పుష్యమిత్ర - 41 - అచ్చంగా తెలుగు
పుష్యమిత్ర - 41(చివరి భాగం)
- టేకుమళ్ళ వెంకటప్పయ్య



జరిగిన కధ: పుష్యమిత్రుడు తన కాలంలో దండయాత్రలకు భయపడి కొన్ని వేల మణుగుల బంగారాన్ని భూగర్భంలో ఒక సొరంగంలో దాచిన విషయం చెప్తాడు.  ఇండియన్ గ్లోబల్ఐ రహస్య విషయం అక్కడపనిచేసే అసాఫాలి ద్వారా ఎక్కువ విషయాలు రాబట్టాలని అతణ్ణి పాకిస్తాన్ కు తీసుకెళ్ళే పధకంలో ఇండియన్ అర్మీకి దొరికిపోతాడు.  బాబాజీ ప్రత్యక్షమై త్వరలో పుష్యమిత్రుని అవతారం పరిసమాప్తి కాబోతున్నదని చెప్తాడు. నాగబంధం విప్పే విధానం సవిస్తరంగా తెలియజేస్తాడు. పుష్యమిత్రుడు అనుకున్న విధంగా నాగబంధం విప్పి పది లక్షల టన్నుల బంగారం మిగతా నవరత్నాలు రిజర్వు బ్యాంకుకు చేరుస్తాడు. ప్రధాని ఆదేశాల మేరకు ఒక వినూత్న "సేవ్-ఐ.జి" ఆపరేషన్ పుష్య శుద్ధ పౌర్ణమి నాడు  చేపట్టారు. అదే రోజు పుష్యమిత్రుని అవతార సమాప్తి కాబోతున్నదని బాబాజీ తెలియజేస్తాడు. (ఇక చదవండి)
ఆరోజు పుష్య శుద్ధ పౌర్ణమి. పుష్యమిత్రుడు కాలకృత్యాలు తీర్చుకుని సంధ్యావందనం ముగించాడు. ప్రధాని కోరిన విధంగా హెలికాప్టర్‌లో ఇండియన్ గ్లోబల్-ఐ ఉన్న గ్రౌండ్ కంట్రోల్ విభాగం చేరుకున్నాడు. అప్పటికే ప్రధాని, రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి ఒక గదిలో సమావేశమయి ఆపరేషన్ "సేవ్-ఐ.జి" గురించి ఆలోచనలో ఉన్నారు. ఒక నాచురల్ డిజాస్టర్ సంభవించిన విధంగా ఆపరేషన్ ఉండాలని, అది ఆరోజు రాత్రి 1-2 గంటల సమయంలో జరగాలని నిర్ణయమైంది. ముందుగానే భారత్ సైనికాధిపతి స్వయం పర్యవేక్షణలో ముఖ్యమైన ప్రాంతాల్లో పీ.ఓ.కే ప్రాంతానికి కొంచెం దిగువన క్షిపణులను ప్రయోగించడానికి రంగం సిద్ధమయింది.
"భారతదేశానికి ఇంక నా అవసరం లేదని భావిస్తున్నాను. ఈ దేశానికి పూర్వ వైభవం వచ్చేసింది. అన్న్ని ఖండాలు అన్ని దేశాలు మనవైపే చూస్తున్నారు. అన్ని రంగాల్లో భారత్ దూసుకుపోతోంది. మళ్ళీ కుటీర పరిశ్రమలు, మన పూర్వపు వైద్య, విద్యావిధానాలు అమల్లోకి వచ్చాయి. మళ్ళీ సంస్కృతం, వేదాలు, వంటి విద్యలపై ఆసక్తి పెరిగింది. కనుక నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. దానికి మీ అనుమతి కోరుతున్నాను."
"అదేమిటి పుష్యమిత్రాజీ! మీ సలహాలు మాకు శిరోధార్యం. నిత్యం మీ సలహాల వల్లనే భారత్ ఇంత పురోభివృద్ధి సాధించింది. మీరు భారత్ ముఖ్య సలహాదారుగా కొనసాగవలసినదే! ఇదే మా అందరి కోరిక" అన్నాడు ప్రధాని.
దానికి అందరూ ఔనన్నట్లు తలలు ఊపారు.  
"నేను అర్ధరాత్రి వరకూ ఇక్కడే ఉండదలచాను. ఆపరేషన్ చూడాలని ఉంది" అన్న పుహ్స్యమిత్రుని మాటలకు ఉలిక్కిపడ్డ రక్షణ మంత్రి "చాలా ప్రమాదం! హిమాలయాలలో కొంత శాతం కూలి కొన్ని కిలోమీటర్లమేర లోయ ఏర్పడబోతున్నది. ఇలాంటి సమయంలో మీరు ఇక్కడ ఉండడం ప్రమాదం" అన్న మాటలకు చిరునవ్వు నవ్విన పుష్యమిత్రుడు "నా జన్మ స్థలమే హిమాలయాలు. భయపడకండి" అని సర్ది చెప్పాడు. అందరూ శెలవు తీసుకున్నాక గ్లోబల్-ఐ లోని వీ.ఐ.పీ గదిలో పుష్యమిత్రునికి విశ్రాంతి ఏర్పాటు చేశారు.

*    *    *

గుడ్‌మార్నింగ్ సార్! సెల్యూట్ కొట్టి నిలబడ్డాడు పాక్ సైనికాధికారి ప్రెసిడెంట్ ముందు.
"బోలీయే"
"మనం అనుకున్న ఆపరేషన్ ఈరోజు రాత్రి తెల్లవారు ఝామున 3-4 గంటల మధ్యలో ప్లాన్ చేశాము. అందరూ నిద్ర మత్తులో ఉన్న సమయంలో ఒక లాంగ్‌రేంజ్ మిసైల్ ఆ గ్లోబల్-ఐ భవనాన్ని తునా తునకలు చేస్తుంది"
"బీ కేర్‌ఫుల్. ఈ విషయం ఎక్కువ మందికి తెలియరాదు"
"ఎస్ సార్!”
"రాత్రి మూడు గంటల ప్రాంతంలో మీకు ఒక మెసేజ్ పెట్టి పని ప్రారంభిస్తాం".
"అలాగే!"
"ఒకే ఒక్క క్షిపణితో వారి గ్లోబల్-ఐ హిమాలయాల్లో కలిసిపోతుంది"
"వారు వేయి కళ్ళతో గమనిస్తూ ఉంటారు. జాగ్రత్త!"
"ఎస్. సార్! బై"
*    *    *
రాత్రి 12 గంటలు దాటింది. పుష్యమిత్రుడు ధ్యాన నిమగ్నుడై గదిలో నేలపై కూర్చుని ఉన్నాడు. ఒక పలుచటి తెల్లని తెర గదిలోకి వచ్చింది. ఆ ఆకారం క్రమంగా బాబాజీ గా రూపు దాల్చింది. పుహ్ష్య మిత్రుని శిరసుపై చేయి ఉంచాడు బాబాజీ. సమాధి నుండి లేచి బాబాజీ కాళ్ళపై పడ్డాడు.

"నీ అవసరం ఇక భారత్‌కు లేదు. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే శక్తి వంతమైన దేశం. అందరూ భారత్ వద్ద అప్పుచేసే పరిస్థితి వచ్చింది. అన్ని రంగాల్లో ఈ భరత ఖండం దూసుకుపోతోంది. ప్రధాని మరలా నలందా, తక్షశిల విశ్వవిద్యాలయాలను పున:ప్రారంభిస్తున్నాడు. దేశ విదేశీయులు మరలా భరత ఖండంపై అడుగిడి మన పురాతన న్యాయ, తర్క, మీమాంసలను అభ్యసిస్తారు. గౌతముడు అనే ఋషి మొదటిగా న్యాయ దర్శనాన్ని ప్రవచించాడు. ఆయన్నే అక్షపాదుడనీ కూడా అంటారు. సవ్యమైన ఆలోచనకు షరతులు,సత్యాన్ని గురించిన సిసలైన జ్ఞానాన్ని సముపార్జించే  మార్గాలు కనుగొనడమే ఆయన తన ప్రధాన లక్ష్యంగా ఎంచాడు. న్యాయ దర్శనాన్ని న్యాయవిద్య, తర్క శాస్త్ర, ఆన్వీక్షకీ (The Science of Critical Study) అనే పేర్లతోనూ పిలుస్తారు. అంతిమ సత్యాన్ని గురించిన సమ్యక్ జ్ఞానం మాత్రమే ఈ లోకంలో జనం  బాధలు నివారించి, వారికి విముక్తి కలిగించగలదని భావించి  తార్కికత, జ్ఞాన సముపార్జనా మార్గాలపైనే నైయాయికులు తమ దృష్టినంతా కేంద్రీకరించారు. ఆయన రాసిన 'న్యాయ సూత్ర' అనే ఐదు అధ్యాయాల గ్రంథం, దానిపై వాత్స్యాయనుడు, ఉద్ద్యోతకరుడు, వాచస్పతి, ఉదయనుడు, జయంతుడు మొదలగు అనంతరకాలపు తాత్త్వికులు రాసిన వ్యాఖ్యాన గ్రంథాలు ఈ సిద్ధాంతాన్ని విపులంగా వివరిస్తాయి. ప్రాచీన న్యాయా(Ancient School of Nyaya)నికి ఇవే ఆధార గ్రంథాలు. నవ్యన్యాయా(Modern School) నికి గణేశుని 'తత్త్వ చింతామణి' ఆధార గ్రంథం. ఈ  నవ్యన్యాయ శాఖ ముందుగా మిథిలలో ప్రారంభమై, అనంతరకాలంలో బెంగాల్ లోని నవద్వీపం (నాడియా)లో పరిడవిల్లిందన్న విషయం నీవు యెరుగనిది కాదు. అవన్నీ మరలా పునర్వైభవం చెందనున్నాయి.” అన్న బాబాజీ మాటలకు మరొక మారు ప్రణమిల్లి నా అవతార సమాప్తికి రంగం సిద్ధంచేయమని ప్రార్ధించాడు.
"రెండిటికీ ఒకే ముహూర్తం. నీవు భారత్‌కు పెట్టిన ముహూర్తంలోనే ఒక కాలనాళిక ఇక్కడకు వచ్చి చేరుతుంది. దానిలో నీవు పండుకోగానే మూసుకుని పోతుంది. తరువాత నువ్వు నిశ్చింతగా ఉండవచ్చు. అది నిన్ను చేరవలసిన స్థలానికి చేరుస్తుంది."
"తమ ఆజ్ఞ"
తలయెత్తి చూసిన పుష్యమిత్రునికి బాబాజీ కనుపించలేదు.

*    *    *
అర్ధరాత్రి ఒంటిగంటకు ఐదు నిముషాలు ఉందనగా ప్రధానికి ఫోన్ వచ్చింది.
"సార్! ఇంకో ఐదునిముషాల్లో ఆపరేషన్ ప్రారంభం"
"ఎస్. గో అహెడ్"
మరో 10 నిముషాల్లో పెద్ద విస్ఫోటనం. మంచు కొండలు పెద్ద శబ్దంతో కూలి పాక్ కు మనదేశానికి దాదాపు 25 కిలో మీటర్ల మేర అగాధాన్ని సృష్టించాయి.
ఉలిక్కిపడ్డ సమస్త ప్రజానీకంతో బాటూ పాక్ ప్రెసిడెంట్ కు ఒక్కక్షణం జరిగిందేమిటో అర్ధం కాలేదు. మ్రోగిన ఫోన్ అందుకున్నాడు. జరిగిన విషయం తెలిసింది. సరిగ్గా పాక్ ప్లాన్ అమలుకు 2 గంటలముందు వారు చేసిన తంత్రం అర్ధమయింది. డ్యామిట్ అంటూ  కోపంగా ఫోన్ ను విసిరి నేలకు కొట్టాడు.
*    *    *
పుష్యమిత్రుడు కాలనాళిక గాలిలో తేలుతూ గదిలోకి రావడం గమనించి ఆ పరమేశ్వరునికి చివరి సారి ప్రార్ధించి లోపల పడుకున్నాడు. లోనకు గుప్పెడు ఊదా రంగు వాయువు ప్రవేశించింది. కాలనాళిక మూసుకుని పోయింది. అది గాలిలో తేలుతూ సాగిపోయింది.
*    *    *
భారతదేశం కర్మభూమి. వేదభూమి. తపోభూమి. త్యాగభూమి. ఆనంద భూమి. పాశ్చాత్య నాగరికతల్లో ‘త్యాగ’శబ్దం కనబడదు. ఏ కొందరో తప్ప వారు భౌతిక సంపదలు సమకూర్చుకొని ఆనందం అనుభవించే ప్రయత్నం చేస్తున్నవారే! త్యాగంతోనే అమృతత్వం సిద్ధిస్తుందని శాస్త్ర వచనం. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసల ద్వారా త్యాగ భావానికి బీజం పడుతుంది. వీటి సమగ్ర స్వరూపమే భారతదేశం. సత్య దర్శనంలో భాగంగా మన ప్రాచీన ఋషులు సమగ్ర ప్రకృతికి తమ దేహాన్ని ప్రతీకగా భావించి పరిశోధనలు చేశారు. తమ అంతరంగంలో ఉన్నదే సర్వత్రా వ్యాపించి ఉన్న ‘సత్య’మని నిజ నిర్ధారణ చేశారు. 
      మన ఋషులకు ఏది సత్యం, ఏది కాదు అన్న విషయంలో సందిగ్ధత లేదు. స్పష్టత ఉండేది. ప్రకృతికి మనిషికి సంబంధం ఏమిటి అన్నప్పుడు - అది తల్లీబిడ్డల అనుబంధమని బోధపడింది. మనిషికే కాదు, సకల చరాచరాలకూ ప్రకృతే తల్లి. ప్రకృతిలో ఆవిర్భవించే ప్రతి ఋతువూ మనిషికి శ్రేయం కలిగించేదే. వర్ష ఋతు ఆగమనంతో అప్పటి దాకా వేడెక్కిన భూమి చల్లబడుతుంది. పంటలకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. తాగునీరు పుష్కలంగా అందివస్తుంది. నేల సస్య శ్యామలమవుతుంది. సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, వెరసి భూమిపై సప్త సముద్రాలు, అనంత వినీలాకాశం. అన్నింటికీ మనిషిపై గల వాత్సల్యం ఎల్లలు లేనిది. భానుడి చుట్టూ పుడమి తల్లి సంచారం, తన చుట్టూ చందమామ ప్రదక్షిణం వల్ల ఏర్పడే దివారాత్రాలు, ఎండ-వెన్నెలలు జీవకోటికి జవజీవాలు ప్రసాదిస్తాయి. కంటికి కనిపించే దైవమే సమస్త ప్రకృతి! తానేమిటో ప్రకృతి వెల్లడి చేసినా మానవుడు సత్యాన్వేషణ చేస్తూనే ఉన్నాడు. అంతరిక్ష రహస్యాలు కొన్ని వెల్లడైనా అతడి తహతహ అంతులేనిది. తన అంతరంగంలోకి తొంగిచూస్తే ప్రపంచపు అంతరంగం అతడి దివ్య చక్షువులకు కనిపిస్తుందని, ఆ అంతరంగ వీక్షణం మనిషి మనిషికి మధ్య గల అభేదాన్ని క్షుణ్ణంగా ఎరుక పరుస్తుందని, ఆ ఎరుకే ప్రపంచ మానవాళి సమానత్వానికి, సోదర భావానికి వెలుగు దివ్వె అవుతుందనీ బోధపడుతుంది. ఏనాటికైనా మనిషికి పదార్థ విజ్ఞానంతో పాటు పరార్థ జ్ఞానం సైతం అత్యంత అవసరమని అప్పుడే అన్వేషణ పూర్తయి సత్య దర్శనం కనుల ముందు సాక్షాత్కరిస్తుందని తెలుసుకోవాలి. (సమాప్తం)

*    *    *

No comments:

Post a Comment

Pages