లోవరాజు కధలు - మనవాళ్ళొట్టి వెధవాయలోయ్ - అచ్చంగా తెలుగు

లోవరాజు కధలు - మనవాళ్ళొట్టి వెధవాయలోయ్

Share This
లోవరాజు కధలు - 20 
మనవాళ్ళొట్టి వెధవాయలోయ్
కంభంపాటి రవీంద్ర 

'నీకోసం పొలంనుంచి గంగాబోండాలట్టుకొచ్చేను .. ' అన్నాడు లోవరాజు , మా ఇంటి ముందు తన బుల్లెట్ బండాపి , ష్టాండేస్తూ .
'గంగా బోండాలేంటీ ?' అన్నాను ఆశ్చర్యంగా. 
'ఎదవ గొడవ .. నీకు ప్రతీదీ వివరం చెప్పాలి .. ఈ వెరైటీ కొబ్బరి చెట్లు పదడుగుల కంటే ఎక్కువ పెరగవు .. నీళ్ల రుచి అదిరిపోద్ది .. పద .. అలా మీ అరుగు మీద కూచో .. కొట్టిస్తాను ' అంటూ తన బుల్లెట్ బండికి కట్టున్న బొండాల గెల విప్పడం మొదలెట్టేడు. 
'అవునొరే .. ఊళ్ళో ఎలక్షన్ల హడావిడి మొదలైనట్టుంది .. ఎవరు గెలుస్తారేంటీ ?' అడిగేను .
'ఎవరు గెలుస్తే మటుకూ లాభమేంటీ ? గెలిచేవోడూ ఎదవే .. గెలిపించేవోడూ ఎదవే ' అన్నాడు. 
'అంత మాటనేస్సేవేంట్రా బాబూ ' అని నేనంటే 'మరంతే .. ఎవడి లాభం ఆడు జూసుకుంటాడు .. మునుపటికోసారి ఇక్కడ జరిగిన ఎలక్షన్ కధ చెబుతాను .. నువ్వే చెప్పు ఎవరిది ఎదవ బుద్ధో .. ఈ కధలో  పార్టీల పేర్లు చెప్పుకోవద్దు .. కులాల పేర్లు కూడా చెప్పను .. అనవసరమైన ఎదవ కాంప్లికేషను ' అన్నాడు. 
'సరేక్కానీ .' అని అంటే ఆడు చెప్పడం మొదలెట్టేడు.
ఎమ్మెల్యే తాతబాబుకి ఒకటే చింత పట్టుకుంది .. అప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యే గా చేస్సేడు .. ఈసారి టిక్కెట్టు ఇస్తారో లేదో తెలీడం లేదు ..  ఇదే టిక్కెట్టు కోసం తన కులపోడు పైడిబాబు కూడా తెగ ప్రయత్నిస్తున్నాడు. పైగా ఊళ్ళో వాళ్ళ కులానిదే డామినేషను కూడా !  పార్టీ పెద్దలు మటుకు అటూ చెప్పకుండా , ఇటూ చెప్పకుండా ఇద్దరితోనూ ఆడేసుకుంటున్నారు . 
పార్టీ పెద్దాయన ఇటేపు ఎప్పుడొచ్చినా , ఆయన కళ్ళల్లో పడ్డానికి తాతబాబు , పైడిబాబు ఇద్దరూ పోటాపోటీగా ఖర్చుపెట్టేస్తున్నారు. ఆయనేమో నవ్వి ఊరుకుంటున్నాడు తప్ప , ఎటూ తేల్చకుండా నానేస్తున్నాడు . 
పార్టీ టిక్కెట్టు ఒస్తుందో రాదో తెలీదుగానీ , చేతిచమురు ఓ రేంజిలో ఒదిలిపోతూంది! పైడిబాబు ' ఇది తెగేదికాదు .. వేరేదైనా ఆలోచించాలి' అనుకుంటూంటే  , ఇంటి ముందు నుంచి నడుచుకెళ్లిపోతున్న బెనర్జీ డాక్టరు గారు కనిపించేరు . 'హమ్మ .. సరైనోడు దొరికేడు మనకి ' అనుకున్న పైడిబాబు , పరిగెత్తుకునెళ్ళి ఆయన్నాపి ,' డాక్టర్ గారండీ ' అంటూ చెప్పడం మొదలెట్టేడు . 
ఈ బెనర్జీ డాక్టర్ గారు ఏ వూరోడో తెలీదు గానీ మనూర్లో మటుకు చాలామంచి పేరు సంపాయించేసేడు . ఎప్పుడూ నవ్వుమొహమేసుకునుండే  ఆ బెనర్జీగారిని చూస్తే , ఎంత జబ్బున్నోడికైనా... మనల్ని కాపాడ్డానికి ఈయన ఉన్నాడు అనే  ధైర్యం ఒచ్చేస్తుంది! పైగా ఎప్పుడూ ఇంతివ్వండి అని ఫీజు కూడా అడిగేవోడు కాదు ఎవరెంతిస్తే ,అంతే పుచ్చుకునేవాడు , ఇంకా చెప్పాలంటే , ఎవడికైనా టెస్టులూ గట్రా చేయించుకోడానికి డబ్బులు లేవంటే , ఈయన జేబులో డబ్బులెట్టేసేవోడు . 
కాబట్టి అలాంటి బెనర్జీ డాక్టర్ గారిని కాండిడేట్ గా నిలబెడితే , అటు తన సాటి కులపోడు తాతబాబునీ దెబ్బ కొట్టినట్టుంటుంది , తాను నుంచోబెట్టిన కాండిడేటు గెలిచి , తన పరపతి పెరిగినట్టూ ఉంటుందని ఆలోచన చేసేడు పైడిబాబు. 
బెనర్జీ గారు ఓ పట్టాన ఒప్పుకోలేదు , 'నేనిలా బానే ఉన్నాను .. నన్నొదిలేవయ్యా బాబూ ' అన్నా కూడా, పైడిబాబు 'అలాక్కాదండి .. మీరు ఎమ్మెల్యే అయితే, ఇంకా మంచి పన్లు చెయ్యొచ్చుకదండీ ... ఎమ్మెల్యే పొజిషను మీకవసరం కాదేమో.. కానీ మీరు ఎమ్మెల్యే అవడం మనూరికవసరమండి . మీరింకేం చెప్పకండి .. మీ ఎలక్షన్ ఖర్చు గట్రా అన్నీ నేనే చూసుకుంటాను ' అనేసి ఆయన చేత ఇండిపెండెంటుగా నామినేషన్ వేయించేసేడు !
'మీరు నాకోసం డబ్బు ఖర్చు పెట్టొద్దండి .. మాట సాయం ఉంటే చాలండి ' అని బెనర్జీ గారు పైడిబాబుని ఎలక్షన్ కోసం డబ్బులు ఖర్చుపెట్టనివ్వలేదు . తన పన్లన్నీ మానుకుని , ఆవేశంగా వీధులంట సైకిలేసుకుని  ప్రచారం చేసుకుంటా తెగ తిరిగేస్తున్నాడాయన .
ఈ తతంగాన్నంతా చూస్తున్న తాతబాబు కులాసాగా నవ్వుకున్నాడు , వాళ్ళ పార్టీ అధిష్టానం మళ్ళీ తాతబాబుకే టిక్కెట్టు ఇచ్చింది !
'నాన్నా .. టిక్కెట్టిచ్చేరు సరే .. కానీ ఈసారి మనం గెలుస్తామంటావా ? పదేళ్లుగా ఎమ్మెల్యే గా నువ్వే ఉన్నావు కదా .. ఊళ్ళో అపోజిషనున్నట్టుంది ' అని తాతబాబు కొడుకు మల్లిబాబు అడిగితే, ఆడికేసి ఆప్యాయంగా చూసి నవ్వేడాయన !
ఎలక్షన్ రోజు దగ్గిరికొచ్చేస్తూంది .. తాతబాబు , బెనర్జీ గారు ఇద్దరూ తెగ ప్రచారం చేసేస్తున్నారు , తాతబాబు ప్రచారం ముందు , బెనర్జీ గారి ప్రచారం ఎక్కడా ఆనడం లేదు . పైగా తన వెనకాలే ఉంటానన్న పైడి బాబు ఈ మధ్య కనబడ్డం మానేసేడు . ఇంక సిగ్గు చంపుకుని , బెనర్జీ గారు పైడిబాబు ఇంటికెళ్ళేసరికి , 'రండ్రండి డాట్రు గారూ .. మీకోసమే కబురంపుదామనుకుంటున్నాను .. మీరే వచ్చేసేరు' అంటూ ఎదురొచ్చేడు పైడిబాబు 
'అవునండి .. అవతల ఆ తాతబాబు డబ్బు ఖర్చు ముందు మనం చాలడం లేదండి .. ఏదైనా సలహా చెబుతారేమోనని వచ్చానండి ' అన్న బెనర్జీ గారితో , 'అవునండి .. భలే టైముకొచ్చేరు .. నిన్ననే తాతబాబు తో మాట్లాడేను .. మా కులం ఓట్లు చీలకుండా.. వాళ్ళబ్బాయికి మా అమ్మాయినిస్తున్నాం ..ఇవాళే నిశితార్థం కూడా .. మురముళ్ళ నుంచి పంతులు గార్రావాలి .. ఆయనొచ్చిన తర్వాత నాలుగాక్షింతలేసి వెల్దురుగాని .. మీ ప్రచారానికి ' కులాసాగా నవ్వుతూ అన్నాడు పైడిబాబు !
'ఆ తర్వాత ఏం జరిగిందో నీకు చెప్పక్కర్లేదనుకుంటా ' అన్నాడు లోవరాజు 
'ఏముందీ .. చెప్పడానికి .. గురజాడ అప్పారావుగారెప్పుడో అన్నారు కదా .. "మనవాళ్ళొట్టి వెధవాయలోయ్" అని ' అన్నాను.. 
***

No comments:

Post a Comment

Pages