అతనికి వందనం - అచ్చంగా తెలుగు
 "అతనికి వందనం"
నాగ్రాజ్...
ఈ దారిలోనే
అతన్ని రోజు చూస్తాను!
మూడు ఆశల చక్రాల పైన
ఆసీనుడై 
బతుకుదెరువు అక్షయసంచులు 
తగిలించుకుని
బయలెల్లుతాడు!

ఇంటింటి ఇనుపముక్కలకు,
పనికిరానిపెంటకు డబ్బులిచ్చి కొనడానికి!
పాతసామానే అతనిపాలిట
కాసులపంట మరి!

రెండుకాళ్ళు ఇవ్వకుండా 
కాలు నేలమీద పెట్టనియకుండా
కంటికిరెప్పలా చక్రాలకుర్చీలో
కూర్చోబెట్టి కాపాడుతున్నాడు
దేవుడు నన్ను
దేవుడికి వందనం అంటాడు!

సకల అంగాలు సక్రమంగా ఉండి
భౌతికబాధలు భరించలేక
ఎన్నిసార్లు దేవుణ్ణి నిందించానో
తుప్పుపట్టిన నా మనోవైకల్యాన్ని
శుభ్రపరిచిన ఆ దివ్యంగుడికి వందనం!
***

No comments:

Post a Comment

Pages