శ్రీమద్భగవద్గీత -28 - అచ్చంగా తెలుగు
ఓం శ్రీ సాయిరాం
శ్రీమద్భగవద్గీత - 28
క్షేత్ర  క్షేత్రజ్ఞ విభాగయోగము
                                                                               రెడ్లం రాజగోపాలరావు


13 వ అధ్యాయము
శ్రీ భగవానువాచ -
ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమత్యభిధీయతే
ఏతద్యో వేత్తితం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః
- 2వ శ్లోకం
కుంతీ పుత్రుడగు ఓ అర్జునా ఈ శరీరమే క్షేత్రమనబడుచున్నది. దానిని తెలుసికొన్నవాడు క్షేత్రజ్ఞుడని విజ్ఞులు చెప్పుదురు. క్షేత్రమనగా పొలము సస్యమభివృద్ధి నొందుటకు ఫలించుటకు భూమి ఆధార భూతమై సహాయవంతముగ నెట్లుండునో జీవుని హృదయాంతరమందలి జ్ఞానబీజమభివృద్ధినొంది కాలాంతరమున మోక్షఫలమునొసగుటకు ఈ శరీరమే ఆధారభూతమైయున్నది. ఏలనన అనేక సాధనానుష్ఠానములను ఈ శరీరముతోనే చేయుచున్నాము. శరీరము ధర్మబీజమునకు, జ్ఞాన బీజమునకు క్షేత్రమువలె ఉపయోగపడుచున్నది. కనుక దీనిని క్షేత్రమనిరి.

ఈ జడమైన శరీరమును చైతన్యమైన ఒక శక్తి నడిపించుచున్నది. ఆ ప్రజ్ఞారూపమగు వస్తువునే క్షేత్రజ్ఞుడందురు.అతడే ప్రత్యగాత్మదేహేంద్రియాది సంఘాతములకు అతడు సాక్షి. నిర్వికారుడు, చిద్రూపుడు అవినాశి పంచకోశ విలక్షణుడు జడమగు దానిని జడము తెలిసికొనలేదు. ప్రజ్ఞ(చైతన్యము)యే దానినితెలిసికొనును ఆ ప్రజ్ఞయే క్షేత్రజ్ఞుడని చెప్పుట వలన క్షేత్రజ్ఞుడు ప్రజ్ఞావంతుడని స్పష్టమగుచున్నది.

అంతరంగమందు అపరాధములు చేసి 
మంచివానివలే మనుజుడుండు
ఇతరులెరుగ కున్నా ఈశ్వరుండెరుగడా 
విశ్వదాభిరామ వినురవేమ!

వేమన యోగి చెప్పిన పై పద్యాన్ని మనం గమనించినట్లైతే సృష్టిలో ఉన్న సమస్త ప్రాణి కోట్ల యొక్క ప్రతిచర్యను భగవంతుడు పూర్తిగా గమనిస్తున్నాడు. ఎలా? సమస్త ప్రాణి కోట్లలోను ప్రత్యగాత్మ స్వరూపుడై, సాక్షీభూతుడై వెలుగుచున్నాడు.మనం గమనించినా గమనించకపోయినా మనం చేసే ప్రతి కర్మ కూడను భగవంతునికి ఎరుకే అందుకే పెద్దలు ఎల్లప్పుడు ధర్మ చింతనతో జీవితాన్ని గడపమని బోధిస్తారు.

పొలమును చూచువాడు పొలముకంటే వేరుగనుండును అట్లే శరీరమును చూచువాడు శరీరము కంటే వేరుగానుండును. ప్రత్యగాత్మ దేహమునందున్ననూ, సాక్షియై జాగ్రత్స్వప్న సుషుప్తలందు మేల్కొనియుండీ సర్వము వీక్షించుచున్నది.

క్షేత్రజ్ఞం చావిమాం విద్ధి సర్వ క్షేత్రేషు భారత
క్షేత్ర క్షేత్రజ్ఞ యోర్ జ్ఞానం యత్త జ్ఞానం మతం మమ
- 3వ శ్లోకం
అర్జునా సమస్త క్షేత్రములందు క్షేత్రజ్ఞునిగా నన్నెరుగుము. క్షేత్ర క్షేత్రజ్ఞుల గూర్చిన జ్ఞానమేదియో అదియేవాస్తవ జ్ఞానమని నాయభిప్రాయము. జీవుడు సాక్షాత్తు శివుడేయను పరమ రహస్యమును భగవానుడు తెలియజేయుచున్నాడు. దేహేంద్రియాదులందు సాక్షిరూపముగ వెలుగొందు ప్రత్యగాత్మ పరమాత్మకంటే వేరుకాదని ఇచట స్పష్టము చేయబడినది. దీనిని బట్టీ సాక్షాత్తు పరమాత్మదూరమునగాక, అతిసమీపమున వారి వారి హృదయక్షేత్రమున వెలుగుచున్నాడని తెలియుచున్నది.

బ్రహ్మమనగ పరదేశమున లేదు
బ్రహ్మమనగ తానే బట్ట బయలు
తన్ను తానెరిగిన తానెపో బ్రహ్మమౌ
విశ్వదాభిరామ వినురవేమ!

ప్రపంచమున బాహ్యమైన బహు జ్ఞానముల కంటెనూ తనలోనున్న బ్రహ్మను తెలిసికొనుటయే నిజమైన జ్ఞానము సమస్త క్షేత్రములయందును తాను క్షేత్రజ్ఞుడనని చెప్పుటవలన తాను మానవ మాత్రుడను కాననియు, సర్వభూతములయందు అధిష్టానరూపుడుగ వెలయుచున్న పరమాత్మయని  శ్రీ కృష్ణపరమాత్మ తెలియజేయుచున్నాడు.

ఇఛ్ఛా ద్వేషస్సుఖం దుఃఖం సజ్ఘాతశ్చేతనాధృతిః
ఏత త్ష్కేత్రం సమాసేనస వికారముదాహృతమ్
- 7 వ శ్లోకం
క్షేత్రమనగా కేవలము స్తూల దేహమేకాదు సమస్త దృశ్యమున్నూ క్షేత్రమే. స్థూల, సూక్ష్మ, పంచభూతములు, మనస్సు, బుద్ధి కూడా క్షేతేరమునకు చెందినవే కావున వాని వృత్తులగు ద్వేషాది దుర్వృుత్తులు, దృత్యాది సద్పృుత్తులు కూడా క్షేత్రము కిందకే వచ్చును.దృష్యరహిత నిస్సంకల్ప స్థితియందు సద్విషయ వృత్తులను కూడా దాటిపోవలసియుండును.

క్షేత్రమనగా ఈ దేహము , కనిపించు ప్రపంచమని తలచుదురు. కాని వాస్తవముగ సూక్ష్మ పంచభూతములు,మనస్సు,బుద్ధి,మూల ప్రకృతి కూడాను క్షేత్రమేయని ఇచట స్పష్టముగా చెప్పబడినది. కాబట్టి విజ్ఞులు తాను ఆత్మయేయని తలంచి ఈ దేహాది దృశ్యమును, మనస్సును,బుద్ధి వృత్తులను కూడా తనకంటే వేరుగా చూచుచూ వానితో తదాత్మ్యమునొందక క్రమముగా వానిని జయించి ఆత్మ రూపమున నిలకడను సంపాదించవలెను.

భగవానుడు కావించిన క్షేతేరము యొక్క ఈ వివరణము ఆత్మానాత్మ విచారణాపరునకు మిక్కిలి ఉపకరించును. ఏలయనిన, సాధకునకు తన నుండి దేనిని వేరుపరచవలెనో దీనియందు స్పష్టముగా చెప్పివేయబడినది.
ఇట్లు
సకల జన శ్రేయోభిలాషి
మీ రెడ్లం రాజగోపాలరావు
పలమనేరు.

No comments:

Post a Comment

Pages