ప్రార్ధించే పెదవులకన్నా...!!! - అచ్చంగా తెలుగు

ప్రార్ధించే పెదవులకన్నా...!!!

Share This
   ప్రార్ధించే పెదవులకన్నా ...!!!
కొత్తపల్లి ఉదయబాబు 
(అచ్చంగా తెలుగు ఉగాది కధల పోటీలో తృతీయ బహుమతి పొందిన కధ )

              తెల్లవారు ఝామున మూడు గంటల సమయం.ఎక్కడో ఆగని ప్రమాదం జరుగుతున్నట్టు సెల్ ఫోన్ అదే పనిగా మోగడంతో ఉలిక్కిపడి  లేచాడు చక్ర హస్త. ఫోన్ అందుకుని ఆన్ చేస్తూనే అతని  ఎడమ చేయి అప్రయత్నంగా తన బెడ్ పక్కనే ఉన్న అలారం బటన్ ను ప్రెస్ చేసింది. వెంటనే ‘’ హలో వాయుసేన సర్వీసెస్  యే నా సర్?’’ అని ఆదుర్దాగా అడగడం వినిపించింది. ఎవరిదో స్త్రీ గొంతు.
‘’అవునమ్మా. ఏమిటో విషయం చెప్పండి.’’
అతని మాట పూర్తికాకుండానే  ఆమె కంగారుగా కొనసాగించింది. ‘’ బాబు.మాది కింబర్లీ అపార్ట్మెంట్స్ బాబు.మాది త్రీ జీరో వన్ ఫ్లాట్. ఎక్కడో షార్ట్ సర్క్యూట్ అయి ఇల్లంతా పెట్రోల్ టాంక్ పేలిపోయి పొగలు వచ్చినట్టుగా పొగలు కమ్మేసి లోపల ఏం జరుగుతోందో తెలియకుండా ఉంది బాబు.ఫైర్ స్టేషన్ వాళ్లకి ఫోన్ చేసాము. మీ టీం కూడా తొందరగా రాగలరా బాబు ?’’
“తప్పకుండా అమ్మ. ఎక్కడకి రావాలి? మీ అడ్రెస్ మెసేజ్ కూడా పెట్టండమ్మా.’’అడిగాడు చక్ర హస్త.ఆమె అడ్రెస్స్ చెప్పింది.
అతను మాట్లాడటం పూర్తీ చేసినప్పటికే మెలకువ వచ్చిన  అయిదుగురు యువకులు తమ యూనిఫాం తో అతనిముందు చేతులు కట్టుకుని రెడీగా ఉన్నారు. “శుభోదయం అన్నా” ఏక కంఠంతో చెప్పారు వాళ్ళు.’’శుభోదయం రా..పదండి.క్విక్ “ అని వాళ్ళను గ్రీట్ చేసి   చక్రహస్త తన బైక్ తాళాలు తీసుకుని మెరుపువేగం తో ముందుకు కదలడం తో అతన్ని అనుసరించారు వాళ్ళు.
చక్రహస్త తన బృందం తో మూడు బైక్ లమీద అపార్ట్ మెంట్ లోని ఆ ఫ్లాట్ కు చేరుకున్నారు. అప్పటికే మిగతా ఫ్లాట్స్ లోని మగవాళ్ళు ఆడవారు కంగారు పడిపోతూ బిక్కు బిక్కుమంటున్నారు. ఏంచేయాలో తోచని అయోమయం లో ఉన్నారు వాళ్ళు. ఫ్లాట్ మెయిన్ డోర్ లోంచి దట్టమైన పొగలు లోపలి అడుగు పెట్టనీయకుండా మనిషిని బయటకు విసిరేస్తున్నాయి.
‘’నాకు ఫోన్ చేసింది ఎవరు సర్?’’ అడిగాడు చక్ర హస్త. ఏభై ఏళ్ల స్త్రీ ముందుకు వచ్చింది.
‘’నేనే బాబు. ఆయన వూరు వెళ్ళారు. ఒక్కర్తినే ఇంట్లో పడుకున్నాను. ఎక్కడో కాలిన వాసన అనిపించి ఒక్కసారిగా లేచి చూస్తె నేను ఎక్కడ ఉన్నానో నాకే తెలియలేదు. బెడ్ రూమ్ ద్వారం కూడా కనిపించలేదు. నెమ్మదిగా తడుముకుంటూ గది బయటకు వచ్చాను. కిచెన్ లో సింక్ పక్కన ఫ్రిజ్ ఉంది. అక్కడ దీపం వేలుగుతున్నట్టుగా సన్నటి మంట వెలుగు కనిపించింది. ఒక్కసారిగా భయం వేసేసింది.నెమ్మదిగా తడుముకుంటూ వీధి తలుపు తీసుకుని వచ్చి మిగతా అందరిని తలుపులు కొట్టి లేపాను.మీరు మా డోర్ బయట అంటించిన ఫోన్ నెంబర్ చూసి ఫోన్ చేసాను. ఎవరూ లోపలి వెళ్ళలేకపోతున్నారు బాబు. సరిగా ఫ్రిజ్ కి అయిదు అడుగుల దూరం లో గాస్ బండ ఉంది బాబు దాన్ని ఆఫ్ చేసిన గుర్తు లేదు. ఏమైపోతోందో ఏమో...’’ ఆమె ఒక్కసారిగా ఏడుపు పారంభించింది.
ఈలోగా అతని వెంట ఉన్న యువకులిద్దరు పక్క ఫ్లాట్ లో గదుల నిర్మాణాన్ని పరిశీలించి వచ్చారు.‘’ఏరా. రెడీనా?’’ అడిగాడు చక్ర హస్త. వాళ్ళిద్దరూ ధంసప్ గుర్తు చూపించారు.ఇద్దరూ చేయి పట్టుకుని లోపలకు వెళ్లబోతుంటే ఆ పెద్దామే ఒక్కసారిగా అరిచింది.” వెళ్లొద్దు బాబు. ఎవరిదైనా ప్రాణమే. నా మాట వినండి.” అని అరిచింది.
‘’ఆమెను సెల్లార్ లోకి తీసుకు పొండి సర్. కంగారుపడకుండా చల్లటి మంచినీళ్ళు ఇచ్చి సేద తీర్చండి “ అన్నాడు చక్ర హస్త. ఆ మూడు ప్లాట్లలోని స్త్రీలు ఆమెను నెమ్మదిగా తీసుకుని సెల్లార్ లోకి వెళ్ళిపోయారు.అతని కనుసైగతో ఇతర  ఫ్లాట్స్ లోని అందరినీ అలెర్ట్ చేసి సేల్లార్లోకి తీసుకుపోయే ప్రయత్నంలో పడ్డారు మిగతా ముగ్గురు తమ్ముళ్ళూ.
అప్పటికే ఆ కుర్రాల్లిద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని హల్లోకి అడుగు పెడుతూనే తలుపుకు ఎడం పక్కనున్న కరెంట్ బోర్డు మెయిన్ ను ఆఫ్ చేసారు. ఉన్న రెండు కిటికీలకు మెష్ లు పీకేసి, తలుపులు బార్లా తెరిచారు.హాల్ కు ఎదురుగా ఉన్న గదిలోని కిటికీ తలుపులు ఒకరు తెరిస్తే, రెండవ వాడు బాల్కనీ తలుపు తెరిచాడు. దాంతో అప్పటివరకు ఇల్లంతా కమ్మేసిన పొగ నెమ్మదిగా బయటకు పోవడంతో  ఒకరికొకరు నల్లని ఆకారాలుగా కనిపించసాగారు.
సేల్ ఫోన్  లో టార్చ్ వెలిగించి హాలుకు కుడి పక్కగా ఉన్న కామన్ బాత్ రూమ్ దగ్గరకు నెమ్మదిగా చేరుకొని కిచెన్ లోకి తొంగి చూసారు. ఆమె చెప్పినట్టుగా ఫ్రిజ్ స్టాండ్ దగ్గర దీపం లాంటి సన్నటి మంట వెలుగుతోంది. మళ్ళీ ఇద్దరూ వెనక్కు చక్రహస్త  దగ్గరకు వచ్చి విషయమంతా చెప్పారు. అతని సలహామేరకు బాత్ రూమ్ తలుపు తెరిచి బకెట్ తో నీళ్ళు పట్టి ఒకడు అందిస్తుంటే రెండవవాడు కిచెన్ లో ఫ్రిజ్ మీద మంట ఆరిపోయే వరకు పది బకెట్ల నీళ్ళు బలంగా కొట్టారు. దాంతో మంటలు ఆరిపోయి ఒక వికృత కాలిన వాసన  అక్కడ అంతా వ్యాపించసాగింది. అపుడు వారిద్దరూ ‘అమ్మయ్య’ అనుకుని బయటకు వచ్చారు.
‘’సక్సస్ అన్నయ్యా.’’ అంటూ వచ్చిన ఇద్దరు తమ్ముళ్ళనూ చక్రహస్త అమాంతం కౌగలించుకున్నాడు చేరోపక్కన.’’ధాంక్యూ రా.థాంక్యూ వెరీ మచ్’’ అంటూ.
తన చుట్టూ ఉన్న మగవాళ్ళతో ‘’ప్రమాదం తప్పింది సర్.ఆల్ ఆర్ సేఫ్ ‘’ అన్నాడు లోపలి దీర్ఘ శ్వాస తీస్తూ. చక్ర హస్త మాట పూర్తవుతుండగా ఫైర్ఇంజన్ సైరన్ పెద్దగా మోగింది. మరో అయిదు నిముషాలలో బిలబిలమంటూ స్టాఫ్ పైకొచ్చి వివరాలు వ్రాసుకుని తమ పని అయిపోయినట్టు ఫోన్ నంబర్స్ తీసుకుని వెళ్ళిపోయారు.
ఎక్కడ గ్యాస్ బండ పేలిపోతుందో అన్న భయంతో మిగతా ఫ్లాట్స్ వాళ్ళు ఒక బాగ్ లో రెండేసి డ్రెస్సెస్, ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు తీసుకుని సెల్లార్ లోకి దిగి పూర్వానుభావాలు చెప్పుకోవడం ఆ కుర్రాళ్ళు ముగ్గురికీ విస్మయం  కలిగించింది. మెల్లగా పైకి వచ్చిన ఆమె చక్రహస్త చేతులు పట్టుకుని ‘’ చల్లగా వర్ధిల్లు బాబు.ఇరవై ఫ్లాట్స్ లో వాళ్ళ ప్రాణాలు కాపాడారు. ఎన్ని లక్షలు ధారపోసినా మీ ఋణం తీర్చుకోలేను బాబు.’’ వెక్కుతూ అన్న మాటలకు అక్కడ అందరి కళ్ళూ చెమర్చాయి.
‘’అమ్మా మీ చల్లని దీవనలే మాకు శ్రీరామ రక్ష .  నైతిక బలం. మీరు రెస్ట్ తీసుకోండి. మీకు ఏ అవసరం వచ్చినా మళ్ళీ నాకు ఫోన్ చెయ్యండి. వస్తామమ్మా.’’ అనేసి అక్కడ అందరికీ నమస్కరించి తన బృందంతో నిష్క్రమించాడు చక్ర హస్త.
   *    *    *
మరునాడు ఆ వార్త అన్ని పత్రికలలోనూ పతాక స్థాయి శీర్షికగా నిలిచింది. జిల్లాస్థాయి బుల్లితెర మీడియా ప్రతినిధులు ‘’వాయుసేన’’ సంస్థ ద్వారా చక్రహస్త చేస్తున్న సేవలను కొనియాడుతూ అతన్ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసారు. ఆ సంస్థ ఏర్పాటు చేయడం లోని అతని ఉద్దేశాన్ని, మూల కారణాలను విని ప్రేక్షకులు నివ్వెరపోయారు.
‘’అసలు ఈ సంస్థ మీకు ఎందుకు స్థాపించాలని అనిపించింది. ఈ సేవలు మీకు ఎలా సాధ్యం?’’ అని విలేకరి అడిగిన ప్రశ్నకు ‘’మీరు దయచేసి నా మాటలకు అంతరాయం కలగనివ్వకుండా మాట్లాడనిస్తే వివరంగా చెబుతాను మేడం.’’
అన్నాడు చక్ర హస్త.
‘’ముందరి కాళ్ళకు బంధం వేసేసారే? కానివ్వండి ’’ వెర్రి నవ్వు నవ్వేస్తూ అంది యాంకర్.
చక్రహస్త కోరగా చూసి నవ్వుతూ చెప్పసాగాడు.
‘’మాది అసలు ఒరిస్సా లోని ఒక కుగ్రామం మేడం. ఇంజనీరింగ్ లో సీట్ ఎన్.ఆర్.ఐ. కోటాలో వచ్చింది. ఆంద్ర లో పేరెన్నిక గన్న ఆ కాలేజీ ఒక మేజర్ మున్సిపాలిటీ కి ఏడు కిలోమీటర్ల దూరం లో  ఉంది. నేను పాలిటెక్నిక్ సివిల్ పాస్ అయి ఇంజనీరింగ్ సివిల్ లో జాయిన్ అయ్యాను. టౌన్ లో బాయ్స్ హాస్టల్ లో ఉండి డైలీ కాలేజీకి వెళ్లి వస్తూండేవాడిని. నాకు ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఎదుటి వాడిని మాట అనను.మాట పడను. నాకు చేతనైనంతలో సహాయం చేయడం మా తల్లితండ్రులు నేర్పారు.
ప్రతీ ఇంజనీరింగ్ కాలేజీలో  లాగే మా కాలేజీలోను సీనియర్స్ రాగింగ్ కి టార్గెట్ అయ్యాను. వాళ్ళు వారం రోజులు పరిశీలించి ఒకరోజు నన్ను సింగల్ గా మున్సిపల్ హైస్కూల్ దగ్గరకు తీసుకువెళ్ళారు.ఉదయం ఎనిమిదిన్నర అయ్యింది.పిల్లలు ఇళ్లనుంచి స్కూల్ కు వచ్చేసి సైకిళ్ళపోటీ పెట్టుకుని రౌండ్స్ వేస్తున్నారు. టీచర్లు ప్రేయర్ టైం కి వస్తేనే  గొప్పట. ఇక పిల్లలదే ఇష్టారాజ్యం.ఆ  స్కూల్ లో నన్ను కొత్తగా ఆరవ తరగతికి వేసిన టీచర్ లా నటించమని, నా తెలివితేటలూ ప్రదర్శించి ఒక కొత్త సైకిల్ సంపాదించుకు రమ్మని వారి ఆర్డర్.
వేరే గతి లేక సీరియస్ గా పిల్లల్ని ‘ఆరవ తరగతి ఎక్కడ’ అని అడిగి డైరెక్ట్ గా తరగతి గది కి వెళ్లాను. నా అరుపులకి భయపడి పిల్లలంతా క్లాస్ కి వచ్చారు. సీరియస్ గా వాళ్ళని భయపెట్టి కొత్త సైన్స్ మాస్టర్ గా పరిచయం చేసుకుని పది నిముషాలు పాఠం చెప్పాను. ‘టిఫిన్ చేసి వస్తాను. ఎవరైనా సైకిల్ ఇస్తారా?’అని అడిగాను.సైకిల్ ఇవ్వడానికి పిల్లలు పోటీ పడ్డారు. ‘నాది కొత్తది సర్.ఇది తీసుకు వెళ్ళండి’ అని ఒక కుర్రాడు కీ ఇచ్చాడు. ‘నాకు నీ సైకిల్ తెలీదుగా.నువ్వేతాళం తీసి ఇవ్వు.’అన్నాను. వాడు మిగతా పిల్లలకేసి విజయగర్వం తో చూసి నాతో వచ్చి సైకిల్ ఇచ్చాడు. వాడికి నమ్మకం కలిగించడం కోసం ‘నువ్వూ నాతొ రా’ అని వాడిని సైకిల్ ఎక్కించుకుని ఆ పేట దాటి వచ్చేసాను. వాడిని ఒక చోట దింపి’ఇపుడే వస్తాను ఇక్కడే ఉండు ‘ అని చెప్పి సైకిల్ తో సీనియర్స్ ఉన్న చోటికి వచ్చాను. వాళ్ళు సైకిల్ తీసేసుకుని నన్ను క్లాస్ కి వెళ్ళమన్నారు. ‘’ఇది అన్యాయం. అది వాడి కొత్త సైకిల్.వాడి అమ్మ నాన్న వాడిని కొడతారు.’’ అన్నాను కోపంగా.
‘’ఏంటి బే..మామీదే కళ్ళెర్ర చేస్తున్నావ్.మళ్ళీ నీ వూరు క్షేమంగా వెళ్లాలని లేదా? ‘ అని బెదిరించారు. ఏమీ  చేయలేకపోయాను.
మూడు రోజుల తరువాత పేపర్లో ఆ అబ్బాయి వార్త చదివి  కోయ్యబారిపోయాను. తల్లితండ్రులు కొడతారన్న భయంతో ఆ అబ్బాయి ఇంట్లోంచి పారిపోయాడు. వాళ్ళు కన్నీరు మున్నేరుగా విలపిస్తూ పోలీసు రిపోర్ట్ ఇచ్చారు. పాఠశాలకు సమయానికి రాలేదనే నెపంతో ప్రదానోపాద్యాయుడిని సస్పెండ్ చేసారు.
నావల్ల ఇద్దరికీ నష్టం జరిగింది.ఆ కోపంతో సీనియర్స్ కాలేజీలో  నన్ను గేలి చేస్తుంటే తిరగబడ్డాను. నన్ను కాలేజీ నుంచి  సస్పెండ్ చేసారు. నా చదువు ఆగిపోయింది. ఇంట్లో తెలిస్తే అమ్మ నాన్న పరువు కోసం  ఆత్మ హత్య చేసుకుంటారు. అందుకే పోయిన చోటే వెతుక్కోవాలని నాకున్న సివిల్ పరిజ్ఞానం తో గ్రూప్ హౌసెస్ ప్లాన్స్ గీసి కాంట్రాక్టర్ లను ఎందరినో కలిసి చూపించాను. నా శ్రమకు ఫలితం దక్కింది. డబ్బు సంపాదనలో పడ్డాను.అయితే ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఆ అబ్బాయిని ఎలాగైనా వారి తల్లిదండ్రులకు అప్పగించాలన్న నా ఆశ అడియాసే అయింది.
అలా ఆ అబ్బాయికోసం వెతుకుతున్న తరుణం లో తల్లి తండ్రులమీద కోపం తోనే, చదువు అంటే ఇష్టం లేకనో, బీదరికం తోనో..ఏదో కారణం తో ఇల్లు వదిలేసి వచ్చేసిన కొందరు తమ్ముళ్ళు నాకు బస్సు స్టాండ్ లోను, రైల్వే స్టేషన్ లోనూ కనిపించారు. వాళ్ళను చేరదీశాను.ఎంతో నచ్చచెప్పి కొందరిని వాళ్ళ తల్లితండ్రులకు క్షేమంగా అప్పగించగలిగాను. కానీ కొందరు ‘ ససేమిరా ఇళ్ళకు వెళ్ళం. ఉంటె నీతో ఉంటాం.లేదా ఆత్మహత్య చేసుకుంటాం’ అన్నారు. సరిగ్గా అపుడే కోస్తాకు తుఫాను వచ్చింది.
అపుడే అమ్మ చెప్పిన వేదమంత్రం లాంటి వాక్యం గుర్తొచ్చింది. అదే ‘’ప్రార్ధించే చేతులకన్నా – సాయం చేసే చేతులు మిన్న ‘’. ఆ ప్రాధమిక సూత్రం ఆధారంగా ‘’ వాయుసేన ‘’ అనే సంస్థను స్థాపించాను. నాతొ పాటు నాలా ఇల్లు వదిలివేసిన పిల్లలు ఇరవై అయిదు మంది ఉన్నాము. అందరూ చదువుకుంటూనే ఏదో పని చేస్తారు. కేటరింగ్ కి వెళ్తారు. డెకరేషన్ చేస్తారు.హౌస్ షిఫ్ట్ చేస్తారు. బిల్లులు కట్టి పెడతారు. ఇలా ఎవరికి ఏ పని కావాలన్న చేసిపెడతారు. డిమాండ్ చెయ్యరు.వాళ్ళు ఇచ్చింది పుచ్చుకుంటారు. ఆ డబ్బు భద్రంగా పైసా కూడా ఖర్చు పెట్టకుండా నాకు తీసుకు వచ్చి ఇస్తారు. అవి వాళ్ళ వాళ్ళ అకౌంట్స్ లో వారానికి ఒకసారి జమ చేసేస్తాను. వాళ్ళు ప్రయోజకులై ఇంటికి వెళ్తాము అన్న రోజున నేనే స్వయంగా తీసుకువెళ్ళి తల్లితండ్రులకు అప్పగించి వస్తాను. ఒకరి స్థానం ఖాళీ అయితే మళ్ళీ అన్వేషించి ఆ స్థానం భర్తీ చేస్తాను.
నా ఈ సేవ నిరంతరమూ కోన సాగుతూనే ఉంటుంది. అటువంటి క్రమశిక్షణ మా ఆయుధం.సేవే మా లక్ష్యం. వాళ్ళు నన్ను నమ్ముకుని నాతొ ఉండి పోయిన వాళ్ళు.ఆ దైవం ఇచ్చిన తమ్ముళ్ళు. ‘’ ఒక్క క్షణం నీటి దొంతరలు జాలువారిన కళ్ళను హుందాగా తుడుచుకుని  తన స్థానం లోంచి లేచి తన బృందాన్ని పరిచయం చేసాడు చక్రహస్త. ప్రణవ్, భార్గవ్, శ్రీ హర్ష, కళ్యాణ్...అందరూ ఒకే యూనిఫాం ధరించి రామభక్తుల్లా తమ అన్నముందు వినయంతో మోకరిల్లడం చూసి యాంకరమ్మే కాదు...కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకలోకం దిగ్భ్రాంతి చెందింది.
యాంకరమ్మ ముక్తాయింపు :
‘’  అచ్చమైన సేవకు స్వచ్చమైన మనసు, సాయం చేయాలనే తపన ఉన్న ఈ యువకుల శక్తి అవసరమైతే ప్రాణానికి తెగించైనా సాటి మనిషిని కాపాడటం కోసం ఉపయోగించిన వీరికి, వీరికి అటువంటి ఉత్తమ నాయకుడై నడిపిస్తున్న చక్రహస్త గారికి  మా టీవీ చానెల్ తరపున ధన్యవాదాలు అర్పించుకుంటున్నాము.ఒక కన్న తల్లి ఒక భారత పౌరుని హృదయంలో ఒక మంచి విత్తనం నాటితే ఆ ఫలితం ఇంత గొప్పగా ఉంటుందని చక్రహస్త బృందం నిరూపించింది. వారిని కన్న తల్లిదండ్రులు ధన్యులు. ఈనాటి మరెందరో అనాధలకు వారు ఆదర్శం. అందుకే ప్రతీ ఒక్కరం ఉదేయమే లేచి ఆ వాక్యాన్ని మననం చేసుకుందాం. ఆ వాక్యమే ‘’ప్రార్ధించే పెదవులకన్నా..సాయం చేసే చేతులు మిన్న.”
 ***

No comments:

Post a Comment

Pages