నిష్క్రమణం - అచ్చంగా తెలుగు
నిష్క్రమణం 
డా.వారణాసి రామబ్రహ్మం 
(జూన్ 2018 లో  జంధ్యాల పికెల్స్ వారి కధల పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కధ. )మరణం అనేది ఒక విరామ చిహ్నమో,  ఫుల్స్టాప్పో తెలియదు.

 మనం జీవించి ఉన్నప్పుడు మనలో ఉండి, మనం మరణించే సమయంలో శరీరాన్ని ఆత్మ వీడుతుందని తరువాత మరొక శరీరంలో ప్రవేశిస్తుందని భగవద్గీతలో చెప్పబడింది. ఎలా చింకిపాతైన బట్టను వదిలి కొత్త బట్టను కట్టుకుంటామో అలా ఆత్మ జీర్ణమైన శరీరాన్ని వదిలి కొత్త శరీరంలో ప్రవేశిస్తుందని భగవద్గీతపై వ్యాఖ్యానాలలో మనం చదువుతాము. 

 ఆత్మ ఇలా శరీరం వదిలి మరో శరీరంలో ప్రవేశించడాన్ని ఒక ఉపాధి వదిలి ఇంకో ఉపాధిని ఆశ్రయించడం అని సాంకేతికంగా తత్త్వ ప్రియులు చెబుతారు.

 ఇటువంటి వ్యాఖ్యలు,  వ్యాఖ్యానాలు మరణం పిదప మనం పునర్జన్మ పొందుతాం అని సూచిస్తాయి. 

 కాని నాకు ఇటువంటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలపై నమ్మకము లేదు. కాని ఈ విషయమై నేను వాదాల్లోకి, వివాదాల్లోకి దిగను. ఎందుకంటే ఈ వాదాలు, వివాదాలు మన నమ్మకాల మీద, మతం పైననే ఆధారపడి ఉంటాయి. 

 నేను మా అమ్మగారికి, నాన్నగారికి ఒకే సంతానాన్ని. నన్ను వారిద్దరూ ఎంతో ప్రేమగా, గారాబంగా పెంచారు. ఆ గారాబం వల్ల నేను చెడిపోలేదు.బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగంలో ప్రవేశించాను. నా ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని, ఇతర హాబీలని వదలకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాను. నా భార్య నా జీవన కచేరిలో శ్రుతిలా నాకు చేదోడు వాదోడుగా ఉండి గృహ నిర్వహణ ఎంతో శ్రద్ధగా, ఆదరాభిమానాతో చేస్తోంది. సంసారాన్ని నేను ఈదేలా చేస్తోంది. అలా మా జీవితం ఒక యుగళ గీతంలా సాగిపోతోంది.

 మా నాన్నగారు నాకు ఉపాధ్యాయులు, తత్త్వవేత్త, మార్గదర్శకులు, మంచి స్నేహితుడు కూడా. ఆయన అందరికీ నచ్చిన మంచివారు, దయా సముద్రులు. నేను జీవితం గురించి ఆయన ద్వారా, ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆయన స్కూల్ హెడ్ మాస్టర్ గా చేసి పదవీవిరమణ చేశారు. నా ఆంగ్ల భాషా ప్రావీణ్యం ఆయన భిక్షే.

ఆయన ప్రస్తుతం చాలా అనారోగ్యంగా ఉన్నారు. ముసలితనం వస్తున్నకొద్దీ మన శరీరం ఎలా నెమ్మదిగా చిక్కిపోయి, ముడుతలు పడి, జీర్ణమై, వ్యాధులు కలిగి, పనికిరాకుండా పోతుందో గమనిస్తూంటే మనసు సుడులు తిరుగుతుంది.

 మా నాన్నగారి శరీరం అలా అయిపోవడాన్ని నేను ఎంతో వేదనతో  గమనిస్తున్నాను.ఆయన శరీరం మాంసం, కండరాలు, కొవ్వు కరిగి పోయి అస్థిపంజరంలా తయారయ్యారు. మా డాక్టర్ నా క్లాస్మేట్. మా నాన్నగారు బ్రతికుండేది ఇంక రోజులు మాత్రమేనని చెప్పాడు.  మా నాన్నగారితో శాశ్వత వియోగం ఇంక రోజులలో అని తెలిసే సరికి విహ్వలుణ్ణి అయ్యాను. విషణ్ణత నా హృదయాన్ని ఆవరించింది. మా నాన్నగారి వాత్సల్యం, ఆపేక్ష, ఆత్మీయత, అనురాగములలో ఎలా నేను పసివానిగా, బాలుడిగా, టీనేజర్ గా, యువకుడిగా, మధ్య వయస్కునిగా ఎదిగానో తలుచుకోవడం నాకిష్టం. ఆ జ్ఞాపకాలను ఆస్వాదిస్తూ ఉంటాను.

 మా నాన్నగారి పట్ల నాకున్న ప్రేమ, గాఢ అనుబంధము  ఎంతైనా, "జాతస్య మరణం ధ్రువమ్  అనే నిజాన్ని మార్చలేదు. ఈ సత్యం అంత స్పష్టమైనది. 

 ప్రకృతి నియమానుసారం మన శరీరము చనిపోవాలి. మన విషాదాలు, వేదనలు మరె విధమైన విచారగ్రస్త హృదయాలు ఈ సంఘటనని ఆపలేవు. అయినా మన మనసు రోదించక మానదు. 

 ఆ రోజున మానాన్నగారికి నలభై ఏళ్లుగా సహోద్యోగి, అరవై ఏళ్లుగా మిత్రులు అయిన  శాస్త్రిగాను మా నాన్నగారిని చోడడానికి వచ్చారు.  వారిద్దరి జీవితాలు ఇంచుమించు ఒకేలా జరిగాయి. ఎటొచ్ఛీ ఆయనికి యెరులు కొడుకులు, ఒక కూతురు, మా నాన్నగారికి నేనొక్కడనే. మా అమ్మగారి లాగానే ఆయన భార్య కూడా మరణించి పదేళ్లు అయింది. ఇద్దరికీ సమ వయస్సు, 85 సంవత్సరాలు. 
ఆయనొచ్చాక వారిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు ఆయన మా నాన్నగారికి వీడ్కోలు ఇవ్వడానికి వచ్చారా అన్నట్టు సాగాయి. మా నాన్నగారు ఇంకా రోజులలో ఉన్నారని ఆయనకు తెలుసు. వారిద్దరూ రామాయణ, మహాభారతాలు, భాగవతం, భగవద్గిత ల గురుంచి మాట్లాడుకున్నారు. భగవద్గిత, ఉద్ధవ గీతలలో శ్రీకృష్ణుని ఉపదేశాల గురించి తులనము చేస్తూ మాట్లాడుకున్నారు. ఇన్నాళ్లు వారు కలిసి జీవించారు. ఇద్దరూ సాంప్రదాయ కుటుంబాలనుంచి వచ్చినవారే.కానీ ఆధునికతని కూడా అంతగా సంతరించుకున్నవారు.  ఇద్దరూ కలిసి సినిమాలకి వెళ్లేవారు. ఇద్దరూ కలిసి మా వూళ్ళో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవములసంగీత కార్యక్రమములకు వెళ్లేవారు. గణపతి, దసరా నవరాత్రి, అమ్మవారి ఉత్సవాలకు వెళ్లి నాటకములు, హరి, బుర్రకథలు, చూసేవారు. మా నాన్నగారు మరణించాక ఈ అనుబంధము ఏమవుతుందో? శాస్త్రి గారు విధి నియమాన్ని గ్రహించి, హృదయములో ఇదంతా దాచుకుని తన జీవితాన్ని జీవిస్తారు  అనుకుంటా. 

 బతికి ఉన్నన్నాళ్ళు మనం అందరమూ పోట్లాడుకుంటాము, మన అహంభావములను, అహంకారములను, గొప్ప, తక్కువలను చూపిస్తూ ఉంటాయు. మగవాళ్ళు ఆడవాళ్ళని బానిసలలా చూసారు అంటాము. అబ్బుకి, అంతస్థుకి , ఆస్తిపాస్తులకి ఎంతో విలువ ఇచ్చి మనుషులను దూరము చేసికుంటాము.  ఈ భూమిపై మన ఉనికి కాసేపే అయినా ఎన్నో శాశ్వత ప్రణాళికలు వేసికుంటూ, అయినా వాళ్ళని తీసిపారేస్తూ, అందినంత సక్రమ మార్గములలో సంపాదించి చివరకు మట్టిలో కలిసిపోతాము. ఇదంతా ఆలోచిస్తూంటే నాకు ఎంతో ఆశ్చర్యము కలిగి, నవ్వు వస్తూ ఉంటుంది. విస్తుపోతూంటాను. కవి అయినా, సామాన్యుడు అయినా, తత్త్వవేత్త, మహారాజు, సన్యాసులు, రాజకీయ నాయకులు, సినీ తారలు అందరికి  ఈ పృథ్విపై నివాసము తాత్కాలికం. అశాశ్వతము. 

 మనము పుట్టాము అంటే మరణించి తీరాలి. ఇవాళో, రేపో మన గమ్యము స్మశానము. ఈ జ్ఞానము కలిగితే మన సంఘములో జరిగే దారుణాలు, అకృత్యాలు, అవినీతి ఇంతలా పెచ్చుమీరి ఉండేవి కాదు. మన జీవితాలతో ఆడుకునే కునాయకుల, నేరస్థుల, దుర్మార్గుల, కుల, మత, సిద్ధాంత దురభిమానుల ఆగడాలు తరిగిపోయేవి. 

 మరణము అందరిని సమస్థాయికి రప్పింస్తుంది. అన్ని ఆహ్మ్భావాలు, అహంకారాలు, విజయములు, ఓటమిలు అన్నిటికి విలువ లేకుండా చేసే ఏకైక న్యాయ వేత్త మరణం. 
అయినా మనం శత్రుత్వాలు, ఇతరులను హించించడం మానము. మన స్వార్థానికి అన్ని అకృత్యములు, అన్యాయములు చేస్తాము. 

 మరణం గురించి విచారిస్తే మనుషులు కొంత సన్మార్గులు అవుతారు. మనలో ఒకరు మరణించాక మనము మళ్ళీ ఎప్పటికీ కలవము.  ఎంతో బాధాకారమైన, మనము భరించలేని ఈ వాస్తవము సత్యము. 

 మనకు అయినవాళ్లు, ఆత్మీయులు మరణిస్తే మనము ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తాము. అదే ఒక బయటి వ్యక్తి మరణిస్తే మనకు ఏమీ అనిపించదు. ఏ దుఃఖము కలగదు. మన అనుబంధమే ఈ వేదనని కలిగిస్తుంది. ఇదే రాగము. అందుకే విరాగము నెమ్మదిగా పెంచుకోవాలని వేదాంతులు సలహా ఇస్తారు. మన ప్రియతముల మరణాన్ని, తద్వారా కలిగే బాధాకరమైన వియోగాన్ని తట్టుకోవడానికి ఈ వైరాగ్యము ఉపకరిస్తుంది.  ఎంత వేదాంతము అలవరచుకున్నా తండ్రికి వీడ్కోలు పలికే సమయము వస్తే గుండె బ్రద్దలై పోతుంది. గాఢ నిద్ర తాత్కాలిక మరణము, మరణము శాశ్వతమైన నిద్ర అంటారు పెద్దలు. ఈ నిద్రనుంచి మనము మళ్ళీ లేవము. 

 ఇన్ని తత్త్వాలు, వేదాంతాలు, పెద్దల సుద్దులు, అన్నీ కూడా వగచి హృదయానికి తొందరగా స్థిమితము కలిగించడానికే ఉద్దేశించ బడ్డాయి. వరాగ్యముతో ఈ ధ్రువము, తప్పనిసరి ఆయినదాన్ని సంయమనంతో భరించడానికే ఈ మాటలన్నీనూ. మనము ఈ వాస్తవాన్ని, ప్రక్రుతి నియమాన్ని అంగీకరించి తీరాలి, నెమ్మదిగా సర్దుకోవాలి. మళ్లీ మన జీవితాలు మనం జీవించాలి. తత్వవేత్తలు మన తాత్కాలికమైన జీవితాన్ని, మానవ ఉనికిని, దృష్టిలో ఉంచుకొని, నిరాసక్తముగా, నిర్వేదముగా, వైరాగ్యముతో జీవిస్తారు. జీవితములో కలిగే వడిదుడుకులను, సుఖదుఃఖాలను, కష్టనష్టాలను, ప్రియములను, అప్రియములను సంయమనం నిండిన మనసుతో తీసికొని తమ తమ విధ్యుక్త ధర్మములను నిర్వహిస్తారు. బ్రతుకులలో శాంతి, సౌఖ్యములను నింపుకుంటారు. కరుణ నిండిన మానసముతో హాయిని అనుభవిస్తూ ఉంటారు. 

 నాకు చిన్నప్పటినుంచీ మనిషికి పునర్జన్మ, జనన మరణములు మనందరమూ అనుకునేట్లుగా, భగవద్గీతను అర్థము చేసికున్నట్టుగా, లేవు, అని ఒక స్ఫురణ ఉండేది. మా నాన్నగారితో శాశ్వత ఎడబాటుని తలుస్తూ, ఆ సమయమునకై  మానసికముగా సిద్ధపడుతూ ఉండేవాడిని.  మా నాన్న గారికి శాశ్వత వీడ్కోలు చెప్పడానికి గుండె దిటవుగా ఉంచుకున్నాను. 

 మేము ఇద్దరమూ మళ్ళీ కలవము. కానీ మేము ఇద్దరమూ ఎంతో ఆపేక్షతో, ప్రేమగా, ఆత్మీయముగా, స్నేహితులవలె కలిసి జీవించాము. మా మా విధ్యుక్త ధర్మములను చక్కగా సంతృప్తిగా   పాటించాము.  మన జీవితాల లక్ష్యము, పరమార్థము అదే కదా!

కొన్ని రోజుల తర్వాత మా నాన్నగారికి అంతిమ క్షణాలు సమీపించాయి. నన్ను దగ్గతికి రమ్మని నా ఒళ్ళంతా ఆప్యాయముగా తడిమి, ప్రేమ నిండిన చూపులతో నా చెవిలో గుసగుసలాడేరు. 

"నేనింక నిద్రపోతాను రా" అని కోమాలోకి వెళ్లిపోయారు. కొన్ని గంటల తర్వాత పరమపదించారు. 
ఎవరూ ఆపలేనంతగా ఏడ్చాను. మా ఇద్దరి వియోగము జరిగిపోయింది. 

 ఆయన భౌతిక శరీరము జడము అయ్యి ఉండవచ్చు. కానీ నా స్మృతిలో శాశ్వతముగా ఉంటారు. 

 ఇప్పుడు కూడా నాకు మరణము విరామ చిహ్నమో, ఫుల్స్టాప్పో తెలియదు

 ***

No comments:

Post a Comment

Pages