అటక మీది మర్మం - 16 - అచ్చంగా తెలుగు

అటక మీది మర్మం - 16

Share This
అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల- 16
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)


(తన మనుమరాలి పోషణకు కావలసిన ధనం కోసం కుమారుడి సాహిత్యాన్ని అమ్మాలనుకున్న మార్చ్ అన్న మిలిటరీ వానికి సాయం చేయటానికి న్యాయవాది కూతురైన నాన్సీ ఒప్పుకొని తన స్నేహితురాళ్ళతో ప్లెజెంట్ హెడ్జెస్ కి వెళ్ళి ఆ భవంతి మొత్తం గాలిస్తుంది. ఆమెకు మాయమైన ఫిప్ సాహిత్యం కనబడదు గానీ తక్షణ సాయంగా అటకమీద ఒక పాత బల్ల, మంచి చిత్రాలు గీసి ఉన్న అరడజను అట్టపెట్టెలు కనిపిస్తాయి. వాటిని పురాతన వస్తువుల దుకాణంలో అమ్మగా కొంత సొమ్ము వస్తుంది. అదేసమయంలో మార్చ్ స్నేహితురాలు యింట్లో ఉన్న మిలిటరీ వాని మనుమరాలు తట్టురోగంతో యింటికి వచ్చేస్తుంది. అందువల్ల ఆ పాపకు సంరక్షకురాలిగా ఎఫీ అన్న అమ్మాయిని తెచ్చి పెడుతుంది నాన్సీ. ఎఫీ భయస్తురాలు. ఒకరోజు ముందురోజు అర్ధరాత్రి ఒక ఆగంతకుడు ఆ ప్రాంగణంలో తచ్చాడాడని ఎఫీ చెబుతుంది. 'దొంగిలించటానికి ఆ పాత భవనంలో ఏమున్నాయని ' ఎఫీని సంతృప్తిపరచినా, అనుమానంతో ఆ ప్రాంగణంలో అన్వేషించిన నాన్సీకి అడుగుజాడలు కనిపించి బిత్తరపోయింది. తరువాత అటకమీద అన్వేషించిన ఆమెకు పాతభోషాణం పెట్టెలో అమ్మకానికి పనికొచ్చే డజను పాతచిత్రాలు కనిపించాయి. వాటిని మార్చ్ అనుమతితో ఫేబర్ దుకాణంలో అమ్మి, భయపడుతున్న ఎఫీకి తోడుకోసం ఆ రాత్రి ప్లెజెంట్ హెడ్జెస్ కి తిరిగి వస్తుంది. ఆ రాత్రి అటకమీద బట్టలబీరువాలో నాన్సీకి అస్తిపంజరం కనిపిస్తుంది. . మరునాడు ఉదయం తన యింటికి వచ్చిన ఆమెకు తండ్రి మరొక కొత్త కేసు గురించి చెబుతాడు. తండ్రి కోరిక మేరకు ఆమె డయానె ద్వారా డైట్ కంపెనీలోకి దూరి బుషీట్రాట్ అన్న వ్యక్తి అక్కడ పని చేస్తున్నట్లు కనుక్కొంటుంది. ఆ విషయాన్ని తండ్రికి తెలిపి, తిరిగి మార్చ్ కేసువైపు దృష్టిని మళ్ళిస్తుంది. రేడియోలో వచ్చిన గాలిపాట స్వరపరిచినది తన కుమారుడేనని మార్చ్ ఆవేశపడతాడు. వీళ్ళ యీ సంభాషణ జరుగుతుండగా, పక్కబట్టల కోసం అటక మీద పాత బీరువాలో వెతుకుతున్న ఎఫీని బ్లాక్ విడో సాలీడు కరిచిందని గమనించి డాక్టరు వద్దకెళ్ళి చికిత్స చేయిస్తుంది. జబ్బుపడ్డ ఎఫీ కోలుకొనేవరకు నాన్సీ మార్చ్ భవంతిలోనే ఉండిపోతుంది. ఆ రోజే గాలిపాట ముద్రణాధికారికి బెన్ బాంక్స్ చిరునామా కోరుతూ ఉత్తరం వ్రాస్తుంది. భోజనాల సమయంలోమార్చ్ తన కుటుంబవిషయాలను నాన్సీకి చెబుతాడు. ఆ రాత్రి అటకమీద వెతుకుతుంటే అనుకోకుండా ఆమె టార్చీలైట్ ఆరిపోవటం, అదే సమయంలో ఎక్కడినుంచో కొన్ని విపరీత శబ్దాలు వినిపించటం జరుగుతుంది. ఎఫీ కోలుకొన్నాక యింటికొచ్చిన యువ గూఢచారి, తన తండ్రితో కలిసి బుకర్ ఫాక్టరీకి వెళ్ళి పట్టుకండువాలు చేసే విధానాన్ని గమనిస్తుంది. తరువాత తండ్రికోరికపై ఒక ప్రణాళిక ప్రకారం డయానె యింటికి వెళ్ళి, తనకు తెలిసిన ఒక పాపకు డయానె చెల్లెలుకి బిగువైన బట్టలను యిమ్మని అడుగుతుంది. ఆమె లోనికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలోని వారి హాబీలేమిటో గమనిస్తుంది. డయానె యిచ్చిన పాత బట్టలతో ప్లెజెంట్ హెడ్జెస్ కి చేరిన నాన్సీ, మార్చ్ అనుమతితో అటక మీద ఉన్న కొన్ని పాత సీసాలతో డైట్ ఫాక్టరీలోకి అడుగు పెడుతుంది. అక్కడ సీసాలను డైట్ కి చూపెడుతున్న ఆమెకు బుషీట్రాట్ కనిపిస్తాడు.వెంటనే బుషీట్రాట్ ను అనుసరిస్తూ ప్రయోగశాల్లోకి ప్రవేశించిన నాన్సీ అక్కడ గాజుకుప్పెల్లో ఉన్న రసాయనిక ద్రవాన్ని చిన్న సీసాలో నింపుతుంది. ట్రాట్ తాళాలేసి వెళ్ళిపోవటం వల్ల లోపల యిరుక్కుపోయిన ఆమె అక్కడ నుంచి అతి కష్టంపై తప్పించుకొని తన యింటికి చేరుకొంటుంది. తనకోసం కంగారుపడుతున్న తండ్రికి తానెక్కడికెళ్ళిందీ చెప్పి, ప్రయోగశాలనుంచి సేకరించిన ద్రావకాల సీసాలను తండ్రికిస్తుంది. తాను ఎఫీకి తిరిగి వస్తానన్న మాటిచ్చినందున, ప్లెజెంట్ హెడ్జెస్ దగ్గ్రర తనను దింపమని తండ్రిని కోరుతుంది. ఇక యిక్కడ నాంసీ రాలేదని కంగారుపడుతున్న ఎఫీకి పొదలమాటునుంచి ఆ యింటివైపు వస్తున్న అగంతకుణ్ణి గమనించి భయపడుతుంది. మార్చ్ ఆమెకు ధైర్యం చెప్పినా, అగంతకుడి అడుగుల చప్పుడు తాను కూడా విన్నందున పరీ్క్సించటానికి అటకమీదకు వెడతాడు. కానీ అతనికి ఎవరూ కనిపించరు. ఆ రాత్రి తండ్రితో వచ్చిన నాన్సీకి విషయం చెబుతాడతను. మరునాడు యింటికి వచ్చిన యువ గూఢచారిని ఆమె స్నేహితురాళ్ళు విందుకు ఆహ్వానిస్తారు. వారితో బయల్దేరుతున్న ఆమె తన చిరునామాకి వచ్చిన ఒక కవరు చూసి దాన్ని చింపుతుంది. ఆ ఉత్తరంలో ఆమె కోరినట్లుగా బెన్ బాంక్స్ సమాచారం యివ్వలేమని ఉంటుంది. ఆమె తిరిగి తాను ముద్రణాధికారిని కలవటానికి వస్తున్నట్లుగా మరొక ఉత్తరం వ్రాసి, తన స్నేహితురాళ్ళతో మార్చ్ యింటికి వెడుతుంది. ఆ రాత్రి ఎఫీని తన యింటికెళ్ళమని చెప్పి పంపిస్తుంది. రాత్రి భోజనాలయ్యాక పాపకు కధ చెప్పబోతున్న యువ గూఢచారికి తోటలో ఏదో కనిపించి కిటికీ దగ్గరకు పరుగనన వెడుతుంది. ఆ తరువాత కధ ఏమిటంటే. . . )
@@@@@@@@@@@@

మంచం మీదనుంచి దూకి పరుగున కిటికీ దగ్గరకు వెళ్ళింది

రాత్రి తొమ్మిది గంటలు దాటింది. దట్టమైన చీకటి తోటంతా పరుచుకొంది. వంటింటి కిటికీలనుంచి మిణుకుతూ పడుతున్న చిన్న దీపాల వెలుతురులో తోటలోని పొదలు కదులుతున్నట్లు కనిపించింది. ఉన్నట్లుండి వాటిని చీల్చుకొంటూ నీడలా, నల్లగా ఉన్న మనిషి మెల్లిగా బయటకొచ్చాడు. గతంలో ఎఫీ చూసిన మనిషి యితనేనా?

" ఇప్పుడే వస్తాను" అంటూ ఆమె పాపతో చెప్పింది.

తానేమి చేయబోతోందో యింట్లో వాళ్ళకి చెప్పటానికి సమయం వృధా చేయకుండా, వేగంగా మెట్లు దిగి తలుపులు తీసి దొంగను వెతకటానికి బయటకొచ్చిందామె.

ఆ చీకట్లో ముందర ఉన్న వస్తువులను స్పష్టంగా చూడటమే కష్టం. అలాంటిది తనకు కొన్ని అడుగుల దూరంలొ వెళ్తున్న మనిషిని చూడటం మరీ కష్టం. కానీ ఆ మసకవెలుతురులో నాన్సీ ఆ వ్యక్తి వీపుని చూసింది. చప్పుడు చేయకుండా అతన్ని కొంతదూరం అనుసరించింది.

ఆ వ్యక్తి పనివాళ్ళ యిళ్ళసముదాయం(సర్వెంట్ క్వార్టర్స్) వైపు వెళ్ళి ఒక మూల మలుపు తిరిగాడు. ఆమె అక్కడకు చేరుకొనే సమయానికి అకస్మాత్తుగా మాయమయ్యాడు.

" ఇప్పుడే కనిపించాడు. అంతలోనే యింత త్వరగా అతను ఏమైపోయాడు?" అనుకొంటూ ఆమె కలవరపడింది. అడుగుల చప్పుడు వినపడుతుందేమోనని ప్రయత్నించినా, ఫలితం శూన్యం.

" అతను యింట్లోకే వెళ్ళి ఉంటాడు" ఉద్వేగంతోనే ఆమె అంచనా వేసింది. " కానీ ఎక్కడికి?"

చప్పుడు కాకుండా అడుగులేస్తూ ఆమె ఆ పాత భవంతిని ఒకసారి చుట్టి వచ్చింది. చీకటి దట్టంగా ఉన్న ఆ ప్రాంతంలో, తను వెళ్ళే దారిని చూడటానికి అతను టార్చ్ లైట్ కాకపోయినా, కనీసం అగ్గిపుల్లయినా వెలిగించవచ్చు కదా! అందుకే ఆ యింటిని చుట్టినప్పుడు కనిపించిన ప్రతికిటికీ లోపల నిశితంగా పరిశీలించింది. ఏ చిన్నపాటి కాంతి కనిపించినా, అతను ఆ ప్రాంతంలో ఉన్నట్లు అనుకోవచ్చు. కానీ ఆమె ప్రయత్నమంతా నిష్ఫలమే అయింది.

"ఇంత చీకట్లోనూ చేతిలో దీపం లేకుండా వెళ్తున్నాడా? అతను ఈ యింట్లోనే ఉండి ఉంటే, అతనికి చీకట్లో కూడా తను వెడుతున్న దారి బాగా పరిచయమై ఉండాలి" అంటూ నాన్సీ అనుకొంది. " ఇంట్లో మిగిలినవాళ్ళను అప్రమత్తం చేయాలి."

ఆమె కంగారుగా యింట్లోకెళ్ళింది. ఇంకా వంటింట్లోనే ఉన్న బెస్, జార్జ్ లతో మాట్లాడింది.

" ఇంట్లోకి దొంగోడు దూరినట్లుంది" ఆమె ఆయాసపడుతూ వాళ్ళతో చెప్పింది. " మీరు బయట నిలబడి, యింట్లోంచి ఎవరైనా బయటకు వచ్చినట్లు కనిపిస్తే అరుస్తారా?"

" నువ్వెక్కడికి వెళ్తున్నావు?" జార్జ్ అడిగింది.

" అటక మీదకి."

" ఒంటరిగానా?" బెస్ కంపితస్వరంతో అడిగింది.

"పెద్దాయన్ని తీసుకెడతాను."

నాన్సీ చెప్పిన వార్తకు మార్చ్ బాగా కలవరపడ్డాడు.

సుశాన్ క్షేమంగా ఉన్నట్లు నిర్ధారించుకొన్నాక, వాళ్ళిద్దరు చప్పుడు కాకుండా నడుస్తూ అటక మెట్ల దగ్గర ఉన్న తలుపు దగ్గరకొచ్చారు. మార్చ్ చప్పుడవకుండా దాన్ని తెరిచాడు. అలా తెరవగానే వారికి అటక మీద నుంచి కిర్రుమన్న శబ్దం వినపడింది. దాని వెనుకే గతంలో నాన్సీ విన్న తీగవాయిద్య స్వరాలు వినిపించాయి. అటకమీద దీపం వెలిగించిన దాఖలా లేదు.

వాళ్ళిద్దరూ కొద్దిక్షణాలు మెట్లకిందనే నిరీక్షించారు. ఉన్నట్లుండి ప్రశాంతత అలముకొంది.

ఆ నిశ్శబ్దం సుశాన్ వల్ల చెదిరిపోయింది. అటక మీద అలజడి గదిలోకి వినిపించి భయంతో పాప హాలులోకి వచ్చింది. పై శబ్దాలను పొంచి వింటూ అటకమెట్ల దగ్గర నిలబడ్డ యిద్దరినీ చూసిందా పాప. వెంటనే భయంతో ఏడుస్తూ వారి దగ్గరకు పరుగున వచ్చింది.

" ఏం జరిగింది? మీరిద్దరూ అటక మీదకు ఎందుకెళ్తున్నారు?" పెద్దగొంతుతో అడిగింది.

తనకు తెలియకుండానే పాప అటకమీద వాణ్ణి అప్రమత్తం చేసిందని నాన్సీ ఒక్కక్షణం బాధపడింది. ఆ పాప వేసిన ప్రశ్నలను ప్రస్తుత పరిస్థితికి అనుకూలంగా మార్చాలని అకస్మాత్తుగా ఆమెకు అనిపించింది. వెంటనే బిగ్గరగా పాపకిలా చెప్పింది.

" గదిలోకెళ్ళి పడుకో అమ్మా! మేము నీకు మంచి కధ చెబుతాం" అంటూ పెద్దాయన వద్దకెళ్ళి పాపను దూరంగా తీసుకెళ్ళమన్నట్లు సైగ చేసింది.

తరువాత ఆమె తన చేతిలోని కొవ్వొత్తిని వెలిగించి గడప దాటి అటకమెట్ల దగ్గరకెళ్ళింది. వెంటనే వెనుదిరిగి అక్కడ ఉన్న తలుపును పెద్దచప్పుడయ్యేలా మూసింది.

"అటక మీద ఎవరైనా ఉన్నట్లయితే, నేను ఈ తలుపు మూసి మరో వైపు వెళ్ళిపోయాననుకొంటాడు" అని తనలో అనుకొంది.

ఆమె కొద్ది నిమిషాలు అక్కడే నిలబడింది. అటకమీద లైట్ వెలిగించిన దాఖలా లేదు. పాపను ఊరుకోబెడుతూ కధ చెబుతున్న మార్చ్ గొణుగుడు తప్ప మరో శబ్దం వినపడటం లేదు.

చివరికి ఆమె అటకమెట్లు ఎక్కడం ప్రారంభించింది. ఎక్కడ కాలుమోపితే కిర్రుమని పెద్దగా చప్పుడవుతుందో, అలాంటి మెట్లను చూసి వాటిపై తన బరువును మోపుతూ ఆమె మెట్లు ఎక్కుతోంది. చివరిమెట్టును చేరుకోగానే చేతిలోని కొవ్వొత్తిని ముందుకుచాచి పట్టుకొంది. ఆ వెలుతురులోనే అక్కడనుంచి అటక లోపల వేగంగా పరిశీలించి చూసింది.

" ఇప్పుడు యిక్కడ ఎవరూ లేరు" అని ఆమె నిశ్చయించుకొంది. ఇంతలో ఆమెకు ఏదో వాసన వచ్చింది. " పొగ!"

వెంటనే ఆమె గుండె వేగంగా కొట్టుకొంది. " అటకకు ఎవరైనా నిప్పు పెట్టారా?"

మరొకసారి వాసన చూసింది. అది నిప్పు కాదు, అంతకుముందే ఎవరో అటక మీద సిగరెట్టు కాల్చారు. అదే సమయంలో పెద్దాయన ఆమెను గట్టిగా పిలిచాడు.

" నాన్సీ!"

" ఇక్కడ" బదులిచ్చిందామె.

" నువ్వు బాగానే ఉన్నావు కదా?"

" బాగున్నాను. నాకిక్కడ ఎవరూ కనపడలేదు."

పెద్దాయన మెట్లెక్కటం మొదలెట్టాడు. " నువ్వు ఒంటరిగా అటక మీదకు వెళ్తావనుకోలేదు. నేను తిరిగొచ్చేదాక ఆగుతావనుకొన్నా!"

ఆమె బదులిచ్చేలోపునే, వాళ్ళకు బయట తోటలోంచి అరుపులు వినిపించాయి.

" బెస్, జార్జ్ ఆ మనిషిని చూసుంటారు" నాన్సీ గట్టిగా అరుస్తూ కంగారుగా మెట్లను దిగింది.

ఆమె వేగంగా వీధిగుమ్మం దగ్గరకు పరుగెత్తింది. ఆమె స్నేహితురాళ్ళు దేవదారు తోటకి అడ్డంపడి రోడ్డు వైపు పరుగెడుతున్నారు. యువగూఢచారి తన శక్తి మేరా పరుగెత్తి వాళ్ళను అందుకొంది. కొద్దిదూరంలో రోడ్డు ఉందనగా, వారి వేట అకస్మాత్తుగా ఆగిపోయింది. వారి కళ్ళముందే ఒక కారు వచ్చి ఆగటం, వాళ్ళు వెంటాడుతున్న వ్యక్తి దానిలోకి దూకటం, వెంటనే కారు దూరంగా ఉన్న మలుపు తిరిగి అదృశ్యమవటం క్షణాల్లో జరిగిపోయింది.

" ఛ! నా దురదృష్టం కాకపోతే, చేతికి అందినట్లే అనిపించి జారిపోయాడు" జార్జ్ కుడిచేతి పిడికిలిని గాల్లోకి విసురుతూ అసహనంతో అరిచింది.

" ఘోరావమానం. నువ్వు అతన్ని స్పష్టంగా చూశావా?" యువ గూఢచారి ఆమెను అడిగింది.

" లేదు. చీకటి దట్టంగా ఉంది కదా!" బెస్ బదులిచ్చింది. " ఊహించనిరీతిలో ఎక్కడనుంచో ఆకస్మికంగా బయటకొచ్చాడు."

" అతను కుడిచేతిలో ఏదో కాగితాన్ని చుట్టి పట్టుకెడుతున్నాడు" జార్జ్ చెప్పింది.

"అతను యింట్లోనుంచే వచ్చాడా?" నాన్సీ ఆత్రంగా అడిగింది.

" మాకు తెలీదు. ఒక్కసారిగా మా ముందుకొచ్చాడు. మా కళ్ళముందు నుంచి వెళ్తుంటే, జార్జ్ గట్టిగా అరిచింది. వెంటనే అతను పరుగు లంకించుకొన్నాడు" బెస్ బదులిచ్చింది.

మార్చ్ ముగ్గురమ్మాయిలను వీధిగుమ్మం దగ్గర కలుసుకొన్నాడు. అతనికి దొంగను వేటాడటంలో వారికి సహకరించాలనిపించినా, అకస్మాత్తుగా అక్కడ జరిగిన గొడవకు మనుమరాలు వణికిపోయింది. ఆమెను సముదాయించటం కోసం అతను ఆగిపోయాడు.

భయపడ్డ పాపను సముదాయించటానికి యువగూఢచారికి కొంత సమయం పట్టింది. చివరికి ఆ పాప కనురెప్పలు మూసి గాఢనిద్రలోకి జారుకొంది. తరువాత చప్పుడు కాకుండా ఆమె పాప గదిలోంచి కింద అంతస్తులోని హాల్లోకి వచ్చింది.

హల్లో బెస్ రేడియో పెట్టి సంగీత కార్యక్రమాన్ని వింటోంది. ఆమె కళ్ళు మూసుకొని దాన్ని వింటూ భయాల నిలయమైన ఆ పాత భవనంలో ఉండటానికి కావలసిన మనోధైర్యాన్ని కూడదీసుకొంటోంది. ఆమె పక్క కుర్చీలో కూర్చుని రేడియో వింటున్న పెద్దాయన ఒక్కుదుటున కుర్చీలోంచి లేచాడు.

" వాళ్ళు మళ్ళీ అదే చేశారు" అంటూ ఉద్రేకంతో అరిచాడు.

అతని అరుపుకి త్రుళ్ళిపడిన బెస్ కళ్ళు తెరిచింది. " ఏం చేశారు?" అయోమయంగా అడిగింది.
(తరువాయి భాగం వచ్చే నెలలో)

No comments:

Post a Comment

Pages