ప్రత్యక్ష దైవం - అచ్చంగా తెలుగు
ప్రత్యక్ష దైవం
శ్రీరామభట్ల ఆదిత్య 

మనకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. ఆయన సంవత్సరంలోని చైత్ర మాసం నుండి ఫాల్గుణ మాసం వరకు పన్నెండు నెలల్లో పన్నెండు స్వరూపాలు ధరిస్తాడు.సూర్య నారాయణమూర్తి పన్నెండు నెలలలో ఏ నెలలో, ఏ పేరుతో, ఎలా సంచరిస్తాడో చూద్దాం. చైత్రం నుంచి పన్నెండు మాసాలలోనూ సౌరగణాలు ఏడు (ఆదిత్యుడు, ఆరుగురు పరిచారకులు) భగవంతుని నిర్ణయం ప్రకారం ఎన్నోవిధాలుగా సంచరిస్తూ ఉంటాయి. ఈ విషయాలను శుకుడు విష్ణురాతుడికి(పరీక్షిత్తు) తెలియచేయగా, మనకు ఈ విషయం పోతనామాత్యుడు రాసిన తెలుగు భాగవతంలోని పన్నెండవ స్కంధంలో కనిపిస్తుంది.
శ్రీమన్నారాయణ స్వరూపుడైన సూర్యుడు ఒకడే. అయినా మహర్షులు కాల, దేశ, క్రియా బేధాలను బట్టి అనేక విధాలుగా వర్ణిస్తారు. 
1) చైత్రమాసంలో సూర్యుడు ధాత అని పేరు ధరిస్తాడు. అతనికి కృతస్థలి, హేతి, వాసుకి, రథకృత్తు, పులస్య్తుడు, తుంబురుడు అనేవారు పరిజనులుగా చేరి సంచరిస్తుంటారు. 
2) వైశాఖమాసంలో సూర్యుడు అర్యముడు అనే పేరు ధరిస్తాడు. పులహుడు,ఓజుడు, ప్రహేతి,పుంజికస్థలి,నారదుడు,కంజనీరుడు అనే వారు అనుచరులుగా చేరి సంచరిస్తుంటారు. 
3) జ్యేష్ఠమాసంలో సూర్యుడు మిత్రుడు అనేపేరు ధరిస్తాడు. అత్రి, పౌరుషేయుడు, తక్షకుడు, మేనక, హాహా, రథస్వనుడు అనే వారు పరిచరులగా చేరి సంచరిస్తుంటారు. 
4) ఆషాడమాసంలో సూర్యుడు వరుణుడు అనే పేరు పొందుతాడు. వశిష్టుడు, రంభ, సహజన్యుడు, హుహువు, శుక్రుడు, చిత్రస్వనుడు అనే వారు పరివారంగా చేరి సంచరిస్తుంటారు. 
5) శ్రావణమాసంలో సూర్యుడు ఇంద్రుడు అనే పేరు స్వీకరిస్తాడు. అతనికి విశ్వావసువు, శ్రోత, ఏలాపుత్రుడు, అంగిరసుడు, ప్రమ్లోచ, చర్యుడు అనే వారు సహచరులుగా చేరి సంచరిస్తుంటారు. 
6) భాద్రపదమాసంలో సూర్యుడు వివస్వంతుడు అనే పేరుతో విరాజిల్లుతాడు. అతనికి ఉగ్రసేనుడు, వ్యాఘ్రుడు, ఆసారణుడు, భృగువు, అనుమ్లోచ, శంఖపాలుడు అనే వారు పరివారంగా చేరి సంచరిస్తుంటారు.
7) ఆశ్వయుజమాసంలో సూర్యుడు త్వష్ట్ర అనే పేరుతో సంచరిస్తూంటాడు. అతనికి ఋచీకుని కొడుకు జమదగ్ని, కంబళాశ్వుడు, తిలోత్తమ, బ్రహ్మోపేతుడు, శతజిత్తు, దృతరాష్ట్రుడు, ఇషంభరుడు అనే వారు పరివారంగా చేరి సంచరిస్తుంటారు. 
8) కార్తీకమాసంలో సూర్యుడు విష్ణువు అనే పేరుతో వ్యవహరిస్తాడు. అతనికి అశ్వతరుడు, రంభ, సూర్యవర్చసుడు, సత్యజిత్తు, విశ్వామిత్రుడు, మఘాపేతుడు అనే వారు పరివారంగా చేరి సంచరిస్తుంటారు. 
9) మార్గశీర్షమాసంలో సూర్యుడు అర్యముడు అనే పేరుతో విలసిల్లుతాడు. అతనికి కశ్యపుడు, తార్క్ష్యు డు, ఋతసేనుడు, ఊర్వశి, విద్యుచ్ఛత్రుడు, మహాశంఖుడు అనే వారు అనుచరులు కాగా చేరి సంచరిస్తుంటారు. 
10) పుష్యమాసంలో సూర్యుడు భగుడనే పేరు ధరిస్తాడు. అతనికి స్ఫూర్జుడు, అరిష్టనేమి, ఊర్ణుడు, ఆయువు, కర్కోటకుడు, పూర్వచిత్తి అనే వారు అనుచరులు కాగా చేరి సంచరిస్తుంటారు. 
11) మాఘమాసంలో సూర్యుడు పూషుడు అనే పేరుతో వ్యవహరింపబడతాడు. అతనికి ధనంజయుడు, వాతుడు, సుషేణుడు, సురుచి, ఘృతాచి, గౌతముడు అనే వారు అనుచరులు కాగా చేరి సంచరిస్తుంటారు.
12) ఫాల్గుణమాసంలో సూర్యుడు క్రతువు అనే పేరుతో విరాజిల్లుతాడు.అతనికి వర్చసుడు, భరద్వాజుడు, పర్జన్యుడు, సేనజిత్తు, విశ్వుడు, ఐరావతుడు, అనేవారు పరిచరులుగా చేరి సంచరిస్తుంటారు. 

( తెలుగు భాగవతం నుండి గ్రహించబడినది )

No comments:

Post a Comment

Pages