అరుంధతి - అచ్చంగా తెలుగు
 అరుంధతి 
మంత్రవాది వి.వి.సత్యనారాయణ 
          
విశాఖపట్నం రైల్వేస్టేషన్ రెండవ ప్లాట్ఫరం లో  బెంగళూరు నుంచి వచ్చిన గరీబరథ్ కీచుమని శబ్దం చేసుకుంటూ ఆగింది. ఎవరి హడావుడి లో వారున్నారు. గబగబా తన లగేజ్ తీసుకుని క్రిందికి దిగి చుట్టూ ఓసారి చూసి కొంచెం పక్కకి జరిగి తన పర్సులోంచి సెల్ఫోన్ తీసింది అరుంధతి. సన్నగా నాజూగ్గా విశాలమైన కళ్ళు, రింగుల జుత్తు, చిన్న ముడి, తెల్లని నేత చీర, తెల్లని జాకెట్టు మోచేతులు దాకా...చాలా సాదాసీదాగా ఉంది. ఒక్క సారి ఏదో ఆలోచించి ఫోన్ మళ్ళీ పర్సులో పడేసి స్టేషన్ బయటికొచ్చి చూసింది.
            “మేడమ్! ఆటో..”, “అమ్మా! ఆటోకావాలా...” ఆటోవాళ్ళ గట్టిగానే అరుస్తున్నారు. అదే సమయంలో ఆమెకో విచిత్ర సంఘటన కనిపించింది. మాసిన గడ్డం, చిరిగిన గుడ్డలు, వళ్ళంతా మట్ట పట్టినట్లుంది. ఎవరో యువకుడు తీగలు తెగిన గిటార్ మీద రకరకాల గీతాలు రమ్యంగా పలికిస్తున్నాడు. ఆ గిటార్ కూడా అతని జీవితానికి చాలా దగ్గరగా ఉంది.
              “కోటి విద్యలు కూటి కొఱకే” అని ఒకాయన నంటుంటే, ఆఁ...ఇవ్వన్నీ నాటక లండి బాబూ..ఈ రోజుల్లో ఎవడు గుడ్డోడో ఎవడు మంచోడో తెలీడం లేదండీ!....” సాగదీస్తూ అన్నాడో మహానుభావుడు. మనదేశంలో వాక్స్వాతంత్ర్యాన్ని డబ్బులు పెట్ట కొనుక్కోనవసరం లేదుకదా! కొంతమంది జాలితో తమకి తోచింది అతని ముందు పరచిన గుడ్డమీద వేసి వెళ్ళపోతున్నారు. ఈ విద్య తనని చేరదీసిన ‘బాబాయ్’ నేర్పాడతనికి. అంతలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ తన ప్రతాపాన్ని చూపించాడు. ఎందుకో తెలీదు...డ్యూటీ ఎక్కతే అన్నీ మరిచిపోతారనుకుంటా. ఎవర్నీ వదిలిపెట్టరు..ఆ కానిస్టేబుల్ చేసిన న పనికి జనం వేసిన చిల్లర చెల్లాచెదురుగా పడిపోయింది. అసహాయుడిగా ఉండిపోయాడు.
               అరుంధతి ఒక్క ఉదుటున అక్కడికి చేరుకుని, “అతనేం తప్పు చేసాడని... చాల తప్ప చేసారు. ఇటువంటి వాళ్ళమీదే మీ ప్రతాపం. పెద్దవాళ్ళ జోలికి పోలేరు” అంటూ చెదిరిపోయిన డబ్బులన్నీ జాగ్రత్తగా తీసిచ్చింది. అందరూ వింతగా చూస్తున్నారు అరుంధతి వైపు
               “ఏవమ్మో! నీకంత ఇదిగా ఉంటే తీసుకెళ్ళి ఉద్ధరించు...ప్రపంచంలో చాలా మందే ఉన్నారు ఇలాంటోళ్ళు” ఆ గొంతులో ఖాకీ కర్కశత్వం ధ్వనించింది.
                 ప్రశాంత వాతావరణంలో జీవితాన్న గడుపుతున్న అరుంధతికి వాగ్వివాదం నచ్చదు. అయినా ఆరోజు మానవత్వం నశించిపోతుంటే ఆమె తట్టుకోలేకపోయింది. “నాకు తెలుసు ఏంచెయ్యలో ?” అంటూ ఆటో పిలిచింది.
                  “ఎక్కడి కెళ్ళాలి మేడమ్?” నమ్రత గా అడిగాడు.
                  “”సీతమ్మధార...అమ్మ ఆశ్రమం....”
                   “అలాగే మేడమ్...ఒక్కనిమిషం...” అంటూ తన ఆటోని తీసుకొచ్చి ఆపాడు.తన లగేజ్ లోపల పెట్టి, “రండి మేడమ్” అన్నాడు.
                   “ఒక్క నిమిషం... ఇతను కూడా వస్తాడు..”అంది.
                   “మేడమ్!!” ఆశ్చర్యం వ్యక్తం చెసాడు.
                    “నువ్వు విన్నది నిజవేఁ!...రా..బాబూ...” అతని చెయ్యి పట్టుకుని ఆటో ఎక్కించి తనూ కూర్చుంది అరుంధతి.
                     “ మేడమ్....”ఏదో ఆ యువకుడు చెప్పబోతుంటే...
                      “ఆశ్రమానికి వెళ్ళింతరవాత అన్నీ వివరంగా మాట్లాడుకుందాం. ఎంతోమంది కల్మషంలేని మంచివాళ్ళమధ్య హాయిగా ఉందుగానీ..అయ్యా! నువ్వ ఆటోని పోనియ్యి.
                       “మేడమ్!..నేనెవరో...నా కులవేంటో తెలీదు...నాకంటూ ఓ ఎడ్రస్ లేదు. మీరు!!!”
                       “అవ్వన్నీ తరవాత మాట్లాడుకుందాం...చెప్పానుగా...”
                        ఆ యువకుడు మమౌనంగా ఉండిపోయాడు. ఆటో శబ్దం చేసుకుంటూ ముందుకు వేగంగా సాగిపోయింది.
                                                              ***********
                       చుట్టూ కొబ్బరి, మామిడి, జీడి మామిడి చెట్లు, కొండ పక్కనే ఎఱ్ఱని బంగాళా పెంకులు పరిచిన ఇళ్ళ సముదాయం. మరోపక్క గోశాల. అహ్లాదకరమైన వాతావరణం. ఒక్క ముక్కలో చెప్పాలంటే మహర్షుల ఆశ్రమాల తాలూకు పర్ణశాలల్లా ఉన్నాయి. అక్కడ ఏ ఆధారం లేని వృద్ధులుగానీ, చిన్నపిల్లలు గానీ మొత్తంమీద  ఓ అరవై మందికి పైనే ఉంటారు. అక్కడ పని మనుషులంటూ ఎవరూ ఉండరు. ఓపికను బట్టి అందరూ కలసి అన్ని పనులూ వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. అందరూ భోజనాలు చేసే హాలులో భోజనం చెయ్యడానికి వారి వారి దేవుళ్ళకు ప్రార్ధించి సిద్ధంగా ఉన్నారు.
             అరుంధతి కొత్తగా వచ్చిన యువకణ్ణి పరిచయం చేస్తూ..”ఇతను కూడా ఈ రోజునుంచి ఇక్కడే మనతో పాటే ఉంటాడు. ఇతని పేరు.....” ఆగిపోయింది.
              వెంటనే ఆ యువకడు, “నాకంటూ ఏపేరూ లేదు..ఎవరూ లేరు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ‘బాబాయ్’ అని పిలిచే ఒకే ఒక వ్యక్తి... తను అడుక్కుంటూ తెచ్చకున్న దాంట్లో నాకూ ఓ ముద్ద పెట్టి పెంచాడు. చాలా సార్లడిగాను నా గురించి. ‘వివరాలు తెలియవు గానీ, ఎవరైనా విడిచిపెట్టి వెళ్ళారో...తప్పిపోయావో బుజ్జోడా!’ అనేవాడు. కొన్నాళ్ళకి ఆ దేవుడు బాబాయిని కూడా నానుంచి దూరం చేసాడు. పాపం బాబాయ్ పోతూ నాకిచ్చిన ఆస్తే గిటారు. ఆ గిటారే ఈ మహాతల్లి కంట్లో పడేట్టు చేసింది. నన్ను ఎలా పిలవాలని అనిపిస్తే అలా పిలవండి.” అన్నాడా యువకుడు.
             ఆశ్రమంలో అందరికంటే పెద్దవాడైన సీతారామయ్య, “అమ్మా! అరుంధతీ..అతనికి ఓ మంచి జీవితం ఇవ్వలనే నీ తపన అర్ధమౌతోంది. నువ్వే ఓ మంచి పేరు పెట్టి ఆశీర్వదించు. అదే అతని కొత్త జీవితానికి నాంది కావాలి”అన్నాడు. మిగిలినవారు కూడా సమర్ధించారు.
           “అవును మేడమ్!...వారు చెప్పిందే నిజం. ఇక్కడ మళ్ళీ పుట్టినందుకు మీరే ఒక పేరు పెట్టండి. ఆ పేరుతో, మీరు పోసిన ఊపిరితో బతుకుతాను.”
            “ఎందుకో..నిన్ను చూసింతరవాత ఈ విశ్వాన్ని నీ సంగీత వెలుగులతో నింపగలవని అనిపించింది. అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ‘విశ్వ తేజ’ గా నీ కొత్తజీవితం ప్రారంభించు.నువ్వు చదువుకోవాలి. నీ చేతి వేళ్ళు అద్భుతాలు సృష్టించి సంగీత ప్రపంచాన్ని ఆనందంలో ముంచెత్తాలి. కావలసిన ఏర్పాట్లు నేను చేస్తాను. పట్టుదలతో కృషి చేసి సాధించు.” అతని మీద ఆమెకున్న నమ్మకం ధ్వనించింది.
            “నేను ఇదంతా చెయ్యగలనా మేడమ్!! నాకు చదువు లేదు. అంధుణ్ణి. పైగా ఈ తీగలు తెగిన గిటారు...”
             “అంధుణ్ణని ఇంకోసారి అనకు. నీకు మనో నేత్రం ఉంటుంది. ఎందుకలా అధైర్య పడతావు. నీ వెనుక మేమంతా ఉన్నాం...ధైర్యంగా అడుగు ముందుకేస్తే ఆ శబ్దానికి అపజయం భయపడాలి.నీకు ఓ మంచి గురువుగార్ని ఏర్పాటు చేస్తాను. నీ గిటారు కంటే ఇంకా చిన్నదిగా ఉంటుంది. దాన్ని మాండొలిన్ అంటారు...అదే నీ బంగారు భవిష్యత్తుకి ఆధారం అవుతుంది. కృషీ, పట్టుదలలతో సాధిస్తావు కదూ! నా నమ్మకాన్ని నిలబెడతావు కదూ!”
            “తప్పకుండా మేడమ్... నా మీద మీకున్న నమ్మకమే నన్ను ముందుకు నడిపిస్తుంది మేడమ్. మరి బాబాయ్ ఇచ్చిన గిటారు...
             “దీన్ని బాబాయ్ మధురజ్ఞాపకంగా ఉండేట్టు నేను చేయిస్తాగా....”
             “మీకు చాలా నమస్కారాలు మేడమ్.”
              “ఓహ్! క్షమించాలి....అన్నపూర్ణమ్మ తల్లీ....మన కోసం అన్నం ఎదురు చూడకూడదు.మొదలు పెట్టండి. చాలా ఆలస్య మైపోయింది.”
                “ఓ మహత్కార్యానికి ఈ రోజు సంకల్పం చేసావు. ఆ భగవంతుడు నీకు సంపూర్ణ ఆయురారోగ్యా లిచ్చి సుఖంగా చూడాలి. నీలాంటి అమ్మలు మా లాంటి వాళ్ళకి చాలా అవసరం తల్లీ.” సీతారామయ్య.
                 “నన్ను మరీ అంత పెద్దదాన్ని చెయ్యొద్దు. మీ అభిమానం. ఇదతా దైవేచ్ఛ.” అరుంధతి.
                                                                ***********
          “హలో! గురువుగారు..నేను అరుంధతిని. ఎలా ఉన్నారు?”
         “అమ్మా! అరుంధతి నేను బావున్నాను. నువ్వెలా ఉన్నవమ్మా?”
         “నేను బానే ఉన్నాను గురువుగారు..మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి గురువుగారు.”
          “ఏంటమ్మా...ఇంత ఆనందం నేను ఎప్పుడూ నీ గొంతులో వినలేదు.”
          “మట్టిలో ఒక మాణిక్యం దొరికింది గురువుగారు...దానికి మీరు మెరుగు పెట్టాలి. దానికోసమే మీతో మాట్లాడ్డానికి రావాలి.”
           “అమ్మా...నేనే వస్తాను. నిన్ను, ఆశ్రమాన్నీ చూసి చాలా రోజులైంది. నేనే వస్తానమ్మా. పైగా ఆ మాణిక్యాన్ని చూసినట్టుంటుంది కదా! వెంటనే బయలు దేరతానమ్మా.”
            “అలాగే గురువుగారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం ఉంటా గురువుగారు.”
            “అలగేనమ్మా”
             తన ఆఫీసు రూం లోంచి బయటికొస్తూ, “గురువుగారు నా కోసం వస్తారు. తేజ దగ్గరున్నానని చెప్పండి” అంటూ బయలుదేరింది.
             తేజా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఏదో మనసులో భయం. ఎందుకో తెలీని గుబులు. సీతారామయ్య అలాగే చూస్తున్నాడు తేజా వంక.
            అదే సమయంలో అరుంధతి లోపలికొచ్చింది. “తేజా!” పిలిచింది.
            “మేడమ్!..ఎప్పుడొచ్చారు?” అడిగాడు.
            “ఇప్పడే...ఏంటి? అలా ఉన్నావ్!”
            “ఏం లేదు మేడమ్.”
            “గురువుగారు నిన్ను చూడ్డాని కొస్తున్నారు. నాకు తెలిసి వచ్చేస్తూంటారు.” అంది.
            “అవునా మేడమ్..నాకెందుకో చాలా భయంగా ఉంది. మీ ఆశయాన్న నేనెలా నెరవేర్చ గలనాని”
            “వచ్చే గురువుగారి గురించి నీకు తెలీదు. చాలా గొప్పవారు. ఆయన ఆశీస్సులు నీకుంటే చాలు. నా ఆశయం నెరవేరినట్టే.” 
             “ఏంటమ్మా..అరుంధతీ! ఆశీస్సులంటున్నావ్?” లోపలికొస్తూ అన్నాడు.
             “గురువుగారూ! నమస్కారం... రండి. మీ గురించే” 
           ఆఫీసులో అడిగితే ఇక్కడున్నవని చెప్పారు. ఇంతకీ ఆ మాణిక్యం ఎక్కడ?” అడిగాడు.
          తేజా చెయ్యి పట్టుకుని, “తేజా! సోమయాజులు గురువుగారు. నమస్కారం చెయ్యి” అంటూ సోమయాజులు గారు నిలబడి ఉన్న చోటుకి తీసుకెళ్ళింది. సోమయాజులు గారు ‘అంధుడా’ అన్న సంజ్ఞకు ‘అవును’ అన్నట్టు తలూపింది. తేజా మెల్లిగా వంగి సోమయాజులు గురువుగారి పాదాలకు
“నమస్కారం సర్!”  నమస్కరించాడు వినయంగా.  
             “లే నాన్నా...లే..మనోవాంఛా ఫలసిద్ధిరస్తు...” తేజాని లేవదీస్తూ..”అర్ధవైందమ్మా..నీ తాపత్రయం.”
               తేజా! నీ గిటారు తీసుకుని నేను చూసిన ఆరోజు వాయించావు..అదే ఒక్కసారి గురువుగారికి వినిపించు.
               “అలాగే మేడమ్..” అంటూ తన బాబాయ్ ఇచ్చిన గిటారు తీసుకొని ‘ఎదరో మహాను భావులు’ అంటూ ఆ ఉన్న మూడు తీగల మీద నాదాన్ని పలికిస్తుంటే, సోమయాజులు గారు అతని వేళ్ళ కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. అతనిలోని తపన కొట్టొచ్చినట్టు కనబడింది. తేజా కీర్తన ముగించాడు.
             “చాలా బావుంది...ఎలా నేర్చుకున్నవు..”
             “నాకేం తెలీద్సర్...” వినయంగా చెప్పాడు.
             “అమ్మా! కారణం లేందే నువ్వు ఏపనీ చెయ్యవు..మంచి నిర్ణయం తీసుకున్నావు. తేజా! నువ్వ చాలా అదృష్ట వంతుడివి. తప్పకుండా ఈ ప్రపంచానికి ఓ గొప్ప కళాకారుణ్ణి అందిస్తాను.”
              తేజా కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయి. అది గమనించిన అరుంధతి భుజంమీద చెయ్యి వేసి అనునయించింది.
             “అరుంధతీ! మంచిరోజు చూసి పాఠం మొదలు పెడదాం. ఇంతకీ ఏమీ నిర్ణయించావ్ ఇన్స్ట్రుమెంటు.” అడిగాడు సోమయాజులు గారు.
              “మాండొలిన్ గురువుగారు. ఎందుకో అదైతే బావుంటుందని పించింది. నిన్న మార్కెట్టు కెళ్ళి తీసుకొచ్చాను కూడా..మీతో చెప్పకుండా చేసినందుకు ఏమీ అనుకోకండి గురువుగారు” వేడుకోలుగా అంది.
               ఇందులో అనుకునేదేం ఉందమ్మా..నీ నిర్ణయం వెనుక ఎంతో అంతరార్థం ఉంటుంది. తేజా! ఇది మనిద్దరికీ ఓ ఛాలెంజ్. అహోరాత్రులు కష్టపడాలి. అటు సంగీతం, ఇటు మామూలు చదువు. అరుంధతమ్మ కళ్ళ పడడం నీ పూర్వజన్మ సుకృతం...ఉంటానమ్మా..అరుంధతీ!”
          “గురువుగారు చిన్న విన్నపం...మీరు వెళ్ళేప్పుడు మాండొలిన్ తీసుకు వెళ్ళి శారదాంబ పాదాల దగ్గర ఉంచి అర్చన చేయించి తీసుకు రండి”
         “ఎంత ఉన్నతురాలవమ్మా! తప్పకుండా...తేజా యుద్ధానికి రెడీగా ఉండు”
  “అలాగే గురువుగారు” 
 అరుంధతి, సోమయాజులు బయల్దేరారు.
  *********
           ఆ రోజు రాత్రి ప్రాక్టీసు చేస్తునే ఉన్నాడు..సీతారామయ్య ఆశ్చర్యంగా చూస్తున్నాడు తేజా వైపు. తేజా మాత్రం కఠోరమైన సాధన చేస్తున్నాడు. అవును హైదరాబాద్ ప్రోగ్రాం గనక సక్సెస్సయితే..ఇక తేజా వెనక్కి తిరిగి చూసుకునే పనుండదు. అందుకే తేజాలో పట్టుదల బాగా పెరిగి పోయింది. 
            సీతారామయ్య తేజా వంక చూస్తూ, “ఎంత మారిపోయావయ్యా...ఈ ఆరేళ్ళ కాలంలో..అరుంధతమ్మ ఎంత ముచ్చట పడుతోందో నిన్ను చూసి...చాలా అదృష్టంరా నీది.”
           “హైదరాబాద్ ప్రోగ్రాం గురించి గురువుగారు చాలా గొప్పగా చెప్పారు. పెద్దపెద్ద వాళ్ళందరూ వస్తారట. మంచి పేరుతో పాటు మన ఆశ్రమానికి మంచి జరుగుతుందని చెప్పారు. అందుకే సర్...ఈసాధన.” 
           “నువ్వు సాధిస్తావ్.. ఇక పడుకో.”
           “అలాగే సర్” అంటూ నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎప్పడో నిద్ర పట్టేసింది.
                                                         *************
           కిటికీ దగ్గర నిలబడి ఎక్కడ్నుంచో వస్తున్న ‘కల కానిది విలువైనది..బ్రతుకు కన్నీటి.....’పాట వింటున్నాడు. తన జీవితానికి సరిపోతుంది. అవునునిజవేఁ....తనకి చదువు లేదు. సంస్కారం లేదు...కెరాఫ్ ప్లాట్ ఫారం. కానీ, ఈరోజు...ఆ మహాతల్లి కరుణ వలన చదువు, సంగీతం, మంచి జీవితం తన సొంతం య్యాయి. ఆమే చేరదియ్యక పోతే తన జీవితం...తలుచుకుంటేనే అతనికి భయమని పించింది. ఎందుకో ఓసారి ఆమెను కలసి తన కృతజ్ఞత చెప్పాలని మెల్లగా తన చేతికర్ర తీసుకుని ఆఫీసు రూం దగ్గరకి చేరుకుని,”మేడమ్..లోపలి రావచ్చా?” అడిగాడు.
            తేజా! ఏంటివాళ కొత్తగా...రా..రా..” చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి కుర్చీలో కూచో బెట్టి తన సీట్లో కూర్చుంది.
            “ఇబ్బంది పెట్టానా మేడమ్..”
             “దేనికి ఇబ్బంది...నాకిష్టమైన ‘సిరివెన్నెల’ సినిమా చూస్తున్నాను.”
            “అయితే ఇబ్బంది పెట్టాను మేడమ్...అందులో కూడా హీరోకి నాలాగే కళ్ళుండవట కదా మేడమ్. బాబాయ్ చాలా సార్లు చెప్పేవాడు. అది సలహా సినిమా కాబట్టి ఏదైనా అవుతుంది. నిజ జీవితాలు అలా ఉండవని చెప్పాడు...”
             “నువ్విప్పుడు పెద్ద సంగీత విధ్వాంసుడివి. హైదరాబాద్ రవీంద్రభారతిలో నీ ప్రోగ్రాంగురించి ఎన్ని పత్రికలు రాశాయో తెలుసా? అన్నట్టు ‘జంధ్యాల పికిల్స్’ వారు మన ఆశ్రమానికి ఇరవై ఐదు వేల రూపాయిల చెక్కు పంపించారు..”
              “మేడమ్..ఇదంతా మీ గొప్పతనం...మీలోని వ్యక్తిత్వానికి ఇవ్వన్నీ నిలువెత్తు నిదర్శనాలు. నాదేమీ లేదు మేడమ్.”
              “ఇది చెప్పడానికా వచ్చావ్..ఇంకా..”
              “ఏంలేదు మేడమ్...అదీ..” నసిగాడు.
               “ఏదో చెప్పలనుకుంటున్నవ్..ఏంటది?”
                “మీరు కురిపించే ప్రేమ..దయ..కరుణ ఎంతోమంది నాలాంటివాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాయి. కానీ, మీ జీవితంలో...ఈచీకటేంటి మేడమ్?..ఎవరు మేడమ్ అతను..”భయంగా అడిగాడు.
              “తేజా! ఎక్కడుండాలో..అక్కడుండు” చాలా కోపంగా అరిచింది. కరుణామూర్తిగా తెలిసిన ఆమెలో ఇంత కోపం ఎప్పడూ చూడలేదు తేజా.
             “క్షమించండి మేడమ్. ఇంకెప్పడూ మీ మనసును బాధ పెట్టను...సారీ..మేడమ్.”అంటూ మెల్లిగా లేచి వెళ్ళిపోయాడు.
               మనసు పరిపరి విధాల పోతోంది. కదురు లేకుండా తిరుగుతున్నాడు. ఏం చెయ్యాలో తోచడం లేదు. సీతారామయ్య. తేజా అంతర్మథనాన్ని గుర్తించాడు లోపలికొస్తూ.
              “ఏది ఏవైనా నువ్వు తొందర పడ్డావబ్బాయ్. మేం ఇన్నాళ్ళుగా ఇక్కడే ఉంటూ ఏరోజూ ఆమె గతం గురించి ఆలోచించనూ లేదు...అడగనూ లేదు. అరుంధతిని ఎప్పడూ అలా చూడలేదు. దేవతని శాంతంగా చూడాలి తప్ప ఇలా ఉగ్రంగానా...”
               “అవున్సార్...నేను తొందర పడ్డాను...తప్పు చేసాను. ఆ అమృతమూర్తికి నా ముఖం చూపించలేను సర్” ముఖం మీద రెండు చేతులు పెట్టుకొని ఏడుస్తున్నాడు.
             “నిద్రపో...చాలా టైమయ్యింది..ఊరుకో..రేపటికంతా చల్లబడుతుంది.” ఓదారుస్తూ తాను నిద్రకుపక్ర మించాడు.   
         తేజాకి నిద్ర రావడం లేదు. తనకి చీకటీ వెలుగూ రెండూ ఒక్కటే. కంటికి నిద్ర పడితే చీకటి తెలుస్తుంది. లేకపోతే అతనికి రాత్రింబవళ్ళు రెండూ ఒక్కటే. ఎంత గింజుకున్నా నిద్ర రావడం లేదు.
మెల్లిగా లేచి మాండొలిన్ తీసుకుని శృతి చేసి వలజ రాగం ఒక్కసారి ఆరోహ ణవరోహణలు చూసుకుని వాయించడం మొదలు పెట్టాడు. ఎడం చేతి వేళ్ళు చాలా వేగంగా కదులుతున్నాయి. అతని మనసు పడే సంఘర్షణ తాలూకు బాధ చాలా స్పష్టంగా ఆ తీగలమీద ధ్వనిస్తోంది. తన ప్రయత్నం లేకుండానే తంత్రులు అతని మనసుపొరల్లోకి తొంగి చూస్తూ ధ్వనిస్తున్నాయి.
                               అదే సమయంలో సీతారామయ్య కు మెలకువ వచ్చి చూసాడు. ఏంజరుగుతోందో కాసేపటిదాకా అర్ధం
                               కాలేదు. వెంటనే తేరుకుని చూసేసరికి తేజా ఎడంచేతి వేళ్ళనుంచి రక్తం కారుతోంది. ఎంత ఆపాలని
                               ప్రయత్నించినా తేజా తన వాదనను ఆపలేదు. అలా వాయిస్తూనే ఉన్నాడు. ఒక్క ఉదుటున అరుంధతి
                         దగ్గరకి వెళ్ళి విషయం చెప్పాడు. సీతారామయ్య,  అరుంధతి పరుగులాంటి నడకతో లోపలి కొచ్చారు. 
                         ఆ దృశ్యం చూసి నిర్ఘాంత పోయింది. తేరుకుని ఇద్దరూ ఎంత ప్రయత్నించినా  తేజా ఆగలేదు. అరుంధతి
                         తేజా చెంప చెళ్ళమని పించింది. తేజా ఆగిపోయాడు. సీతారామయ్య స్థాణువులా నిలబడి పోయాడు
                  “ఏంట్రా...నీ బాధేంటి? ఎందుకురా ఇలా...” చేతివేళ్ళు పట్టుకుని కన్నీళ్ళు పెట్టుకుంది..ఆమెచెంపల వెంబడి కన్నీళ్ళు తేజా చేతిమీద పడ్డాయి.
                                     “మేడమ్...మీరు నాకోసం బాధపడుతున్నారా..పుణ్యాత్ముల కన్నీళ్ళు నేల రాలడం మంచిది కాదంటారు ...వద్దు మేడమ్...నన్ను క్షమించండి. నేనొక మూర్ఖుణ్ణి..కానీ, కళ్ళు లేకపోయినా నీళ్ళుంటాయిమేడమ్.” ఏడుస్తున్నాడు.
                                      “నీకు కన్నీళ్ళు లేవని ఎవరు చెప్పార్రా..నాకు తెలుసు నీ మనసేంటో. హైదరాబాద్ ప్రోగ్రాంఅయిపోయి వారం రోజులైనా నీలో సంఘర్షణ తగ్గలేదు. అక్కడ జరిగిన విషయం నిన్ను బాధ పెట్టిందనీనాకు తెల్సు. వాణ్ణి గురించి తెలుసుకుని ఏంచేస్తావ్రా..నా జీవితంలో అదో పీడకల. ...తెలుసుకుని జాలిపడతావా....అయితే విను...నేను చదువుకుంటున్న రోజులు. ఒక్క సంవత్సరం ఆగితే చేతికి డిగ్రీ వచ్చేది.అందరాడ పిల్లల్లాగానే నేనూ ౠన్నో అందమైన కలలు కన్నాను. సివిల్ ల్ పరీక్షలు రాసి పేదవారికి సేవ చెయ్యాలనుకున్నాను. అంతలో ఆవ్యక్తితో పరిచయం..విద్యా..విద్యా...”
                                           ***********
                                                 “విద్యా!....ఏంటీ..ఏఁవైపోయావ్...రెండు రోజుల్నుంచి కంటిమీద కునుకు పడితో ఒట్టు” సత్యమూర్తి గోముగా అడిగాడు.
             “ఏంలేదు..అర్జంటుగా ఇంటికి రమ్మని కబురు చేసారు. మనం తొందరగా పెళ్ళి చేసుకోవాలి. మన విషయం ఇంట్లో తెలిసి పోయింది.” విద్యాధరి.
                “చూడు విద్యా!...మా ఇంటి ఆచార వ్యవహారాల గురించి నీకు బాగా తలుసు. పైగా నాకు పెళ్ళి కావలసిన చెల్లి ఉంది. మనం తొందరపడి పెళ్ళి చేసుకుంటే తనకిక పెళ్ళి కాదు. నామాట మీద నీకు నమ్మకం లేదా?” అన్నాడు.
             తన కారణంగా సాటి ఆడపివల్ల కి అన్యాయం జరిగడం తనకిష్టం లేదు. చేసేదేమి లేకమాట్లాడలేకపోయింది. 
          అలా నెలలు గడిచిపోయాయి. సంవత్సరం తరవాత సత్యమూర్తి తన మేనమామ కూతుర్ని పెళ్ళి చెసుకున్నాడని తెలిసి నిలదీసింది విద్యాధరి. ఏం ప్రయోజనం? ఏవో కథలు చెప్పాడు. తను మోసపోయానని తెలుసుకుంది. అంతా అయి పోయింది కాలం కర్పూరంలా ఆవిరై పోయింది. విద్యాధరి జీవితం కొవ్వొత్తిలా కరిగి పోయింది.
            ఇన్నేళ్ళ తరవాత మళ్ళీ వచ్చి, “విద్యా నన్ను క్షమించు...అప్పుడేదో అలాజరిగి పోయింది. నేనుచేసింది తప్పే..మళ్ళీ మనం కలిసి జీవించే అవకాశం వచ్చింది. ఎంతకాలం ఇలా ఒంటరిగా బతుకుతావు. మళ్ళీ మనం పెళ్ళి చేసుకుందాం.” అన్నాడు.
            “చూడు మిస్టర్...ఒక ఆడది ఇష్టపడి తెల్ల గుడ్డలు కట్టుకుంటే మీ ఆచారంలో ఏఁవంటారు. మొగుడుచచ్చిన ముండ అంటారు. అర్ధమైందనుకుంటా...నువ్వు పెళ్ళి చేసుకుంటే పోనీలే నా లాంటి మరో ఆడది సుఖపడుతుందనుకున్నాను. కానీ, అనుమానంతో ఆమెను వదిలించుకుంటావనుకో లేదు. నిన్ను చూస్తేమగజాతే అసహ్యించు కుంటుంది. నా దృష్టిలో నువ్వెప్పుడో....వద్దు...వెళ్ళిపో..మళ్ళీ ఎప్పుడూ నన్నుచూడ్డానికి ప్రయత్నించకు” చాలా నిష్కర్షగా చెప్పింది.
             చేసేది లేక సత్యమూర్తి వెళ్ళిపోయాడు.
                                    **************
            “అలా నాజీవితంతో ఆటలాడుకున్నాడు. హైదరాబాద్ లో అనుక్షణం నరకయాతన అనుభవించాను.ఇంకక్కడ ఉండలేక తెలిసిందే నవాళ్ళ ద్వారా ఇలా ఈ వైజాగ్ లోని ఈ ఆశ్రమానికి చేరుకున్నాను. ఆశ్రమాన్నినడిపే నిర్మలమ్మ గారు నన్ను చేరదీసి  ధైర్యం చెప్పి విద్యాధరిని అరంధతిగా చేసింది. అవసానదశలో ఈ ఆశ్రమబాధ్యతలు నాకప్ప చెప్పి తను తనువును చాలించారు. తరవాత అమ్మా, నాన్నా ఇక్కడే కాలం చేసారు.”నిట్టూర్చింది.
              సీతారామయ్య కళ్ళు చెమర్చాయి. తేజా మాండొలిన్ పక్కన పెట్టి అరుంధతి కాళ్ళమీద పడి చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి మరీ ఏడుస్తున్నాడు.
రుంధతి లేవదీసి ఓదార్చింది. చేతి వేళ్ళవంక చూసి చాలా బాధపడి పోయింది. డాక్టర్ రోజూ వచ్చి వైద్యం చెయ్యడంతో బాగా తగ్గిపోయింది.తాను చేసిన పనికి దాదాపు వారం రోజులు సాధన చెయ్యలేక పోయాడు తేజ. విషయం తెలుసుకుని సోమయాజులు గారు కూడా చాలా బాధ పడ్డాడు. మరల తన సాధన ప్రారంభించాడు తేజ.
              ఆ రోజు తేజాకి ఓ ఛాలెంజ్ అనే చెప్పాలి. అంతకమునుపు చేసిన కచేరీలు వేరు..ఇప్పడు తనుచెయ్యబోయే ప్రోగ్రాం వేరు. అఞతక ముందు ఎన్ని ఆల్బమ్స్ చేసినా ఆ అనుభవం వేరు. ఇదే అరుంధతి తేజాజీవితంలో కోరుకున్న మలుపు. వచ్చే వాళ్ళందరిలో ఎక్కువ మంది ఫారిన్ డెలిగేట్సే. తేజా వాళ్ళ మనసుల్ని రంజింప చెయ్యగలిగితే సంవత్సరం పాటు ఫారిన్ ప్రోగ్రాములే.  మనసులో అనుకుంటున్నాడు.”ఇది గనకజరిగితే..నాకు పేరుతో పాటు నన్నింతవాణ్ణి చేసిన మేడమ్ ఎంతో సంతోష పడతారు. నాకు ఆశ్రయాన్ని కల్పించిన ఈ ఆశ్రమానికి ఎంతో మేలు జరుగుతుంది.” అతని మస్తిష్కంలో ఆలోచనలు రివ్వున తిరుగుతున్నాయి.ఎన్నడూ లేనంత ఉద్వేగానికి గురౌతున్నాడు.
            అది గమనించిన సోమయాజులు గారు, “చూడమ్మా!..తేజా ఎందుకో చాలా కంగారు పడుతున్నాడు.ఒకచోట నిదానంగా ఉండలేక పోతున్నాడు. నువ్వు ధైర్యం చెబితే చాలు...వెళ్ళమ్మా..” అన్నాడు.
          అరుంధతి తేజా భుజం మీద చెయ్యి వేసి, “ఏంటమ్మా...ఊఁ...ఏం ఫరవాలేదు...ఎప్పడూ లేనిది ఇంత టెన్షన్ పడుతున్నావ్?”
           “ఏంలేదు మేడమ్...అది..అది..నా గురించి కాదు మేడమ్...మరి...” నసిగాడు
              “అర్ధమయ్యింది...ఇప్పడీ అవకాశం పోతే ఆశ్రమాని కచ్చే విరాళాలు పోతాయేమోనని భయం...అంతేగా...విధాత ఏంనిర్ణయిస్తే అదే జరుగుతుంది. నువ్వ చెయ్యల్సిన ప్రయత్నం నువ్వు చెయ్యి.” భుజంచేతులతో చరుస్తూ ధైర్యం చెప్పింది.
         చెన్న పట్టణం నడుమ ‘నడిగర్ సంగం’ ఆడిటోరియం క్రక్కిరిసి పోయింది. జనం ఆతృతతో కచెరీ కోసంఎదురు చూస్తున్నారు.అంతలో...”రెస్పెక్టెడ్ డిస్టింగ్విష్డ్ గెస్ట్సు! లేడీస్ అండ్ జంటిల్మన్! నౌ ద కర్నటిక్ క్లాసికల్ మ్యూజిక్ ఆన్మాండొలిన్ విల్బి పెర్ఫర్మ్డ్ బై మిస్టర్ విశ్వతేజ.” అనౌన్స్ చెసారు.
           “అంతా మంచే జరుగుతుంది..పద” అరుంధతి.
         “మేడమ్ మీరు నాదగ్గరే కూర్చోండి మేడమ్. గురువుగారు చెప్పినట్టు ఆ శారదాంబ నాపక్కనే ఉన్నంత ధైర్యంగా ఉంటుంది. గురువుగారు మీరూ చెరో పక్కన ఉంటే చాలు..” అన్నాడు.
           ఇద్దరూ తేజాని డయాస్ మీద కూర్చో బెట్టి వాళ్ళు కూడా కూర్చున్నారు. జనం కరతాళ ధ్వనులతో ఆడిటోరియం అంతా మారు మోగింది.
            ఎందరో మహానుభావులు..అందరికీ వందనములు...నమస్కారం చేసి శృతి చూసుకున్నాడు . మృదంగం,వయోలిన్ వాయిద్య సహకారులు సన్నద్ధమయ్యారు.
      ‘మహా గణపతిం..మనసా స్మరామి....’ తో కచేరీ ప్రారంభమయ్యింది. ఆద్యంతం తన మాండొలిన్ తంత్రులపైవేళ్ళతో లయ విన్యాసం చేసి మంత్ర ముగ్ధుల్ని చేసాడు.‘హిమగిరి తనయే..హేమలతే..’ అమ్మని తన్మయత్వంతో ఆరాధించాడు.‘బంటు.రీతి కలువు ఇయ్యవయ్య రామా...’ అలా అలవోకగా పదిహేను కీర్తనలు మధురంగా పలికించాడు.
                      చివరి కిర్తనగా...
             ‘ఎందరో..మహానుభావులు...అందరికీ..’ ఆ స్వరాలతో ఆట లాడుకున్నాడు. చప్పట్లతో ఆడిటోరియంమారుమోగి పోయింది. చాలా మంది ఫారిన్ డౄలిగేట్స్ గౌరవంగా లేచి నిలబడ్డారు. అరుంధతి కళ్ళలోంచి నీళ్ళు జలజలా రాలిపోతున్నాయి. సోమయాజులు గురువుగారు ఆనందంతో చమర్చిన కళ్ళను తుడుచు కున్నాడు.
           “దయతో ఇక్కడి కి వచ్చిన పెద్దలందరికీ నా విన్నపం. నేను రెండు.మాటలు సవినయంగా మీకుచెప్పాలనుకుంటున్నాను...పాత్రికేయ మిత్రులు దయతో నేచెప్పే విషయాలను ఫారిన్ డెలిగేట్స్ కి చెప్పవలసినదిగా కోరుకుంటున్నాను.” రెండు చేతులూ పైకెత్తి నమస్కరించాడుతేజ.ఒక్కసారి ఆడిటోరియం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అరుంధతి సోమయాజులు గారూ అలాఉండిపోయారు.
       “అందరికీ శిరసొంచి పాదాభివందనం చేస్తున్నాను. దయచేసి నా గురించి డబ్బా కట్టుకుంటున్నాననిఅనుకోవద్దు. నేనో అంధుణ్ణి..నన్ను చూసిన మీకు అర్ధమయ్యే ఉంటుంది. నేనెవరో..నా తల్లిదండ్రులౄవరో నాకు తెలీదు.నన్ను ఏసంబంధంలేక పోయినా, నాకు ఏమీకాని ‘బాబాయ్’ తన తీగలు తెగిన ఎందుకూ పనికిరాని గిటారు మీద కీర్తనలూ పాటలూ వాయిస్తూ, వైజాగ్ రైల్వే స్టేషన్ లో అడుక్కుంటూ వచ్చిన దాంట్లో నాకూ ఒక ముద్ద పెట్టి పెద్దవాణ్ణి చేసాడు. అంతలోనే నన్ను విడిచి తన గిటారు నాకిచ్చి శాశ్వతంగా వెళ్ళపోయాడు. బాబాయ్ ఏదైతే చేసేవాడో..నేనూదానికే అలవాటు పడ్డాను. ఎన్నో వడి దుడుకులు..మరెన్నో అవమానాలు...అటువంటి సమయంలో ఓ మహాతల్లి నన్ను చేరదీసి అన్నం పెట్టి ఒక మహామనీషిని నాకు గురువుగా ప్రసాదించి ఇంత విద్య నేర్పించింది. నేను పల్చే గాలి, నేనువేసుకున్న బట్టలు, ఈ శరీరం..చివరికి నేను మీముందు ప్రదర్శించిన విద్య అన్నీ  ఆమె పెట్టిన భిక్షే. నా శరీరంలోని ప్రతిఅణువులోనూ ప్రేమామృతము నింపిన దేవత. ఆమె మరెవరో కాదు...ఆ అమృతమూర్తి అరుంధతీ మేడమ్ గారే... నాకు  విద్య, సంస్కారం నేర్పిన  ఆ మహా మనీషి..సోమయాజులు గురువుగారు”
              జనం మళ్ళీ కరతాళ ధ్వనులతో నిండిపోయింది.
              “నేను చాలా ఆల్బమ్స్ చేసాను...అది మేడమ్ గారి పర్యవేక్షణలో...కానీ, ఆమెకు తలీకుండా వలజ రాగంలో..కేవలం ‘ప్రేమ’ అనే కన్సెప్టుతో “లివ్ విత్ లవ్” చేసాను. ‘ప్రేమ భగవంతుడంత పవిత్రమైనది. అమ్మనాన్నలంత పవిత్రమైనది. గురువులంత పవిత్రమైనది. తల్లిదండ్రులను ప్రేమించండి...తోడబుట్టినవాళ్ళను ప్రేమించండి. భార్యని, కన్న బిడ్డలని ప్రేమించండి. ఏఆధారం లేని వాళ్ళని ప్రేమించండి. గురువులను ప్రేమించండి. సహాయం చేసినవారిని ప్రేమించండి. సమాజాన్ని ప్రేమించండి. ప్రేమ పేరుతో ఆడవాళ్ళని దయ చేసి మోసం చెయ్యకండి’ నేను చేసిన ఆల్బమ్ లో ఉన్నవే చెప్పాను తప్ప మీకు సలహా చెప్పానని తప్పుగా భావించొద్దు. ఈ సీడీని ఆ అమృతమూర్తి అరుంధతీ మేడమ్ గారికి అంకిత మిస్తున్నాను. నాకు విద్య, వినయం నేర్పిన గురువుగారు దీన్న ఆవిష్కరిస్తారు. దయచేసి సభలో ఉన్నపెద్దలు అన్యధా భావించ వద్దని నా మనవి.” తన కూడా తెచ్చిన సీడీల పాకెట్ సోమయాజులు గారికి అందజేసాడు
             తేజా..ఆవిష్కరించిన సీడీని అరుంధతి చేతికిచ్చి అక్కడే తచ్చాడుతున్న సత్యమూర్తి గురించి చెప్పాడు. ఆమెపట్టించుకోలేదు.
           ఈ కట్టెలో ప్రాణం ఉన్నంత వరకూ కచేరీలు చేస్తూనే ఉంటాను. అలా వచ్చిన ప్రతి పైసా నన్ను పెంచిన ఆశ్రమానికే...ఆ మహాతల్లి ఋణం ఎలా తీర్చుకోగలను” అంటూ అరుంధతి వైపు తిరిగి ఆమె పదాలకి నమస్కారం చేసాడు.అరుంధతి పైకి లేపింది.
              “నేను తేజ చెప్పినంత గొప్పదాన్ని కాదు. సోమయాజులు గురువుగారి తపన..తేజా చేసిన కఠోరమైన సాధన అంతేతప్ప ఇందలో నేను చేసిందేమీ లేదు. ఓ మనిషిలా నడుచుకున్నానుఇదంతా కృషీ, పట్టుదలతోనే సాధ్యమౌతుంది. ఈ సందర్భంగా గీరువులను సత్కరించు కోవలసిన అవసరం ఉంది” అంటూ దుశ్శాలువా, స్వర్ణ కంకణంతో సత్కరించింది. 
                        అదే సందర్భంలో వచ్చిన అతిథులకూ, పాత్రకేయ మిత్రులకూ తెజా చేసిన ఆల.బమ్ సీడీలు’సంగీత ఝరి’,‘అమృతధార’, ‘ఫింగర్స్ మిస్టరీ’,  ‘లివ్ ఫర్ లవ్’ ఇచ్చింది. వెంటనే డయాస్ మీద సభ ఏర్పాటు చేసి  ఫారిన్ డెలిగేట్స్ తో అరుంధతి అన్నీ వివరంగా మాట్లాడుతుంటే సత్యమూర్తి దూరంనుంచి అసూయగా చూస్తున్నాడు. వక్తలందరూ చక్కగా  మాట్లడుతున్నారు. విశ్వతేజా బృందానికి సంవత్సరం పాటు కాంట్రాక్టు ప్రకటించడంతో ప్రేక్షకులు తమ హర్షాతిరేకాలు వ్యక్తంచేసారు.సోమయాజులు గారు, అరుంధతి, అతిథులంతా తేజాని అభినందనలతో ముంచెత్తారు. తేజా ఆనందానికి అవధులు లేవు. తనకి అందనంత ఎత్తుకి  ఎదిగిపోయిన ఆమె ఇప్పుడు తన విద్యాధరి కాదు..అమృతమూర్తి. అని తనలో తాను అనుకుంటూ ముందుకి వెళ్ళబోతూ ఎవరికో  తగిలి ”సారీ” అన్నాడు.అవతలి వ్యక్తి “ఏంబాబూ! పగటి కలలు కంటున్నావా...”అడిగాడు.
                         “సారీ..సారీ..” అంటూ గమ్యం లేని పయనం మొదలు పెట్టాడు...
 ***

No comments:

Post a Comment

Pages