స్ధాయి - అచ్చంగా తెలుగు
స్థాయి
శివకుమారి 

పదిరోజుల కిందట బామ్మ ఎడమ కంటికి శుక్లం ఆపరేషన్ అయ్యింది నల్ల కళ్ళజోడు పెట్టుకుంటున్నది. స్నానం టిఫిను అన్నీ పూర్తి చేసుకుని దివాన్ మీద దిండ్లకు జారగిలబడి కూర్చున్నది. 11 గంటలకు కానీ కాగానే పక్కింట్లోని వనజాక్షి తన పనులు పూర్తి చేసుకొని వస్తుంది. రాగానే భగవద్గీతను కళ్ళకద్దుకుని  వ్యాసపీఠం మీద భగవద్గీతను తెరిచి పెట్టుకుని గీతను చదవటం ప్రారంభిస్తుంది. ఆ శ్లోకాలన్నీ బామ్మకు దాదాపు కంఠస్తమే. ప్రస్తుతం శుక్లం తీసిన కంటితో తను చదవకూడదు కాబట్టి వనజాక్షి చేత చదివించుకున్నది. ఆ రోజు ఆమె వచ్చి “కంట్లో చుక్కల మందు వేసే టైం అయిందిగా” వేసేదా అని అడిగింది. “నా కోడలు వేసేసింది వనజాక్షి పాపం రోజు నా కోడలు టైం ప్రకారం కళ్ళ​​లో మందు వేస్తున్నది ఇంట్లో పనికి తోడు ఈ పని కూడా అదనం అయ్యింది” అంటుండగానే బామ్మ తమ్ముడు ఆంజనేయులు లోపలికి వచ్చాడు ఆ వెనుకే ఆయన మనవరాలు హేమలత కూడా వచ్చింది.
  “ఏమీ అక్కయ్య! ఎలా ఉన్నావు? కన్ను అంతా బాగానే ఉందిగా నీకు శుక్లం తీసిన దగ్గర నుంచి వచ్చి చూద్దామని ప్రయత్నం చేశాను కానీ ఇవాల్టి దాకా కుదరలేదు హేమలతను తీసుకుని ఇవ్వాల బయలుదేరి వచ్చాను అన్నాడు.
“కన్ను నొప్పి కూడా పెద్దగా లేదు నేను జాగ్రత్తగానే ఉంటున్నాను హేము పరీక్షలు అయిపోయినాయా బాగా రాశావా !”
'అయిపోయినాయి బామ్మ 'బాగానే రాశాను".
"మంచినీళ్లు తాగి అలా కూర్చోండి. వనజాక్షి! శ్లోకాలు కొన్ని చదువు. ఈ పూటకి త్వరగా ముగించేయి. పావుగంటలోనే వనజాక్షి చదవడం ఆపేసి లేచి నిల్చున్నది.అక్కయ్య తోపాటు ఆంజనేయులు శ్రద్ధగా విన్నాడు. హేమలత మాత్రం ఇంట్లోకి బామ్మ గారి కోడలు దగ్గరకు వెళ్ళిపోయింది. వనజాక్షి వెళ్లగానే అక్కాతమ్ముళ్ళు మాటల్లో పడ్డారు. "ఏం ఆంజనేయులు! విషయం ఏమన్నా ఉన్నదా? హేమాను కూడా తీసుకొచ్చావు.
"ఉన్నది అక్కయ్య హేమలత పెళ్లిసంగతి ఈ సంవత్సరం దాని పెళ్లి చేసేయాలనుకుంటున్నాము"
"సంబంధాలు ఏమన్నా చూశావా?"
మన దగ్గరే పనిచేస్తూ నాకు చేదోడువాదోడుగా ఒక అతను ఉంటున్నాడు. ఆ కుర్రాడు చూపులకు శుభ్రంగా ఉంటాడు. చదువుకున్న వాడు. వాళ్లది మంచి కుటుంబం. నా తరువాత ఈ దారపు బంతులు తయారు చేసే పనిని చూసుకోగల సమర్ధుడు. అతనికి ఇచ్చి చేస్తే పరిశ్రమ బాగుంటుంది. మన పిల్ల సుఖపడుతుంది అని ఆలోచించాం. హేమలత ఇష్టపడడం లేదు. దారపు ఉండలు తయారు చేసే వాడిని చేసుకోవాలా? తమ్ముడి నేమో బీటెక్ చదివిస్తున్నారు, నాకేమో బీకాం తో సరిపెట్టారు.నా స్టేటస్ ఏంటి తాతయ్య? ఏ ఫారిన్ సంబంధము చేసుకుని విమానమెక్కి విదేశాలకు వెళ్లాల్సిన దానిని. అలాంటి దానిని ఇక్కడ ముష్టి సంబంధం చేసుకుని ఈ కళ్ళ ఎదురుగా దారపు ఉండలు చుట్టుకుంటూ బతకమ్మ అంటున్నారు.చచ్చినా చేసుకోను అంటూ మొండికేస్తున్నది. నాకు మీ మరదలుకు  ఏమీ పాలుపోవడం లేదు ఎలాగూ నిన్ను పలకరించటానికి వస్తున్నగా. నువ్వు అయితే నాలుగు మంచి మాటలు చెప్పి దాని మనసు మారుస్తామని,హేమలత ను వెంటబెట్టుకుని వచ్చాను. మీ మరదలు కూడా వచ్చేది వంట్లో కాస్త నలతగా ఉండి ఆగిపోయింది.
మరదలికి  మనశ్శాంతి ఎక్కడిది ఆంజనేయులు! ఉన్న ఒక్కగానొక్క కొడుకు చిన్న వయసులోనే చనిపోయే, ఆ తర్వాత వచ్చి కోడలు తనతో లోకాలకు తాను వెళ్లిపోయింది. హేమలతను దాని తమ్ముని మీరే కళ్ళల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేశారు. మరదలికి ఎప్పుడూ కష్టాలు బాధ్యతలు.  దాంతో ఆరోగ్యం అంతంత మాత్రం అయిపోయింది.
ఏం చేస్తాము అక్కయ్యా! మా రాత బాగుంటే నా కొడుకు అలా నీళ్ళలో పడి చనిపోయే వాడు కాదుగా, రాత్రిపూట ఎనిమిదింటికి ఆ తుంగభద్ర కాలువ ఒడ్డున పెంపుడు కుక్కపిల్లను తీసుకుని పోవడం ఏంటి? ఆ కుక్క పిల్ల కాలువలోకి దూకిందని దాన్ని పట్టుకోవడానికని వీడు ఆ కాలువలోకి దూకి దాన్ని పట్టుకుని ఒడ్డుకు విసిరేశాడు. ఆ తర్వాత తన కాళ్ల కింద ఇసుక జారిందో మనిషే నిలదొక్కుకోలేక పోయాడో తెలియదు కానీ వెనక్కు తూలి నీళ్ళలో పడి పోయాడు. పడ్డవాడు పడ్డట్టే కొట్టుకుపోయారని చూసిన వాళ్లు చెప్పారు అంతా నిన్న మొన్న జరిగినట్లు ఉన్నది.
​​ “వాడికి ఆయుష్షు తీరి చావు అలా నీళ్ళ రూపంలో నెట్టుకొచ్చింది ప్రారబ్ధాన్ని మించింది లేదు జరిగిపోయిన దాన్ని దిగమింగుకో ఇప్పుడు జరగాల్సింది చూడాలి”.
నా బాధ కూడా అదే అక్కయ్య మేం కాస్త ఆరోగ్యంగా ఉండగానే ఈ పిల్లనెత్తిన నాలుగు అక్షింతలు వేయిద్దామని తాపత్రయపడుతున్నాం. హేమలతకు అదేం అర్థం కావడం లేదు. మనం ఎంతో ఎక్కువ స్థాయిలో ఉన్నాం. మనకేం తక్కువ చాలా పెద్ద సంబంధమే వస్తుంది. అలాంటి సంబంధం అయితేనే చేసుకుంటాను. రేపు తమ్ముడు ఏ అమెరికానో వెళ్లి ఎంఎస్ చేస్తానంటే పంపించరా! అలాగే నాకు ఫారిన్ సంబంధం చేసి పంపడానికి ఎందుకింత ఆలోచిస్తారు అంటూ వాదనకు దిగుతున్నది అక్కయ్య అంటూ ఆంజనేయులు దిగులుగా చెప్పాడు.
****
మధ్యాహ్నం భోజనాలు అయ్యాయి.ఆంజనేయులు భోజనం చేసి కాసేపు నడుంవాల్చడానికి లోపలి గదిలోకి వెళ్ళాడు. హేమలత హాల్లో కూర్చుని ఉన్నది రిమోట్ తీసుకుని టీవీ చానల్స్ మారుస్తూ ఏ ప్రోగ్రాం చూడాలా అని ఆలోచిస్తున్నది బామ్మ కూడా అక్కడే ఉన్నది "ఏమే హేమ బి.కామ్ అయిపోయింది"గా ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగింది.
"నాకైతే ఇంకా చదువుకుని ఆ తర్వాత ఉద్యోగం చేయాలని ఉన్నది బామ్మా తాతయ్య వాళ్లేమో పెళ్లి చేసేస్తా మంటున్నారు నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఒక వేళ చేసుకున్నా నా స్టేటస్ కు తగ్గ వాడ్ని చేసుకోవాలనుకుంటున్నాను.
" స్టేటస్ ఏమిటి నీ ముఖం నీకున్న అందం,తెలివితేటలు, చదువు ఇవే నా నీ స్టేటస్ అంటే? నువ్వింకా ఫలానా ఆంజనేయులు గారి మనవరాలువే. ఆంజనేయులు నడిపే దారపు ఉండ పరిశ్రమే మీ తాతయ్యకు ఒక గుర్తింపు తెచ్చి పెట్టింది ఈ దారపు ఉండల తయారీ పెట్టి మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాను.ఆ తరువాత లీసోనా యంత్రాన్ని కొన్నాను. ఇప్పుడు దీనిమీద మిషన్ దారం, ట్విన్ దారం, చెప్పులు కుట్టే దారం, బస్తాలు కుట్టే దారం అన్ని త్వరగా చాలా బాగా తయారవుతున్నాయి అక్కయ్యా! అని లోగడే చెప్పాడు. ఏదో కొంతమంది పనివాళ్లను తనకు తోడుగా పెట్టుకుని బాగానే నెట్టుకొస్తున్నాడు. తాను తయారు చేసిన ఆధారాలన్నీ బాగానే అమ్ముడుపోతున్నాయి. మంచి పేరు తెచ్చుకున్నాడు. మీ నాన్న ఉంటే తండ్రికి తోడుగా ఉంటూ ఇవన్నీ చూసుకునేవాడు.ఇక్కడ ఈ ఊళ్లో నా కొడుకు సంగతి చూడు.ఆ రోజుల్లో వ్యవసాయం చదువు చదివాడు కానీ ఎక్కడా ఉద్యోగం చేస్తానంటూ పోలేదు. ఊర్లోనే ఇంటి పట్టునే ఉండి అటు వ్యవసాయము,ఇటు ఊరి ప్రెసిడెంట్ గా ఉండి ఊరి కోసం ఎంతో పాటుపడ్డాడు. ఊళ్ళోవాళ్ళ తలలో నాలుకలాగా ఉంటాడు.ఇంటా బయట మంచి పేరు తెచ్చుకున్నాడు నా కొడుకు రైతని, వ్యవసాయదారుడు అని ఎవరు చిన్న చూపు చూడడం లేదు చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా చాలా మంచి పేరు ఉన్నది.నా మనుమరాలిని కావాలని అడిగి మరీ పెళ్లి చేసుకుని వెళ్లారు. ఇంతకంటే ఏం కావాలి నా మనవడు వాడి చదివేదో వాడు చదువుకుంటున్నాడు. మనం ఏ పని చేస్తున్నా దాంట్లో శ్రద్ధ నిజాయితీ ఉండాలి హేమ.దాన్ని బట్టే నువ్వనే స్టేటస్ వస్తుంది. మీ అమ్మ నాన్న లేరు ఉన్నదల్లా తాతయ్య నాయనమ్మ లే వాళ్లు పెద్ద వాళ్లు అయిపోతున్నారు. నీ పెళ్లి చేయాలనుకోవడం న్యాయమే తనకు ఆదాయం అంతో ఇంతో పేరు తెచ్చి పెట్టిన పరిశ్రమ ఇంకా కొనసాగించాలని మీ తాతయ్యకు ఉంటుంది. తనతో పాటు ఇంకొంతమందిని పోషించగల అవుతున్నాడు కాబట్టి దాన్నలాగే గడపాలన్న కోరిక ఉండడం సహజం. ఆ ఉద్దేశంతోనే తన చేతి కింద మెలిగే ఆ కుర్రాడికిచ్చి చేస్తే నీకు సుఖంగా ఉంటుంది పరిశ్రమ కూడా మూతపడకుండా ఉంటుందని ఆశ పడుతున్నాడు ఆలోచించు హేమ! నీవు చదువుకున్న దానివి ఆఖరువుగా ఒక్క మాట మనం బ్రతకటం తో పాటు మరో నలుగురికి అన్నం పెట్టగలగడం చాలా గొప్ప విషయం. అటువంటి అవకాశం అందరికీ రాదు. మీ తాతయ్య ఎంతో శ్రమపడి ఈ స్థాయికి వచ్చారు. ఇవ్వాలా స్వస్తిక్ మార్కు దారపు బంతులు అంటే సమాజంలో గుర్తింపు నమ్మకము ఉన్నది. ఆ గుర్తింపు నమ్మకం నువ్వు తలుచుకుంటే ఇంకా కొన్ని ఏళ్లు అలాగే నిలబడుతుంది. ఇంత సోది చెప్పానని ఏం అనుకోవద్దు వాస్తవం నీకు తెలియాలని ఇంత వివరంగా చెప్పాను అంటూ బామ్మ ఓపిగ్గా మాట్లాడింది.
నేను ఏం అనుకోవడంలేదు బామ్మ నువ్వు చెప్పిన విషయాలన్నీ నేను శ్రద్ధగానే విన్నాను అన్నది.
​ ఆ సాయంకాలం తను కూడా తాతతో వెళ్లిపోతానని హేమలత వెళ్ళిపోయింది.సెలవు లేగా  నాలుగురోజులు ఉండమన్నా ఉండలేదు.
ఆ తరువాత కొన్ని రోజులకు ఆంజనేయులు అక్కయ్యకు  ఒక ఉత్తరం రాశాడు 
అక్కయ్య! మా వ్యాపారం ఇదివరకటికన్నా బాగున్నది. ఎందుకంటే పెద్ద పెద్ద రెడీమేడ్  వ్యాపారస్తులు తమ బట్టల్ని కుట్టించడానికి మేము తయారు చేసే మిషన్ దారపు బంతులు వాడే ఒప్పందాన్ని కుదుర్చుకున్నము.అలాగే చాలా ఊళ్ళలోని షాపులకు మాదారపుఉండలను, అలాగే ట్వైన్  దారాన్ని కూడా ఏమే సప్లై చేస్తున్నాం. బ్రాండెడ్ చెప్పులు తయారుచేసే కంపెనీలకు కూడా చెప్పులు కుట్టే దారాన్ని మేమే సప్లై చేస్తున్నాం. అలాగే ధాన్యపు మిల్లులు, పప్పులు మిల్లులు తమ గోతాలు కుట్టడానికి మేము తయారుచేసిన బస్తాల కుట్టు దారాన్నికొనే ఒప్పందం చేసుకున్నాం.ఎక్కడెక్కడ దారపు అవసరం ఉందో తెలుసుకుని వాళ్లతో సంప్రదించి హేమలతే ఈ పనులన్నీ ఆన్లైన్ ద్వారా చేస్తున్నది. తోడుగా నేను చెప్పిన కుర్రాడు ఉన్నాడు అనుకో. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నది ముఖ్యంగా హేమలతకు కలిగిన ఈ శ్రద్ధ చూసి నీ మరదలు కూడా చాలా సంబరపడుతున్నది ఉంటాను ..ఆంజనేయులు
ఆ తరువాత కొన్ని రోజులకు మరో ఉత్తరం రాశాడు 
అక్కయ్య!నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను చెప్పలేను.నేను నీకు లోగడ చెప్పిన కుర్రాన్ని పెళ్లిచేసుకోవడానికి హేమలత ఒప్పుకున్నది. అతను కూడా ఇష్టపడ్డా​​డు పిల్ల వాడి తల్లితండ్రులు మేము కూర్చుని మిగతా విషయాలు మాట్లాడుకుంటాం. అలా మాట్లాడేటప్పుడు నువ్వు కూడా ఉండాలి. అక్కయ్య నువ్వు మన హేమలతకు ఏం చెప్పావో ఎలా తన మనసు మార్చావో కానీ అని ఇప్పుడు చాలా బాగా నిదానంగా అన్ని విషయాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇదంతా నీ చలువే అక్కయ్య ఇప్పుడు ఎంత నిశ్చింతగా ఉందో చెప్పలేను. నువ్వు మా ఊరు రావడానికి సిద్ధంగా ఉండు ఒకటి రెండు రోజుల్లో నేనే వచ్చి నిన్ను ఇక్కడకు తీసుకు వస్తాను. మాట్లాడుకునే దగ్గర నుంచి పెళ్లి వరకు నువ్వు ఇక్కడే ఉండి,అన్ని పనుల్లోనూ సలహాలు ఇవ్వాలి. హేమలత పెళ్లి కుదిరిన సంగతి నా మేనల్లుడు తోనూ వాడి భార్యతోనూ చెప్పు వాడికి నేను ఫోన్ చేసి చెబుతాను అనుకో. నీ మరదలు నిన్ను మరీ మరీ గుర్తు చేసుకుంటున్నది ఇక ఉంటాను ..ఆంజనేయులు
అది చదివిన బామ్మ చాలా ఆనంద పడింది గీత చదువుకోవడానికి వచ్చిన వనజాక్షి తో అన్నది మా తమ్ముడి మనుమరాలు ఎంతో బుద్ధిమంతురాలు సుమ వాళ్ళ తాతయ్యకు వ్యాపారంలో తోడు ఉండటమే కాకుండా అక్కడ వీళ్లకు సాయపడే సాయపడుతూ మా తమ్ముడికి బాగా తెలిసిన అబ్బాయిని పెండ్లి చేసుకోవడానికి కూడా ఒప్పుకున్నది ఇక నుండి మా తమ్ముడి వ్యాపార బాధ్యతలు వాళ్ళు చూసుకుంటారు. మా తమ్ముడు మరదలు ఇకనైనా విశ్రాంతి కాలం గడపవచ్చు వనజాక్షి! అంటూ తన సంతోషాన్ని ఆమెతో పంచుకున్నది అంతకు ముందే కొడుకు కోడలు తోను ఈ విషయం చెప్పింది.

No comments:

Post a Comment

Pages