పరమ పవిత్ర తులసి - అచ్చంగా తెలుగు
పరమ పవిత్ర తులసి
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు



మన సంస్కృతీ, సంప్రదాయంలో కొన్ని మొక్కలకు విశేషమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. అందులో తులసి మొక్కది ప్రథమ స్థానం. హిందువులు తులసిని ప్రత్యక్ష దైవంగా పూజిస్తారు. మానవులకు అకాల మరణం కలగకుండా తులసి చెట్టు కాపాడుతుందనే నమ్మకం ఉంది. తులసిలో రెండు రకాలు- ముదురు రంగులో ఉండే దాన్ని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండే దాన్ని రామతులసి అనీ అంటారు. సాధారణంగా కృష్ణతులసిని పూజలకు వాడతారు. దేవుళ్లకు జరిపే షోడశోపచార పూజా విధానంలో తులసికి విశిష్ట స్థానం ఉంది. 
శ్లో|| యన్మూలే సర్వతీర్ధాని యన్మధ్యే సర్వదేవతా
య దగ్రే సర్వవేదశ్చ తులసీం త్వా నమామ్యహమ్‌ ||
శ్రీ మహాలక్ష్మీ నారాయణ స్వరూపిణియైన "తులసి" మూలభాగంలో సర్వతీర్ధాలు, మధ్యభాగంలో సమస్త దేవతలు, తులసి మొక్క పైభాగాన సర్వవేదాలతో కొలువైవున్న తులసి మాతకు ముందుగా నమస్కరించాలి. 
ఆషాడమాసంలో శుక్లపక్ష ఏకాదశినాడు పాల కడలిలో యోగ నిద్రకు ఉపక్రమించే శ్రీ మహా విష్ణువు కార్తీక శుక్ల ఏకాదశినాడు (ఉత్థాన ఏకాదశి) మేల్కొంటాడని పురాణవచనం. ఉత్థాన ఏకాదశినాడు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలిసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశినాడు ప్రవేశిస్తాడని పెద్దలంటారు. ఆరోజు గృహిణులు క్షీరాబ్ధిశయన వ్రతాన్ని ఆచరించి తులసమ్మను, మహావిష్ణువునూ పూజించి దీపారాధన చేస్తారు.
సూర్యాస్తమయ అనంతరం మహిళలు తులసి కోట వద్ద శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ఉంచి క్షీరాబ్ధిశయన వ్రతం ఆచరించడం వల్ల దీర్ఘసౌమంగళిత్వం ప్రాప్తించి సర్వ సుఖ సంపదలూ ప్రాప్తిస్తాయని స్మృతి కౌస్తుభం పేర్కొంది.
శ్రీకృష్ణుడిగా ద్వాపర యుగంలో అవతరించిన శ్రీ మహావిష్ణువు తులసిని కార్తీక శుద్ధ ద్వాదశినాడు వివాహం చేసుకున్నాడు. కార్తీక శుద్ధ ద్వాదశి మొదలు, పౌర్ణమి వరకు తులసీ కల్యాణం జరపాలని పండితులు అంటారు. తులసీ కల్యాణానికి దేవ దీపావళి అని పేరు. దీపావళినాటిలాగానే కార్తీక శుద్ధ ద్వాదశినాడు ఇంట్లో మట్టిప్రమిదల్లో దీపాలు వెలిగించి అలంకరించాలి.
గంధర్వతంత్రం ప్రకారం ఏకాగ్రత మరియు నిష్ఠతో ధ్యానం, పూజలు చేసుకోడానికి అనువైన స్థలాల్లో తులసి మొక్కలను గుబురుగా పెంచుతారు.  
వైష్ణవులు, తులసి విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైందిగా భావించి నైవేద్యంలో భాగంగా తులసి ఆకులను నివేదించి, ప్రసాదంగా స్వీకరిస్తారు. విష్ణు భక్తులు తులసి కాండంతో చేసిన పూసల దండలను ధరిస్తారు. తులసికి హరిప్రియ అనే మరోపేరు కూడా ఉంది. సత్యభామ నిలువెత్తు బంగారం ఉంచినా తూగని విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవి సమర్పించిన ఒకే ఒక్క తులసీదళానికి వశుడయ్యాడు. హనుమంతుడు సీతమ్మతల్లి కోసం లంకలోకి ప్రవేశించినప్పుడు అక్కడి ఆవరణలో తులసి మొక్కలను చూసి ఆ గృహిణి గురించిన అంచనా వేస్తాడు. గౌడియ వైష్ణవ సంప్రదాయంలో తులసికి, బృందావన దేవత, బృందాదేవి లేదా వృందాదేవి అన్న పేర్లు ఉన్నాయి. అమృతంలానే తులసి కూడా క్షీరసాగరం మధించే సందర్భంలో ఉద్భవించిందని మన పురాణాలు తెలియజేస్తాయి.
వైష్ణవ దేవాలయాల్లో తులసితో కూడిన సాలగ్రామతీర్థాన్ని ఇస్తున్నారు. ఇది సమస్త రోగనివారిణి, మరికొన్ని దేవాలయాలలో తులసి, పచ్చకర్పూరం కలిపిన చేసిన తీర్థం ఇస్తున్నారు. తీర్థాన్ని భక్తిభావంతో స్వీకరించిన భక్తులు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది, తదనంతరం మోక్షప్రాప్తి పొందుతారన్నది పురాణవాక్కు. తీర్థాన్ని మూడుసార్లు తీసుకోవాలని, తీర్థాన్ని తీసుకున్న తరువాత శిరస్సుపై చల్లుకోవాలని శ్రీప్రశ్నసంహిత చెబుతోంది.
గంగ స్మరణం, హరి నామస్మరణంలానే తులసీ స్మరణం సకల పాపహరణము- బృహన్నారదీయ పురాణం.
తులసిని తాకినంతనే పవిత్రత సిద్ధిస్తుంది. తులసిని ప్రార్థించడం వల్ల రోగాలు నశిస్తాయి. తులసిని పూజించినట్టైతే యమునిగురించిన భయం ఉండదు- స్కంద పురాణం.
తులసి మొక్క ఆకులను ఏవేళ పడితే ఆవేళప్పుడు తాకకూడదు, తెంపకూడదు. ఆకుల్ని తెంపే సమయంలో ముందుగా తులసి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే తెంపాలి. ఆకులను ఏకాదశి రోజు, రాత్రి సమయంలో, ఆదివారాలు తెంపకూడదు. అలాగే గ్రహణ సమయాల్లో ఆకులను తెంపడం అరిష్టం. తులసి మొక్క వద్ద దీపం ఉంచి రోజూ పూజ చేయాలి. ఆరోగ్య లేదా పూజాది అవసరాలకే తులసి ఆకులను తెంపాలి. అకారణంగా వాటిని తుంచడం పాపం. ఎండిపోయిన తులసి ఆకులు రాలితే, వాటిని ఊడ్చివేయకూడదు. ఆ మొక్క సమీపంలోనే గుంత తీసి పూడ్చాలి. తులసి మొక్క ఎండిపోతే దాన్ని పడేయకూడదు. పుణ్య నదీ జలాల్లో లేదా చెరువులోగానీ వేయాలి. ఎండిపోయిన తులసి చెట్టు ఇంట్లో ఉండటం మంచిది కాదని పురాణాలు చెబుతున్నాయి.
తులసి ఉన్న ఇల్లు నిత్యకళ్యాణం పచ్చతోరణంతో శోభిల్లుతూంటుందనడం అతిశయోక్తి కాదు.

***

No comments:

Post a Comment

Pages