యుగయుగాల తెలుగుకు స్వాగతం! - అచ్చంగా తెలుగు

యుగయుగాల తెలుగుకు స్వాగతం!

Share This
 యుగయుగాల తెలుగుకు స్వాగతం! 
 బండ్లమూడి పూర్ణానందం    

అతి ప్రాచీనకాలము నుండి నేటివరకు మనతెలుగులో ఏమున్నది? అంటారా సరే చదవండి !  క్రీ.పూ 1 వ శతాబ్దికిచెందిన ఆమరావతి స్తూపమువద్ద దొరికిన శిలాశాసనములో మొదటి తెలుగుపదము “నాగబుద్ధ” కనిపించుచున్నది. క్రీ.శ 6 వ శతాబ్దికాలము నాటి శిలాశాసనాలు, నాటి భాషను, చరిత్రను, సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను తెలియచేయుచున్నవి. 
అప్పటి తెలుగుభాష 36 అక్షరములతో మన సంస్కృతిని తెలియచేసినది. నేటి తెలుగులో 56  అక్షరములు ఉన్నాయి. తెలుగుభాషలో ప్రజలనోళ్ళలో  రోజూమనము మాట్లాడుకొనే సామెతలు, జాతీయపదాలు, లోకోక్తులు, చాటువులు, వంగ్యోక్తులు, హాస్యోక్తులు, నుడికారములు అనేకము కన్పిస్తాయి. నవరసాలతో నిండినకావ్యములు, మోదాంతకావ్యములు, విషాదాంతకావ్యములు స్మృతికావ్యములు, నాటకములు, పద్యకావ్యములు, గద్యకావ్యములు, చంపూకావ్యములు, ద్విపదకావ్యములు, జానపద సాహిత్యము, భక్తిసాహిత్యము, ద్యర్థికావ్యాలు, త్ర్యర్థికావ్యాలు శతకపద్యసాహిత్యము యక్షగాన సాహిత్యం, అనువాద సాహిత్యము, అవధాన సాహిత్యము, కవిత్రయము, అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్యల పదకవితలు, కీర్తనలు, వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన తత్త్వాలు, వ్యాకరణములు, నిఘంటువులు అలంకారములు, ఛందస్సుశాస్త్రము, మాత్రాఛందస్సు, నవలలు, మినీకవితలు, (గొబ్బిపాటలు)గేయాలు, బతుకమ్మపాటలు, లాలిపాటలు, జోలపాటలు, జావళీలు, గేయకవితలు,డిటెక్టివ్ రచనలు, హరికథల పుస్తకములు, విమర్శన గ్రంథాలు, మాండలికవ్యుత్పత్తి పదకోశములు, హాస్యోక్తులు, భారతము, రామాయణము, పురాణములు, భాగవతము, భగవద్గీత, వైద్యశాస్త్రము, ఇవన్నీ తరతరాలతెలుగువారి తరగని సంపద. అష్టదిగ్గజ కవులకు నెలవైనది మన తెలుగు భాష.కవిరాజుల మన్ననలందినది మన భాష. కన్నడ ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు మెచ్చి, అభివృద్ధి చేసిన భాష మనది. ప్రాచీన గ్రంథములను కాపాడుటకు గ్రంథాలయములు ఉన్నాయి. తెలుగు భాషను రక్షించుటకు తెలుగువిశ్వవిద్యాలయము ఎంతోకృషి చేయుచున్నది. తెలుగుఅకాడమీ తెలుగుపుస్తకములు అచ్చువేసి, ప్రజలకు  అందుబాటులో ఉంచుచున్నది.  తెలుగుభాష మీద అభిమానము కలవారు  ఏర్పాటుచేసుకున్న తెలుగుభాషోద్యమసమాఖ్యలు కూడా భాషను రక్షించుటకు కృషిచేయుచున్నారు.
అమెరికాలోని  “తానా” తెలుగుసంస్థ మరియు తెలుగు గూగుల్ గ్రూపులు తెలుగు భాషాభిమానాన్ని చాటుచున్నాయి. ఇటీవల నాలుగువేదాలు కూడా తెలుగులిపితో ముద్రింపబడి ప్రజలు చదువుకొనుటకు అందుబాటులోనికి వచ్చినవి. 
        ఆధునికవిజ్ఞానశాస్త్రఫలితంగా ప్రపంచ స్థితిగతులు మార్పుచెందటము జరిగినది. విద్యుచ్ఛక్తి మనిషి జీవితంలో వెలుగులు నింపింది అంటాము.అది నిజమే, కానీ తెలుగుభాషకూడా మనిషి యొక్కఆధునిక అవసరాలకు అనుగుణముగా అభివృద్ధి చెందిన, ఆధునికవిజ్ఞానశాస్త్రపరముగా పెరిగిన జ్ఞానాన్ని తనలో నింపుకొని నిరంతరం తాను వెలుగుతూ మానవులందరికీ  ఎంతో వెలుగునిస్తోంది. అనాదిగా వందలసంవత్సరాలపాటు తాళపత్ర గ్రంథాలలో ఉన్న మన తెలుగుసాహిత్యము 18 వశతాబ్దిలో అచ్చుయంత్రము అందుబాటులోనికి రావటముతో, మనప్రాచీనకావ్య సంపద ముద్రింపబడి పుస్తకములరూపములోనికి అందుబాటులోనికి వచ్చినది. విదేశీయుడైన సి.పి.బ్రౌను వేమనపద్యాలు మొదలు చాలా తెలుగుకావ్యాలు అచ్చువేసి  ప్రజలకుచేరువచేసి భద్రపరచుటకు కృషిచేశారు.

                                                                  
                                                             2   
గణితశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం,  జీవశాస్త్రం, వృక్షశాస్త్రం, నామవిజ్ఞానశాస్త్రం, మనోవిజ్ఞానశాస్త్రం, కంప్యూటర్ విజ్ఞానశాస్త్రం, చరిత్ర,న్యాయశాస్త్రం, పరిశోధనసిద్ధాంతగ్రంథాలు, ఇలా చెప్పుకుంటూపోతే సముద్రమంత విశాలమైన భాషమనది. దీనిలో మునిగినవానికి   విలువైన రత్నాలు, ముత్యాలు, కెంపులు, దొరుకుతాయి. అనేక శాస్త్రగ్రంథాలు తెలుగుభాషలోరచింపబడి పుస్తకరూపంలో మనపిల్లలకు అందుబాటులోనికి వచ్చినవి. పాఠశాలస్థాయి నుండి విశ్వవిద్యాలయస్థాయి వరకు చదువునేర్చుకొను  విద్యార్థులకు మనకు తెలుగు అనువాదములో పుస్తకములు లభించుచున్నవి. తెలుగుదేశములో స్వాతంత్ర్యోద్యమానికి  ‘భాష’ మూలకేంద్రముగా నిలిచింది. ఆధునికఉద్యమాలకు  భాష-సాహిత్యములు ఊపిరిని అందించాయి.                                                    
                        కవులు, కవయిత్రులు, పండితులు, విమర్శకులు, అవధానులు ,వైతాళికులు, కళాకారులు, రచయితలు, రచయిత్రులు ఎందరెందరో తమతమ జీవితాలను భాష-సాహిత్యములకు అంకితముచేసి ఈ బంగారురంగారు తెలుగుభాషను బలమైన భాషగా చేశారు. ప్రాచీనకాలమునుండి నేటివరకు  భారతము, రామాయణములను ఆధారముగా చేసుకొని కళలను కాపాడుకొంటూ వస్తున్నజానపదులు, కూచిపూడి నాట్యకళాకారులు, హరికథా కళాకారులు, సురభి కళాకారులు, బుర్రకథ కళాకారులు, తోలుబొమ్మలను ఆడించువారు, ఒగ్గుకళాకారులు, జక్కుల పురంధ్రీలు, పగటివేషగాండ్రు, జంగమయ్యలు, గంగిరెద్దులను ఆడించువారు, పిచ్చుకుంటలవారు, పిట్టలదొరకళాకారులు, పులివేషమువారు, తప్పెటకళాకారులు , (డప్పువాయిద్యకళాకారులు) ఒకరేమిటి చాలామంది కళాకారులుఉన్నారు. ఆధునికసాంకేతిక ఉపకరణాలతో అభివృద్ధిచెందిన  తెలుగుభాష నేడు సుమారు ముప్పది తెలుగు యూనికోడు  ఫాంట్స్ తయారై ప్రజలు ఉపయోగించుకొనుటకు అనుకూలముగా ఉన్నవి. భారతప్రభుత్వపు సంస్థ సి.డాక్  తయారుచేసిన తెలుగు సాంకేతిక ఉపకరణాలు ఐలీపు, లీపుఆఫీసు, ఐఎస్.ఎమ్. జిస్ట్,పబ్లిషరు, 14 భారతీయ భాషలను ఒకే కీబోర్డు  డి.ఓ.ఈ. లే అవుట్  సహాయముతో  రాయుటకు అనుకూలముగా తయారుచేయటము  జరిగినది. ఇంకనూ ప్రైవేటు సంస్థలు తయారుచేసిన అనుఫాంట్లు, శ్రీలిపి, ఆకృతి, మొదలైన సాంకేతిక ఉపకరణాలు కూడా  నేడు కంప్యూటరులో తెలుగుభాషా వినియోగములో గొప్పగా సహాయపడుచున్నాయి..
   పూర్వముతాటియాకులమీద రాయబడినభాష , మట్టి పలకలపై చిట్టిచేతులకు నేర్పించిన భాష శిలాశాసనములమీద చెక్కబడినభాష, నేడుసాంకేతికత  అభివృద్ధిలోభాగముగా నిర్మించిన కంప్యూటరులో నిర్మించబడి విశ్వతెలుగుగా ధగధగా మెరయుచున్నది. భూగోళశాస్త్రమునుండి అంతరిక్షశాస్త్రమువరకు  అంతటా మన తెలుగువారు ఉన్నారు. మన తెలుగువారి కృషిఉన్నది. సందర్భసహితంగా‘రా’ అనిపలికితే ఒకవాక్యమే. ‘పో’ అని పలికితే ఒక వాక్యభావాన్ని పూరించగల ఏకాక్షర అర్థబోధక సత్తాగల భాషమనది.ఇక పత్రికారంగానికి వస్తే దినపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలు, త్త్రైమాసికపత్రికలు, అర్థసంవత్సర, సంవత్సర పత్రికలు, మొదలైనవి మన భాషావ్యాప్తికి సహాయపడుచున్నాయి. నన్నయ్యకవి నుండి డాక్టరు సి.నారాయణరెడ్డిగారి వరకు ఎందరో కవులున్నారు. అందరికీ పేరుపేరునా వందనములు. శతకోటివందనములు. సహస్రకోటి వందనములు. కోటికోట్లవందనములు. వారి ఆశీస్సులే  మనందరికి శ్రీరామరక్ష.

                                                       ***

No comments:

Post a Comment

Pages