నెత్తుటి పువ్వు - 9 - అచ్చంగా తెలుగు

నెత్తుటి పువ్వు - 9

Share This
నెత్తుటి పువ్వు - 9
మహీధర శేషారత్నం

(జరిగిన కధ :రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు  అతడి శ్రేయోభిలాషులు. ఆమెను బట్టల కోటలో పనిలో పెడతాడు రాజు.) 

గిర్రున నెలతిరిగింది. రెండువేలు జీతంగా ఇచ్చేడు ఆదినారాయణ. గది అద్దెకింద రెండు వందలే తీసుకున్నాడు నాగరాజు. అంతకుముందే మిత్రుడికి చెప్పాడు. ఒక పేద పిల్లకి అద్దెకి ఇచ్చేనని, ఎక్కువ అద్దె ఇచ్చుకోలేదని పప్పు, ఉప్పు కొనిపెట్టాడు. ఓ పిడత తెచ్చి ఇచ్చాడు. మిగిలిన డబ్బు ఇందులో వేసుకో అవసరానికుంటాయి అన్నాడు.

          ఓ నూటయాభై రూపాయలెట్టి చీర కొనుక్కుంది. ఓ రెండు వందలుపెట్టి నాగరాజుకి టీషర్టుకొంది.
“ఇదుగో” అంది వెడుతున్న నాగరాజుని ఆపుతూ,
“ఇదుగో అనవద్దన్నానా! రాజు అను” విసురుగా అన్నాడు. “నేను అలాగే అంటా! ఇదుగో...” అంది బెరుగ్గా.
“సరే ఏదో ఒకటి ఏడు! ఏంటి?”
“కళ్ళ మూసుకు అలానుంచో!
“ఓహో! దేవతలా వరాలిస్తావా?” పకపకా నవ్వాడు. స్వచ్ఛంగా నవ్వుతున్న నాగరాజుని మురిపెంగా చూసింది.
“ఊఁ! ఊఁ! నుంచో!”
“సరే!” కళ్ళు మూసుకు నుంచున్నాడు.
“చెయ్యి చాపు)
“అబ్బో!....” నవ్వుతూ కుడిచేయి చాపాడు.
చటుక్కున టీషర్టు చేతిలో పెట్టింది. ఏమిటిది? అంటూనే కళ్ళు తెరిచాడు.
“ఏయ్! ఏమిటి? ఎవరికి?”... కంగారుగా అడిగేడు.
“నీకే! నాకెవరున్నారు” గుమ్మత్తుగా పలికింది.
“అదే ఎందుకంటున్నా!”
“ఎందుకేమిటి? తొడుక్కోవడానికి....”
“మరే! పాపం, పారెయ్యడానికనుకున్నా!”వెక్కిరింతగా అన్నాడు.
“డబ్బు దండగ పనులు చేయకు, పది రూపాయలు దాచుకో. వెనక్కి ఇచ్చేసి నీక్కావలసిన చీరేదో తెచ్చుకో”...
ఇచ్చెయ్యబోయాడు.
“నామీద ఒట్టే, వేసుకో! ఇప్పుడే వేసుకో!” తనకు అతనిమీద అధికార మున్నట్టే మాట్లాడింది.
నాగరాజు ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
“వేసుకు చూపించు” మళ్ళీ అంది గదమాయిస్తున్నట్టు.
చిన్న పిల్లలా హఠం చేస్తున్నట్టున్న ఆమెను చూస్తుంటే అతనికి పాలుపోలేదు.
“వేసుకో!” మళ్ళీ అంది.
“సరే! అటు తిరుగు, వేసుకుంటా!
పకపకా నవ్వింది. ఎట్టా సిగ్గు పడుతున్నాడో అంటూ
నాగరాజు షర్టు వేసుకున్నాడు. సరోజని చూసాడు.
“చక్కగా నప్పింది, నల్లటోళ్ళకి లేతరంగులే నప్పుతాయి” అంది వెక్కిరిస్తున్నట్టు.
(సశేషం)

No comments:

Post a Comment

Pages