శాస్త వైభవం - 2 - అచ్చంగా తెలుగు
శాస్త వైభవం - 2
శ్రీరామభట్ల ఆదిత్య 
శ్రీ అయ్యప్ప స్వామి చైత్రమాసంలో శుద్ధ చతుర్దశినాడు ఉత్తరా నక్షత్రంలో సోమవారము నాడు జన్మించినట్లు చెప్తారు. అలా అడవిలో దొరికిన మణికంఠుడిని రాజశేఖర మహారాజు అంతఃపురానికి తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి మహారాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది. ఆయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళావిశేషము వలన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. గురుకులంలో విద్యనభ్యసించి తిరిగి రాజ్యానికి వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు రాజశేఖరుడు. కానీ మహారాణికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. తల్లీకోసమని పులిపాలు తీసుకువస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప.
అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్ప గురించి నీ సంహానికే వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది.  అయ్యప్ప మహిషిల మధ్య జరిగే భీకరయుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. ఆ సమయంలోనే అయ్యప్పకు అరేబియా సముద్రపు దొంగ 'వావర్' తో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత పులులను పట్టి వాటితో సహా రాజ్యానికి చేరతాడు అయ్యప్ప స్వామి. అప్పుడు తల్లి తన తప్పు తెలుసుకుని అయ్యప్ప మహాపురుషుడు అని గ్రహించి పశ్చాత్తాపం చెందిందట. రాజశేఖరుడు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వద్దని అయ్యప్ప తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయమే ప్రస్తుత శబరిమల ఆలయం. 

అష్టశాస్త స్వరూపాలలో అయ్యప్పది బ్రహ్మచారి రూపం. ఒకసారి మాలికాపురత్తమ్మ అనే స్త్రీ అయ్యప్పని ఇష్టపడుతుంది. తళని పెండ్లాడమని అయ్యప్పని కోరుతుంది. కానీ బ్రహ్మచారి అయిన అయ్యప్ప ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తాడు. అయినా సరే అమె వినకపోయే సరికి అమెతో ఇలా అంటాడు " ఏ సంవత్సరంలో అయితే కన్నెస్వాములు దీక్షాపరులై శబరిమలకు రాకుండా ఉంటారో ఆ సంవత్సరం నిన్ను పెళ్ళిచేసుకుంటా". ఆనాటి నేటి వరకు కన్నెస్వాములు రాని సంవత్సరం లేదు. అలా ఇప్పటివరకు ఆమె ఎదురు చూస్తూనే ఉంది. ఆమె ఆలయం మనకు శబరిమల ఆలయ ఆవరణలో కనిపిస్తుంది.

భక్తులు కార్తీకమాసం మొదలుకొని మార్గశిర,పుష్యమాసాల వరకు కఠిన నియమాలను ఆచరిస్తూ ఐహిక సుఖాలను పరిత్యజించి మద్యమాంసధూమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో చాలా ముఖ్యం . దీక్ష తీసుకోవాలనుకొనేవారు ఆరుసార్లకన్నా ఎక్కువ మాల వేసుకున్న స్వామి వద్దనుండి ఉపదేశం తీసుకుని మాలధారణ చేస్తారు. 41 రోజులు లేదా వారు సంకల్పించినన్ని రోజులు గడిచాక ఇరుముడితో శబరిమలకు బయలుదేరి
జ్యోతిసవరూపుడైన అయ్యప్ప స్వామిని దర్శించుకొని తిరిగి స్వస్థలానికి చేరుకొని మాలవిరమణ చేస్తారు.

స్వామియే శరణం అయ్యప్ప.... ( సశేషం )
***

No comments:

Post a Comment

Pages