చూసేందుకు పిల్లలకు నాలుగు కళ్ళూ చాలేవి కావు. చందు వాళ్ళ ఊరిలో జరిగే బతుకమ్మ ఆటలు, బోనాల సంబరాలు వేరేవిధంగా ఉంటాయి. సూర్యా వాళ్ళు అక్కడి పండుగలను అస్వాదించినట్లుగా చందు వాళ్ళు ఇక్కడి సంక్రాంతి పండుగను ఆనందంతో జరుపుకొనేవారు. వెళ్ళే రోజు బామ్మా తాతయ్యలు పిల్లలకు, పెద్దలకు కొత్త బట్టలను పెట్టి సంతోషంగా పంపేవారు. వాళ్ళు కట్టించిన బియ్యం మూటలు, అటుకులు, పిండి వంటలు, పచ్చళ్ళు, తేగలు ఇత్యాదులతో సగం రైలు వీళ్ళ సామానులతోనే నిండిపోయేది. అలా రెండు కుటుంబాల మధ్య అరమరికలు ఉండేవికావు.
పిక్నిక్ లకు వెళ్ళినా, యాదగిరిగారింట్లో లేదా వారి బంధువుల ఇళ్ళలో ఏ ఫంక్షన్ లయినా అంతా కలసి వెళ్ళేవారు. పిల్లలు నలుగురు సంక్రాంతి పండుగనుండి వచ్చిన తరువాత ఓ పది రోజులు పండుగ కబుర్లు, బామ్మా తాతయ్యల ప్రేమ గురించి తమ స్నేహితులతో కథలు కథలుగా చెప్తూండేవారు. అది విన్న వాళ్ళ స్నేహితులు మాక్కూడా ఆ ఊరు చూడాలని ఉందిరా అంటూండే వాళ్ళు.  
ఆ సంవత్సరం సూర్య,  కామారెడ్డిలో ఉన్న రెసిడెన్షియల్ కాలేజిలో ఇంటరులో చేరాడు. అతని చెల్లెలు ఆరో తరగతి చదువుతూండేది. సూర్యాను కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయించి అమెరికాకు పంపాలని నరేంద్రగారి కోరిక.  దానికి తగ్గట్టుగా సూర్యా కూడా చాలా శ్రధ్ధగా  చదువుకొనేవాడు. 
ఇక యాదగిరిగారి పొలాలు వర్షాధారాలు. పండీపండక వచ్చే ఆదాయం ఆ కుటుంబానికి తిండికి బట్టకు కరువు లేకుండా సరిపోయేది.  కొడుకును కార్పొరేట్ కాలేజిలో చేర్పించటం కష్టమని ప్రభుత్వ కళశాలలో చేర్చారు.
శెలవలకొచ్చినప్పుడు సూర్య తన దగ్గరున్న స్టడీ మెటీరియల్ ను జిరాక్స్ తీయించి చందుకి ఇచ్చేవాడు.  తెలియనివి చెప్పించుకుంటూ ఉన్న తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకొనేవారు స్నేహితులిద్దరు. స్నేహితుడి మంచి మనసుకి చందు చాలా ఆనందించేవాడు.  పెద్దవాళ్ళంతా వీళ్ళ స్నేహానికి ముచ్చట పడేవారు.  
అలా ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ శెలవలకు వచ్చిన సూర్య ఒక వారం పాటే అందరితో గడిపాడు. తిరిగి వెళ్ళేటప్పుడు చందుతో ఎం.సెట్ కు ప్రిపేర్ అవ్వు. ఆదివారాలు ఫోను చేస్తే ఏమైనా సందేహాలుంటే చెప్తాను. ఎగ్జాంకు చాల తక్కువ సమయమే ఉంది అని స్నేహితునికి చెప్పి వెళ్ళాడు.  
ఈ లోగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం చాలా ఉధృతంగా వచ్చింది. కొందరు  కార్యకర్తలతో కలసి ఉద్యమ బాట పట్టాడు చందు.  నాయకుల ప్రసంగాలను, ఆంధ్రా వాళ్ళు మనకున్న ఉపాధిని, అవకాశాలను, మన వ్యాపారాలను మనకు కాకుండా చేస్తున్నారని, ఇక్కడి భూములను తక్కువ ధరలకు కొని, కొన్ని కోట్లను సంపాదించుకుంటున్నారని, వాళ్ళను వాళ్ళ ప్రాంతానికి తరిమి వేయాలని, వాళ్ళు ఇంకా మనతో కలసి ఉంటే ముందుముందు మనకు భవిష్యత్తే ఉండదని, కాబట్టి  వయోభేదం మరచి ప్రజలందరూ పోరాడాలి అని చెప్పిన మాటలను విని చందు లోని యువ రక్తం ఆవేశంతో ఉత్తేజం అయ్యింది. నరేంద్ర దంపతులతో మాట్లాడటం మానేశాడు.  
నరేంద్రగారి తమ్ముడు  హైదరాబాద్ నుండి వచ్చి తన 'గృహప్రవేశానికి ' అన్నావదినలతోపాటు యాదగిరి కుటుంబాన్ని కూడా రమ్మనమని పిలచాడు. పెద్దలంతా వెడదామనుకున్నారు. ఇద్దరాడపిల్లలు బట్టలను  సర్దుకుంటున్నారు. బయిటనుండి వచ్చిన చందు ఈ హడావిడీను గమనించి, ఏ ఊరుకెడుతున్నామని అడిగాడు తల్లిని.  నరేంద్ర మామా వాళ్ళ తమ్ముడి గృహప్రవేశానికి వెడుతున్నాం.  నీవు కూడా మంచి బట్టలను సూట్ కేస్ లో సర్దుకో అని చెప్పింది తల్లి.  
ఈ ఆంధ్రా వాళ్ళంటేనాకిష్టం లేదమ్మా. నేను రాను. అయినా వాళ్ళు మనకు శత్రువులు, వాళ్ళింట్లో ఫంక్షన్ కు మనం పోవటమేమిటి? మీరు కూడా వెళ్ళకండి కోపంగా గట్టిగా అతనన్న మాటలను విని లోపల నుండి యాదగిరిగారు వచ్చారు.  
ఏమిట్రా నీ లొల్లి? నోరుమూసుకుంటావా? వాళ్ళు నిన్నేం చేశార్రా?  అంతగా గుస్సా అవుతుంటివి.  ప్రతి ఎడాది అందరికన్నా ముందుగా నువ్వేగా సంక్రాంతి పండుగకు వాళ్ళ ఊరు వెళ్ళటానికి తయారయ్యేవాడివి. మనం తిరిగి వచ్చేటప్పుడు ఆయమ్మ ఎన్నెన్ని మూటలను కట్టి ఇచ్చేది? వాళ్ళ ఊరగాయలు బాగుంటాయని,  ఆ హాస్టల్ తిండి బాగాలేదని, వాటిని సూర్యాకనిస్తే, సగం సీసా నువ్వే తినేసేవాడివి. ఇప్పుడు తెలివుండే మాట్లాడుతున్నావా? అంటూ  చందును కేకలేశారు. తండ్రి మాటలకు చందు ఇంకా కోపంతో విసవిసా బయటకెళ్ళిపోయాడు.
పైన ఆరిన బట్టలను తీయటానికి వెళుతున్న నరేంద్రగారి భార్య జ్యోతికి ఆ మాటలు, కేకలు వినిపించాయి. కిందకు దిగివచ్చి ప్రభావతి దగ్గఱకు వెళ్ళి వదినా!  దాదాపుగా గత నాలుగు సంవత్సరాలుగా మీ ఇంట్లో ఉంటున్నాము. మేము సూర్య కెప్పుడూ చందును నీ తోడబుట్టినవానిగా చూడమని, తన చదువుకు సాయం చెయ్యమని చెప్పి వాళ్ళిద్దరి మధ్యన అరమరికలు లేకుండా చేశాం. చేస్తున్నాం కూడా. ఇక ఇంటర్, ఎం.సెట్ లలో మంచి మార్కులొస్తే మంచి ఇంజనీరింగ్ కాలేజిలో చేర్పించవచ్చు. చందు చదువుకవసరమైన డబ్బును బ్యాంక్ లోనుగా ఇప్పించమని మా వారికి చెప్పాను. ఇంత కాలం ఒకే కుటుంబంలా ఉన్నాము. ఇప్పుడు చందులో ఇంతగా మార్పెందుకు వచ్చిందో అర్ధ్ధం కావటం లేదు. చెపుతున్న జ్యోతి కన్నీటి పర్యంతమైంది.
ప్రభావతి కూడా బాధ పడింది. నేను చందుకు చెప్తాను. నీవేమీ పరేషాన్ కాకు, మనసులో పెట్టుకోకు వదినా అంది. గృహప్రవేశానికి ఆడపిల్లలను తీసుకొని రెండు కుటుంబాల వాళ్ళు వెళ్ళారు. చందు రాలేదు. ఎం.సెట్ కోచింగ్ లో ఉండటం వల్ల సూర్య కూడా రాలేదు. ఇల్లు చాలా బాగా వుంది అని అంతా అనుకొన్నారు. ఆ కార్యక్రమం ముగించుకొని తిరిగి వచ్చారు.
 ప్రభావతి ఇంటికి రాగానే చందుకి వ్రత ప్రసాదం, పిండి వంటలను పెట్టింది. నాకేమి అఖ్ఖరలేదు ఆ ఆంధ్రా వాళ్ళ ప్రసాదాలు అంటూ విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు చందు. 
 ఈలోగా రాష్ట్ర అసెంబ్లీకు ఎన్నికలొచ్చాయి. తెలంగాణా ఇచ్చి తీరతామన్న జాతీయ పార్టీ వారితో కలసి ఉద్యమ నాయకులు ఎలక్షన్ల కెళ్ళారు. ఒకటే రాష్ట్రం, ఒకటే ప్రజ అన్న పార్టీ ఆ ఎలక్షన్లలో ఓడిపోయింది. పీడ వదలి పోయిందనుకున్నారు  ఉద్యమ నాయకులు.
సూర్య ఇంటర్, ఎం.సెట్ పరీక్షలను బాగా రాశాడు. చందు ఎన్నికల హడావిడీలో అంతగా చదవలేదు. పరీక్షలను ఓ మోస్తరుగా రాశాడు. ఓ ఇరవై రోజులలో రిజల్ట్స్ వచ్చాయి.  సూర్యాకు మంచి రాంక్ రావటంతో బీ.టెక్ (కంప్యూటర్స్) సీటు యూనివర్సిటీలో వచ్చింది.  జాయిన్ అయ్యాడు. 
 చందు కు వచ్చిన రాంక్ కు ఓ ప్రయివేట్ కాలేజ్ లో డొనేషన్ కట్టి చేర్పించాల్సివచ్చింది.  నరేంద్రగారి భ్యాంక్ లోనే ఎడ్యుకేషనల్ లోన్ తీసుకొని చదివిస్తునారు.  ఈ విషయం తెలిసినా, తన కొచ్చిన ర్యాంక్, తనున్న పరిస్థితులకు లోన్ తీసుకోక తప్పదని తటస్థంగా ఉండిపోయాడు చందు. 
నరేంద్రగారికి ఆంధ్రా వైపుకు బదిలి అయ్యింది. వెళ్ళేముందు చందును పిలిచి ఎన్నో జాగ్రత్తలను చెప్పారు, బాగా చదువుకోవాలని, మార్క్ లు మంచిగా వస్తేనే ప్లేస్మెంట్స్ మంచిగా వస్తాయని, మంచి ఉద్యోగంలో జేరితే, ముందుగా బ్యాంక్ లోన్ తీర్చివేసి ఇంకా చెల్లి చదువుకు, వివాహానికి బాధ్యత తీసుకొనే వీలుకలుగుతుందని, ఒక మేనమామలాగా సలహాలు చెప్పారు. 
యాదగిరి దంపతులు తమలో ఓ భాగం దూరమౌతున్నందులకు చాలా బాధపడ్డారు. ఆడపిల్లలిద్దరు ఒకరిని పట్టుకొని ఒకరు కన్నీరు కార్చారు. 
ఆంధ్రాకు వచ్చాక జ్యోతికి ప్రభావతి వాళ్ళు పదేపదే గుర్తుకొచ్చేవాళ్ళు. వాళ్ళ స్వచ్చమైన ప్రేమను నిరంతరం మనసులోనే మెచ్చుకుంటూ ఉండేది.  రాజకీయ నాయకుల మాటలను నమ్మి, చందు ఉద్యమాల బాట పట్టకుండా బాగా చదువుకోవాలని ప్రతిరోజూ ఆ దేముణ్ణి వేడుకొంటూండేది. 
 కాలగమనంలో నాలుగు సంవత్సరాలు గిర్రున తిరిగిపోయాయి. నరేంద్రగారు ప్రస్తుతం ఏలూరుకు బదిలీపై వచ్చారు.  సూర్య ఎం.ఎస్. చేయటానికి అమెరికా వెళ్ళాడు. ఇక చందు యూనియన్లు, ఉద్యమాలు అంటూ కాలేజ్ మానేసి తిరుగుతూ, మంచి మార్కులను తెచ్చుకోలేక పోయాడు.  క్యాంపస్ సెలక్షన్లలో అతని పేరు కూడా రాలేదు. రిజర్వేషన్లు లేక సరయిన ఉద్యోగం కూడా రాలేదు. ఉన్న ఉద్యోగాలన్నింటిని ఆంధ్రావాళ్ళే దోచుకుపోతున్నారని, అందుకే తనలాంటి వారికి ఉద్యోగాలు రావటంలేదని ప్రతివారితోను అంటూండేవాడు. 
కాకపోతే ఇంటి దగ్గర అమ్మానాన్నల బాధ చూడలేక పోతున్నాడు. గత నాలుగేళ్ళుగా మిమ్మల్ని కాలేజీలకు పోనీయకుండ, చదువుకోనీయకుండా తమవెంట తిప్పుకున్నారు కదా, ఆ పెద్దమనుషులను అడగరాదా? మీకు ఉద్యోగాలిప్పించమని అంటున్న తండ్రిమాటలకు ఏమి జవాబు చెప్పాలో తెలియక బయటకు వెళ్ళిపోయేవాడు చందు.  
తరువాత కొద్దిరోజులకు నరేంద్ర గారి నుండి ఫోను వస్తే చందు గురించి చెప్పి బాధ పడ్డారు యాదగిరిగారు. ఆయనకు ధైర్యం చెప్పి, మీరు బాధ పడకండి, నేను కూడా నాకు తెలిసిన వారి ద్వారా ప్రయత్నం చేస్తాను అని చెప్పారు నరేంద్రగారు.  ఓ ఇరవై రోజులకు ఓ కంపెనీ నుండి కాల్ లెటర్ వచ్చింది. చందు ఆనందానికి అంతు లేదు. 
కానీ ఆ కంపెనీ ఇదివరలో తన కాలేజికి రిక్రూట్ మెంట్ కొరకు వచ్చిన కంపెనీయే! అప్పుడు తన పేరు కనీసం ఇంటర్వ్యూకు అయినా  క్వాలిఫై కాలేదు.   ఇప్పుడు ఇదేమిటి? ఎవరైనా చేరలేదా? లేక కొత్తగా ఖాళీలున్నాయా? అనుకొంటు పలువిధాలైన అనుమానాలతో ఆలోచిస్తున్నాడు. తన తండ్రి వద్ద తన సందేహాలను వెలిబుచ్చాడు. ముందు ఇంటర్వ్యూకు వెళ్ళరా, వెయ్యి అనుమానాలతో వచ్చిన అవకాశాన్ని వదులుకోకంటూ యాదగిరిగారు, చందును ప్రోత్సహించారు. ఇంటర్వ్యూకు వెళ్ళివచ్చాడు. ఓ వారం తరువాత మెసేజ్ పెడతామన్నారు. 
ఓ పదిహేను రోజులకు కంపెనీ నుండి చందుకు ఉద్యోగంలో జాయిన్ కావలసినదిగా ఫోను వచ్చింది.  వెంటనే అమ్మా నాన్నలకు నమస్కరించి చెల్లెలితో సంతోషం పంచుకొన్నాడు. 
రాత్రికి ఏలూరు ఫోను చేసి మామయ్యగారు వాళ్ళకి చెప్పమంది ప్రభావతి. ఉహూ! ఇది నా స్వయం కృషితో సాధించుకున్నాను.  అయినా వాళ్ళు మన రాష్ట్ర సంపదను, యువత అవకాశాలను దోచుకున్న దోపిడీదారులు, నేను వాళ్ళతో మాట్లాడను.  సూర్య అమెరికాకు  వెళ్ళేటప్పుడు నాతో ఏమైనా మాట్లాడాడా? ఉక్రోషంగా అన్నాడు చందు.
 ఏరా! వాడు నీకు దాదాపుగా పదిసార్లకు పైనే ఫోన్ చేసుంటాడు. నీవొక్కసారన్నా లిఫ్ట్ చేస్తే కదా వాడు నీతో మాట్లాడేది అంటూ చివాట్లేసింది ప్రభావతి.
అదేరోజు రాత్రి నరేంద్రగారు,  యాదగిరిగారికి ఫోను చేసి “సూర్య తన స్నేహితుని తండ్రి ద్వారా చందుకు ఆ కంపెనీలో మంచి ఉద్యోగాన్నిప్పించటమే కాకుండా ఆ ప్రోజక్ట్ ద్వారా ఒక సంవత్సరం లోగా అమెరికాకు వెళ్ళే అవకాశం కల్పించాడని, అయితే ఈ విషయాలేమీ చందుకు తెలియనీయవద్దని, సూర్య సాయం ద్వారా అంటే అసలు జాబ్ కే వెళ్ళనంటాడు, కాబట్టి ఈ విషయాలను రహస్యంగా ఉంచండి” అని  చెప్పారు.
యాదగిరి దంపతులు నరేంద్రగారికి కృతజ్ఞతలను చెప్పారు.  దానికి నరేంద్రగారు నేను నా అబ్బాయికి చేశానే తప్ప వేరేవాళ్ళకు కాదుకదా అని అభిమానంతో బదులిచ్చారు. 
నెలకు ముప్పై వేల రూపాయిల జీతంతో చందు ఆ కంపనీలో జాయిన్ అయ్యాడు. ఒక సంవత్సరం  కష్టపడి పనిచేస్తే అమెరికా వెళ్ళే ప్రోజక్ట్ దొరుకుతుందని తెలియటంతో ఎలాగైనా దానిని సాధించాలని కష్టపడుతున్నాడు.  స్వతహాగా మంచి వాడైన చందు ఉద్యోగంలో చేరిన తరువాత, ముందుగా తన ఎడ్యుకేషనల్ లోన్ వాయిదాలను తానే కట్టసాగాడు.  నరేంద్రగారు చెప్పినట్లు గానే ఒక సంవత్సరం గడిచేసరికి, కంపెనీ వారు చందును అమెరికాకు పంపారు. "వీసా" వ్యవహారమంతా కంపెనీయే చూసుకొంది. కంపెనీ వారు అమెరికా ప్రయాణమనడంతో ఇంకా ఉత్సాహం వచ్చింది చందుకి. మిగిలిన అప్పును తీర్చేయడమేకాక చెల్లెలి చదువుకు కూడా సహాయం చేయవచ్చని ఆలోచిస్తునాడు
చందు అమెరికాకు వెళ్ళే రోజు వీడ్కోలు చెప్పటానికి విమానాశ్రయానికి యాదగిరి  దంపతులతోపాటు నరేంద్ర దంపతులు కూడా వచ్చారు.  ఏవో పిండివంటలు, పచ్చళ్ళు, పొడులు తీసుకువచ్చారు. దేశంగాని దేశమెడుతున్నావు, అక్కడ సూర్య నీవు అన్నదమ్ములా కలసి మెలసి ఉండండి అంటూ సూర్య ఫోను నెంబరుతోపాటుగా తాము తెచ్చిన వస్తువులన్నింటినీ చందుకు ఇచ్చారు. ఏ కళనున్నాడోగాని సూర్యా ఫోను నెంబర్ తన ఫోనులో ఫీడ్ చేసుకొన్నాడు.   
కంపెనీ వాళ్ళు అమెరికాలో వసతి ఏర్పాట్లు చేసిఉంచారు. నలుగురి షేరింగ్ ఉన్న ఇల్లు అది. రెండు పడక గదులు, హాలు, కిచెను ఉన్నాయి. రెండు పడక గదుల్లోను రెండేసి మంచాలు వేసి ఉంచారు. బెంగాలీ వాళ్ళిద్దరు ఒక రూం లో ఉంటున్నారు. తనకు కేటాయించిన గదిలో ఇంకొక తెలుగు అతను ఉన్నాడు. చందు వెళ్ళేటప్పటికి ఆ తెలుగతను బయటకు వెళ్ళాడు. దాదాపు 24 గంటల ప్రయాణపు బడలికతో ఉన్న చందు తన అలమరాలో లగేజ్ సర్దుకొని మంచంపై వాలి పోయాడు. నిద్రలేచేటప్పటికి తన రూంమేట్ ఇంకా రాలేదు. కాస్త ఫ్రెష్ అయి వచ్చి  కుర్చీలో కూర్చొని గదిని, పరిసరాలను చూస్తున్న చందుకు, టేబుల్ పై ఉన్న ఫోటొ కనబడింది. 
చూసిన వెంటనే ఒక్కసారి షాకయ్యాడు. తను సూర్యతో కలసి తీయించుకొన్నదా ఫోటో. తెలుగతను రూంమేట్ అంటే ఎవరో అనుకున్నాను. సూర్య తన రూంమేటా!. తను గత అయిదారేళ్ళనుండి సూర్యతో మాట్లాడటమేలేదు. అయినాసరే సూర్య తమ ఇద్దరి ఫోటో పెట్టుకున్నాడెందుకు? అనుకొంటూ టేబుల్ పై తెరచి ఉన్న డైరీని చూసి ఇలా పుస్తకాన్ని మూసే టైం కూడా లేదా అతనికి? ఎవరైనా చదివితే? అయినా తెలుగు రానిచోట పుస్తకం మూసినా తెరచినా ఒకటే అనుకున్నాడేమో అనుకొంటూ ఆ డైరీను మూసెయ్యాలని కుర్చీ లోంచి లేచి సూర్య టేబుల్ దగ్గరకెళ్ళాడు. తెరచి ఉంచిన పేజీలో రెడ్డింక్ తో అండర్ లైన్ చేసిన మాటను చూసి ఆశ్చర్య పోయాడు. ఆ పేజీలో తన పేరును చూసి, సూర్య తనగురించి రాశాడా? ఏం రాశాడో? అన్న ఉత్సుకతతో డైరీ లోని ఆ పేజీను చదవటం మొదలుపెట్టాడు చందు.
అందులో, "ఈ రాత్రి నా స్నేహితుడు చందు విమానం ఎక్కి ఉంటాడు. ఈ పాటికి విమానం బయలుదేరి ఉంటుంది. ఇంకొన్ని గంటలలో నా చందును చూస్తాను. వాడి భ్రమలనన్నింటిని దూరం చెయ్యాలి. మేమున్న ఆ నాలుగేళ్ళు, చందు కుటుంబమంతా మాపై ఎంతో ప్రేమను చూపించింది. ఆ మారుమూల పల్లెటూళ్ళో మంచి ఇల్లు అద్దెకిచ్చి, నాన్నగారికి పెద్ద కష్టమర్లను పరిచయం చేసి, తమతో పాటు నానమ్మా వాళ్ళ ఊరువచ్చి, ఎన్నెన్ని కబురులతో, ఆటలతో ఎంత సరదాగా గడిపామో?  ఆ ప్రేమనంతటిని మా కుటుంబ సభ్యులందరమూ గుండెల్లో దాచుకున్నాము. రాష్ట్ర విభజన ఉద్యమం పేరుతో చందు మాత్రము  ఒకే కుటుంబంలా ఉంటున్న మానుండి  దూరం అయ్యాడు. 
మాలాంటి యువతను పెడతోవ పట్టించి, ఉద్యమాల బాటలోకి లాగి, రాజకీయ నాయకులు విద్వేషాలను రెచ్చగొట్టటం చేతనే చందు లాంటి వారి మనస్సులు పాడైనాయి. రాష్ట్రాలు వేరైనప్పటికి ప్రజలు కలసిమెలసి ఉండవచ్చును కదా! ప్రజల అంతరంగాలు స్వచ్చంగా ఏ మాలిన్యాలు అంటకుండా ఉండవచ్చును కదా!.
అయినా వాణ్ణి మేమెలా దూరం చేసుకొంటాం? నేను పట్టుబట్టి, నాన్నగారి ద్వారా ఎడ్యుకేషనల్ లోన్ ఇప్పించబట్టి, వాడు నాలాగా ఇంజనీరింగ్ చదివాడు. మా బంధం కలకాలం నిలవాలని, తనను నాతో సమానంగా అమెరికాకు రప్పించాలనే నా ప్రయత్నం ఆ భగవంతుని దయతో నెరవేరబోతోంది. వాడు అమెరికాకు వస్తున్నాడు. కాని నా మనస్సులో ఎన్నో సందేహాలున్నాయి.  వాడు నాతో ఫోనులోనైనా మాట్లాడతాడా? అతనెక్కడున్నది తెలుసుకొని వెళ్ళి కలిస్తే, నాతో ఎలా ఉంటాడు?  నా ప్రేమతో నెమ్మదిగా అతన్ని మార్చగలిగితే, పెద్దలంతా చాలా సంతోషిస్తారు”. అంటూ తన గురించి రాసుకున్నడు సూర్య. 
అదంతా చదివాక చందుకు తన స్నేహితుని మనస్సేమిటో తెలిసింది. ఎంత తప్పుగా అర్ధం చేసుకున్నాను సూర్యను అన్న బాధతో ఏమిచేయాలో చందుకు తెలియలేదు. సూర్యాను కలవాలంటే చాలా గిల్టీ గా ఫీల్ అవుతున్నాడు చందు. దాంతో సూర్యను కలవకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు చందు. సూర్యా బయటకెళ్ళాక రూం కు రావటం, అతను వచ్చే టైం కు తాను బయటకెళ్ళిపోవడం చేస్తూ సూర్యను తప్పించుకు తిరుగుతున్నాడు.
అది నెలలో ఆఖరి 'వీకెండ్' కావటంచేత ఆఫీసు వాళ్ళు 'టీం లంచ్' ఏర్పాటు చేయటంతో స్టాఫ్ అందరు ఓ 'ఇండియన్ ఫుడ్ కోర్ట్' కు వెళ్ళారు. అక్కడ అందరూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో ఓ అగంతకుడు చేతిలో రివాల్వర్ తో చొరబడి అందరిని భయపెట్టసాగాడు. ఇండియన్స్ కాని వారందరూ బయటకు వెళ్ళిపోండి, ఇండియన్స్ మాత్రమే ఇక్కడుండాలి, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ రెండు సార్లు గాలిలోకి కాల్పులు చేశాడు. దాంతో అందరూ భయపడిపోయి, బయటకు పరుగులు తీశారు. ఒక్క ఇండియన్స్ మాత్రమే లోపల ఉండిపోయారు. ఒకతను ధైర్యం చేసి సెల్ లో ఫోటొలు తీసి పోలీసులకు మెసేజ్ పెట్టాడు. అందరికంటే వెనుకనున్న చందుకు మాస్క్ వేసి పాకుతూ తనతో రమ్మనమని చెప్పి వెనుక  ద్వారం గుండా బయటకు వెళ్ళిపోయాడు. ఇదంతా ఆ అగంతకుని దృష్టిలో పడకుండానే జరిగిపోయింది. ఈలోగా సమాచారమందుకున్న వెంటనే పోలీసులొచ్చి  ఏ నష్టం వాటిల్లకుండా ఆ అగంతకుణ్ణి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు.  పోలీసులతో వెడుతూ కూడా ఆ వ్యక్తి  "బ్లడీ ఇండియన్స్, గో బ్యాక్ టు యువర్ కంట్రీ" అంటూ అరుస్తూనే ఉన్నాడు. ఇండియన్స్ అంతా బ్రతుకు జీవుడా అంటూ టెన్షన్ నుండి బయట పడ్డారు.  
కార్లో కొంచం దూరమెళ్ళాక  చందు మాస్క్ తీసేసి, ఎవరు మీరు? నన్ను ఒక్కణ్ణే కాపాడారు? మరి మిగిలిన మావాళ్ళంతా.. భయంగా అన్నాడు. మీవాళ్ళందరిని పోలీసులొచ్చి కాపాడారు.  ఆ అగంతకుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారని, రెస్టారెంట్ లో మిగిలిన అందరూ క్షేమంగా ఉన్నారని ఇప్పుడే మెసేజ్ వచ్చింది, మీరు నాకు చాలా కావలసిన మిత్రులు కాబట్టి మిమ్మల్ని ఒక్కరినే బయటకు తీసుకు వచ్చాను అంటూ తను వేసుకున్న మాస్క్ ను కూడా తొలగించాడు సూర్య. అతన్ని చూడగానే నువ్వా సూర్యా! కారాపు అంటూ గబగబా కారుదిగి సూర్యను కౌగలించుకున్నాడు. దేశం కాని దేశంలో నా ప్రాణాలను కాపాడావు చాలా థ్యాంక్స్ అన్నాడు చందు.    
“వాళ్ళంతా జ్యాత్యహంకారులు. ఉపాధిలేక, ఉద్యోగాలు దొరకక, ఇతర దేశాలనుండి వచ్చిన మనలాంటి వాళ్ళు, వాళ్ళ ఉపాధి అవకాశాలను  దోచేసుకుంటున్నామనే భ్రమలో ఇలా ఇండియన్స్ ఉన్న రెస్టారెంట్ల మీద, థియేటర్స్ మీద, విచ్చల విడిగా కాల్పులు జరుపుతున్నారు. థ్యాంక్స్ టు గాడ్ నిన్ను కాపాడుకోగలిగాను” అన్నాడు సూర్య.      
నన్ను క్షమించరా సూర్యా! ఇంతకాలం ఇక్కడి జ్యాత్యహంకారులవలెనే మీ ఆంధ్రావాళ్ళు మా ఉపాధి అవకాశాలను, సంపదను దోచుకుంటున్నారనే అపోహలో నిన్ను, మీ నాన్నగారిని నేను మానసికంగా చాలా బాధపెట్టాను.  మనమంతా ఒక్కటే, మానవత్వం నిండిన మనుషులమని గ్రహించాను అన్నాడు చందు. 
మనం భరత మాతకు రెండు కళ్ళురా, మనం సూర్యచంద్రులం, పద కారెక్కు ఆఫీస్ కెడదాం అన్నాడు సూర్య.     
                       .                   
***

No comments:

Post a Comment

Pages