చింత - అచ్చంగా తెలుగు
 చింత
(అచ్చంగా తెలుగు ఉగాది కధల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కధ )
జైదాస్

                      యస్...చెట్లూ శాపాలు పెడతాయి.పగ పడతాయి. ప్రతీకారం కూడా తీర్చుకుంటాయి. చెట్లను నరికే వారికే కాదు,  పెంపకం పేరుతో వాటి ప్రాణాలు తీసే వారికీ ఇలాగే జరిగితే ఎంత బావుణ్ణు."కసిగా అనుకున్నాను.నాలో ఇంత అసహనానికి కారణం కాలేజిలో జరుగుతోన్న 'హరితహారమే'. ఇలాంటి  కార్యక్రమాలంటేనే చిరాకు నాకు. ఉన్నవి కాపాడుకోకుండా కోట్లాది రూపాయల మొక్కలు నాటి, వాటి సంరక్షణ గాలికొదిలేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం,నీళ్లుకూడా పోయకుండా వాటి ఉసురు తీయడం, గర్భస్థ పిండాల్ని చంపడంకన్నా  ఘోరం. ప్రాణంపోసి పెంచుతారు.ఆపై పీకి పాతిపెట్టి, నీళ్లులేకుండా ఎండబెట్టి నిర్దాక్షిణ్యంగా చంపుతారు. అందుకే ఇలాంటివి చూసినప్పుడల్లా నా చిన్ననాటి  'ముగ్గురు మిత్రుల'  తోపాటూ, జరిగిన సంఘటనలూ నా కళ్ళలో మెదులుతాయి. అవెంటనే నన్ను  లాలించి పెంచిన అవీ , ఒకప్పటి సంస్కృతీ సాంప్రదాయాల్లాగే గతించిన జ్ఞాపకాలుగా మారాయన్న బాధ,   వాటి అంతానికి కారణమైన ఈ ఆధునిక నాగరికత విధానాలపైన ఏదో తెలియని 'కసీ' పెరిగిపోతాయి నాలో.
                   'నెల్లు' (వరి)కి నెలవైన 'నెల్లూరు'కు దగ్గర్లో   'పాళెం' గా పిలిచుకొనే మా వూరు పెద్ద టౌనూ కాదు. పక్కా పల్లెటూరూ కాదు.  సినిమా హాళ్ళు, లైబ్రరీ, పార్కుల తో సహా,'కనిగిరి చెరువు'లాంటి 'జలసిరి' తో  ఏ కాలంలోనైనా ఎన్ని రకాల పంటలై నా పండించగలది.'కంచి' తరువాత 'అతిపెద్ద రథం' కలిగిన కోదండ రామాలయం,దానిక్కాస్త దూరంలో ఉన్నపచ్చటి పొలాల గట్టు మీదే మేముండేది.  మా ఇంటి ప్రాంతం లో పల్లె వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపించేది. తూర్పు పడమరలుగా విశాలమైన వీధిలోవెంకటతాత వాళ్ళింటి వెనకాల ఉండేవాళ్ళం. వీధి అంచున 'గుంటగా ఉన్న పంటచేలే'  'గుంటకయ్య'. ఆ గుంటకయ్య గట్టే నా 'ముగ్గురు మిత్రుల' ఆవాసం. ఆ ముగ్గురెవరెవరంటే మా ఇంటి వెనుకగా వీధి మధ్యలో ఆకాశాన్నంటుతున్నట్టుండే తాటి చెట్టు. అది మగది.'సుండుగాయలు' తప్పు 'తాటికాయలు' కాసేది కాదు.ఏటా 'శ్రీరామనవమి'కి జరిపే 'తిరునాళ్ళు'  ప్రారంభ దినాన దేవాలయం ధ్వజస్తంభానికి 'పొడిగుడ్డ' (జెండా) కట్టడం ఆచారం. దాన్ని కట్టే ముందు ఊరంతా తిప్పుతూ వచ్చి తాటి చెట్టుకు సూత్రాలు చుట్టి పూజ చేసేవారు. అందుకే దాన్ని 'దేవుడి తాటి చెట్ట'ని పవిత్రంగా చూసేవాళ్ళం.వెంకట తాత వాళ్ళ ఇంటి పక్కనే శాఖోపశాఖలుగా విస్తరించి ఉండే అతిపెద్ద చింత చెట్టు.ఆ చింత చెట్టును ఆనుకొని ఉండే పొడవైన ఈత చెట్టు.వీ(రి)టితోనే నా 'సావాసం'.. చింత,ఈత చెట్లయితే  గాలి వీచినప్పుడల్లా ఒకదాన్నొకటిరాసుకుంటూ ఆప్త మిత్రుల్లా పరామర్శించుకుంటున్నట్టుండేవి. వేసవిలో ఈత చెట్టు పెద్ద పెద్ద గెలలతో ఎర్రగా నోరూరించే కాయలతో నిండుగా ఉండేది. తెల్లారిందే తడవుగా రాత్రి పండి కింద రాలిన ఈత పండ్ల కోసం పిల్లలందరం చెట్టు క్రింద కు చేరి ఒకరినొకరు తోసుకుంటూ ఏరుకునేవాళ్ళం. గెలలను మాత్రం కోసేవాళ్ళంకాదు.మరెవర్నీకోయనిచ్చే వాళ్ళం కాదు. చింత చెట్టు పంచాయతీ దైనా వెంకట తాత వాళ్లు తమ సొంత ఆస్తిగానే భావించి కాపాడేవారు. నా ఈడు వాళ్ళంతా చెట్టు కింద చేరి గోళీకాయలో, బిళ్ళాకోడో అడుతుండడం, అప్పుడప్పుడు దొంగచాటుగా చింత చెట్టెక్కి చింతకాయలు కోయడం కూడా కద్దు. మా గోల భరించలేక తాత భార్య అచ్చవ్వ "నా భడవల్లారా పోండిరా అవతలకి.  పొద్దస్తమానం చెట్టు కింద చేరి ఒకటే గోల" అంటూ తిట్టుకోని రోజంటూలేదు. కానీ ప్రతి సీజన్లో అచ్చవ్వ అనుమతితో ఊర్లోని చిన్నా పెద్దా, ఆడా మగా తేడా లేకుండా అందరూ కొమ్మ కొకరు చేరి చింత చిగురు, చింతకాయలు కోసుకునేవాళ్ళం. రెండు చెట్లు ఆ రకంగా అందరికీ ఉపయోగపడేవి..అప్పట్లో 'దీపావళి'కి 'కాకరపువ్వొత్తులు' 'కొనలేని వాళ్ళమంతా కొనేవాళ్ళమేకాదు.' తాటిచెట్టునుంచి రాలే 'సుండుగాయలు','చింత బొబ్బర'(చింత బెరడు),'వేప బొబ్బర'లను తెచ్చి, కాల్చి పొడిచేసే వాళ్ళం.దాన్ని పేడ పూసి ఎండబెట్టిన గుడ్డలో మూటగట్టి మూడుగా చీల్చిన తాటిబద్ద మధ్యలో పెట్టిపైనతాడుతో కట్టేవాళ్ళం. మూడుదబ్బల సందులోంచి మూట పైన 'నిప్పుగల్లు' వేసి ఊది, ఊది కాలాక తాడుతో పోటీలుపడి గిరగిరా తిప్పుతుంటే ఎన్నెన్ని పూలు రాలేవో..! అచ్చవ్వ నాకు 'చింతకాయ పచ్చడి' రుచి చూపిస్తే వెంకట తాత 'కధల కమ్మదనం' రుచి చూపాడు. ఇద్దరికీ నేనన్నా, చెట్లన్నా  ప్రాణం.వాళ్ళు పెంచిన ప్రతి చెట్టు నా చేతుల మీదుగా నాటించిందే. తాత ఖాళీగా ఉన్నప్పుడల్లా 'చందమామ' 'బొమ్మరిల్లు' వంటివి తెచ్చి చింత చెట్టు కింద పడక్కుర్చీలో కూర్చుని 'నస్యం' పీలుస్తూ నా చేత కథలు చదివించుకునే వాడు. తాతకు పదో తరగతి చదివే కూతురు ఉండేది. ఆమె 'కన్నకూతురు కాదని 'దత్తత' తెచ్చుకున్నార'ని అనుకుంటూ ఉండేవారు. ఎందుకో గాని ఐదో తరగతి చదివే నా చేతనే కథలు చదివించుకునేం దుకు ఇష్టపడేవాడు. అప్పట్లో ఏ ఇంటికి కూడా ఇప్పటిలా 'సంకుచిత ప్రహరీ గోడలు' లేవు. ఇంటి 'వసారా'ల్లో కూర్చుని వచ్చేపోయే వాళ్లతో చేసే పలకరింపులు,బావామరదళ్ళ పరాచికాలు,ఎకసక్కేలాడటాలు ఎంతో'సరదా'అన్పించేవి. 'లేనితనం దగ్గరితనానికి దారితీస్తుందికదా!'ఫ్యాన్లు లేని ఆ కాలంలో వేసవి వచ్చిందంటే అందరి 'మకాం' చింత చెట్టు కిందే. నేనైతేచెట్టు కిందచేరి,  అమ్మలక్కలంతా గుంటకయ్యలో నారు వేస్తూ చింత చెట్టు పైన చేరే కోయిలమ్మ కమనీయ గానంతో పోటీ పడేలా 'కోరస్' గా పాడే పాటలు   వింటూ మైమరచి పోయేవాడిని. 'గోధూళి వేళ గూటికి చేరే పక్షుల కిలకిలా రావాలు, సాయంత్రపు చంద్రోదయ సమయాన ఎద్దుల మెడలో గజ్జెలు లయ బద్ధంగా లాస్యం చేస్తుండగా గుంటకయ్య మీదుగా  కుప్పలు నూర్చిన ధాన్యాన్ని వెన్నెల్లోఎడ్ల బండ్లతో తరలించేమనోహర దృశ్యాలు' నాకు మరువలేని మధుర స్మృతులే. ఆ రోజుల్లో రిజి స్ట్రార్ ఆఫీసులో పని చేసే వెంకట తాత మాట అంటే అందరికీ వేదం. అలాంటి వెంకట తాత కుటుంబాన్ని విధి 'జెముడు కాకి' రూపంలో వచ్చి చిన్నాభిన్నం చేసింది. ఓ రోజు చింత చెట్టు మీదున్న జెముడు కాకిని   గ్రద్దోకటి తరమడం తో అది దిక్కుతోచక తాత వాళ్ళింట్లో దూరింది. జెముడు కాకి ఇంట్లో దూరడం 'అరిష్టం'గా భావించి ఆ దోషం పోయేందుకు ఆరు నెలల పాటు ఇంటిని వాడకుండా పాడు బెట్టడం ఆచారం. అంతకు ముందోసారి మా ఇంట్లో కూడా దూరితే మేము ఇల్లు మార్చినప్పుడు మూఢ నమ్మకాలు లేని వెంకటతాత నాన్నను మందలించడం నాకుబాగా గుర్తే. అందుకే ఎవరడిగినా ఓ నవ్వు నవ్వేసి "అవన్నీఒట్టి మూఢ నమ్మకాల్లేరా!. ఇల్లు పాడుబేట్టే ప్రసక్తే లేదు. ఆ జెముడుకాకి దొరికినట్టే దొరికి చేజారి పోయిందిరా.. దొరికుంటే ఫ్రై చేసుకుని తినే వాడిని. జెముడు కాకిది పసందైనరుచి కదట్రా" అంటూ తెగ బాధపడిపోయేవాడు. నా మనసెందుకో కీడు శంకించింది. కానీ 'తాతకు దగ్గులు' నేర్పగల వాడిని కాదు కదా! మరికొద్ది రోజుల్లోనే మూఢనమ్మకాలే  నిజమనిపించేలా ప్రారంభమయ్యేయి వెంకట తాత కు కష్టాలు. కొడుకుల్లేరని 'ఇల్లరికం' తెచ్చుకున్న అల్లుడు పనీ పాటా లేకుండా జులాయిలా తిరుగుతూ తాగుడుకు బానిసైడబ్బులకోసం భార్యను హింసించడం ప్రారంభించాడు. వ్యసనాలను సహించలేని తాత పట్టుబట్టి పంతం తో పోలీసుల దాకా వెళ్లి విడాకులు ఇప్పించి కానీ వదల్లేదు. కన్నకూతురు కాకపోయినా పెంచిన మమకారంతో తాము పోతే ఆమె పరిస్థితి ఏమిటనే దిగులుతో 'పక్షవాతం' వచ్చి మంచాన పడ్డాడు. దాంతో తాత కూతురికీ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇక తాత లేవలేడు. అన్నీ ఆమే చూసుకోవాలి. 'యువరాణి'లా పెరిగినామే అచ్చవ్వ కూడాముసలిది కావడంతో విధిలేక వీధిన పడాల్సి వచ్చింది. అతి గారాబంతో బయటి ప్రపంచం తెలియకుండా పెరిగినవాళ్లు ఒక్కసారిగా బయటకు రావాల్సి వస్తే 'ఒడ్డున పడ్డ చేప'లా ఎలా గిల గిల్లాడతారో  ఆమెను చూశాక తెలిసిందినాకు. నాకైతే ఏడుపొస్తుంది తాతను చూసినప్పుడల్లా. తాత మునుపటిలా బజారుకెళ్లి కథల పుస్తకాలు తేలేడు. చింత చెట్టు నీడన కూర్చుని కథలు చదివించుకో లేడు. అదే నన్ను బాధిస్తోంది. దగ్గరికెళితే 'ఆర్తి'గా, ప్రేమగా, బాధగా చూడటం తప్ప మాటల్లేవు. ఆచూపుల్లో ఎన్నెన్నిభావాలో, 'తనకిష్టమైన ఏ కథను చదివి విన్పించమంటున్నాడో ' నాకేమీ అర్ధం అయ్యేది కాదు. అలా చూపులతోనే 'చివరి వీడ్కోలు' చెప్పి వెళ్ళిపోయాడు. అంతిమకార్యక్రమాలన్నీ తనకి ష్టమైన చింత చెట్టు నీడనే ముగించుకుని బయలుదేరి పోయాడు. మరికొద్ది రోజుల్లోనే అచ్చవ్వ కూడ తాత దగ్గరికెళ్లి పోయింది.
                       కాలం ఎవరికోసమూ ఆగదు కదా! కాలంతో పాటే ఎన్నెన్నో మార్పులు. ఒకప్పుడు 'మంచివి కాద'నుకున్నవి కూడా కాలం మారి 'కామన్' గా మారిపోతున్నాయి. అందరిలోనూ వారి అవసరాలకు అనుగుణంగా 'సర్దుకుపోయే గుణం' పెరిగిపోతోంది. అప్పటికే 'రెండో పెళ్లి తో సెటిల్' అయివున్న తాత అల్లుడు మొదటి భార్య వద్దకు తిరిగి రాకపోకలు ప్రారంభించాడు. ఎక్కడి నుంచి వచ్చారో కానీ 'కల్లు' తీసే వాళ్ళోచ్చారు. ఈత చెట్టు తో సహా ఊర్లోని చెట్లన్నిటిని 'కాంట్రాక్ట్' కు తీసుకుని  కల్లు తీసి వాటి కిందే అమ్మడం ప్రారంభించారు. ఏకంగాఇంటి దగ్గరే దొరుకుతూ 'సౌకర్యవంతం'గా ఉండటం తో తాగే వాళ్ళూ ఎక్కువయ్యారు. పేదల 'వృద్ధి'లో భాగంగా(?) గుంటకయ్య ను ఇళ్ల స్థలాలుగా గా మార్చి ఇవ్వాలని నిర్ణయించేరు. పంటలు ఆపి 'ప్లాట్లు' వేసేశారు. కానీ స్థలం చాలకపోవడంతో వీధిలో కొంతభాగాన్నీ ప్లాట్లలో కలపాల్సి వచ్చింది. దాంతో చింత చెట్టు ఈత చెట్టు కూడా ప్లాట్ల లో చేరాయి. వాటిని ఏం చేయాలనే ప్రశ్న తలెత్తింది. తర్జనభర్జనలు పడ్డ మీదట  వాటిని ఉంచడమా కొట్టివేయడమా అనేది ' పైరవీ' చేసి స్థలాన్ని దక్కించుకున్న తాత ఇంటి ముందున్న చెన్నమామ చెన్నత్త లకు వదిలేశారు. కానీ ఎవరూ చెట్ల గురించి 'సీరియస్' గా తీసుకోలేదు. పచ్చని పంట పొలాలను ఇళ్ల స్థలాల కోసం నాశనం చేస్తున్నారనే బాధ, నాకిష్టమైన చెట్లు కొట్టేస్తారేమోననే దిగులు పట్టుకున్నాయి నాకు.అదే వెంకట తాత ఉంటే ఆ స్థలం వారికే వచ్చేది. అన్నీ నిలిచేవి. కానీ అప్పటికే తాత అల్లుడు కూడా తాగుడు వల్ల 'లివర్' పాడై చనిపోవడంతో ఉన్న ఒక్క 'ఆసరా' కూడా పోయి తాత కూతురు దిక్కులేనిదయింది.  ఏ పనీ చేత కాక ఇల్లు అమ్మేసి ఊరు వదిలి 'సవతి' పంచన చేరి బ్రతుకుతోంది.చివరి ప్రయత్నంగా చెన్నమామ వాళ్ళింటికెళ్లాను. "మావా! చానా కాలం నించి చింత చెట్టు మనకుపయోగ పడ్తాఉంది గదా! దానివల్ల మీకు లాభమే గాని నష్టమేం లేదుగదా! దాన్నట్టే ఉండిచ్చి వాడుకోవచ్చు గదా! ఉత్తి పుణ్యానికి అంత పెద్ద చెట్టును కొట్టెయ్యడం ఎందుకు.?" అన్నాను. వెంటనే చెన్నత్త కల్పించుకొని "దాన్నట్లా ఉండీడం కుదర్థు లేరా ఆల్లుడా.. మాకు ఎద్దులు కట్టేసుకోను 'కొట్టం' గావాల. చెట్ను కొట్టేసి కొట్టాం గడతాం. అసలా చెట్టుంటే ఊరోళ్ళందరికి దానికిందే పని మేం దట్టుకోలేంలే.." అంటూ కాసేపాగి చింత మొద్దులాంటి తన శరీరాన్ని కదల్చలేక ఆయాసపడుతూ,  "పంచాయితీ చెట్టు మా స్థలంలో ఉంటం ఎప్పుటికైనా ఇబ్బందే లేరా అల్లుడా.. అయినా దాన్నుండిస్తే నీకొరిగేదేవుంది రా.."అంది తేలిగ్గా. నేనేం చెప్పగలను? అది నా నేస్తమని చెప్పనా? అది మనందరి 'ప్రాణాలకు ఆయువుపట్ట'ని చెప్పనా? ఏమని చెప్తే అర్థమవుతుంది వాళ్ళకు. సరిగ్గా ఆ సమయంలోనే దాని 'అంతం నేను చూడకూడద'న్నట్టుగా నాకుఅడవుల జిల్లా ఆదిలాబాద్ లో 'జాబ్' రావడంతో ఊరొదలక తప్పలేదు.
                     కాలం కరిగిపోతోంది.'ఆంధ్రా బోర్డర్' కు ట్రాన్స్ఫర్ చేయించుకుని ఊరెళ్ళాను.ఊరంతా 'ఊసరవెల్లి'లా రూపు మార్చేసుకొంటోంది. ఏకైక మగ సంతానమని  అష్టకష్టాలు పడి నన్నింత వాణ్ణి చేశారు. అభివృద్ధి తెచ్చిన ఆధునిక సౌకర్యాలన్నీ  సమకూర్చుకున్నాను. కానీ అవేవీ నా తల్లిదండ్రులను సుఖ పెట్టలేవు. పైగా కష్ట పెట్టొచ్చు కూడా. ప్రపంచం మొత్తం   కుదించుకు పోయి 'కుగ్రామం'గా మారినట్లే మనుషులూ, మనసులూ కుంచించుకుపోయి మంచికి,మానవత్వానికి  చోటు లేకుండా పోయింది. 'కొలీగ్' వే కాని :ఫ్రెండు'వెలా అవుతావని  ప్రశ్నించే, మనసుకు చోటివ్వని 'నాగరిక' ఉద్యోగబృందం మధ్య, 'నా గాలి పీల్చి  ఆరోగ్యవంతుడివెలా అవుతావ'నే కాలుష్యపు వాతావరణం మధ్య సర్దుకుపోవలసి వస్తోంది.అందుకే వాళ్ళున్న ఊరు వదిలి రాలేరు.నేను వారున్న చోటుకువెళ్లే వీలులేదు. మనిషికి కావల్సింది సౌకర్యవంతమైన జీవితమేకాదు. సంతోషకరమైన జీవనం కూడా.కానీ అవి లేకుండానే 'అభివృద్ధి' జరిగిపోతోంది.ఊర్లో అడుగుపెట్టిన నాకు గుండె కలుక్కుమంది. అభివృద్ది వల్ల 'ఆదాయాలు పెరగడంతో 'అవసరాలు'తగ్గిపోయాయి.దాంతో బయటి వాళ్ల తో సంబంధాలు తెంచేస్తూ 'అడ్డుగోడల్లా'ఇళ్లకు 'ప్రహరీలు' లేచాయి. 'గుంటపూడ్చిన కయ్య ఇంటి వాసాలకింద ఇంకి పోయింది.' డబ్బు యావ'లో పడి పాడి పంటలు వదిలేయడం వల్ల 'రొయ్యల గుంటలు' పెరిగి నీటికీ కొరతోచ్చింది. ఊళ్ళోకి 'టౌన్ బస్సు'లేశారు. పిల్లల చేతుల్లో 'గోళీ కాయలు', 'బిళ్లాకోడు' పోయి  'బ్యాటు' 'బంతి' వచ్చేయి. ఉమ్మడి కుటుంబాల్లో కొడుకులు 'కొత్తొక వింత పాతొక రోత' అన్నట్టు అవసరం ఉన్నా లేకున్నా పాత ఇళ్లను పాడుబెట్టి 'కొత్త పెళ్లాలతో కొత్త చోట కొత్త కాపురాలు' పెట్టడంతో పాతిళ్ళలోని పెద్దలు దిక్కులేని వారయ్యారు.ఊర్లోని చెట్లన్నీ ఒక్కొక్కటిగా అంతరించిపోయినట్లే పెద్దలు కూడా ఒక్కోక్కరే గతించి పోతున్నారు. చింత చెట్టుపోయి దాని స్థానే 'కొట్టాం' వెలిసింది. 'నల్లటి కళ్లద్దాల' తో కొట్టాం ముందు కూర్చుని శూన్యం లోకి చూస్తున్నాడు చెన్నమామ." చేసిన పాపం,చెట్లు బెట్టిన శాపం'"  ఊరికినే పోదనేదందుకే.. ఎందరం జెప్పినా ఇంటేగా..? గొడ్డళ్లతో నరికించి రంపాల్తో ముక్కలుగా కొయ్యించి మరీ ఏలం ఏయించిందా పంచాయతోళ్లచేత.చింత చెట్టు బోయాక, దాని పాపం దగిలి చెన్నత్తా దాన్లగే పోయింది. అదిగో ఆ ఈత చెట్టొకటే నిలబడ్డది గానీ ఏం లాభం? కల్లు కోసం దాన్నీ 'పీల్చిపిప్పిజేసి' ఒదిలేసిన్రు. అదీ రేపోమాపో రాలిపోయ్యే టట్టుంది." అమ్మ మాటలతో  అప్రయత్నంగా ఈత చెట్టు వంక చూసాను. తనకు తోడున్న చింతచెట్టు పోయాక దిక్కులేని దానిలా కాపు లేకుండా ఎండిపోయి 'జీవచ్ఛవం'లా ఉందది. పురుగుల్లా దాని 'రసం' పీల్చేశాక ఇంకా 'జీవం' ఎలా ఉంటుంది? 'కల్లు' గీసిన చోట్లల్లా  దానికి 'కనుగుడ్లు పీకేశాక రక్తం చారికలు కట్టి ఎండిపోయిన కనుగుంట్లలా' రంధ్రాలు ఏర్పడి ఉన్నాయి.అవి పడ్డ చోట 'భోగి పండుగ నాడు ఉస్మాన్ సాయిబు చేత 'బిస్మిల్లా' చేయించిన కోడి మెడ'లా సగం తెగివాలిపోయి, ఏ క్షణమైనా విరిగిపడిపోయేలా ఉందది. దాని  'కుత్తుకను ఛిద్రం చేసి అది బాధతో మూగగా రోదిస్తుంటే కల్లు రూపంలో కారిన దాని కన్నీటిని' దాని కళ్ళ ముందే తాగిన దృశ్యాలు నా కళ్ళలో మెదిలాయి. నే వెళ్లాక జరిగిన విషయాలు అమ్మచెప్తుంటే నాకు నమ్మబుద్ది కాలేదు. "చెన్నత్త చిన్న కోడలు 'పెద్దాసుసుపత్రి' లో  పిల్లోణ్ణి కనింది. మనవణ్ణి చూట్టానికి పోతా పోతా అక్క డిగ్గావల్చిన సామానుల్ని' అన్నం క్యారేజిల్ని రొండు సంచిల్లో ఏసుకోని చెరో చెత్తో బట్టుకుని టవున్ బస్సు డోరుముందర సీట్లో కూకుంది చెన్నత్త. దార్లో బసుకడ్డంగా 'బర్రోచ్చేసరికి డ్రైవొరు 'సడన్ బ్రేకే సేసిండు. చేతుల్లో సంచిలున్న చెన్నత్త ఆసరాలేక పోవడంతో నిలదొక్కోలేక బొక్క బోర్లా పడిపోయింది.అసలే చింత మాను వళ్లాయే  ఎంత లాగినా రాక పోయ్యేసరికి అట్నే ఉంచి బస్సు నెల్లూరు కి తీసుకోబోయిడోరు రేకులు కోయ్యించి తీసి ఆసుపత్రి  లో ఏసేసరికే ఒళ్లంతా నుజ్జు నుజ్జయిపోయి లాభం లేదు పొమ్మన్నరు."అంతతో ఆగినాదా! ఆ చింతుసురా..?!" అని కాసేపు ఆగి తిరిగి చెప్పడం ప్రారంభించింది "అట్లా మంచానబడి  ఎంత కాలం ఉండేదో ఏమో గాని వాడెవడో 'కోయోడొ'కడొచ్చి 'నేను బాగ జేస్తాన'ని జెప్పిఏవేవో 'పసుర్లు' ఒంటికి బూసి ఇష్టం వచ్చినట్టు తోమి దొరికినంత దోసుకుపోయిండు. ఇంకేవుంది వాడితోముడికి ఒళ్లంతా గుల్లయి తెల్లారేసరికి సచ్చోరుకుంది. పెళ్ళాం బోయిన దిగులుతో  ఏడ్చి ఏడ్చి చెన్న మామ కంట్లో 'సుక్లాలో చ్చి ఆపరేసన్' చేయాల్సి వచ్చింది. అప్పుట్నుంచి నల్లద్దాలతో అత్తాగే కొట్టాం ముందు కూకోని సూన్యంలోకి చూడ్డమే గాని మంచి సెబ్బర ఎం లే." చింత చెట్టును పట్టు పట్టి కొట్టించిన పాపం చెన్నత్తకు చుట్టుకుందన్నమాట.గొడ్డళ్లతో నరికినపుడు చింత చెట్టుఎలాకూలిందో అలా కూలింది. కానీ  భారీకాయంకావడంతో బయటపడే వీలులేక 'డోర్' లోనే ఇరుక్కుని నెల్లూరుకెళ్ళేదాకాపగ వాళ్లకు కూడా వద్దనేంత నరకం అనుభవించింది. రంపాలతోచెట్టు నెలా ముక్కలుగా కోశారో కోయ వాడు అమెనలాగేతోమేశాడు. చెన్నత్త కు కచ్చితంగా చెట్టు పడ్డ బాధ తెలిసి ఉంటుంది. అంతేకాదు చింతచెట్టు పోయాక కల్లు తీసిన తొర్రలతో ఈత చెట్టు ఎలా మిగిలి ఉందో అలాగే కళ్లుపోయి నల్లద్దాలతో చెన్నమామ ఉన్నాడు.' చివరకు  ఎన్నో భయంకర తుఫాన్ల తాకిడికి తట్టుకుని నిలబడ్డ దేవుడి తాటిచెట్టు కూడా ఇప్పుడు వీస్తున్న కొత్తగాలుల కు తట్టుకోలేక నేలకూలింది. కానీ మనుషుల కన్నా మాకే మానవత్వం ఉందనిపించేలా 'దేవుడి చెట్టే' అనిపించేలా ఎడమవైపున్న ఇళ్ళపై పడకుండా కుడివైపుకు కూలిపోయింది. మనుషుల్లా మేము వాతావరణానికి తగినట్టు మారలేమంటూ ఈత చెట్టూ నేలకొరిగింది. చెన్నమామా దాంతోపాటే వెళ్ళిపోయాడు. ఇవన్నీ జరిగి ఎంతో కాలమైనా పాత చింతకాయ పచ్చడి' లాంటి ఆలోచనల 'రుచి' మరిగిన నాకు ఇవన్నీ మింగుడు పడటం లేదు.'చింత చచ్చినా పులుపు చావ లేద'న్నట్లు నా 'చింత' మాత్రం తీరడం లేదు
***

No comments:

Post a Comment

Pages