హృదయ వేదన - అచ్చంగా తెలుగు
  హృదయ వేదన
(అచ్చంగా తెలుగు ఉగాది కధల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కధ )
శశిరేఖా లక్ష్మణన్ 

రాజేష్ ఇంటి ముందు అశేష జనం గుమిగూడి ఉన్నారు.అతడు యాక్సిడెంటులో మరణించాడు.
అతనికి ఒక్కగానొక్క కూతురు అయిదేళ్ళ పాప " పవిత్ర. "
అదే అపార్ట్ మెంటులో ఉన్న సుందర్ అనే కాలేజీ కుర్రాడు మాయమాటలతో ఆ పాపను తన ఫ్లాట్కు తీసుకెళ్ళి ఎవరూ లేని సమయం చూసి అత్యాచారం చేసాడు.
పవిత్ర ఈ విషయం బయటకి చెప్తానని ఏడుస్తూ బెదిరించడంతో గొంతు నులిమి చంపి పెద్ద ప్లాస్టిక్ కవర్ లో పెట్టి ఊరవతల మురిక్కాలువలో పడేసాడు.
ఈ విషయం నగరంలో సంచలనం సృష్టించి మహిళాసంఘాలు,స్వచ్ఛంద సంస్థలు రాజేష్ ,స్వర్ణ దంపతులకు మద్దతుగా నిలిచి  "పవిత్ర " దారుణ అత్యాచారం మరియు మరణానికి తీవ్రంగా స్పందించాయి.
ఈ పోరాటం  ఆరునెలలుగా జరిగి తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య నిందితుడైన సుందర్ కి ఉరిశిక్ష ఖాయం చేయడంతో విషయం కొంత సద్దు మణిగి ప్రజలు,స్వచ్ఛంద సంస్థలు ఎప్పట్లానే ఎవరి పనులలో వారు వ్యస్థులయ్యారు.
ఎటొచ్చి రాజేష్ ,స్వర్ణ దంపతులే కుమిలి కుమిలి  "పవిత్ర "ని తలచుకుని తలచుకుని ఏడవసాగారు.
గత రెండు నెలలుగా రాజేష్ మరింత డీలాపడిపోయాడు.
పాప మరణం అతడిని కుదిపివేసింది.
ఏవో పాప ఆలోచనలతో జ్ఞాపకాలతో ఆఫీసు నుండి వస్తూ బస్ క్రింద పడబోయి కారు అదుపు తప్పి ఎదురుగా బ్రిడ్జ్ వారగా ఉన్న రైలింగ్ను "ఢీ" కొని రాజేష్ స్పీడ్ గా వస్తున్న తన కారు నుండి బయటకి విసురుగా  త్రోసివేయబడి తలకు బలమైన గాయం తగిలి క్షణాలలో గిలగిల తన్నుకుని మరణించాడు.
ఆ ఆఖరి పది నిముషాలలో అతనికి ముద్దులొలికే "పవిత్ర "రూపం కనుల ముందు కదిలి కరువుతీరా విలపించాడు.
తలకు తగిలిన గాయం కన్నా హృదయానికి తగిలిన గాయం బలమైనది.
గత వారం రోజుల ముందు అతడికి సౌమ్య ఫోన్ చేసి బాధగా అన్న మాటలు వినిపించసాగాయి..."టీవీలో నీ కూతురిని అత్యాచారం చేసి చంపిన సుందర్ కి ఉరిశిక్ష పడడం తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేకూరినట్లు భావిస్తున్నానని చెప్పావు..!!భేష్ ..!!
కన్నతండ్రిగా నీ హృదయవేదన అన్ని టీవీ ఛానల్స్ లలోనూ ప్రస్ఫుటంగా కనిపించింది.
మరి అమూల్యమైన నా బాల్యాన్ని,గుర్తు పెట్టుకోవాల్సిన అపురూప చిననాటి జ్ఙాపకాలు అనేవే నాకు లేకుండా చేసి...
మరో వ్యక్తికి ఇదంతా ముందే చెప్పి పెళ్ళి చేసుకునే గుండెనిబ్బరం లేకుండా చేసి.... నేను అవివాహితగానే బ్రతకాలనే నిర్ణయానికి బంధీని చేసి జీవితాంతం జీవచ్ఛవంలా బ్రతికేలా  "అయిదేళ్ళ పాపగా ఉన్న నన్ను రెండేళ్ళపాటు అత్యాచారం చేసి నీ కసి తీర్చుకున్న నిన్నేం చేయాలి ..?????
నీకు ఏ శిక్ష విధించాలి..???"
ఆఖరి రెండు మాటలు అంటున్నప్పుడు సౌమ్య కంటి వెంట ధారాపాతంగా కన్నీరు స్రవించింది.
ఆమె హృదయం ఇక మాటలు కూడగట్టుకున మాట్లాడలేక మూగబోయింది.
ఇదంతా వింటున్న రాజేష్ ల్యాండ్ లైను ఫోనును హతాశుడై వదిలేసాడు.
సౌమ్య....ఇన్నాళ్ళకు గొంతు విప్పి మాట్లాడింది.అదీ...తన కూతురు "పవిత్ర "మరణం తరువాత...
రాజేష్ సోఫాలో కుప్పకూలిపోయాడు.
గతం నీడలా రాజేష్ కళ్ళ ముందు కదిలింది.
***** 
సౌమ్య తన మేనమామ కూతురు.
రాజేష్ తండ్రి గుండెపోటుతో మరణించాడు.
తల్లి అనసూయతో మేనమామ ఇంటికి వచ్చాడు.
వారి పంచన చేరడంతో మేనమామ భార్య కమల రాజేష్ ను లోకువగా చూడడంతో పాటు గొడ్డు చాకిరి చేయించేది.
ఇరవై ఏళ్ళ రాజేష్ కి అత్తయ్య మీద పీకల దాకా కోపం.
తన పేదరికాన్ని,నిస్సహాయతని అలుసుగా తీసుకుని అత్తయ్య అనే సూటిపోటి మాటలను,చిత్రహింసలను చదువు కోసమని భరించసాగాడు.
ఇంట్లో మావయ్య,అత్తయ్య,సౌమ్య బట్టలుతకడం, అంట్లు తోమడం,ఇల్లు ఊడ్చడం ఇవన్నీ మౌనంగా చేసేవాడు.
కూరగాయలు తేవడం,పచారీ కొట్టుకెళ్ళి వంట సామాగ్రి,పప్పు ధాన్యాలు తేవడం,సైకిల్ పై బియ్యం మూట తేవడం లాంటి అన్ని పనులు చేసేవాడు.
ఆఖరికి బాత్రూము,టాయ్ లెట్లు చేతిలో "హార్పిక్ "  ఇచ్చి  కడిగించేది.
ఇంటి చుట్టూ రెండ్రోజులకోసారి కాంపౌండ్ వాల్ ఊడిపించేది.
ఇవన్నీ చాలదన్నట్లు ప్రొద్దున్నే కాలితో తంతూ "ముదనష్టపోడు కన్నతండ్రిని మింగేసాడు అంటూ తనను ఈటెల్లాంటి మాటలతో హింసించేది.
తనను మావయ్య చదివిస్తున్నాడు.
ఎక్కడ ఇంజనీరింగ్ చదువు మధ్యలో  ఆగిపోతుందేమోనని రాజేష్ అన్నీ భరించేవాడు.
అత్తయ్య కమల మీద కోపంతో కుతకుతలాడిపోయేవాడు.
ఆఖరికి ఆ కోపం ప్రతీకారంగా మారి అతడి హృదయాన్ని దహించి వేసేది.
ఆ ఆరని హృదయజ్వాలలను అణచి వేయడం అతడి వల్ల అయ్యేది కాదు.
పగతో రగిలిపోయేవాడు.
ఒకరోజు రాజేష్ కమల పట్టుచీర ఐరన్ చేయడం మరచిపోయాడు.
ఆ రోజు సాయంత్రమే దగ్గరి బంధువుల రిసప్షన్.
మరుసటి రోజు ఇంటర్నల్ ఎగ్ఙామ్స్ .
రాజేష్ తన పుస్తకాలు ముందేసుకుని కుస్తీ పడుతున్నాడు.
ఇంతలో ఎక్కడి నుండి వచ్చిందో కమల విసవిస అతడి వద్దకు వచ్చింది. 
అతడి వీపుపై చేతిలోని దువ్వెన తగిలేట్లు విసురుగా కొట్టింది.
"ఏరా తిని బాగా కొవ్వెక్కిందా..??
నా పట్టుచీర ఐరన్ చేయమంటే ఇంకా ఐరన్ చేయలేదేమిటి..??
నిన్ననగా చెప్పాను.
ఇప్పుడు పెళ్ళికి ఏ చీర కట్టుకోమంటావు..??
నిన్ను రెండేళ్ళుగా ఇంజనీరింగ్ చదివించడానికే మీ మావయ్య ఆస్థి కరిగిపోతోంది. నాకు కట్టుకోవడానికి మంచి పట్టుచీరలు కూడా లేవు. ఉన్న మంచి పట్టుచీర కూడా ఐరన్ చేయలేదేం రా కుక్కా..??" అపర భద్రకాళిలా గర్ఙించింది కమల.
చేసేదేమి లేక గుడ్లనీరు కుక్కుకుని రాజేష్,
"లేదు అత్తయ్య ..!! ఇప్పుడే ఐరన్ చేసిస్తాను. కొంతసేపు ఆగు..!!" అని పుస్తకాలు హడావుడిగా సర్ది గబగబ హాల్లో టీ టేబుల్ పై పాత బెడ్ షీటు పరచి కమల పట్టుచీరను ఐరన్ చేసి అర్థగంటలో రెడీ చేసిచ్చాడు.
ఆ రోజు సాయంత్రం కమల,రాజేష్ అమ్మ అనసూయ,మావయ్య చలపతి రిసప్షన్ కు బయల్దేరి వెళ్ళారు.
మావయ్య కూతురు అయిదేళ్ళ సౌమ్యకు జ్వరంగా ఉండడంతో రాజేష్ ను జాగ్రత్తగా పాపను చూసుకోమని చెప్పి  కమల పెళ్ళికి వెళ్ళిపోయింది. 
ఒంటరిగా అపస్మారకంతో నిదురపోతున్న అయిదేళ్ళ సౌమ్య లో రాజేష్ కు గయ్యాళిగంప అయిన అత్తయ్య రూపం కనపడింది.
పాప దగ్గరికెళ్ళి తన దుస్తులు తొలగించి అత్యాచారం చేసాడు.
అప్పటికి అతడికి పగ చల్లారినట్లనిపించింది.
సౌమ్యకు జ్వరం వారం పాటు వదలలేదు.
అత్యాచారం అయినా తనకు ఏం జరిగిందో తెలీదు.
అమ్మకు చెప్పొచ్చో చెప్పకూడదో తెలీని అమాయకత్వం.
బాధతో విలవిలలాడుతున్న పాపను చూసి కమల జ్వరం వల్ల అనుకుందే తప్ప రాజేష్ చేసిన ఘాతుకం అంచనా వేయలేకపోయింది.
ఆ తరువాత కూడా రాజేష్ అత్తయ్య మీద కోపం వచ్చినప్పుడల్లా సౌమ్యను పదేపదే లైంగికంగా వేధించేవాడు.
అత్తయ్య,మావయ్యకు చెప్తే గొంతు నులిమి చంపేస్తానని అనడంతో అయిదేళ్ళ సౌమ్య రెండేళ్ళపాటు ఆ నరకాన్ని భరించింది.
కమలకు అస్సలు అనుమానం రాలేదు.
కూతురుకి అప్పుడప్పుడు జ్వరం రావడంతో అప్పటికి ఏవో యాంటీబయాటిక్ మాత్రలు వేసి 
జ్వరం తగ్గగానే స్కూలుకు పంపేది.
ఇంజనీరింగ్ చదువు రాజేష్ కు పూర్తవుతుండగానే క్యాంపస్ లోనే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల ఇంటర్వ్యూలల్లో సెలక్ట్ అయ్యాడు.
అందులో మంచి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది.
దాంతో మిగిలిన కంపెనీ ఉద్యోగాలొదులుకుని పేరున్న సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు.
చూస్తుండగానే ఆరునెలలు ట్రైనింగు బెంగుళూరులో ఆ తరువాత హైదరాబాదులో ఉద్యోగం రావడంతో తల్లి అనసూయతో సహా హైదరాబాదులో కంపెనీకి దగ్గరగా ఇల్లు చూసుకుని అక్కడే ఉండిపోయాడు.
మావయ్య,అత్తయ్యను ఏదైనా పెళ్ళిల్లల్లో, ఫంక్షన్ లలో చూసి పలకరించేవాడు.
అక్కడా అత్తయ్య కమల "నీ ఇంజనీరింగ్ చదువుకు బోలెడు ఖర్చయ్యింది ఇప్పుడు మా పాప సౌమ్యకు స్కూల్ ఫీజు కట్టలేక చస్తున్నాం."అంటూ ఈసడించింది.
పక్కనే ఉన్న ఎనిమిదేళ్ళ సౌమ్య రాజేష్ ను చూడగానే ముచ్చెమటలతో వణికిపోతూ కన్నతల్లి చేయి గట్టిగా పట్టుకుంది.
అయిదవ ఏట నుండి ఏడవ ఏట వరకు రాజేష్ వల్ల తను పడ్డ నరకయాతన గుర్తొచ్చి కళ్ళనీళ్ళూరాయి.
సౌమ్య ముఖకవళికలల్లో మార్పు గమనించి రాజేష్ కంగారుగా ఎవరో పిలుస్తున్నట్లు వెళ్ళిపోయాడు.
మావయ్య చలపతి బ్యాంకు అకౌంటుకు రెండేళ్ళ లోపు కొద్ది కొద్ది మొత్తంగా పదిలక్షల వరకు రొక్కం జమ చేసాడు రాజేష్అ
ఆ విధంగానైనా తమ బంధువులలో అత్తయ్య తనకేదో మెహర్బానీ చేసినట్లు చెప్పుకోకూడదనీ,తన చదువుకైన ఖర్చుల గురించి అందరి దగ్గర వాపోకూడదని భావించాడు.
కంపెనీలో ఎప్పటికప్పుడు చురుగ్గా అప్డేట్ అవుతూ ఇరవై నాలుగవ ఏటికల్లా నెలకు అరవైవేలు సంపాదించే స్థాయికి ఎదిగాడు.
అతడికి బాగా అర్థమైంది.తనలాగే సంపాదించే అమ్మాయయితే సంసారజీవితం కులాసాగా సాగుతుందని.
తమ బంధువర్గంలోనే తమకన్నా కొంచెం ఆర్థికస్థాయి తక్కువ గల స్వర్ణను పెళ్ళి చేసుకున్నాడు.
అతడి పెళ్ళైయ్యేనాటికి సౌమ్య తొమ్మిదేళ్ళ అన్నెంపున్నెం ఎరుగని పసిపాప.
తనకన్నా పదహైదేళ్ళ చిన్న అయిన సౌమ్యకు తను చేసిన మానసిక శారీరక గాయం ఆమెనెంతలా అతలాకుతలం చేసిందో అతడస్సలు ఊహించలేదు.
అతడికి "పవిత్ర" పుట్టినప్పుడు మాత్రం పదేపదే తన కూతురుకు సౌమ్యకు జరిగిన అన్యాయమే జరిగితే ఎలా..??
అని భయపడుతూ "పవిత్ర"ను కంటికిరెప్పలా కాపాడుకునేవాడు.
ఆఖరికి అనుకున్నంతా అయ్యింది.
"పవిత్ర" చనిపోయిన రోజు రాజేష్ ను ఆపడం ఎవ్వరి తరమూ కాలేదు.
అతడి మావయ్య చలపతి,అత్తయ్య కమల కూడా చావు ఇంట్లో కన్నీరు పెట్టుకున్నారు.
కమల అయితే స్వర్ణను తిట్టిపోసింది.
"పసిపాపను అలా అపరిచితులతో మాట్లాడేలా ఎందుకు పెంచారు..??
ఎన్ని ఛానళ్ళల్లో..న్యూస్ పేపర్లల్లో ఇలాంటి సంఘటనలు మనం చదవడంలేదు..??
అయినా మీకు జాగ్రత్త లేదు.
పాపం పసిపిల్ల..!! చిట్టితల్లి..!!ఎంత నరకయాతన అనుభవించిందో..!!
ఎంత ముద్దుగా ఉండేది..!!అటువంటి పసికూనను చిదిమేయడానికి ఆ త్రాష్టుడికి మనసెలా ఒప్పిందో..??"
కమల అంటున్న మాటలన్నీ సౌమ్య విషయంలో తన ప్రవర్తననే గుర్తు చేసినట్లనిపించింది రాజేష్ కు.
"అయ్యో! నా బిడ్డ అన్యాయంగా చనిపోయిందే..!!
వాడిని వదలను!ఉరికంబం ఎక్కించే దాకా నిద్రపోను."
ఆవేశంగా గుండెలు బాదుకుంటు అన్నాడు రాజేష్ .
రాజేష్ భార్య స్వర్ణ ఏడుపు ఆపుకోలేకపోయింది.
పదేపదే స్పృహ కోల్పోసాగింది.
సౌమ్యకు ఇప్పుడు పదునాలుగేళ్ళు.
మౌనంగా రాజేష్ ఏడుస్తుంటే చూస్తోంది.

****
ఆ చావు ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోయింది.
మెల్లగా చలపతి దగ్గరికి వెళ్ళింది.
"నాన్నా!నన్ను ఇంట్లో దిగబెట్టు.నాకు ఆక్కడ ఉండడం ఏం బాలేదు."బేలగా అంది.
"అలాగేనమ్మా!మీ అమ్మతో పాటు ఇప్పుడే బస్ ఎక్కిస్తాను."
అని కమలను కళ్ళతోనే పిలిచాడు.
అతడు వెంట రాగా కమల సౌమ్యతో కలిసి ముగ్గురూ బస్ స్టేషన్ కు ఆటోలో వెళ్ళారు.
"నేను ఈ రోజు ఇక్కడే ఉండి రెండ్రోజుల లోపు వస్తాను. అమ్మాయి సౌమ్య జాగ్రత్త! అసలే రోజులు బాగా లేవు."
అధైర్యంగా అన్నాడు చలపతి.
అతడి వంక అభావంగా చూస్తూ కమల "పాపను నేను జాగ్రత్తగా చూసుకుంటాను.
మీరు త్వరగా ఇంటికి రండి."అని పలుకుతుండగా బస్ కదులుతున్నట్లనిపించడంతో చలపతి బస్ దిగి వారి బస్ కనుచూపు మేరకు వెళ్ళేంత వరకు చూస్తుండిపోయాడు.
**** 
పవిత్ర చనిపోయాక రాజేష్ చాలా మారిపోయాడు.
ఆఫీసు అవ్వగానే లాయారు ఇంటికి వెళ్ళి కేసు విషయమై మాట్లాడేవాడు.
గట్టి లాయారు కాబట్టి "పవిత్ర" మరణం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం కావడంతో ఆరునెలల లోనే నిందితుడు, రేపిస్టు మైనారిటీ దాటిన కాలేజీ కుర్రాడు సుందర్ కు ఉరిశిక్ష ఖాయం అయ్యింది.
సరిగ్గా ఆ విషయం విని టీవీలో పలు ఛానల్సు,పత్రికల  వాళ్ళకి రాజేష్ ఇంటర్వ్యూ ఇవ్వడం చూసి సౌమ్యకు ఒళ్ళు మండింది.
తన తండ్రి సెల్ లోని రాజేష్ ల్యాండ్ లైన్ నెంబరు చూసి పబ్లిక్ ఫోన్ బూత్ నుండి కాల్ చేసి..
" నీ కూతురిని అత్యాచారం చేసినవాడికి ఉరిశిక్ష ఖాయం అయినందుకు న్యాయం జరిగిందని ఆనందిస్తున్నావే మరి నీవు నా పసితనంలో చేసిన ఘాతుకానికి నీకేం శిక్ష విధించాలి..??
నిన్ను ఎన్నిసార్లు ఉరి తీయాలి..?"
ఈ మాటలు అని ఫోను పెట్టేసింది.
రాజేష్ కు ఫోనులో సౌమ్య అన్న మాటలు పదేపదే చెవులలో వినిపించి గింగిరులు తిరగసాగాయి.
ఆ మాటల తూటాలను తలచుకుంటూ వెళ్ళి యాక్సిడెంట్ అయ్యి మరణించాడు.
ప్రజలు,మీడియా అతడి మరణానికి సానుభూతి కురిపించింది.
అతడి భార్య స్వర్ణను ఓదార్చి అంత్యక్రియలు,కర్మకాండలు అయ్యాక ఆమె తల్లిదండ్రులు స్వర్ణను పుట్టింటికి తీసుకెళ్ళారు.

**** 
సౌమ్య తన బాల్యంలో జరిగిన అవాంఛనీయ సంఘటనని,రాజేష్ హింసించిన వైనాన్ని మరవడానికి శ్రద్ధగా చదవసాగింది.
మంచి మార్కులతో ప్రతి ఏడు పాసయ్యి ఎమ్ బిబియస్ సీటు సంపాదించింది.
చిల్డ్రన్ స్పెషలిస్టు అయ్యింది.
చిన్నపిల్లల వ్యాధులకు సత్వరమే గుణమయ్యే ఎక్కువ సైడ్ ఎఫెక్టులు లేని  మందులు రాసివ్వడం,లైంగిక వేధింపులకు గురయిన పసిపిల్లలకు తగిన మానసిక స్థైర్యం,ఆత్మబలం తన కైన్సిలింగ్ ద్వారా అందించసాగింది.
చూస్తుండగానే ఇరవై ఎనిమిదేళ్ళకు మంచి వైద్యురాలిగా నగరంలో పేరు తెచ్చుకుంది.
ఎన్నో బాలికల స్కూల్లల్లోనూ,లేడీస్ కాలేజీలలోనూ ఎలా అప్రమత్తంగా ఉండాలో,ఎలా లైంగిక వేధింపుల నుండి తప్పించుకోవాలనో బోధించసాగింది.
వ్యక్తిగత శుభ్రత గురించి అవగాహన కల్పించింది.
ఇప్పుడు ఆమెకు బాల్యంలో జరిగిన సంఘటనలన్నీ లీలగా గుర్తొస్తాయి.అదీ ఎప్పుడో అప్పుడు.
ఆ సమయంలో మనసు అతలాకుతలం అయినా పని మీద శ్రద్ధ వహించి ఈ దుఃఖాన్ని ఈద సాగింది.
అటువంటి ఆమె జీవితంలో ప్రవేశించాడు డా.ప్రకాష్ .
అతడూ చిల్డ్రన్స్ స్పెషలిస్టు.
ఇద్దరికీ దూరపు చుట్టరికం ఉండడంతో మధ్యవర్తుల ద్వారా ఓ పెళ్ళిలో కలిసి పరస్పరం పరిచయం చేసుకున్నారు.
ఇద్దరూ డాక్టర్లు కావడంతో బంధువర్గంలో అందరూ వీరి పెళ్ళికై ఇతోధిక కృషి చేసి వారిద్దరిని ఒప్పించే ప్రయత్నం చేసారు.
"ఆలోచించి చెప్తాను ." అని ఇద్దరూ తప్పించుకున్నారు.
అయినా ఇరు వైపులా పెద్దలు మరింతగా బలవంతం చేయడంతో సౌమ్య క్లినిక్ లోని చిన్న లాన్ లో డా.ప్రకాష్ తో ఒంటరిగా మాట్లాడేందుకు ఏర్పాటు జరిగింది.
సౌమ్య అతడికి క్లుప్తంగా తన బాల్యంలో తను అనుభవించిన లైంగిక వేధింపు గురించి,రాజేష్ గురించి చెప్పింది.
అంతా మౌనంగా విన్న డా.ప్రకాష్ "అనుకున్నా..!!
పెళ్ళికి పెద్దగా ఇష్టం చూపకపోవడంతో ఇలాంటిదేదో ఉంటుందని..!!
నీకో విషయం చెప్పాలి సౌమ్యా..!!
నేనూ నా పదవ ఏట ఇలాంటి లైంగిక వేధింపులకే లోనయ్యాను.
మా ఇంటి ప్రక్క నుండే ఆంటీ కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి నా జీవితంతో ఆడుకుంది.
ఆ విషయం ఇంట్లో చెప్పకుండా నన్ను చంపుతానని బెదిరించింది.
ఆ తరువాత ఆమె నుండి నన్ను నేను రక్షించుకోవడానికి ఒకసారి ఆమెను కత్తితో గాయపరచాను.
దాంతో మా అమ్మతో నాపై లేనిపోని చాడీలు చెప్పి నలుగురిలో నన్ను బద్నాం(అవమానం) చేసి మరీ వదిలి పెట్టింది.
దాంతో స్త్రీలంటేనే అసహ్యం పుట్టి ఆ ఊరు నుండి వేరే ఊరికి మా నాన్నగారి చేత ట్రాన్స్ ఫర్ చేయించాను.
తరువాత బాయ్స్ స్కూల్ లోనే చదువు ముగించి సైన్స్ పట్ల మక్కువతో బైపిసి లో చేరి మంచి మార్కులతో పాసయ్యి ..ఎమ్ సెట్ లో ర్యాంకు తెచ్చుకున్నాను.
తరువాత చిన్నపిల్లలకు డాక్టర్ నయితే వారి సైకాలజీ నాకు వైద్యపరంగా చక్కగా అర్థమవుతుంది కాబట్టి ఈ రంగంలో చిల్డ్రన్స్ స్పెషలిస్టు నైయ్యాను."సుధీర్ఘమైన తన గతాన్ని విడమరచి చెప్పాడు.
డా.ప్రకాష్ మాటలను నమ్మలేనట్లు చూసింది సౌమ్య.
ఒక్క క్షణం అప్రతిభురాలైయ్యింది.
షాక్ తగిలినట్లు మెదడు దిమ్మదిరిగిబోయింది.
అయితే ఇదంతా చెబుతున్నప్పుడు అతడి కళ్ళు చెమర్చడం,కోపంతో , అవమానంతో అతడి కళ్ళు ఎర్రబడడం గమనించి అతడు నిజం చెబుతున్నాడని గ్రహించింది.
"స్త్రీ పుట్టినప్పటి నుండి ముసలితనం వరకూ..లేదా చనిపోయేదాకా తన శీలాన్ని కాపాడుకోవడంతోనే జీవితం మొత్తం సరిపోతుందనుకున్నాను.
స్త్రీల పట్ల సానుభూతి..సహానుభూతితో  మనసంతా వారి పట్ల ప్రేమ నింపుకున్నాను.ఆఖరికి ముక్కుపచ్చలారని పసిబాలురకూ ఈ వేధింపులు ఉంటాయని ఇప్పుడిప్పుడే అవగతమవుతోంది."
సౌమ్య ఇలా అంటున్నప్పుడు ఆమె వదనం వేదనతో నిండిపోయింది.
అతడిని పెళ్ళి చేసుకోవడానికి తన సమ్మతం తెలియజేసింది.
మరో నెల రోజుల తరువాత వారి పెళ్ళి ఘనంగా బంధుమిత్రుల మధ్య జరిగింది.

కొసమెరుపు మరియు గమనించ దగ్గ విషయం:—
బాల్యంలో లైంగిక వేధింపుల మధ్య పెరిగిన పసిపిల్లల అందరి కథలూ సుఖాంతమవ్వవు.
ప్రాణాలు కోల్పోవడమో లేక సంఘ విద్రోహకశక్తులుగా మారడమో ,షాక్ తో మూగబోవడం లేక మతిస్థిమాతం కోల్పోవడం లేక పదేపదే ఆ విషయం తలచుకుని తమను తామే అనేక సందర్భాలల్లో తిట్టుకోవడం ,ఆత్మనింద,ఆత్మన్యూనతతో జీవించడం,పెళ్ళైనా తమ జీవిత భాగస్వామిని ఏదోక వంకతో సతాయించడం లేక సైకోలుగా మారడమో అనేకంగా జరుగుతుంది.
వారి "హృదయవేదన " తెలిస్తే దైవసమానులైన ఆ పసిపిల్లల, పసిబాలుర పట్ల ఎవరూ ఇంత కిరాతకంగా...నీచంగా ప్రవర్తించరు.
గత తరం మరియు ప్రస్తుత తరం భవిష్యత్ తరంలో పౌరులుగా మారబోయే పసిపిల్లలను పువ్వులుగా ఎదగకుండానే మొగ్గలోనే చిదిమి వేయకూడదు.
అదే గత తరం,ఈ తరం మనుషులు బాధ్యతాయుతంగా భవిష్యత్ తరానికి చెందబోయే పసి పిల్లలకు అందించబోయే అందమైన జీవితం.

**** 

No comments:

Post a Comment

Pages