‘ఇండియన్’ - అచ్చంగా తెలుగు
  ‘ఇండియన్’
నండూరి సుందరి నాగమణి 
(జంధ్యాల పికెల్స్, అచ్చంగా తెలుగు సంయుక్తంగా నిర్వహించిన ఉగాది కధల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కధ )

“ఎవరు మీరు? ఐ మీన్ మీది ఏ కులం శరణ్యా?” ఆఫీస్ క్యాంటీన్ లో పక్క టేబుల్ మీద - కొత్తగా చేరిన అమ్మాయి శరణ్యను, బిందూ అడుగుతుండగా విన్నాడు  మంజునాథ్.

“డామిట్! ఈ బిందూ చూడు అసహ్యంగా!! ఛ, ఏమిటా అసభ్యకరమైన ప్రశ్న?” పళ్లెంలోని చపాతీని తుంచుతూ విసుక్కున్నాడు పైకే.

“ఏమైందిరా?” అడిగాడు శంకర్.

“చూడు, బిందూ ఆ అమ్మాయిని తన కేస్ట్ ఏమిటో అడుగుతుంది… మ్యానర్స్ తెలుసా అసలు?”

“అందులో తప్పేముందిరా,  ఈ ప్రశ్న ఎక్కడైనా కామన్…” అంటూనే, రెండు టేబుల్స్ అవతల ఉన్న   బిందూ వైపు చూసాడు శంకర్ ఆసక్తిగా.

“ఓ… అవునా?” అంటున్నది బిందూ పాలిపోయిన ముఖంతో.  ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం ఏం చెప్పిందో కానీ శరణ్య , బిందూ మొహం లోకే సూటిగా చూడటం గమనించారు మిత్రులిద్దరూ. ఆ చూపులో నిస్సంకోచం, నిర్భయత, ఆత్మవిశ్వాసం!!

బిందూ తల తిప్పేసుకుని, తన బాక్స్ లో తెచ్చుకున్న ఇడ్లీ తినసాగింది.


***

‘డ్యామిట్! ఆ పిల్లకి పొగరెక్కువ!!’ కోపంగా అంది బిందూ.

“అదేమిటీ, అంత మాట అనేసావు?” అన్నాడు మంజు.

“మరేమిటి? నువ్వెవరని నేనడిగితే నేను ఇండియన్ ని అని జవాబు చెప్పింది… షాక్ అయిపోయాను అనుకో…” టేబుల్ మీదున్న వాటర్ బాటిల్ తీసుకుని గడగడ తాగేసింది.

ఫక్కున నవ్వాడు మంజు. “భలే… ప్రశ్నకి తగిన జవాబు…ఎంత చక్కగా చెప్పింది!  లేకపోతే ఆ అమ్మాయి ఎవరైతే నీకెందుకు? అసలు ఆ ప్రశ్నే బాగాలేదు బిందు…”

“మహానుభావా, ఆ పిల్లకి పెళ్ళి సంబంధాలు చూడటానికి అడగలేదు. వెజిటేరియన్ అవునో కాదో తెలుసుకోవటానికి అడిగాను అంతే! అయినా ఆవిడ సంగతి నాకెందుకు చెప్పు? బోలెడు పనుంది నాకు…” అంటూ లాగిన్ అయింది.

***

శరణ్యను మంజు డిపార్టుమెంటు లో వేసారు. ఆమెకు వర్క్ నేర్పించే బాధ్యత అతని మీద పడింది. వినయంగా, శ్రద్ధగా పని నేర్చుకునే శరణ్య, మంజునాథ్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె సమయపాలన, క్రమశిక్షణ, పనిని వాయిదా వేయని నైజం అతనికెంతగానో నచ్చాయి. ముగ్ధమైన సౌందర్యంతో, ప్రవర్తనతో స్నేహంగా, గలగల నవ్వుతూ ఉండే ఆమె అనతి కాలంలోనే అందరికీ ప్రీతిప్రాత్రురాలైంది. బిందూకి కూడా ఎంతో ఇష్టమైన స్నేహితురాలిగా మారిపోయింది శరణ్య. ఆరే ఆరు నెలల్లో  ఆమెతో ప్రేమలో పడిపోయాడు మంజునాథ్.

అయితే, ఆమెను వివాహమాడే దృష్టితో ఆమె వివరాలు తెలుసుకున్న అతడు ఒక్కసారిగా బిత్తర పోయాడు. మత్స్యకారుల కుటుంబానికి చెందిన అమ్మాయి శరణ్య. సమాజంలో ఉన్నతకులంగా భాసించే ఒక వర్గానికి చెందిన వాడు మంజు. ఆమెను వదులుకోలేక, అలాగని ధైర్యం చేసి పెళ్ళికి ప్రపోజ్ చేయలేక సతమతమవసాగాడు.

మంజు తన ప్రేమను తెలుపగానే అందరు ఆడపిల్లల్లాగా ఎగిరి గంతేయ లేదు శరణ్య. ఆమెకు కూడా మంజు అంటే అభిమానం ఉన్నా ఎప్పుడూ బయట పడలేదు. కాలం ఎంత ముందుకు పరుగుతీసినా, ప్రపంచం ఎంత ముందంజ వేసిందని అనుకున్నా, ‘కులం’ విషయంలో జనారణ్యం ఏమీ మారలేదనీ, మారదనీ ఆమెకు బాగా తెలుసు. అందుకే మంజునాథ్ పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే, ఆమె అంగీకరించలేదు. వివాహం ద్వారా తన తల్లిదండ్రులను బాధపెట్టలేనని, వారు చూసిన వరుడినే పెళ్ళి చేసుకుంటాననీ చెప్పేసింది.

పట్టువదలని విక్రమార్కుడైన మంజునాథ్ శరణ్యను వదులుకోవటానికి ఇష్టపడలేదు. నగరంలోనే మరో కంపెనీలో పనిచేస్తున్న ఆమె అన్నయ్యను కలిసి, విషయం చెప్పి ఒప్పించాడు. ఇంట్లో చెప్పే ధైర్యం ఎలాగూ లేదు కనుక గుట్టుగా ఆమెను ‘రిజిస్టర్ మేరేజ్’ చేసేసుకుని అప్పుడు చెప్పాడు. ముందుగా అనుకున్నట్టే శరణ్య వంటి అమ్మాయిని కోడలిగా అంగీకరించేది లేదని, కొడుక్కి కూడా ఇంట్లో స్థానం లేదనీ గట్టిగా చెప్పేసాడు మంజు తండ్రి.

ఫలితంగా వేరు కాపురం పెట్టాడు మంజు. తన ప్రమేయమేమీ లేకుండా వేగంగా జరిగిపోతున్న పరిణామాలకు ఆశ్చర్యపోతూనే, కొత్తజీవితంలోకి అడుగుపెట్టింది శరణ్య, తనకెంతో ఇష్టమైన మంజునాథ్ తో.

***

ఆరునెలలు వేగంగా గడిచిపోయాయి. మంజు కోసమని తానూ పూర్తి వెజిటేరియన్ గా మారిపోయింది శరణ్య. మంజు కూడా శరణ్యను ప్రేమగా చూసుకుంటూ, పువ్వుల్లో పెట్టి చూసుకోసాగాడు. కలిసి ఆఫీసుకు వెళ్ళటం, డ్యూటీ ముగిసాక, కలిసి ఇంటికి రావటం, ముద్దు ముచ్చట్లు, హాయీ అచ్చట్ల మధ్య తల్లిదండ్రులు గుర్తుకు రాలేదు మంజుకి. 

కొన్నాళ్ళు గడిచేసరికి అతనికి ఇంటికి వెళ్ళి తల్లిని చూడాలని అనిపించింది. శరణ్యతో చెప్పాడు. “అయ్యో, తప్పకుండా ఓ సారి వెళ్ళిరా...” అని చెప్పి పంపించింది శరణ్య.


బిడియంగా, భయంగా ఇంటికి వెళ్ళిన మంజునాథ్ కి  అతను ఊహించినంత నిరాదరణ కలుగలేదు. అతను ఇంటికి రావటం తండ్రి చూసినా, ముఖం తిప్పుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు. తల్లి మాత్రం కొడుకును గుండెలకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. గబగబా వంట చేసి అతనికి ఇష్టమైన ఆధరువులతో వంట చేసి పెట్టింది. ఆవురావురుమని తిని, మళ్ళీ వస్తూనే ఉంటానని మాటిచ్చి  కొంత డబ్బు తల్లి చేతుల్లో పెట్టి, ఇంటికి వచ్చాడు మంజునాథ్. అయితే తల్లితో మాట్లాడిన మాటల్లో శరణ్య ప్రసక్తి అతను తీసుకురాలేదు, ఆమె కూడా కోడలి గురించి ఏమీ అడగలేదు. 

ఆరోజు నుంచీ అప్పుడప్పుడూ తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళేవాడు మంజునాథ్. అప్పటివరకూ లేనిది శరణ్య చేసే వంటకాలకు వంకలు పెట్టటం ప్రారంభించాడు. 

ఆమె వంకాయ కూర చేస్తే, తన తల్లి చేసినట్టు లేదనీ, బీరకాయ కూరలో అనవసరంగా గరంమసాలా తగిలించిందనీ, నాన్ వెజ్ వండే వాళ్లకు వెజ్ కూరలు రుచికరంగా చేయటం రాదనీ తన అసంతృప్తిని వెల్లడించసాగాడు.

***

ఒకసారి తమ కూతుర్ని చూడటానికి వచ్చిన శరణ్య తల్లిదండ్రులతో చాలా పొడిగా మాట్లాడి ఊరుకున్నాడు. పైగా శరణ్యను పక్కకు పిలిచి, “మీ నాన్న దగ్గర అదోలాంటి వాసన వస్తోంది… మీ మదర్ భాషేమిటి అలా ఉంది? ఎంత సేపుంటారు వాళ్ళు? ఊళ్లోనే మీ అన్నయ్య ఉంటాడు కదా, అక్కడికి వెళతారా?” అని అడగడంతో బిత్తరపోయింది శరణ్య. 

మంజునాథ్ నుంచి అలాంటి మాటలు ఆమె ఎప్పుడూ ఊహించి ఉండలేదు. తనవరకూ ఫరవాలేదు కానీ తన తల్లిదండ్రుల ఉనికిని అతడు సహించలేకపోతున్నాడని అర్థమైపోయింది ఆమెకు. విద్యాగంధం లేకపోయినా తన తల్లిదండ్రులు తనకెప్పుడూ పూజ్యులే… కానీ మంజునాథ్ కి వాళ్ళంటే అయిష్టం సరిగ్గా చెప్పాలంటే ‘అసహ్యం’ అని అర్థమై, బాధతో విలవిలలాడి పోయింది.

తన స్నేహితురాలింట్లో తాను చేపకూర తిన్నదని వారం రోజులు మాట్లాడటం మానేసాడు కోపంతో. నిజానికి ఆ పార్టీకి అతను రాలేదు. అతని అమ్మానాన్నల దగ్గరకు వెళితే, ఆదివారం తానొక్కతే ఉండలేక, స్నేహితురాలి పుట్టినరోజు అని అక్కడికి వెళ్ళింది. చిన్నప్పటినుండీ అలవాటు, ఇష్టమైన ఆహారం… పెళ్ళితో ఇంట్లో వండటం కానీ, తినటం కానీ మానేసింది అతని కోసం. అక్కడ అలా తిన్నట్టు తానే చెప్పింది మంజునాథ్ కి. అయినా పెద్ద రభస చేసాడు. ఒక్కసారి ఏదో సందర్భవశాత్తూ అలా జరిగిందని అలా గొడవ చేయటం ఆమెకు బాధను కలిగించింది. తాను ఎంత సర్దుకున్నా, అతడు సర్దుకోలేకపోతూ ఉంటే ఎలాగ?

అన్నయ్య కూతురి పుట్టినరోజు ఫంక్షన్ కి వెళ్ళటానికి వీలు కాదన్నాడు మంజు. అదేమని అడిగితే తనకిష్టం లేదంటాడు. పుట్టింటి వారితో సంబంధ బాంధవ్యాలు ఉండటానికిక వీలులేదని శాసించాడు. 

అసహాయంగా అతనివైపు చూసింది శరణ్య. తమ మధ్య ప్రేమ మాత్ర మీది పంచదార పూతలా కరిగిపోయిందా? తనను ప్రేమించి, వెంటపడి, పెళ్ళాడిన ప్రేమికుడు ఇతడేనా? తన కులం ‘ఇండియన్’ అని బిందూతో చెప్పినప్పుడు తనను ప్రశంసించిన ఆదర్శవాది ఇతడేనా? అప్పుడు తనలో ఉన్నదేమిటి, ఇప్పుడు లేనిదేమిటి? కళ్ళు చెమ్మగిల్లాయి. తన కర్తవ్యం ఏమిటో బోధపడింది.

***

మర్నాడు -

ఆఫీసు వదిలిన తరువాత బయటకు వచ్చి ఆటోను పిలుస్తున్న శరణ్యను చూసి ఆశ్చర్యంగా, “ఆటో ఎందుకు? ఎక్కడికైనా వెళుతున్నావా?” అని అడిగాడు మంజునాథ్. 

“ఈ రోజు అమీర్ పేట షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాను మంజూ… వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కి ఫీజు కట్టేసాను. కొన్నాళ్ళు విడిగా ఉందాం. ఎందుకంటే నన్ను నీవు భరించలేకపోతున్నావు. ఒకప్పుడు ఎంతో నచ్చిన నా దగ్గర నీవు ఫ్రీ గా ఉండలేకపోతున్నావు. ప్రణయశృంగార సమయంలో కూడా నీవు మనస్ఫూర్తిగా ఆనందించలేకపోతున్నావు. అనుక్షణం నీకు నా దగ్గర చేపల వాసన వస్తోంది. కానీ మరి నేనెందుకు నీతో ఫ్రీగా ఉండగలుగుతున్నాను? ఎవరి ఆలోచనావిధానంలో తేడా ఉంది? 

రెండు నెలలుగా మీ ఇంటికి వెళుతున్నావు, వస్తున్నావు. ఒక్కసారైనా నన్ను మీ ఇంటికి తీసుకుపోయే ప్రయత్నం కాదు కదా ఆలోచన కూడా చేయటం లేదు. పోనీ ఇద్దరం మా వాళ్ళ ఇంటికి వెళదామంటే, నన్నే వెళ్ళవద్దని ఆపేస్తున్నావు. ఎలా అర్థం చేసుకోవాలి నిన్ను? నేను మీ ఇంటి కోడలిని మంజూ… నాకూ నా అత్తగారిని, మామగారిని కలవాలని, వారికి పాదాభివందనం చేయాలని ఉంటుంది కదా… ఎందుకంటే నీకు జన్మనిచ్చిన వారు నాకు పూజ్యులు. కానీ నాకు జన్మనిచ్చిన వారి నీడను కూడా నీవు భరించలేకపోతున్నావు.

కులాంతర వివాహాలు చేసుకోగానే సరిపోదు మంజూ… ఎంతో సున్నితమైన ఈ బంధాన్ని నిలుపుకోవటానికి ఇద్దరమూ, ఇరువైపులనుంచీ,  అన్ని విధాలా ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం ఏకపక్షమైతే మన కథలాగానే ఉంటుంది. నీకు ముందే తెలుసు, నా తల్లిదండ్రుల కుల వృత్తి ఏమిటో, వాళ్ళ భాష ఎలా ఉంటుందో… వాళ్ళ పిల్లనైన నేను నచ్చాను కానీ వాళ్ళు మనింటికి సారీ నీ దృష్టిలో నీ ఇంటికి రాకూడదు. అంతే కదా…

మరి మీ అమ్మగారేం చదువుకున్నారో నాకు తెలియదు. మీ నాన్నగారెలా ఉంటారో కూడా నాకు చూపించలేదు… వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయరని నాకు ముందే తెలుసు. కానీ నువ్వు కనీసం నా గురించి మంచి మాటలు చెబుతూ వాళ్ళను ప్రిపేర్ చేస్తున్నావా అంటే ఆ ఆలోచనే లేదు నీకు. అటు మీ వాళ్ళు పిలవక, ఇటు మా వాళ్ళను కలవక నేను అనాధగా మిగలాలా?

నేను వెజిటేరియన్ గా మారిపోవాలి. ఏం, నన్ను ప్రేమించినందుకు నువ్వు నాన్ వెజ్ తీసుకోవాలి అని నేను ఎప్పుడైనా కండిషన్ పెట్టానా? నిజానికి నాకెంతో ఇష్టమైన నీకు ఇష్టమైన విధంగానే ఉండాలని నాకుంటుంది. కానీ ఎప్పుడో ఒక సారి, ఎక్కడో… అదీ నీ పరోక్షంలో నేను నాన్ వెజ్ తింటే అది నువ్వు భరించలేవు. వెజిటేరియన్ గా ఉండిపోవాలన్నది నాకుగా నేను తీసుకున్న నిర్ణయం, నువ్వు పెట్టింది మాత్రం కాదు. 

నాకూ, నీకూ కూడా ప్రశాంతత   కావాలి. అందుకే నేను కొన్నాళ్ళు ఒంటరిగా ఉంటాను మంజూ… నీకు నా యాబ్సెన్స్ తెలిసిన రోజున, నన్ను నన్నుగా గుర్తించి, నేనూ, నా వాళ్ళూ కూడా కావాలని అనిపించిన రోజున, మీ అమ్మానాన్నల దగ్గరకు నన్ను తీసుకుపోవాలని అనిపించిన సమయాన అప్పుడు మళ్ళీ కలుద్దాం. మనందరం అవకాశవాదులమే... కులాన్ని చెరిపెయ్యాలి చెరిపెయ్యాలి అని ఉపన్యాసాలిస్తాము… మన మనసుల్లోంచి మాత్రం తుడిచివేయలేకపోతున్నాం… 

బై ద వే, చెప్పలేదనుకోకు… నాకిప్పుడు మూడో నెల. నా కడుపున పుట్టబోయేది నీ వంశస్తుడో, నా కులపుదో కాదు… ఇండియన్… ఇండియన్ పుట్టబోతున్నాడు లేదా ఇండియన్ పుట్టబోతోంది… బై ఫర్ నౌ…”

అప్పుడే వచ్చి ఆగిన ఆటో ఎక్కేసి కూర్చుంది శరణ్య. ఊహించని పరిణామాన్ని తట్టుకోలేని మంజునాథ్ ఆమె ఆటో వెళ్ళిన వైపే నిశ్చేష్టుడై చూస్తూ నిలబడ్డాడు మంజునాథ్.
  (సమాప్తము)

No comments:

Post a Comment

Pages