మురికి మనసులు - అచ్చంగా తెలుగు
మురికి మనసులు
 ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్
                                               
                          
చాలా కాలం  తరువాత కూర్మారావు భార్యతో సహా రాజస్తాన్ లో జైపూర్ లో  ఉంటున్న బాల్య మిత్రుడు భుజంగం ఇంటికి వెళ్ళాడు.కూర్మారావు ని చూసిన భుజంగం“ఒరేయ్ కూర్మం ఎన్నాళ్ళు అయ్యిందిరా నిన్నుచూసి”అంటూ కౌగలించుకున్నాడు.
కూర్మారావు కూడా భుజంగం ని చాలా కాలం తరువాత చూడడంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు.
కూర్మారావు, భుజంగాలది దాదాపు నలబయి ఏళ్ళ నాటి స్నేహం.ఇద్దరు ఒకటో క్లాసు నుంచి కలిసి చదువుకున్నారు.ఒక కంచంలో తిన్నారు.ఒకే మంచం ఫై పడుకున్నారు.
కానీ ఇద్దరకూ ఉద్యోగాలు రావడంతో, పెళ్లిళ్ళు కావడంతో దూరం అయిపోయారు.అయితే మొదట ఉత్తరాలతో, తరువాత తరువాత ఫోన్లతో,ప్రస్తుతం వ్హాట్స్అప్ ద్వారా ఫ్రెండ్ షిప్ ని కాపాడుకుంటూ వస్తున్నారు.
స్నేహితులు దాదాపు ఇరవయి సంవత్సరాల తరువాత కలుసుకున్నారు.
భుజంగం భార్య శాంత “రండి అన్నయ్యగారు , రా వదినా “ అంటూ కూర్మారావుని,   అతని భార్య రజితని సాదరంగా ఆహ్వానించింది.
“ఏమ్మా బాగున్నావా!? పిల్లలు ఎక్కడ!? “ అని అడిగాడు కూర్మారావు. 
“పిల్లలు ఇద్దరూ హైదరాబాద్ అన్నయ్యగారు.మీ పిల్లలు అమెరికాలో ఉన్నారటగా!!?”
“అవును వదినా .వాళ్ళు రమ్మని చంపేస్తున్నారు.మీ అన్నయ్య గారికి విమానం భయం.కదలరు”అంది నవ్వుతూ కూర్మారావు భార్య  రజిత.
“సరేలే “కసురుకున్నాడు కూర్మారావు.
“అయినా అన్నయ్యగారికి శలవు దొరకదు కదా. మా ఇంటికి కూడా పూటో, రోజో ఉండడానికి వచ్చి ఉంటారు” అంది శాంత. ఆ మాటలకు కూర్మారావు దంపతులు గతుక్కుమన్నారు.
“లేదు వదినా . ఈసారి అన్నీ చూసి వెళదామని వారం రోజులు శలవు పెట్టి వచ్చారు.”అంది రజిత.
అది విన్న శాంత కి గుండె ఆగినంత పని అయ్యింది.మనస్సులోనే అయ్యే ఖర్చులు  బేరీజు వేసుకుంది.
‘అమ్మో ఎంత లేదన్నా తిండికే పది వేలు.తరవాత తిరగడానికి.....’ ఇక తరువాత ఆలోచించ లేకపోయింది.
కానీ నవ్వు మొఖానికి పులుముకుని “చాలా  సంతోషం.”అంది శాంత.
“ఇక్కడ చలి బాగా ఎక్కువట కదా చెల్లెమ్మా!?” తన సందేహం వెలిబుచ్చాడు కూర్మారావు.
“రాజస్తాన్ అంటే అంతే కదా అన్నయ్యా.విపరీతం.ఎవరన్నా కొత్త వాళ్ళు ఒకటి రెండు రోజుల కన్నా ఉండలేరు” అంది శాంత.’విపరీతం’ అన్న మాట వొత్తి పలుకుతూ.
“అన్ని విధాల తయారు అయ్యే వచ్చాం వదినా.దండిగా దుప్పట్లు, స్వెట్టర్లు తెచ్చుకున్నాం లే ”అంది రజిత.
“ఆహా అయితే పరవాలేదు.” అంది శాంతి ముఖం అదోలా పెట్టి.
“అయినా ఇంట్లో ఉన్నప్పుడు పరవాలేదు.బయటకు రాత్రిళ్ళు తిరగం.అదీ కాక కారులో కదా మనం తిరిగేది....”ఇంకా ఏదో అనబోతున్నభుజంగం మాటలు మధ్యలోనే త్రుంచేసింది శాంత.
“ అదేమిటండి!!?? మీరు పదిహేను రోజులనుంచి నడుం నెప్పని చంపుతున్నారు.అసలు ఆఫీస్ కి శలవు పెట్టి రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారు.అన్నయ్యగారు ఏమైన పరాయి వాళ్ళా!!??.ఉన్న సంగతి చెపితే తప్పేముంది!!??”అంది శాంత.
“అంటే .....” భుజంగం మరలా ఏదో చెప్పబోతుంటే తన సైగల తోనే అతని నోరు నొక్కేసింది శాంత. భుజంగం బిత్తర చూపులు చూస్తూ నుంచున్నాడు. 
“అయ్యో భుజ్జు నీకు నడుం నొప్పా !!??” సానుభూతి ప్రకటించాడు కూర్మారావు.
“పోనీలెండి .అన్నయ్యగారికి అంత బాగా లేనపుడు ఆయనని ఇబ్బంది పెట్టడం ఎందుకు!?హాయిగా డ్రైవర్ ని పెట్టుకుందాం.” సులభమైన పరిష్కారం సూచించాను అనుకుంది రజిత.
“వదినా ఇక్కడ డ్రైవర్ ని పెట్టుకోడం మంచిది కాదు.మన వేపులా కాదు.ఒక్క రోజు పెట్టుకున్నామా పెట్రోల్ తాగేస్తారు. పార్ట్స్ అన్నీ మార్చేస్తారు.”అంది శాంత కంగారుగా.
“పోనీ మీ అన్నయ్య డ్రైవ్ చేస్తారు”.
“ఇంకా నయం . వచ్చిన అతిధుల చేత పనులు చేయించడమా!!??అదీ కాక ఇక్కడ అయన ఏమి డ్రైవ్ చేయగలరు. ట్రాఫిక్ అంతా అస్త వ్యస్తంగా ఉంటుంది.ఆటో సుఖం.”అంది శాంత.
‘వదిన మరదళ్ళు ఒకరికి ఒకరు తీసిపోరు’ అనుకున్నాడు వాళ్ళ మాటలు విన్న,భావాలూ గ్రహించిన కూర్మారావు.
“సరే స్నానాలకి లేవండి. ఆలశ్యం చేస్తే గీజర్ లో నీళ్ళు చల్లారి పోతాయి. అవి మాములుగా చలి వదిలేలా ఉంటాయి.మేము అలాగే పోసుకుంటాం.” అంది శాంత.
ఆ మాటలకే కూర్మారావు కి వెన్నులోంచి చలి మొదలయింది.ఎందుకంటే అతను నీళ్ళు మరుగులు పోసుకుంటాడు.
గీజర్ ఎక్కువ సేపు వెయ్యనని,నీళ్ళు వేడి ఎక్కువ ఉండవని,అలాగే సర్దుకు పోవాలని చెప్పకనే చెప్పింది శాంత.
‘అమ్మ ఎంత కక్కుర్తి  శాంత నీకు!?’ అని మనసులోనే అనుకుంది రజిత.
ఆ పూటకి భోజనాలు అయ్యాయనిపించి అందరూ నిద్రకు ఉపక్రమించారు.
ఆ రాత్రి, కూర్మారావు దంపతుల రాక సందర్భంగా,  అయ్యే ఖర్చులు తామే భరించాల్సి ఉంటుందని అన్నాడు భుజంగం. డబ్బు అనవసరంగా ఖర్చు కాకుండా చూసుకోవాలని,వాళ్ళు ఉన్నంత కాలం ఇలా మాట్లాడాలి,అలా ప్రవర్తించాలి అంటూ  వేయి జాగ్రత్తలు చెప్పింది శాంత.
*                                     *                                           *
మరునాడు ఉదయం టిఫిన్లు అయ్యాక  ఊళ్ళో  వింతలు విశేషాలు చూడడానికి బయలు దేరారు.
కారు లేదు కనక ఆటో మాట్లాడుకుంటే బావుంటుందని కూర్మారావు అన్నాడు.
వెంటనే “ఆటో మాట్లాడుకోడం ఎందుకు అన్నయ్యగారు.షేర్ ఆటో బెటర్.మనం ఎక్కడ కావాల్సివస్తే అక్కడ ఎక్కుతాం ,ఎక్కడ కావాల్సివస్తే అక్కడ దిగిపోవచ్చు. బేరమాడుకుంటే వాడు నిమషం కూడా ఉండడు.ఏమీ చూడలేం.”అంది శాంత. భుజంగం యాంత్రికంగా తల ఊపాడు. రజిత ఏదో అనబోయి తమాయించుకుంది.
కూర్మారావు మాత్రం షేర్ ఆటో అన్నప్పటి నుంచి ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు.
అవేమి పట్టని శాంత షేర్ ఆటో ని పిలిచి పలానా ప్రదేశానికి వెళ్ళాలని చెప్పింది.
“అన్నయ్యగారు , వదినా, నేను రావడం లేదు.ఇంట్లో పనులు ఉన్నాయి.బయట ఎక్కడా తినడం మంచిది కాదు కదా.అదీ కాక మన తిళ్ళు ఇక్కడ దొరకవు.మీరు వచ్చేసరికి వంట చేసి రెడీ గా ఉంచుతాను.రాగానే భోజనాలు చెయ్యొచ్చు.” అంది శాంత.
కూర్మారావు,రజిత,భుజంగం ఆటో ఎక్కారు. ఆటో ఎక్కినప్పడినుంచి కూర్మారావు కంగారు పెరిగిపోయింది. ఆటో ఆగినప్పుడల్లా భయం ,భయంగా చూడడం మొదలు పెట్టాడు.
భుజంగానికి తన మిత్రుడి కంగారు కి కారణం అర్థం కాలేదు.కారణం అడిగితే కూర్మారావు చెప్పలేదు.
కానీ ఆటో ఆగినా, ఎవరన్నా ఎక్కడానికి ప్రయత్నించినా  ఇంచుమించు బిగుసుకు పోసాగాడు.
అలా ఎందుకు బిగుసుకు పోతున్నాడో అటు రజితకు గాని, ఇటు భుజంగాని కి గాని అర్థం అవలేదు.
అదృష్టం కొద్దీ ఆటో లో వేరెవరూ ఎక్క లేదు. ఒక పర్యాటక ప్రదేశం చూడడానికి ముగ్గురూ దిగారు.
అక్కడ వింతలు విశేషాలు చూడడం కన్నా ఆటో లోంచి దిగడమే సంతోషంగా అనిపించింది కూర్మారావు కి. 
అలాగ నాలుగు, అయిదు ప్రదేశాలు చూడడం అయ్యింది.ప్రతీసారి ఆటోలో ఉన్నంత సేపు కూర్మారావు భయపడడం జరుగుతోంది.అతనిని ఆ పరిస్థితిలో చూసిన భుజంగానికి ఏమీ అర్థం కావడం లేదు.
మొత్తానికి ఆ రోజు కొన్ని పర్యాటక  ప్రదేశాలు కవర్ చేసారు.
మరునాడు మళ్ళీ షరా మామూలే.
“పోనీ టాక్సీ మాట్లాడుకు వెళదాం” అంది రజిత.
అప్పుడు శాంత,భుజంగం కంగారు పడ్డారు.ఎందుకంటే డబ్బులు అతిధిని అడగలేరు.అంత డబ్బు ఖర్చు పెట్టాలంటే మనసు ఒప్పడంలేదు లేదు.ఆ విషయం సూటిగా చెప్పలేరు.
“అయ్యో అన్నయ్యగారు ఈ ఉళ్ళో టాక్సీలు పచ్చి మోసం, దగా.డబ్బు ఎక్కువ తీసుకోవడమే కాదు.దారి మళ్ళించి దోచుకుంటారు .మొన్న ఈ మధ్య అలాగే ఎవరినో చంపేసారు కూడా.” అంది శాంత.
ఆ దెబ్బకి ఇంక టాక్సీ ఊసెత్తలేదు కూర్మారావు,రజిత.
ఆ  మరుసటి రోజు  కూడా మరలా ఆటో లోనే బయలు దేరారు.
“భుజ్జు ఊళ్ళో స్వైన్ ఫ్లూ ఉందటరా!!.పేపర్లో చూసాను” భయం భయంగా అసలు విషయం చెప్పాడు కూర్మారావు.
“అయితే ఏమిటిరా!!??” అని అడిగాడు భుజంగం.
“ఎవరైనా అది ఉన్న వాళ్ళు షేర్ ఆటో ఎక్కితే!!??.మరీ మన పక్కనే కూచుంటారు కదా!!?? అసలు  ఈ మధ్య నాకు ఒంట్లో అంత బాగుండడం లేదు.” అన్నాడు కూర్మారావు.
“ఓస్! అదా నీ భయం.అయినా అంత అనారోగ్యం ఉన్న వాళ్ళు ఆటో ఎలా ఎక్కుతారు.అయినా వాళ్ళు మనం ఎక్కిన ఆటో ఎక్కుతారని ఏమిటి!!?? ”
“కానీ ఎక్కవచ్చు కదా!!??” తన సందేహం వెలుబుచ్చాడు కూర్మారావు.
“పోనీలెండి అంత భయమైతే  మనం వేరే ఆటో మాట్లాడుకుందాం. అంచలు, అంచలుగా వెడితే వెయిటింగ్ అదీ ఉండదు కనుక చౌకగా ఉంటుంది.”సలహా ఇచ్చింది రజిత.
“అన్నయ్యగారు రోజూ డబ్బులు  మీరు ఇస్తున్నారు.ఇకనుంచి మేమే ఇస్తాం.మీరు కాదనకూడదు” అని గట్టిగా చెప్పింది రజిత.
నిజానికి అది భుజంగానికి ఇబ్బందిగా అనిపించినా తన భార్యకి భయపడి ఒప్పుకున్నాడు.
వేరే  ఆటో మాట్లాడుకోడంతో కూర్మారావు ప్రశాంతంగా  ఉన్నాడు.
ప్రతి ప్రదేశం లో వింతలు విశేషాలు చాల నిదానంగా చూసాడు.భార్యతో, స్నేహితుడితో జోకులు వేసాడు.
అలా రోజంతా తిరిగారు.
ఆ రోజు  రాత్రి కూచుని మరునాడు చూడవలిసిన ప్రదేశాలు లిస్టు తయారు చేసాడు కూర్మారావు.
అలాగే ఊరినుంచి వెళ్ళేటప్పుడు ఏవేవి తీసుకెళ్ళాలో భార్యతో చర్చించాడు.
ఇక నుంచీ వెళ్ళే ప్రదేశాలన్నీ సువిశాలమైనవే అని , ఇరుకుగా ఉండే స్థలాలు లేవని, ఇక ఫ్లూ వాళ్ళు వచ్చినా  దూరంగా ఉండవచ్చని తన సంతోషం వ్యక్తం చేసాడు. 
ఇక తనకి ఫ్లూ భయం పోయిందని డిక్లేర్ చేసాడు.
మరునాడు తెలుగు వచ్చిన ఆటో వాడు దొరికాడు. కూర్మారావు సంతోషానికి అవధులు లేవు.
ఇన్నాళ్ళకి మళ్ళా బయట వాళ్ళతో తెలుగు మాట్లాడే అవకాశం వచ్చినందుకు అనందపడ్డాడు.
ఆటో అతనితో తెలుగులో  మాట్లాడుతూ ఉల్లాసంగా గడిపాడు.
శలవు పెంచి , ఇంకో నాలుగు రోజులు ఉండి, ఇంకా చుట్టూ పక్కల ప్రదేశాలు కూడా చూస్తే ఎలా ఉంటుందని ఆలోచించసాగాడు.
ఇక పది నిమషాలలో ఇంటికి వెళతారు  అనగా “బాబూ ఈ ఉళ్ళో స్వైన్ ఫ్లూ బాగా ఉందిట కదా!!?” అని ఆటో డ్రైవర్ ని అడిగాడు కూర్మారావు.
“అవును సర్.చాల ఎక్కువగా ఉంది. అంత ఎందుకు నాకు నిన్ననే స్వైన్ ఫ్లూ లక్షణాలాలా ఉన్నాయని డాక్టర్ అన్నాడు.కానీ ఇంట్లో కూచుంటే తిండి ఎలా గడుస్తుంది.ఆటో డ్రైవ్ చేస్తూనే ఉన్నాను.....ఏం చేయను!!??...   ఈ రోజు   జ్వరం బాగా ఎక్కువ  వచ్చినట్టు ఉంది...మిమ్మల్ని దింపేసి ఇంటికి వెళిపోతాను” అంటూ ఉన్నట్టుండి  విపరీతంగా దగ్గసాగాడు ఆటో డ్రైవర్.
“నిజంగా!!!?? “ అన్నాడు కూర్మారావు ఫై ప్రాణాలు పైకి పోతుంటే.
ఆటో డ్రైవర్ మాట్లాడలేకపోయాడు.దగ్గు అతనికి ఊపిరి సలపనివ్వడం లేదు.
‘అంటే ఆ రోజంతా స్వైన్  ఫ్లూ పేషెంట్ తో అతి దగ్గరగా గడిపానన్న మాట’ ఆ ఆలోచన రాగానే అపాదమస్తకం కంపించిపోయాడు కూర్మారావు.మృత్యువు ఒడిలో కూచున్నట్టనిపించింది అతనికి.
“అమ్మో” అంటూ విరుచుకు పడిపోయాడు కూర్మారావు.భుజంగం, రజిత , ఆటో అతను ఏమిటి అయ్యిందో అని కంగారు పడిపోయారు. అదే ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్ళారు.
కూర్మారావు ని ఎమర్జెన్సీ వార్డ్ లో ఉంచారు. ఇరవై నాలుగు గంటలు  అబ్జర్వ్ చెయ్యాలన్నారు.
భుజంగం ఇంటికి ఫోన్ చేసాడు.జరిగిన సంగతి చెప్పాడు.
శాంత పూర్తిగా వినిపించుకోకుండా”అలాగా !!?? అయితే వెళిపోతారన్నమాట!!” అంది సంతోషంగా.ఆమె చేతుల్లో ఖర్చులకు అని బ్యాంకు నుంచి అప్పుడే తెచ్చిన డబ్బు ఉంది.
“నీ పిండాకుడు.కారు కి వందలలో ఖర్చు అవుతందని కక్కుర్తి పడ్డావు.ఇప్పుడు  ఆసుపత్రి వాళ్ళు వాడికి హార్ట్ ఎటాక్  అంటున్నారు.వాళ్ళు కనీసం నెల్లాళ్ళు ఇక్కడ ఉంటారు.వాళ్ళ కోసం వాళ్ళ పిల్లలు, చూడడానికి వచ్చే చుట్టాలు, బంధువులు ....” కోపంతో మాటలు తడబడ్డాయి భుజంగానికి.
“ఇంట్లో బస్తా బియ్యం,సరుకులు తెప్పించి పెట్టు.పాల అతనికి రోజు ఆరు గాని ఎనిమిది గాని పాకెట్లు కావాలని చెప్పు.అందరికి నువ్వు వండి పెట్టలేవు గాని వంట మనిషిని చూడు.అర్జెంటు గా...... జీతం ఎంత అయినా సరే పని మనిషిని పెట్టుకో....నాకు నీరసం వస్తోంది.” అంటూ ఫోన్ పెట్టేసాడు భుజంగం.
శాంత కి  గుండెల్లో ఏదో సన్నగా బాధ అనిపించింది.గట్టిగా అరిచి విరుచుకు పడిపోయింది శాంత. 
డబ్బుకి తప్ప అనురాగం,అప్యాయతలకి,ప్రేమ బంధాలకి.స్నేహానికి విలువ లేని ఈ రోజులలో డబ్బే జీవితంగా బతుకుతున్న ఒక సగటు వ్యక్తి శాంత.  అవన్నీ శుద్ధ బూటకం అని నమ్మే వాళ్ళలో మొదటిది శాంత.  డబ్బు రక్షించదని,డబ్బుతో కొనలేని, పొందలేనివి చాలా ఉన్నాయని తెలుకోలేని మూర్ఖులకు ఒక ఉత్తమ ఉదాహరణ ఆమె.
చేతుల్లో ఉన్న కరెన్సీ నోటులను  గట్టిగా పట్టుకున్న ఆమె చేతులు , మమతలకన్నా మనీ కే ఎక్కువ విలువ ఇచ్చే మనుషుల హృదయలలాగే కుంచించుకు పోసాగాయి.
 ###


1 comment:

Pages