పుష్యమిత్ర - 37 - అచ్చంగా తెలుగు
పుష్యమిత్ర - 37
- టేకుమళ్ళ వెంకటప్పయ్య

జరిగిన కధ: పుష్యమిత్రుడి కాలంలో దండయాత్రలకు భయపడి కొన్ని వేల మణుగుల బంగారాన్ని భూగర్భంలో ఒక సొరంగంలో దాచిన విషయం చెప్తాడు పుష్యమిత్ర.  ఆర్ధిక శాఖామాత్యుడైన పంచాపకేశన్ దాన్నిఎలాగైనా అపహరించాలని పన్నాగాలు వేస్తుంటాడు.  ఇండియన్ గ్లోబల్ ఐ విషయం పాకిస్తాన్ వాళ్ళకు తెలిసిపోయిందన్న విషయం ప్రభుత్వం గమనిస్తుంది.  పాకిస్తాన్‌లోని ఉప్పుగనులకు టెండర్ వేసిన సుకేశ్ సుభానికి టెండర్ వచ్చిందని ఫోన్‌లొ మన ప్రధానికి పాక్ ప్రెసిడెంట్ శుభవార్త చెప్తాడు. పంచాపకేశన్‌ను అనుచరుడు వెంకటేశన్ ప్రభుత్వానికి లొంగిపోయి సాక్ష్యాధారాల్తో సహా పట్టించగా ఆర్ధికమంత్రి జైలుపాలవుతాడు. ఇండియన్ గ్లోబల్ఐ రహస్య విషయం అక్కడపనిచేసే అసాఫాలి ద్వారా సలాలుద్దీన్ తెలుసుకుని పాక్ ఆర్మీ జెనరల్‌అనుజ్ఞల మేరకు అతణ్ణి సెలవుపెట్టించి పాక్‌కు తీసుకువెళ్ళడానికి మంతనాలు సాగించి ఒప్పిస్తాడు. ఉప్పుగనిలో స్వచ్ఛందపదవీ విరమణకు ఒప్పుకోని పాక్‌  ఉద్యోగులను ఉద్యోగులను ఎక్కువ పరిహారం ఇచ్చి సాగనంపుతారు (ఇక చదవండి)
సలాలుద్దీన్ చెప్పిన విధంగానే అనుకున్న రోజుకు శ్రీనగర్ దగ్గర ఉన్న "గురిపోరా" విలేజ్ లో ఉన్న ఖాదర్‌మస్తాన్ హోటెల్‌కు చేరుకున్నాడు అసాఫాలీ. రిసెప్షన్‌లో ఎవరో ముస్లిం కుర్రాడు ఉన్నాడు. మెల్లిగా మాటలు కలిపాడు.
"సలాలుద్దీన్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చాడా?"
"ఆప్ కౌన్ హై?" అన్నాడు ఆ పేరు వింటూనే ఉలిక్కిపడుతూ రిసెప్షన్లో మూల కూర్చుని పేపర్ చదువుతున్న  ముసలివాడు
"నేను ఆయన దోస్తును. ఇవాళ ఇక్కడ కలుద్దామని చెప్పాడు"
ముస్లిం కుర్రాడు ఏదో చెప్పబోతుండగా ముసలివాడు ఏదో సైగ చేసి ఆగమని చెప్పి అసాఫాలి ని హోటెల్ బయటకు తీసుకుని వెళ్ళి "సలాలుద్దీన్‌ను కలవాలా?" అన్నాడు.
అవునన్నట్టు తలూపాడు అసాఫాలి.
"అంధర్ ఆయీయే!. ఇండియన్ పోలీస్‌కు అనుమానాలు రాకూడదు" అంటూ మళ్ళీ లోపలికి తీసుకుని వెళ్ళాడు.
లోపల ఒక రూంలో అసాఫాలికి వేషం మార్చి గడ్డం అంటించి తలకు ముస్లిం టోపీ పెట్టి "ఆయీయే వెహికల్ పర్ బైఠీయే" అని దూరంగా వెళ్ళి ఫోను మాట్లాడి వచ్చి "నేను చెప్పే వరకూ మాట్లాడొద్దు.డేంజర్ జోన్‌లో ఉన్నావు" అని కళ్ళకు గంతలు కట్టాడు.
వెహికల్ సాగిపోతోంది. గమ్యం మాత్రం అసాఫాలి ఊహించనిదే!
*    *    *
"పుష్యమిత్రాజీ! మనకు ప్రస్తుతం అన్ని సమస్యలు తీరినట్టే! యిప్పుడే మనం జాగ్రత్తగా ఆలోచించాలి."
"అవును. ఏమాత్రం తొందరపాటు పనికిరాదు. కొద్ది నెలలు మామూలుగానే ఉప్పును పాక్ బార్డర్ దాటించి మనదేశంలోకి తీసుకుని వద్దాం. వాళ్ళ నిఘా ఏపాటిదో చూద్దాం. రంజాన్‌కు మిగతా అన్ని పండుగలకు బార్డర్ వాళ్ళకు ఏవో ఖరీదైన గిఫ్ట్‌లు పంచుతూ ఉండండి. 4-5 నెలల తర్వాత లారీల్లో ఉప్పు బస్తాల అడుగున మామూలు మట్టి బస్తాలు ఒక 5-6 వేసి పంపండి. తనిఖీ చేస్తారో లేదో గమనించండి. తనిఖీ అసలు లేదు అనుకున్నప్పుడు, మనకు అనుకూలురు చెక్‌పోస్ట్ లో ఉన్న రోజుల్లో పని మొదలెడదాం మెల్లిగా"
"ఆలోచన బావుంది. కానీ మట్టిబస్తాల సంగతి ఏమిటో అర్ధం కాలేదు" అన్నాడు నవ్వుతూ.
"మీలా చెక్‌పోస్టు వాళ్ళూ అలాగే అడిగితే - ఆ మట్టిలో ఉప్పు ఎక్కువ కాలం కరిగిపోకుండా ఉంటుందన్న కాకమ్మ కధలు ఏవో చెప్పండి. ఆ తర్వాత మట్టే కదా అని  వాళ్ళు అనుకున్నప్పుడు మట్టి మధ్యలో బంగారం పెట్టి పంపడం మెల్లిగా ప్రారంభిద్దాం"
"బావుంది" నావ్వాడు పీ.ఎం.
"వేల యేళ్ళ నాటి పాత చింతకాయ ఆలోచనలు అనుకుంటున్నారా? మనం వాళ్ళకు ఒక్కసారి దొరికితే శాశ్వతంగా నిధి వదులుకోవాల్సి వస్తుంది".
"నిజమే! నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను"
"కానీ నాగబంధం విప్పడానికి నాకు ఇంకా కొన్ని గ్రంధాలు కావాలి. కాశీ విశ్వవిద్యాలయంలో ఉన్నాయని చెప్పారు. అవి తెప్పించండి.  బౌద్ధ గ్రంధాలయిన సుత్త పిటకం, వినయ పిటకం, అభిదమ్మ పిటకాలతోబాటూ మన హిందూ శాస్త్ర తాళపత్ర గ్రంధాలు కూడా తక్షశిల గ్రంధాలయంలో ఉంచబడ్డాయి. అవి ఏమయ్యాయో తెలీదు".  
"తంజావూరు సరస్వతీ మహల్‌లో ఏవో గుర్తు తెలియని తాళపత్ర గ్రంధాలు ఉన్నాయనీ, ఆ భాష గానీ విషయం గానీ అర్ధం కావడంలేదని వాటిపై నాగజాతికి చెందిన సర్పాల బొమ్మలు ఉన్నాయని ఒక పండితుడు చెప్పాడు. వాటిని ఒక గదిలో ఉంచి కాపాడుతున్నామని కూడా చెప్పాడు".
"బహుశ: అవే అయిఉండవచ్చు. ఆ తాళపత్రాలన్నీ ఏదో ఒకటి చెప్పి..ఆర్కీవ్స్ అనో ఏదో చెప్పండి మొత్తం దిల్లీ కి తరలించండి. చూద్దాం.  నాగబంధం వేసేటప్పుడు నేను ఉన్నాను కాబట్టి ఏ వరుసక్రమంలో అయితే మనం నాగజాతి సర్పాలను ఆవాహన చేసామో అదే వరుసక్రమంలో విప్పాలి. లేకపోతే ఆ ప్రాంతం మొత్తం విషవాయువులతో నిండి మొత్తం అందరూ మరణిస్తారు".
"మై గాడ్"
"అవును. చాలా జాగ్రత్తగా ఉండాలి"
ఏదో ఫోన్ రావడంతో పీ.ఎం. "ఎస్. స్పీకింగ్" అన్నాడు. విషయం విన్నాక
"వాడిని బట్టలు మొత్తం ఊడదీసి తలక్రిందులుగా వేలాడదీసి మన మామూలు గదిలో ఉంచండి. నేను ఇంకో అరగంటలో వస్తాను"
"ఏమైంది?" అన్నాడు నవ్వుతూ.
"ఇండియన్ గ్లోబల్-ఐ రహస్యాలు చేరవేసే స్కౌండ్రల్ దొరికాడు. వాడి సత్కారం గురించి చెప్తున్నాను" అన్నాడు నవ్వుతూనే.
"ఉప్పు గనులు త్రవ్వి తీసే వారికెవరికీ ఈ విషయాలు చెప్పకండి. మనం సీక్రెట్‌గా హ్యాండిల్ చెయ్యకపోతే పంచాపకేశన్ లాంటి వాళ్ళు నలుగురు తయారవుతారు."
ష్యూర్! ష్యూర్! ఇప్పటివరకూ మనిద్దరికి తప్ప ఎవరికీ తెలీదు.  తెలిసిన పంచాపకేశన్ జైల్‌లో ఉన్నాడు.
*    *    *
"సార్! గుడ్‌మార్నింగ్! యాక్టుయల్లీ అసాఫాలి నిన్న గురిపోరా విలేజ్ హోటల్ దగ్గరకు వచ్చాడట. కానీ కానీ ఏమయ్యాడో తెలీదు. ఎంక్వైరీ చేస్తే సెలవులోనే ఉన్నాడని అంటున్నారు. అనుకోకుండా ఆ హోటెల్‌లో నాకు తెలిసిన స్టాఫంతా రిజైన్ చేసి వెళ్ళిపోయారట. ఒకవేళ నా గురించి తెలియకపోవడంతో వెనుదిరిగి వాళ్ళ నేటివ్ ప్లేస్‌కు  వెళ్ళిపోయాడా అన్నది ఎంక్వైరీ చెయ్యాలి".
"నీ అంత ఫూల్ ఇంకోడు ఉండడు. ఇండియా గవర్నమెంట్ వాడిని పట్టుకుని వెళ్ళి ఉంటారు"
"ఇంపాజిబుల్ సార్! హోటెల్ నాజ్ లో మేమిద్దరమే కలిసాం. వేరొకరు లేరు"
"అని నువ్వనుకుంటే సరిపోయిందా! ఇండియన్ పోలీస్ వ్యవస్థను అంత తేలిగ్గా అంచనా వేయకు. పీ.ఎం. సామాన్యుడు కాదు. మనకు ఏదో ఒక ఎసరు పెట్టందే గద్దె దిగేట్టు లేడు వాడు. ప్రస్తుతం రూలింగ్ పార్టీ పాతది కాదు. క్రొత్త ప్రభుత్వం.. మొన్న మనకు పక్కలో బల్లెంలా ఉన్న బెలూచిస్తాను విషయం గోకాడు. దాని దురద ఇంతవరకూ తగ్గలేదు మనకు. గీరుకుంటూనే ఉన్నాం. అది అలా ఉండగానే నిన్నటికి నిన్న చైనా వాడి దూకుడుకు చెక్ పెట్టేందుకు భారత్ ఏమి చేసిందో తెలుసా? సోవియెట్ నుండి విడిపోయిన కిర్జికిస్థాన్ ప్రస్తుతం ఆర్ధిక మాంద్యంతో బాధ పడుతోంది. అక్కడ కమ్యూనిజం ప్రభావం బాగా ఉంది. వారికి సహాయం చేసేందుకు చైనా ముందుకు రాగా, కర్జికిస్థాన్ ను రెచ్చగొట్టి మీ సహజ వనరులమీద, మానవ వనరులమీద, వారి విశాలమైన భూభాగం మీద చైనావారి కన్ను పడింది జాగ్రత్త అని చెప్పింది. వారు భారత్ సహాయం కోరీ కోరగానే అంగీకారం తెలిపింది. భారత్ ను తక్కువ అంచనా వేయొద్దు. ఇంతకు ముందు భారత్ కాదు. ”
"ఎస్. ఆ యాంగిల్‌లో ఆలోచించలేదు. ఇంతకు ముందు మాదిరిగానే పని జరుగుతుందనుకున్నాను సార్!"
"యూ ఫూల్!. వాడు భయపడుతున్నప్పుడే నీకు విషయం అర్ధమయి ఉండాలి. వాడు త్వరలో దొరికిపోతాడని."
'ఎస్ సార్! నేను పట్టుకుంటా! వాడి నేటివ్ ప్లేస్ వెళ్ళయినా సరే!"
"అరే పాగల్ వాడు ఇప్పుడు నేటివ్ ప్లేస్‌లో కాదు. జైల్‌లో నరక యాతన అనుభవిస్తూ ఉండి ఉంటాడు. ఇఫ్ అయాం కరెక్ట్"
"కరెక్టు సార్! జరిగిందేమిటంటే..." అంటూ ఒక స్పై ఆఫీసర్ లోనకు వచ్చాడు. ఆ ఆఫీసర్ చెప్పింది వినిన సలాలుద్దీన్‌కు గుండె  ఒక్కసారి ఆగినంత పనయింది.
ఇంకో సారి ఆ చుట్టుపక్కలకెళ్ళావో నిన్ను కుక్కను కాల్చినట్టు కాల్చి చంపేస్తారు. గో టు అండర్‌గ్రౌండ్ టిల్ మై ఫర్దర్ ఇన్స్‌ట్రక్షన్స్." గర్జించాడు మిలిటరీ మేజర్.
"యెస్.సార్"
*    *    *
ఉప్పుగనుల త్రవ్వకం సాగుతోంది. 
"మనకు ఇక్కడి పరిస్థితులు అవగాహనకు వచ్చే వరకైనా పాత ఇంజినీర్లను ఉంచవచ్చుగదా! అందరికీ ఉద్వాసన ఇచ్చేశారు." విసుక్కుంటున్నడు ఒక సూపర్వైజర్.
"నిజమే కదా!" అని వాపోయాడు ఇంకో ఇంజినీర్
"ఎక్కడ త్రవ్వితే నీటి మడుగులుంటాయో తెలీదు. మొన్న మైన్ మొత్తం జలప్రవాహం అయింది".
"అసలు ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతోందా అనిపిస్తోంది"
"అంటే నీ ఉద్దేశ్యం?"
"ఏమీ లేదు కేవలం రాజకీయ, శతృత్వ కారణాలు కాకుండా ఇంకో కోణంలో ఆలోచించాల్సి ఉందేమో అనిపిస్తోంది"
"సరిగ్గా అర్ధం కాలేదు"
"ఒక్క పాక్ వాడినికూడా లేకుండా తరిమేశారు. గొడవచేసిన వాళ్ళకు ఎన్ని సంవత్సరాల జీతం నష్ట పరిహారంగా ఇచ్చి పంపారో చూశావు కదా!"
"దానికి కారణం ఏమిటి? ఇక్కడి ఉప్పు అంత గొప్ప కెమికల్ లక్షణాలు కలిగిందేమీ కాదని కెమిస్ట్ అనాలిసిస్ ఇచ్చాడు. దాన్ని సీక్రెట్‌గా దాచేశారు. వాడు నా ఫ్రెండ్ కాబట్టి "ఎందుకు మీ వాళ్ళు నేల విడిచి సాము చేస్తున్నారు" అని అడిగాడు.
"అంటే ఇంకేదో రహస్యం దాగి ఉందా?"
"పాక్ సైనిక రహస్యాలు తెలుసుకోవడమో లేక ఇంకేదో మర్మం దాగి ఉంది కానీ మనకు నిదానంగా కానీ విషయం అవగాహనకు రాదు"
"అందరం కొంచెం విజిలెంట్‌గా ఉందాం. మిగతా వారికి కూడా చెప్పు"
"అలాగే"
జీ.ఎం. గారు వస్తున్నారు. వెళ్ళు వెళ్ళి నీ రూంలో పని చూసుకో” అన్నాడు దూరంగా వస్తున్న జీ.ఎం ను చూసి.
ఎవరికి వాళ్ళు సర్దుకున్నారు. (సశేషం)

*    *    *

No comments:

Post a Comment

Pages