మాతను పంపిన మేరీమాత. - అచ్చంగా తెలుగు

మాతను పంపిన మేరీమాత.

Share This
మాతను పంపిన మేరీమాత.
ఆదూరి హైమవతి 
              

ఆనందనిలయంలోని మేరీమాత విగ్రహం ముందు ప్రార్ధనచేసి మోక రిల్లుతున్నాడు ఫాదర్ . ద్వారం వద్ద పసిబిడ్డ  ఏడ్పు వినిపించింది. వెంటనే లేచి వెళ్ళి చూశాడు. తెల్లని గుడ్డలో చుట్టి ఉన్న మూడు నాల్గు నెలల పసి బిడ్డ కళ్ళు మూసుకునే ఏడుస్తున్నది.  
      బిడ్డనుతీసిహృదయానికి  హత్తుకుని " అమ్మా! మేరీమాతా ! నాకు ఈ క్రిస్మస్ పండుక్కి కానుకగా మరో బిడ్డనిచ్చావాతల్లీ !" అంటూ లోనికి నడి చాడు. 
                            
         ఆనందనిలయంలో పాతిక మంది చిన్నపెద్దా ఆడామగా బిడ్డలు  ఫాదర్ ప్రాంక్లిన్ పెంపకంలో ఉన్నారు. అమ్మా నాన్నలకు బరువైపడేసిన ఆ బిడ్డల్నిఫాదర్ కన్నబిడ్డల కన్నాఎక్కువగా   ప్రేమించి క్రమశిక్షణతో  సాకుతున్నాడు. దానికంతా సొమ్ము మేరీమాత కృపవల్ల దయామయు లెవరో  ఒకరు అందిస్తున్నారు. 

       పిల్లలంతా స్నానపానాదులు ముగించి ప్రార్ధనకై మేరీ మాత ఉన్న మందిరంలోకి వచ్చారు. ఫాదర్ చేతుల్లో ఆకలితీరి హాయిగా ఆదమరచి నిద్రిస్తున్న బిడ్డను పైకెత్తి,  " బిడ్డల్లారా! మీకందరికీ మరో చెల్లాయిని  మేరీమాత ఈ పండుక్కి క్రిస్మస్ తాత ద్వారా కానుకగా పంపింది .." అంటూ చూపాడు  ఆబిడ్డను. 
            అందరూ ఫాదర్ చుట్టూమూగి నిద్రిస్తున్న ఆచిన్నారిని చూడను పోటీపడసాగారు.  
     నాలుగై దేళ్ళఆనంద్ అందరినీ నెట్టుకుంటూ ముందు కొచ్చి " ఫాదర్! క్రిస్మస్ తాత మీరు అడక్కుండానే కానుక తెచ్చాడే,మరి అడిగితే  ఏమైనా ఇస్తాడా?" అని అడిగాడు.
    ఫాదర్ నవ్వుతూ " తప్పక ఇస్తాడు ఆనంద్ !  నీకేం కావాలో కోరుకో !" అన్నాడుప్రేమగా.
  ఫాదర్ చాలాకాలంగా వాడిని గమనిస్తూనే ఉన్నాడు.  వాడి మనస్సులోని కోరిక కూడా ఫాదర్ కు తెలుసు. ఐనావాడేం చెప్తాడో అని చూడసాగాడు.             " ఫాదర్! నాకు సంతోష్ లాగా అమ్మా , ఇంకా ప్రకాశ్ లా నాన్నకూడా కావాలి .ఇస్తాడా మరి?"అనిఅడిగాడుఅమాయకంగా.  
   ఎఱ్ఱని శరీర ఛాయతో, ఉంగరాల జుట్టుతో పెద్ద గుండ్రనికళ్ళతో ఎంతో అందంగా ఉండే ఆనంద్ అంటే అందరికీ  ఇష్టమే . 
      ఏతల్లి ఎలాంటి పరిస్థితిలో పడేసిపోయిందోని అను కుంటాడు ఫాదర్.    
   అమాయకంగా  అలా అడుగుతున్న ఆనంద్ ను చూసి, తన కొడుకు సంతోష్ ను ఎత్తుకుని ఉన్న తన్మయి  కళ్ళు చెమర్చాయి.
  ‘వీరందరిలో తాను తన కొడుకును ఎత్తు కోడం  దగ్గరికి తీయడం వల్ల ఎంత పొరబాటు జరిగిందో ఆమెకు అప్పుడే అర్ధమై పశ్చాత్తాప పడి , తన కొడుకును దింపి ఆనంద్ దగ్గరగా వచ్చి ఎత్తుకోబోయింది.
 " వద్దుఆంటీ! మీరు సంతోష్ అమ్మ, వాడినే ఎత్తుకోవాలి .క్రిస్మస్ తాత నేను అడిగితే  తప్పక నాకూ ఓ అమ్మానాన్నల్ని పంపుతాడు, ఫాదర్ చెప్పారుగా?!"  చేతులూపుతూ చెప్తున్న , ఇతరుల హక్కునూ  సంపదని కోరని ఆ చిన్నారిని చూసి తన్మై కి దుఃఖం ఆగలేదు. 
  ఫాదర్ " తప్పక పంపుతాడు ఆనంద్ ! వేచి ఉండు " అని ప్రార్ధన మొద లు పెట్టాడు. 
 ఆనంద్ మాత్రం మేరీ మాత విగ్రహం ముందు మోకరిల్లి " అమ్మా! మేరీమాతా ! నాకూ ఓఅమ్మా  నాన్నాకావాలి, అచ్చం నాకే , కిస్మస్ తాతతో తప్పక పంపుతావుగా ?  ఎదురు చూస్తూ ఉంటా మరి."  అంటూ పదే పదే కళ్ళుమూసుకుని పలుకుతున్న ఆనంద్ అమాయకత్వానికి జాలిపడి  ఫాదర్ తో పాటుగా తన్మై కూడా  " మేరీమాతా ! ఆచిన్నారికి నిజంగానే అమ్మానాన్నల్ని పంపమ్మా!" అని కోరుకుoది.
          తన్మై వంటరిగా ఐదేళ్ళక్రితం,ఐదునెలల కొడుకుతో ఆనంద నిల యానికి వచ్చిoది. అక్కడి పిల్ల లందరినీ తనబిడ్డల్లా చూసుకుంటూ అందరికీ ఇంత వండి పెడుతుంటుంది . 
 ఆమె తీరిక సమయం లో తన కొడుకు సంతోష్ నుఎత్తుకుని వడిలో ఉంచుకుని ముద్దులాడుతుంటుంది.
  ఊహ తెలిసినప్పటి నుండీ ఇదంతా గమనించేవాడు ఆనంద్ , తనకూ ఓ అమ్మ ఉంటే అలా వళ్ళో పెట్టుకుని ముద్దులాడు తుందని భావించే వాడు.  
       ఆనందనిలయం కాపలాదారు కామయ్య తనబిడ్డ ప్రకాశ్ ని భుజంపై ఎక్కించు కుని తిప్పడం, ఐస్ క్రీములు కొనివ్వడం, వాళ్ళమ్మ వెనుక నుండీ ’ఛుక్ ఛుక్  రైలూ వస్తోంది ‘అని , రైల్ లా కూస్తూ పాడటం చూసే వాడు.  
    వయస్సుతోపాటుగా ఆనంద్ కు ' అమ్మే కాక నాన్న కూడా కావాలనే కోరిక పెరిగిపోసాగింది. 
 అప్పుడప్పుడూ తనకంటే పెద్దపిల్లల్ని " అన్నా! అమ్మ నాన్న కావా లంటే ఏంచేయాలి? మనందరికీ అసలు అమ్మానాన్నాలేనే లేరా?" అని అడిగేవాడు. 
 వారు నవ్వి "మనకు మేరీమాతే అమ్మ"  అనిచెప్పేవారు.
     " మరైతే మేరిమాత సంతోష్ వాళ్ళ అమ్మలా మనలను  వళ్ళో పెట్టు కోదేం? ఆమె కదలదు,మెదలదు, పలకదు .." అని అడిగేవాడు. 
    వారు "ఆమె దేవత, అందుకే అలా ఉంటుంది. మనకేం కావాలన్నా మేరీమాతను ప్రార్ధించమని ఫాదర్ చెప్పారుగా ? ఆమెనే అడుగు. " అనిచెప్పేవారు.
 ‘తమందరికీ అమ్మ నాన్న ఎందుకు లేరు?! ‘అనే సందేహం తో పాటుగా ' అమ్మ కావాలనే కోరిక వాడికివయస్సుతోపాటుగా రోజు రోజుకూ పెరగ సాగింది.
  సంతోష్  వాళ్ళమ్మ  ఒళ్ళో ఆడుకోడం చాటునుండీ చూస్తూ ఏడు స్తుండే వాడు. 
   రాత్రిపూట ఒక్కోసారి " అమ్మా! మేరీమాతా!  నాకూ ఓ అమ్మానాన్నల నుపంపు.." అంటూ పలవరించేవాడు.
           క్రిస్టమస్ ముందురోజు అందరూ ప్రార్ధనా మందిరంలో ఉండగా  మేరీమాత వారి ప్రార్ధన వినిందేమో అన్నట్లుగా ,  "ఫాదర్ ! మన్నించాలి. మిమ్ము కలవను ఎవరో వచ్చారు,చాలా  జరూరుట !“  అని కాపలాదారు వచ్చిచెప్పగా ,ఫాదర్ తన చేతుల్లో ఉన్న పాపను తన్మైకిచ్చి , తన కార్యాల యపుగదిలోకి దారితీశాడు
“ప్రార్ధనాసమయంలో మిమ్ము ఇబ్బంది పెట్టినట్లున్నాం. మన్నించా లి“   అంటూ ఫాదర్కు నమస్కరించారు  అక్కడ వేచి ఉన్న దంపతులు. 
" ఫాదర్ మీతో ఏకాంతంగా మాట్లాడాలని వచ్చాం , నాపేరు నారాయణ , ఈమె నా భార్య రమ . మాకు సంతానం లేదు. ఎంతో కాలంగా బిడ్డను దత్తత తీసుకోను వెతుకు తున్నాం. ఈ రోజే  మీ గురించీ తెలిసింది. మాకో అబ్బాయి కావాలి." అని చెప్పాడావ్యక్తి.   
  ఫాదర్ ఆనందానికి హద్దే లేదు.వారితో అన్నివిషయాలూ మాట్లాడి మరు నాడురమ్మని చెప్పిపంపాడు. 
 మనస్సులోనే మేరీమాత కు  కృతఙ్ఞతలు సమర్పించుకున్నాడు
         ఆ క్రిస్టమస్ రోజున అంతా ఆనందనిలయాన్నిరంగురంగుల కాయి తం తోరణాల తో అలంక రించు కున్నారు. అంతా కొత్తదుస్తులుధరించి ప్రార్ధనా మoదిరం  చేరగానే క్రిస్ట్మస్ తాత ఎగురు కుంటూ కోటు నిండా బహుమతులతోవచ్చాడు.అందరినీ నవ్విస్తూ , తన కోటులోంచీ చాక్లెట్లూ, బిస్కత్తులూ, దుస్తులూ, రకరకాల బహుమతులూ తీసి పిల్లలవైపు ఎగ రేస్తూ ,పాటలుపాడుతూ ,అందరిచుట్టూతిరుగుతూ …..
" ఏయ్! పిల్లలూ!  ఆనందెవరిక్కడ? వాడు అమ్మానాన్నలను ఇవ్వమని మేరీమాతను రోజూ అడుగు తున్నాట్ట?వాడికి అమ్మానాన్నా వచ్చారు " అంటూ గుమ్మం వైపు చూపగా అక్కడ నారాయణ , రమ దంపతులు నిల్చుని ఉన్నారు.
     వారులోనికి వచ్చి " ఆనంద్ కోసం వచ్చాం " అని చెప్పగానే ఆనంద్ దిగ్గున లేచి ఒక్క దూకులోవారి వద్దకు వెళ్ళాడు.
  " ఫాదర్ ! ఫాదర్ ! మేరీమాత క్రిస్మస్ తాతతో మీరు చెప్పినట్లేనాకు  అమ్మానాన్నలను పంపింది. " అని సంబరంగా అరుస్తూ చెప్పాడు.
 ఫాదర్ " చూశావా ఏదైనా భక్తితో  కోరితే జరుగు తుందిమరి. ఇహ నీవు నీ అమ్మానాన్నలతో వెళ్ళి, అప్పుడప్పుడూ మమ్మల్ని చూడను వస్తుంటా వుగా? " అంటూ వాడితలనిమిరి చేయి ఊపాడు. 
 అందరికీ చేతులూ పు తూ “"ఏయ్ ! సంతోష్ ! సురేష్! నాకూ అమ్మా నాన్నలు వచ్చారు  చూశారా?" అంటూ ఆనంద్ వారి చేతులుపట్టుకుని వెంట నడిచాడు.      
  ********


No comments:

Post a Comment

Pages