మనిషి చేసిన మొట్టమొదటి ఆయుధం - అచ్చంగా తెలుగు

మనిషి చేసిన మొట్టమొదటి ఆయుధం

Share This
మనిషి చేసిన మొట్టమొదటి ఆయుధం...
కె.ఎన్.మనోజ్ కుమార్ 
(జూన్ 2018 లో  జంధ్యాల పికెల్స్ వారి కధల పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కధ. )

ఆనాటి భూమి పూర్తిగా పచ్చని చెట్లతో,స్వచ్ఛమైన నీటితో,కాలుష్యం నిండని గాలితో,ఎక్కువ క్రూర జంతువులతో,తక్కువ మనుషులతో నిండి ఉంది.
మనిషి ఇంకా సామూహికంగా బ్రతకడం ప్రారంభించని రోజుల్లో,మాట పెదవి దాటని దశలో ,స్ట్రగుల్ ఫర్ ఎక్సిస్టెన్స్ అనేది తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు,మనిషికి ఆకలి కోపం నిద్ర సెక్స్ వంటి నేచురల్ ఇన్స్టింక్ట్స్ తప్ప వేరే ఫీలింగ్స్  అభివృద్ధి చెందని కాలంలో ...అసలు మనిషి మనుగడే అసాధ్యమైన యుగంలో...భూమిపైన ఒకానొక ప్రదేశంలో...
ఎటుచూసినా పచ్చదనమే.ఎత్తైన కొండలు.కొండల్ని భయపెట్టే కోనలు.కోనల్ని కలిపే వాగులు.వాగుల్ని విడిచి నిలిచిన నీటి మడుగులు.ఆ ప్రాంతంలోనే ఉంది 400 అడుగుల ఎత్తునుండి దుమికే జలపాతం.ఇలా పూర్తిగా జీవంతో కళకళలాడుతున్న ఆ ప్రాంతంలో అనేక రకాల పక్షులు,రకరకాల జంతువులు నివశిస్తున్నాయి.జలపాతానికి  దగ్గర్లోనే ఒక గుహలో 
ఎన్నో సంవత్సరాలనుండి ఒక ఆడ-మగ జంట బ్రతకడానికి మాత్రమే బ్రతుకుతుండేవారు.వాళ్ళమధ్య ఏముందో వాళ్ళకే తెలియని స్థితిలో,ప్రేమని మించి ప్రకృతి విధించిన అవసరం అనే బంధనంలో చిక్కి కాలం గడుపుతూ ఉండేవారు.అవసరం అలవాటుగా మారిన వాళ్లలో ఆకర్షణకి మించిన బంధమేదో చిగురించింది.ఆ ఇద్దరూ రోజంతా గుహలోనే ఎక్కువసేపు గడిపేవారు.ఆకలి వేస్తే మగ మనిషి మాత్రమే గుహ బయటకి వెళ్లి ఆహారాన్ని సంపాదించి తీసుకొచ్చేవాడు.
ఒకరోజు గుహలో ఒంటరిగా ఉన్న ఆడ మనిషి తన శరీరంలో వచ్చిన మార్పులను చేతులతో తాకి గమనించుకుంటుంది.ఉబ్బెత్తుగా వచ్చిన కడుపు మీద తన చేత్తో మెల్లిగా పైకి కిందకి నిమిరింది.పొట్టమీదున్న వెంటుకల శబ్దం వినబడింది తనకి  నిశ్శబ్దంగా ఉన్న ఆ గుహలో.గుహ బయటనుండి కీచు కీచుమనే శబ్దాలు వినిపించడంతో నెమ్మదిగా బయటకి నడిచి ఆ శబ్దాలొస్తున్న వైపు వెళ్ళింది ఆడ మనిషి.అలా నడుస్తూ వాగువైపుకి వెళ్తున్న తనకి నీటిమడుగులో పడి చిక్కుకున్న ఒక పక్షి గూడు కనిపించింది.అందులో ఆరు చిన్న చిన్న పక్షి పిల్లలు కనిపించాయి.అరుస్తున్న వాటిని పైకి తీద్దామని మడుగులోకి దిగిన ఆడ మనిషిని చూసి ఇంకా గట్టిగా అరవడం మెదలుపెట్టాయి పక్షి పిల్లలు.సగం శరీరం నీటిలో ఉండగా పక్షి పిల్లల్ని బైటకి తీయడానికి ముందుకు వెళ్తున్న  తనని చూసి ఎందుకు అలా అరుస్తున్నాయో అర్ధంయ్యేలోపే ఆడ మనిషికి ఆకాశంలోంచి ఒక పెద్ద శబ్దం వినిపించింది.శబ్దం వినబడ్డంతోనే ఒక్కసారిగా వెనక్కి తిరిగి  ఆకాశం  వైపు చూసిన ఆడమనిషికి 60కేజిల,12అడుగుల శరీర కొలతలతో ఉన్న ఒక పెద్ద పక్షి తన రెక్కలని విపరీతంగా ఆడిస్తూ పెద్దగా  అరుస్తూ జలపాతం పైనుండి తనమీదకి రావడం కనిపించింది.
గుహకి దూరంగా ఉన్న పొదల్లో రెండు కుందేళ్ళు ఆడుకుంటూ,దొరికినవి తింటూ పరిగెడుతున్నాయి.గిలిగింతలు పెడ్తున్న పచ్చిక మీద పరిగెడుతున్న రెండు కుందేళ్ళలో ఒక కుందేలుకి చెట్టు మాటునుండి వచ్చిన రాయి ఒకటి  బలంగా తగలడంతో ఆ పచ్చిక మీదే  పడి కదలకుండా ఉండిపోయింది.భయంతో రెండో కుందేలు పొదల్లోకి పారిపోయింది.పొదల్లోనుండి చూస్తున్న కుందేలుకి చెట్టు చాటు నుండి వచ్చిన మగ మనిషి కనిపించాడు,నడుచుకుంటూ వచ్చి పచ్చిక మీద పడున్న కుందేలుని తీసుకుని అక్కడనుండి బయలుదేరాడు.మగమనిషి వెళ్ళిన వెంటనే పొదల్లోనుండి బయటకి వచ్చిన కుందేలు ఇంతకముందు కుందేలు పడున్న ప్రదేశంలో అటూ ఇటూ కల తిరిగింది.తిరిగి తిరిగి మగ మనిషి వెనకాల పరిగెట్టింది.

భయం అనేది ప్రతి ప్రాణికి తనను తానూ కాపాడుకోవడానికి ప్రకృతి పెట్టిన జాగ్రత్త అయితే ...ప్రేమ అనేది ప్రతి ప్రాణి చావడానికి కూడా తమని తాము  సిద్ధం చేసుకునే  ఓ తెగింపు.
గుహకి చేరుకున్న మగ మనిషికి రొజూ తనకోసం చూసే ఇంకో మనిషి కనిపించలేదు.తనతో  తీసుకొచ్చిన పండ్లని,జంతువుల్ని ఒక పక్కకి పెట్టి గుహంతా వెతికాడు మగ మనిషి.ఆడ మనిషి కనిపించలేదు.అరిచాడు కాని బదులు రాలేదు.పరిగెత్తుకుంటూ గుహ బయటకొచ్చి దిక్కులన్నీ బద్దలయ్యేలా  గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి చుట్టూ ఉన్న  ప్రాంతమంతా ఒక్కసారిగా వణికిపోయింది.మగ మనిషి గుండె వేగం పెరిగింది. శ్వాస లయ తప్పింది.తనకే తెలియని ఏదో ఆందోళన ఇంతముందెన్నడూ అనుభవంలోకి రాని ఒక శూన్యంలోకి తోసేస్తున్నట్లనిపించింది.ఆడ మనిషి కోసం వెతుకుతూనే జలపాతం వైపుకి పరిగెత్తాడు.గుహ వదిలి మగ మనిషి వెళ్ళగానే పక్కనే పొదల్లో దాక్కుని ఉన్న కుందేలు గుహలోకి వెళ్ళింది.
జలపాతంవైపు పరిగెడుతున్న మగ మనిషికి దూరంగా కనిపిస్తున్న నీటి మడుగు దగ్గర ఏదో పడుండటం కనిపించింది.పరిగెత్తడం ఆపాడు,నెమ్మదిగా అటువైపు చూస్తూ నడిచాడు.తను నడుస్తున్నకొద్దీ వెళ్ళాల్సిన ప్రదేశమంతా ఎర్రగా కనిపిస్తుంది.చివరకి నీటి మడుగు దగ్గరకి  చేరిన మగ మనిషికి రక్తపు మడుగులో మూలుగుతూ బోర్లా  పడున్న ఒక శరీరం కనిపించింది.
నేలమీద కూర్చుని  బోర్లా  పడున్న  శరీరాన్ని తనవైపుకి లాక్కున్న మగ మనిషికి రక్తంలో తడిసి, వెంటుకులతో కప్పేసిన ఆడ మనిషి కనిపించింది.చిన్న మూలుగు వినిపించింది.ఆడ మనిషి మొహం  వైపే చూస్తున్న మగ మనిషి  ఇదివరకుండే రెండు  కళ్ళలో ఒకటి లేదని గమనించాడు.శరీరంలో అనేక చోట్లనుండి రక్తం ఉబికి వస్తుంది,ఆమె శరీరం అంతా అదిమి పెట్టి నొక్కాడు రక్తం ఆగుతుందేమోనని.మగ మనిషి చెయ్యంతా జిగురులాంటి రక్తం  తను జంతువుల్ని చంపినప్పుడు చేతికి అంటుకునే అదే జిగురులాంటి రక్తం.ఆమె పక్కనే కూర్చుని ఉన్న మగ మనిషికి బాధ లేదు,ఏమవుతుందో అడగడానికి మాటా రాదు,అసలు అడిగే జ్ఞానమే లేదు.
ఆనాటి మనిషికి ఆమె పడే బాధ యొక్క శబ్దాలు మాత్రమే అతని చెవిని చేరుతున్నాయి.ఆమె శరీరం నుండి వచ్చే రక్తం రంగు మాత్రమే అతని కంటికి కనబడుతుంది.సమయం గడుస్తుంది... ఆడ మనిషి ఎప్పుడు లేస్తుందా అని ఆమె పక్కనే కూర్చున్నాడు మగ మనిషి.పడుకుందనుకుంటున్నాడా ?కదిపి చూసాడు ,కొట్టి చూసాడు,మాటరాని శబ్దాలతో పిలిచాడు,చివరకి కోపంతో గట్టిగా అరిచాడు. 
ఆమె కదల్లేదు.
"ఏమీ చెయ్యలేని నిస్సహాయతలో అటూ ఇటూ చూసాడు,అకాశంకేసి చూసాడు,జలపాతం వైపు,నీళ్ళలోకి అన్నివైపులా చూసాడు...బహుసా అదేనేమో ఆశంటే.ఏవైపునుండి ఏమీ రాలేదు.ఏమీ జరగలేదు."
నీటి మడుగంతా ఎర్రగా మారుతుంది ఆడ మనిషి రక్తం ప్రవేశించడంతో.మగ మనిషి ఆమె వైపే చూస్తూ ఉన్నాడు.రెండు రోజులైనా అడ మనిషి కదల్లేదు.కదుల్తున్దేమోనని అతను ఆమె పక్కనే కూర్చుని ఉన్నాడు కదలకుండా.నాలుగు రోజుల తర్వాత ఆమె శరీరం నుండి కంపు రావడం మొదలయ్యింది.ఆడ మనిషి శరీరంలో నుండి పురుగులు రావడం చూస్తున్న మగ మనిషికి అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు.పగలు రాత్రి ఆమె పక్కనే కూర్చుని ఆమెనే చూస్తున్నాడు.ఆమె శరీరంలో జరుగుతున్న మార్పులు చూస్తున్నాడు.ఇలా చాలా రోజులు గడిచాక వాడి గుండె కరగడం మొదలైంది.ఆమె కదలడం లేదని,తను ఒంటరి అయ్యాడని మగ మనిషి తనకే తెలియకుండా మొదటిసారి బాధపడ్డాడు లోలోపల.
"ఏడవడం అప్పటికింకా మనిషి నేర్చుకోలేదు."  

రోజులు గడుస్తున్నా కదలని తన మనిషి పక్కన మగ మనిషి కూడా  అలానే కూర్చున్నాడు కదలకుండా...ఏడవకుండా...గుహలోకి వెళ్ళిన కుందేలులాగా.చివరికి ఆడ మనిషి రూపం పూర్తిగా మారిపోయాక,ఇక తనే లేకుండా పోయాక ..."మనిషి ఒంటరి అయిపోయాడు."
మృగాల అరుపులకి,మేఘాల గర్జనలకి కూడా భయపడని మనిషి ఒంటరితనానికి విపరీతంగా భయపడ్డాడు.భయంలో మనిషికి దొరికిందే బాధ.మనిషి బాధ పడ్డాడు.బాధ మనిషికి అనంతమైన భావనలు ఇచ్చింది.కన్నీళ్ళని పరిచయం చేసింది.అలాంటి బాధని అనుభవించి అనుభవించి మనిషి మొట్టమొదటిసారి తన కళ్ళ నుండి నీళ్ళు రావడం చూసుకున్నాడు.ఆ నీళ్ళని మనమిప్పుడు కన్నీళ్ళంటాం అని ఆనాటి మనిషికి తెలియకపోయినా బాధపడితే ఆ నీళ్ళోస్తాయని తెలిసింది.
అసలు ఈ నీళ్ళెందుకు? తీరని ఈ బాధెందుకు? అసలు ఆమేంటి?ఆమెకు నాకు మధ్యన ఉన్నదేమిటి?చెట్లూ,పక్షులు,వాగులు,కొండలు ,కోనలు,నేను ?ఇవన్నీ ఏమిటీ?అసలు వీటన్నింటి మధ్యలో నేనేంటి?ప్రశ్న ... ప్రశ్న ...ప్రశ్న తర్వాత ప్రశ్న ...ఇలా పుట్టిన ప్రశ్నల జవాబుల కోసం మనిషి మెదడు అన్వేషించడం ప్రారంభించింది.అన్వేషణకి బయలుదేరిన మనిషి తయ్యారుచేసిన మొట్టమొదటి ఆయుధమే ఆలోచన.మనిషి ఆలోచించడం మొదలుపెట్టాడు.... ఆలోచిస్తూ ఎదుగుతున్నాడు....ఆలోచనకి అంతం లేదు.
***

No comments:

Post a Comment

Pages