లోవరాజు కధలు - టీవీ నైను ప్రసాదు - అచ్చంగా తెలుగు

లోవరాజు కధలు - టీవీ నైను ప్రసాదు

Share This
లోవరాజు కధలు - 19
టీవీ నైను ప్రసాదు
కంభంపాటి రవీంద్ర 

ఉదయాన్నే కాఫీ తాగుతూ, టీవిలో  వార్తలు చూస్తూంటే లోవరాజు గాడొచ్చేడు .
నాకేసి చూసి 'వీటిని వార్తలు అనకూడదు . చాడీలు అనాలి.  సర్లే..  నిన్న మధ్యాన్నం   మా పినమావగారి ఫ్యామిలీ వైజాగు నుంచి చెప్పాపెట్టకుండా ఒచ్చేసేరు .. ఆళ్ళని అప్పనపల్లి , అంతర్వేది తీసుకెళ్లమని అడిగితే ,  ఆ గుళ్లన్నీ తిప్పొచ్చేను ..అందుకే కలవడం కుదర్లేదు ' అన్నాడు
'ఫర్లేదులే .. నిన్నంతా కొంచెం ఒంట్లో బాగోలేదు .. అందుకే నేను కూడా నీకు ఫోను చెయ్యలేదు ' అన్నాను
'ఏం ?..ఏవయ్యింది ?' అన్నాడు
'ఏమోరా బాబూ .. నిన్న నిద్ర లేస్తూనే ఒకటే తలనొప్పి .. సాయంత్రానికి తగ్గింది ' అన్నాను
'తలనొప్పన్నప్పుడు , ఉదయాన్నే టీవి వార్తలు అస్సలు చూడకూడదు .. అర్జెంటుగా టీవీ కట్టెయ్యి .. ఇదిగో నిన్న నగరం దగ్గిర పిచ్చిగ్గూళ్ళు కొన్నాను .. తీసుకో ..' అంటూ సంచీ అందించేడు
'పిచ్చిగ్గూళ్ళేవిట్రా బాబూ ? నీకేవైనా పిచ్చా ' అన్నాను '
 లోవరాజు గాడు నవ్వుతా చెప్పేడు 'మరదే .. అమలాపురం దాటిన తర్వాత నగరం  అనే ఊరొస్తుంది .. ఆ ఊళ్లోని ముస్లింలు చేసే ఈ పిచిగ్గూళ్లనే స్వీటు చాలా ఫేమస్సు ..దీన్నే గరజి అని కూడా పిలుస్తారు .. కాబట్టి ఎదవనుమానాలు పక్కనెట్టి రుచ్చూడు ..' అన్నాడు 
ఆడు చెప్పింది నిజమే .. భలేగా ఉన్నాయా పిచిగ్గూళ్ళు .. కారప్పూస కన్నా సన్నంగా ఎలా చేసుంటారా అని నేను ఆశ్చర్యపడుతూంటే , లోవరాజు గాడు 'నీకు టీవీ నైను ప్రసాదు గారి కధ చెప్పాలి .. ఇందాక నువ్వు టీవీ వార్తలంటే గుర్తొచ్చింది'  అంటూ మొదలెట్టేడు.
చెల్లుబోయిన రమణారావు గారి భార్య కమలమ్మ కి నెల తప్పితే, ఆ విషయం వాళ్ళ ఇంటి ఓనరు మేకుల సత్యప్రసాదు గారి భార్య కాళీరత్నం గారికి చెప్పుకుంది . 'ఇంకా రెణ్నెల్లు కూడా నిండలేదు కదా .. మూడోనెల రానీ. . అప్పుడు మన చుట్టాలకీ , స్నేహితులకీ చెబుదామన్నారండి మా ఆయనగారు .. కాకపొతే మీరు నాకున్న ఒకేఒక క్లోజు ఫ్రెండు కదండీ .. అందుకే మీ ఒక్కరికే ఈ విషయం చెప్పేనండి .. ' అనేసరికి కాళీరత్నం గారు చాలా సంతోషపడిపోయి , 'సర్సరే .. నేనెవ్వరికీ చెప్పను కానీ కనీసం నీ నోరు తీపిచెయ్యనీ .. నిన్న అన్నవరం నుంచి ఎవరో సత్యన్నారాయణ స్వామి ప్రసాదం తెచ్చిచ్చేరు .. తిందువుగాని' అని  లోపలికెళ్ళింది . పక్క గదిలో పేపర్ చదువుకుంటున్న సత్యప్రసాదు గారు ఏదో  సెల్ఫోన్ లో టైపు చేసుకుంటున్నారు .
సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికొస్తూనే రమణారావు గారు కమల ని కొట్టినంత పని చేసేరు . ఆ రోజు మధ్యాన్నం ఆయన పై ఆఫీసరు బొంతు జయరాజు గారు స్టాఫందరి ముందూ 'మన రమణారావు తండ్రి కాబోతున్నాడు .. అందరూ కంగ్రాట్యులేషన్స్ చెప్పండి .. వీలైనంత త్వరగా పార్టీ ఇవ్వాలోయ్ ' అన్నాట్ట . షాకైపోయిన రమణారావు 'మనిద్దరికీ తప్ప నీ కడుపు విషయం ఇంకెవరికీ తెలీదు కదా .. ఎదవకానా.. ఊరంతా టముకేసేసేవు ' అంటూ కమల మీద అరుస్తోంటే , ఆవిడకి ఏమీ అర్ధం కాక ఒకటే ఏడుస్తా , 'కాళీరత్నం  గారికి తప్ప ఇంకెవరికీ చెప్పలేదండీ.. పుట్టబోయే మన బిడ్డ మీదొట్టు' అంటే ' అదీ సంగతి . నీకు దొరక్కదొరక్క ఆవిడే దొరికిందా చెప్పడానికి ... వాళ్ళాయనో టీవీ నైనన్న సంగతి నీకు తెల్సుకదా' అంటూ మళ్ళీ తిట్లు మొదలెట్టేడు!
సత్యప్రసాదుదో వింత మనస్తత్వం..ఏదైనా సంగతి విన్నాడా ...ఆ సంగతి అందరికీ చెప్పేదాకా చేతులూ నోరూ ఊరుకోవాయనకి.. చేతులెందుకన్నానంటే...ఈ రోజుల్లో వాట్సాప్ ఒకటొచ్చింది కదా . . అందులో టైపు చెయ్యడానికన్నమాట.
ఎదురింట్లోని జనిపల్లి వినోద్ గారింటికి ఆయన బావమరిది ఫ్యామిలీ వస్తే, ఆ విషయాన్ని వెంటనే ఆఫీసులో ఏదో మీటింగులో ఉన్న వినోద్ గారికి 'యువర్ వైఫ్స్ బ్రదర్ అండ్ ఫ్యామిలీ ఎట్ యువర్ హౌజ్' అని మెసేజ్ పెట్టేసేడు. అసలే బావమరిదంటే పడని ఆ వినోద్ గారు సాయంత్రం ఇంటికొచ్చి పెళ్ళాన్ని చితగ్గొట్టేసేడు 'నేను లేనప్పుడు మీ వాళ్ళని ఇంటికి పిలిపించుకుంటావా    అంటూ! 
సత్యప్రసాదు తో ఎప్పట్నుంచో మాటల్లేని వాళ్ళ పెదనాన్న దారం వెంకటరత్నం గారికి సత్యప్రసాదు నుంచి అర్ధరాత్రి మెసేజ్ వచ్చేసరికి , ఆయన ఆశ్చర్యపోయేడు , 'ఏమిటా అని ఆ మెసేజి చూసేసరికి 'నువ్వెంతగానో అభిమానించే హిందీ యాక్టర్ శశికపూర్ పోయేడు .. ఆ విషయం చెబుదామనే మెసెజ్' అని ఉంది . ఈ వెధవ ఓ మంచీ చెడూ కనుక్కోడు గానీ ఈ పనికిమాలిన మెసేజీలొకటి  అంటూ ఒకటే విసుక్కున్నాడాయన !
ఉద్యోగంలో ఉన్నంత కాలం బాగానే డబ్బులు సంపాయించేసి , వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న సత్యప్రసాద్ గారికి ఒకటే వ్యాపకం .. తనకి ఓ విషయం గానీ వార్త గానీ తెల్సిందంటే చాలు వెంటనే అయినాళ్ళకీ , కానాళ్ళకీ మెసేజీలు పెట్టేయడమే .  
ఈయన వార్తలు మోసేసే విధానం చూసిన జనాలు 'ఈయనెవడ్రా బాబూ .. ఆ టీవీ నైనాడిలాగా వెంటవెంటనే  అప్ డేట్లు ఇస్తూంటాడు ' అని చాటుగా నవ్వుకుని , ఈయన పేరుని టీవీనైను ప్రసాదు అని మార్చేసేరు!
జనం ఈయన్ని ఎంత తిట్టుకున్నా , ఆళ్లూ మనుషులే కదా .. పక్కోడి విషయాలంటే యామాసక్తి ఉంటుంది .. దాంతో ఈయన పెట్టే వాట్సాప్ మెసేజీల కోసం తెగ ఆత్రుత గా ఎదురుచూసేవారు !' అన్నాడు లోవరాజు 
'భలే వెరైటీ క్యారక్టరు .. ఎక్కడుంటాడాయన ?' అన్నాను 
'కంగారు పడద్దు .. చెప్పనీ .. ఆ మధ్య ఓసారి హైదరాబాద్ నుంచి వస్తూ  బోగీలో పెదముత్యం మంగారావు గారు ఎవరో ఆడలేడీస్ తో కనిపించేసరికి, ఆ విషయం అందరికీ  మెసెజ్ పెట్టాలని,  సిగ్నల్ సరిగ్గా  లేకపోడంతో బోగీ తలుపుదగ్గిరికెళ్ళి ఆ కుదుపు కి రైల్లోంచి కిందడిపోయి పోయేడు .. ఎప్పటికప్పుడు వార్తలు చేరేసే ప్రసాదు గారి మరణవార్త మటుకూ వారం దాకా ఎవరికీ తెలీలేదు ..ఆఖరికి ఆయన ఇంట్లో వాళ్ళకి కూడా ' అంటూ ముగించేడు లోవరాజు !
***

No comments:

Post a Comment

Pages