శ్రీమద్భగవద్గీత -25 - అచ్చంగా తెలుగు
ఓం శ్రీ సాయిరాం
శ్రీమద్భగవద్గీత -25
రెడ్లం రాజగోపాలరావు

11 వ అధ్యాయము
విశ్వరూప సందర్శనయోగము
ఎడతెరిపిలేని అర్జునుని ప్రార్థనలను మన్నించి భగవానుడు కరుణతో విశ్వరూపాన్ని అర్జునునికి చూపించెను. విశ్వంలో ప్రతియణువునందు భగవంతుని ఉనికిని తేటతెల్లమొనర్చెను. విశ్వమెల్లెడల నిండియున్న చైతన్యమే భగవంతుడు. విశ్వరూపాన్ని దర్శించటానికి అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాననేత్రాన్ని ప్రసాదించాడు.నిజానికి ప్రతిమానవునిలో జ్ఞాననేత్రముంది. నిరంతరసాధన, ధర్మప్రవర్తన, సత్యసంధత మొదలగు సద్గుణ సంపన్నులకు మాత్రమే జ్ఞాననేత్రం (3వ కన్ను) తెరుచుకుంటుంది.బాహ్యమైన చర్మచక్షువు ద్వారానే విశ్వవిరాడ్రూపుని తెలిసికొనగలము.

అర్జున ఉవాచ

మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్
యత్త్వయోక్తంవచస్తేనమోహోయంవిగతోమయ

1 వ శ్లోకం
ఇంత వరకూ భగవానుడు చెప్పినట్టి ఆధ్యాత్మిక బోధవలన అంధకారము తొలగినపిదప అర్జునుడు బాహ్యజగత్తు అనిత్యమని, ఆత్మ శాశ్వతమని తెలిసికొనినవాడై పరమాత్మయైన శ్రీకృష్ణుని విశ్వరూపదర్శనాన్ని, ప్రసాదించమని, ఆత్మసాక్షాత్కారస్థితిని కలుగజేయుమని ప్రార్థించెను.

ప్రపంచమున ఎన్నియో విద్యలుగలవు, ఎంతయో సంపదగలదు. ప్రకృతి యందునున్న బాహ్యసంపదలేవియు మనుజునకు శాశ్వత ఆనందాన్ని కలుగజేయలేవు. ఒక్క భగవంతుడు మాత్రమే శాశ్వతానందప్రదాత.

శ్రీ భగవానువాచ:
పశ్యమే పార్థరూపాణి శతశోధ సహస్రశ:
నానా విధాని దివ్యాని నానావర్ణాకృతీనిచ.
5 వ శ్లోకం

ఓ అర్జునా! అనేక విధములైనట్టివియు, అలౌకికమైనట్టివియు, వివిధవర్ణములు, ఆకారములుగలవియు, అసంఖ్యాకములైనట్టి నారూపములను జూడుము.

సమస్త బ్రహ్మాండములతో గూడిన చరాచార జగత్తంతయు పరమాత్మయొక్క అంశమునందు ఇమిడియున్నది. కావున తన యొక్క విశ్వరూపమునయున్న ఒకానొక ఓంగముగా నున్న దానినిగా జూడుమని అర్జునునకు పరమాత్మదెలియజేసెను. దీనిని బట్టి పరమాత్మ యొక్క అనంతరూపమెంత విశాలమైనదో మనము యోచించవచ్చును.

ఇట్టి అనంతరూపుడు, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడుగు పరమాత్మను-అల్పుడగు మానవుడు భక్తి ప్రపత్తులుగలిగి వినయవిధేయుడై సేవించుట ధర్మము. అట్టితరి పరమాత్మయనుగ్రహమునుబడసి జ్ఞానమును పొంది, తరించుటకు అవకాశముండును. లేకున్న ఈ జననమరణ ప్రవాహ భ్రమణమున తగుల్కొని జీవుడు దుఃఖమునబడవలసియున్నది.
పంచభూతాత్మకమగునేత్రము భౌతిక పదార్థములనే చూడగలదుగాని, చిన్మయమైన ఆత్మవస్తువును చూడలేదు. పరమాత్మను దర్శించవలెనన్న జ్ఞాననేత్రము ద్వారానే అది సాధ్యమైయున్నది.

సంజయ ఉవాచ:
అనేక వక్త్రనయన మనేకాద్భుత దర్శనమ్
అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్

10 వ శ్లోకము
దివ్యమాల్యామ్బరధరం దివ్యగన్ధానులేపనమ్
సర్వాశ్చర్యమయం దేవమనన్తం విశ్వతోముఖమ్

11 వ శ్లోకం
శ్రీ వేదవ్యాసులవారి అనుగ్రహముచే సంజయుడు యుద్ధ రంగమున జరుగు వృత్తాంతములన్నింటిని తెలిసికొనినవాడై భగవానుని విశ్వరూపమును గూడ దర్శించి, ఆ విశేషములన్నింటిని ధృతరాష్ట్రునికెరిగించుచున్నాడు.
అత్తరి పెక్కుముఖములు, నేత్రములుగలదియు అనేక అద్భుతములను జూపునదియు,దివ్యములైన ఆభరణములతో గూడినదియు, దివ్యమగు సుగంధ పరిమళములతో గూడియున్నదియు, అనేక ఆశ్చర్యములతో ప్రకాశమానమైనదియు, అంతములేనిదైన తన విశ్వరూపమును భగవానుడర్జునునకు జూపెను.


ఆకాశమందు వేలకొలది సూర్యుల యొక్క కాంతి ఒకేతావునయున్నచో అది ఆ మహాత్ముని సరిపోలియున్నది.ఆయద్భుతరూపమును దర్శించి అర్జునుడు ఆశ్చర్యచకితుడై భగవానుని ఈ విధముగా స్తుతించుచున్నాడని సంజయుడు చెప్పుచున్నాడు.

అర్జున ఉవాచ:
పశ్యామి దేవాంస్తవదేవదేహే సర్వాంస్తధా భూతవిశేష సంఘాన్
బ్రహ్మాణ మీశం కమలాసనస్థ మృషీంశ్చ సర్వానురగాంశ్చదివ్యాన్

15 వ శ్లోకం
దేవా! నీ శరీరమందు సమస్త దేవతలను చరాచరా ప్రాణికోట్ల సమూహములను, సృష్ఠికర్తయగు బ్రహ్మదేవుని, సమస్త ఋషులను, దివ్యమైన సర్పములను చూచుచున్నాను.
జగద్రూపుడా ! నిన్ను అనేక హస్తములు, ఉదరములు, ముఖములు, నేత్రములు గల వానినిగా, అనంతరూపునిగా చూచుచున్నాను. నీ యొక్క మొదలుగాని, ముధ్యముగాని, తుదనుగాని నేనుగాంచలేకున్నాను.
నిన్ను అనేక కాంతిపుంజములుగను, అంతటను ప్రకాశించువానిగా, జ్వలించు అగ్ని, సూర్యునివంటి కాంతిగలవానిగను, పరిమితిలేని వానినిగా చూచుచున్నాను.

(సశేషం)
ఇట్లు
సర్వజన శ్రేయోభిలాషి
మీ రెడ్లం రాజగోపాలరావు
పలమనేరు
9482013801

1 comment:

  1. బాగున్నదండి ..గీతాసారం ధన్యవాదాలు..

    ReplyDelete

Pages