అమ్మమ్మ అమెరికా ట్రిప్ - అచ్చంగా తెలుగు

అమ్మమ్మ అమెరికా ట్రిప్

Share This
 అమ్మమ్మ అమెరికా ట్రిప్
కుసుమ ఉప్పలపాటి 
(అచ్చంగా తెలుగు ఉగాది కధల పోటీలో  తృతీయ బహుమతి పొందిన కధ )

 “అమ్మమ్మా బ్రేక్ ఫాస్ట్ !”

చేతిలో ఐ పాడ్ తో కిందకి దిగి వచ్చింది చిన్నమనవరాలు స్వీటీ. చేతిలో అది లేకుండా నిమిషం వుండదు అది. బారెడు పొద్దెక్కింది. ఇప్పుడా లేచేదీ అన్నట్టు చిరాగ్గా చూసింది లీల. “మొహం కడుక్కున్నావుటే ?"మొహంచూస్తే ఆ ఛాయలెక్కడా కనబడలేదు . దానికి రోజూ గుర్తుచేయాలి . లేకపోతే యెగ్గొట్టేస్తుంది .

"పేస్ట్ కనబడలేదు అమ్మమ్మా “ 

" పద.నే చూపెడతాను.  అక్కేదే ?“ 

" ముందు బ్రేక్ ఫాస్ట్ పెట్టు . నేను స్నానంచేసేటప్పుడు కడుక్కుంటాను .” “అదేంకుదరదు . పద నే చూపెడతాగా. మొహంకడుక్కోకుండా తినకూడదు .” 

" చిన్నీ యెక్కడున్నావే , చెల్లికి పేస్ట్ కనబడలేదుట, నువ్వుకొంచెం హెల్ప్ చేయొచ్చుకదా !” వాళ్ల అక్కను వెతుక్కుంటూ వెళ్లి చూస్తే లీలకు ఇంకాచిరాకు పరాకాష్టకు వచ్చింది. గదినిండా విడిచిన బట్టలు , పుస్తకాలు , స్నాక్స్ తిన్న బౌల్స్ ,గందరగోళంగా వుంది . తాపీగా తన బొమ్మకి బట్టలు మార్చి ,తలదువ్వే ప్రయత్నంలో వుంది చిన్ని . ఇరవయి నాలుగుగంటలు దానికి ఆ బొమ్మల సంరక్షణే. వాటికి గుడ్దలు మార్చనూ, తల దువ్వనూ ఇదే పని. ఆ బొమ్మలకి డ్రెస్సులు , దువ్వెన , హాండు బాగు అన్ని అట్టహాసాలూ వున్నాయి .చూస్తే అదీ మొహంకడుక్కున్న ఛాయలు కనబడలేదు . 

“లేవంగానే మొహాలు కడుక్కోవద్దా చిన్నీ , చెల్లికి హెల్ప్ చేయాలి కదా!  చూడు యెంత పొద్దు పోయిందో “

“అమ్మమ్మా ఇది మాకు వెకేషన్ . నువ్వు ఎంజాయ్ చెయ్యనీయటంలేదు “ కోపంగా అమ్మమ్మను నిలదీసింది. చిన్నీ పెద్దదయింది. బాగా సమాధానాలు ఇస్తోంది .ఇద్దరినీ వెంటబడి తరిమి మొహాలు కడిగించింద లీల.  

"అమ్మమ్మా ! కూర కారంగా వుంది . నాకొద్దు . " ప్లేట్ నెట్టేసింది స్వీటీ . బలవంతంగా మొహంకడిగించినందుకు దానికి అమ్మమ్మ మీద చాలా కోపంగా వుంది. ఆ కోపంకూరమీద చూపించింది. తిండిమానేస్తే పెద్దవాళ్లు బాధ పడతారని దానికి బాగా తెలుసు. దాని నిరసన అలా చూపిస్తూంటూంది. ‘అమ్మమ్మా గోబాక్ ఇండియా ‘ అని అంటుంటే చిన్ని గొంతు నొక్కి ఆపేసింది, అమ్మమ్మ వింటుందే అంటూ.  దానికీ అమ్మమ్మ వరస యేం నచ్చలేదు. అమ్మమ్మ నాగింగ్, వెరీ నోసీ అనుకుంది. 

దేవుడా ,ఇంక ఇది వద్దంటే ముట్టదు. మొత్తం ట్రాష్ కాన్ పాలే . జామ్ తోనన్నా తినవే అంటే ఇంక అది ముట్టు కోలా . బ్రెడ్ టోస్ట్ చేసి ఇచ్చింది. ఇక్కడ ఫుడ్ మిగిలిందంటే ట్రాష్ లోవెయ్యాల్సిందే. ఎవరికన్నా ఇచ్చే సౌకర్యంవుండదు . అలా ఫుడ్ ట్రాష్ లో వేస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది . 'అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అంటారు కదా అని. కూతురితో దెబ్బలాడింది ,పిల్లలని కొంచెం కోప్పడి డిసిప్లిన్ నేర్పకపోతే యెలాగా అని .

"లేదమ్మా మేం ఇద్దరం జాబ్ కెళ్లిపోతాం. వాళ్లు మమ్మల్ని బాగా మిస్సవుతుంటారు . వాళ్లతో వున్న కాసేపూ వాళ్లని కోప్పడటం, వాళ్ళు అలగటం, బాగా అనిపించదు . వాళ్లని యెలా హాపీ గా వుంచాలా అని మేం వర్రీ అవుతుంటాం.” కూతురు తన బాధ తను చెప్పుకుంది .

  లీలకి పిల్లల్ని గారాబంచేయటం ఇష్టంవుండదు . చాలా స్ట్రి క్ట్ గా వుండేది పిల్లలతో .వాళ్లు బాగా చదువు కోవాలి . బుధ్ధిగా వుండాలి. 

ఎవరి తో ఒక్క మాట అనిపించు కోకూడదు.ఫ్రెండ్స్ తో తిరగనిచ్చేది కాదు .తనతోనే కూడా కూడా తిప్పు కొనేది .భర్త, అత్తగారూ ఎంత హెచ్చరించినా వినిపించు కునేది కాదు .పిల్లలు తప్పు దోవన పడితే యెలా ? వాళ్ల స్నేహితురాలు ఒకామె ప్రేమ వివాహంచేసుకుని, తరువాత డైవోర్స్ తీసుకుని, చాలా ఇబ్బందులు పడింది. అలా జరుగుతుందేమో !యేదో భయమ్,ఆందోళన . !వాళ్లు యేంతినాలి, యేంకట్టు కోవాలి అంతా తనే ప్లాన్ చేసేది. యేంచదువుకోవాలి, యేకోచింగ్ తీసుకోవాలి, తనే దగ్గరుండి పర్య వేక్షించుకునేది . సమ్మర్ లోకూడా, యేదో కొచింగ్ లనీ, సంగీతమ్ నేర్పించడం, వాళ్లని ఖాళీగా వుండనిచ్చేది కాదు .పిల్లలిద్దరూ బాగా చదువుకొని మంచిగా సెటిల్ అయ్యారు . స్వీటీ వాళ్ల అమ్మ ఒక పెద్ద కంపెనీకి డైరెక్టరు. మంచి పొజిషన్ లో వుంది ఇక్కడే us లో. చిన్నపిల్ల బెంగుళూరు లో కార్పొరేట్ హాస్పిటల్ లో పీడియాట్రిషన్. అల్లుళ్లూ మంచి పొజిషన్ లోవున్నారు . 

  పెద్దమ్మాయి పిల్లలకి సమ్మర్ వెకేషన్ అయితే వాళ్లతో స్పెండ్ చేయటానికి వచ్చింది లీల. రెండు నెలలకి నేను కూడా యెందుకు, ఒక్కదానివే వెళ్లిరా , యెలాగో మానేజ్ చేసుకుంటాలే అని భర్త రాలేదు. ఆయనకి అమెరికా అంటేనే బోర్. ఇరవయి నాలుగు గంటలూ ఆ  tv ముందు పడుండాలని. మనుషులు కలవటం, రావటాలూ, పోవటాలూ వుండనే వుండవు. యేదన్నా కాలక్షేపమే వుండదు. పిల్లలు వీకెండ్ అని తిప్పితేనే బయటి ప్రపంచం. అందుకని నేను రాను, నువ్వు పోయిరమ్మని భార్యను పంపించాడు. సమ్మర్ లో కూడా పిల్లలు స్కూల్ కెళ్లాలి , అమ్మవుంటే ఇంటి పట్టున వుండి హాయిగా వేళకు తిని , ఆడుకుంటారని తల్లిని పిలిపించుకుంది కూతురు ఉష. 

   పిల్లల్ని మంచిగా క్రమశిక్షణలో పెట్టాలని లీల తాపత్రయం. వాళ్లని ఇలావుండాలి, అలా వుండాలని వెంటబడుతుంటుంది. పిల్లలకి చెప్పుకోలేక, తల్లిని నొప్పించలేక ఉష సతమతమౌతోంది. పిల్లలు అమ్మమ్మ అలా, అమ్మమ్మ ఇలా అని కంప్లైంట్స్ చేసినా, పిల్లల్నే కోప్పడుతుంది. అమ్మమ్మ మీ కోసంతాతయ్యను వదిలి, ఒక్కతే వచ్చింది. మీరు మాట వినక పోతే బాధ పడుతుంది. నెక్స్ట్ సమ్మర్ రాదు మరి  అని బెదిరిస్తుంది. 

“అమ్మమ్మా ! ఐపాడ్ కనబడటంలేదు .దాచి పెట్టావా ?”

“అవునే , మీరు స్నానంచేసి కాసేపు సంగీతం నేర్చుకుంటే .లంచ్ చేసిన తరువాత ఇస్తాను “ 

ఐ పాడ్ లేకపోతే వాళ్లు గిల గిల లాడిపోతారు అది వాళ్లకి ఆరోప్రాణం. కార్టూన్ మూవీస్ చూడటం, మ్యూజిక్ వింటం, ఈ మధ్య వీడియోస్ వాళ్ల మీద వాళ్లే రికార్డ్ చేసుకుని సాయింత్రంవాళ్ల అమ్మకి చూపిస్తారు.  ఆ ఐపాడు తోనే లోకం. తల్లి తండ్రులు కోప్పడు తుంటారు. యెంత కంట్రోల్ చేసినా పెద్ద ఉపయోగంలేదు. ఆ వీక్నెస్ పట్టుకుని లీల వాళ్లతో అన్ని పనులూ చేయించటం మొదలు పెట్టింది. లీల కి సంగీతం వచ్చు. ఇట్లా వచ్చినప్పుడు వాళ్లకి నేర్పుతుంటుంది. ఇద్దరికీ బాగా తలలు దువ్వి జడలేసి , కాసేపు కూర్చో బెట్టి సంగీతంపాడిచ్చింది. ఇద్దరిదీ మంచి గొంతు . ఇట్టా చెబితే అట్టా నేర్చుకుంటారు .మనవరాళ్లను చూసి మురిసిపోయింది. ఈ రెండు నెలలు ఇద్దరూ చెప్పిన మాట వింటే చాకుల్లాగా తయారవుతారు అనుకుంది. రోజూ ఒక గంట పాడు కోవాలి. పనిలో పని రూమ్ నీట్ గాయెలావుంచు కోవాలి ,తీసిన వస్తువుతీసిన చోట యెలా పెట్టాలి ,లాంటి వన్నీ చెప్పింది .  ఆతరువాతే ఐపాడ్ తో ఆడుకోవాలి. 

“తొందరగా లంచ్ పెట్టు అమ్మమ్మా” బుధ్ధిగా పెట్టించుకుని తిన్నారు. యెప్పుడెప్పుడు అమ్మమ్మ చేతిలో ఐపాడ్ లాక్కోవాలనే వాళ్ల ధ్యేయం. 

“ఏదీ ఐపాడ్ తొందరగా ఇచ్చేయి , “ అన్నంతినటము అయీ అవగానే తీసుకుని పరిగెత్తారు .      

 దీనితో లీల కు చాలా వుత్సాహంవచ్చింది. యేదో చేసి పిల్లలకు అన్నీ నేర్పాలి. వాళ్లని అద్భుతంగా తయారు చేయాలి.  ఆ పిచ్చి పట్టుకుంది. రూము నీట్ గా పెట్టుకుంటే మార్కులు. చెప్పించు కోకుండా స్నానంచేస్తే మార్కులు. ఫుడ్ పారేయకుండా తింటే ఎ గ్రేడు. సంగీతంబాగా నేర్చుకుంటే మళ్లీ గ్రేడులు .  వాళ్లని హాపీగా వుంచటానికి చిన్న చిన్న గిఫ్టులు వాళ్ల అమ్మతో కొనిపించటం. రెండు మూడు రోజులు పిల్లలు కొద్దిగా లొంగి నట్టే కనిపించారు. ఒక రెండు మూడు గంటలు అమ్మమ్మ చెప్పినట్టువింటే ఇంక రోజంతా ఆడుకోవచ్చు గదా అని .

   మెల్లగా చిన్నది విప్లవంలేవదీసింది. మొరాయించటం మొదలు పెట్టింది. ఒకరోజు స్త్రైక్ డిక్లేర్ చేసింది. నాకు వంట్లో బాగా లేదని పడుకుంది.  అన్నంకూడా ముట్టలేదు . అమ్మమ్మ ఇటొస్తే అటు పోవటం మొదలు పెట్టింది. వాళ్లమ్మ వచ్చి బతిమలాడితే అప్పుడు లేచి స్నానంచేసి అన్నంతిన్నది . మర్నాడు అదేతంతు. వాళ్లమ్మ వచ్చిన తరువాత లేచి స్నానంచేసి తింటుంది. అప్పుడు వాళ్ల అక్కతో ఆడుతుంది. లీల యెంత బతిమిలాడినా లేవదు, రాదు. లీల బాగా హతాశురాలయింది. కావాలని చేస్తోందని అర్ధమవుతోంది. ఇవ్వాళ సాయిత్రం అమ్మాయి రాంగానే గట్టిగా చెప్పించాలని కూతురు రాక కోసం యెదురు చూడటం మొదలు పెట్టింది. 

సాయింత్రం, ఉష ఇంటికి వచ్చి తల్లి చేతిలో ఒక కాయితంపెట్టింది . పిల్లలు వాళ్ళ అమ్మకు రాసిన వుత్తరం.

“ మమ్మీ ! మేం సమ్మర్ స్కూల్ కి వెళతాం.అక్కడ మాకు ఫ్రెండ్స్ వుంటారు. వాళ్లు తో కల్సి ఆడు కోవచ్చు. నువ్వు యెటూ సాయింత్రమే కదా వచ్చేదీ. ఇక్కడ అమ్మమ్మతో బాగా ఫైటింగ్ అవుతోంది మాకు. ఇంట్లో ఆడుకోలేనప్పుడు బయట స్కూల్ నయం.మాకు ఇంట్లో బాగా లేదు. మమ్మల్ని స్కూల్ కి పంపించేయి .స్వీటీ , చిన్నీ .” 

లీలకు చిన్నతనమనిపించింది, ఉష ముందు.  ఉష తల్లితో అనునయంగా అంది . " అమ్మా ! నువ్వు మమ్మల్ని పెంచిన రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. ఇండియాకి ఇక్కడి పరిస్థితి కి  సంబంధం లేదు. మాకు అక్కడ సపోర్ట్ సిస్టంవుంటుంది. పిన్నులూ,అత్తయ్యలూ , మామయ్యలూ, ఫ్రెండ్స్ , బోలెడంత కాలక్షేపం. పైగా నువ్వు ఇంట్లోనే వుంటావు. వీళ్లకి అలాకాదమ్మా. వీళ్లు చదువుకునే స్కూల్స్ లో అమెరికన్ పిల్లలు వుంటారు. వాళ్ల రంగూ , రూపూ వేరు. వాళ్ల కల్చరు వేరు. ఫుడ్ హాబిట్స్ వేరు . వాళ్ల తో వీళ్లు కలవలేరు . వాళ్లూ వీళ్లను కలుపుకోరు. ఇది వాళ్ల దేశం. మేము పరాయి దేశస్థులం అన్న భావన వాళ్లకి బాగా వుంటుంది. ఇంట్లో ఇద్దరం జాబు కెళ్లిపోతాం. మేం ఇంట్లో వుండే సమయము తక్కువ. బంధువులూ అందరూ కలిసే అకేషన్స్ ఇక్కడ తక్కువ . వాళ్లని వాళ్లు ఎంగేజ్ చేసుకోవాలి . వింటర్ లో ఏడు గంటలకి ఆ చలిలో మంచులో లేపి , లంచ్ పాక్ చేసి, ఆ నిద్ర మత్తులోనే స్కూల్లో వదిలేసి పోతాం. వాళ్ల స్కూల్ అయిపోయినా మేం ఆఫీసులో వుంటాంకాబట్టి అక్కడే యేమ్యూజిక్కో , కరాటే నో నేర్చుకుంటూ వుంటారు . ఇంటి కొచ్చి యేదో ఇంత తిని పడుకుంటాం. పొద్దున్నే మళ్లీ మొదలు . ఇంక వాళ్లకి అనారోగ్యం యేదన్నా వస్తే, వాళ్ల తిప్పలూ, మాతిప్పలూ వర్ణనా తీతం. యెవరు సెలవు పెట్టాలా, యెవరు పిల్లలతో వుండాలా అని. అందుకే వీకెండ్ మేంపిల్లల తోనే గడుపు తాం. తెలుగు అసోసియేషన్స్ , అవీ వున్నా యెటూ పోం. మేం నలుగురం కలసి టైమ్ స్పెండ్ చేస్తాం. వాళ్లు బొమ్మలు అదీ యేం అడిగినా కాదనం. నువ్వున్న ఈ రెండు నెలలు మాకు స్వర్గమ్. మేం ఇంత ఆరాముగా వుండటము కుదరదు. ఇంటికి రాంగానే వేడిగా వండి పెడతావు. పిల్లలు నీరక్షణలో నిశ్చింతగా వుంటారు. అందుకే నాన్నకిబ్బందని తెలిసినా నిన్ను పిలిపించుకున్నాను . పిల్లలు నీకు నచ్చినట్లు వుండటంలేదని నాకు తెలుసు . కానీ ఇక్కడి మా పరిస్థితి ఇది .”

 లీల జాలితో, బాధతో చలించి పోయింది. అయ్యో! నా ,చాదస్తంతో పసిమనసులను యెంత విసిగించాను. వాళ్ల కంపెనీ ఎంజాయ్ చెయ్యటం పూర్తిగా మరిచి పోయాను. మళ్లీ ఇండియా వెళితే పిల్లలు కనబడతారా? నేను వాళ్లకివ్వల్సింది ప్రేమ. వాళ్ల అమ్మా,నాన్నలతో గడిపిన అనుభూతి నివ్వగలగాలి. అసలు అమ్మమ్మ అని వాళ్ళకి అనిపించేట్టు చేసుకోగలిగానా ? పిల్లలతో గడిపిన ఈ రోజులు తలుచు కుని నేను ఆనందించాలి. వాళ్ల మనుసులో ఒక తీపి గుర్తుగా మిగిలి పోవాలి. నేను అలా వున్నానా ? యేమిటి నా బొంద డిసిప్లినూ నేనూనూ . కాలం మారింది. పరిస్థితులు మారినయ్యి. తదనుగుణంగా మనమూ, మన ఆలోచనలూ మారవద్దా? అయినా వాళ్ల తల్లితండ్రుల కంటే నాకెక్కువ తెలుస్తుందా ? వాళ్లు ప్రపంచం మొత్తంతిరుగుతుంటారు. నాకు వున్నచోటు తప్ప తెలియదు. నా మిడిమిడి జ్ఞానంతో అందరినీ విసిగించాను. అమ్మమ్మ యెప్పుడొస్తుందని వాళ్లు ఎదురు చూడాలి కదా! ఎప్పుడు వెళ్లిపోతుందని కాదు. జీవితమంటే లక్ష్యాలు, ప్రణాళికలు కాదు. అనుభూతులు, అనుబంధాలు. అవి మిగుల్చుకోలేని నాడు,  యేంసంపాదించినా , యేమి అయినా కూడా నిష్ప్రయోజనమే . 

  అమ్మ మౌనంగా అయిపోయేసరికి ఉషకి బాధేసింది.  " అమ్మా! తెలుగు మూవీ కెళదాం, అలాగే ఇండియన్ రెస్టారెంటు కెళ్లి భోంచేసి వద్దాము. " పిల్లలనీ, భర్తనీ బయలుదేరదీసింది ఉష , తల్లిని, చీరప్ చేద్దామని. పిల్లలకి యేదో నేర్పటంకాదు . తనే యెంతో నేర్చుకున్నాను అని అనిపించింది లీలకు . నేర్చుకునే వాళ్లకి జీవిత మెప్పుడూ పాఠశాలే కదా !

 ***

No comments:

Post a Comment

Pages