మార్పు - అచ్చంగా తెలుగు
"మార్పు"
రాధికా రామానుజం 

'ఏమేవ్ రాధా ఎక్కడ? ఎంతసేపైయింది కాఫీ చెప్పి' అన్న అత్తగారి పిలుపులాంటి అరుపుకు, రామం ని కౌగిట్లోంచి నెట్టి కాఫీ కప్పుతో అత్తగారి ముందు ప్రత్యక్షమైంది రాధ.
ఎమ్మా, నీ పుట్టింట్లో కాఫీ తాగాలంటే గంట ముందు చెప్పాలా ఏంటి? ఎంత సేపయింది! అన్న అత్తగారి మాటలకి బిత్తరపోయి రామం ని చూసింది రాధ.
ఇదిగో కొత్త కోడలని ఉరుకుంటున్నా. నాకు అన్ని టైం కి అయిపోవాలి. ఎరా రామం అంతేనా? 
అవునమ్మా నువ్వు ఏం చెప్పినా కరెక్ట్, అని కొంటెగా నవ్వుతూ రాధ కి కన్ను గీటాడు రామం.
రాధ పేరుకు తగ్గట్టు అందెగత్తేకాదు చాలా బుద్ధిమంతురాలు, పనిమంతురాలు. ఒక్కతే కూతురైనా అల్లారుముద్దుగా పెరిగినా ఎంతో పద్దతిగల పిల్ల.
తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన సంభంధం, ఆస్తి పాస్తులు లేకపోయినా అబ్బాయి ఫామిలీ మంచిదని రాధనిచ్చి చేశారు. కట్నకానుకలు లాంఛనాలు తగు విధంగా ఇవ్వటమే కాకుండా పెళ్లి ఘనంగా చేశారు.
అత్తగారైన రాజ్యం గారికి ఇద్దరు అమ్మాయిలు, ఒక్కడే కొడుకు రామం. ఆవిడ చిన్నతనం లొనే భర్తని కోల్పోవడం తో పిల్లలని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. ఉన్నంతలో ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళి జరిపించింది. కోడలు స్థితిమంతురాలు, చదువుకున్నది అయ్యేసరికి కొడుకుని ఎక్కడ కొంగున కట్టుకుంటుందో అన్న బెంగ. తాను ఒంటరి అయితే దిక్కేంటి అన్న ఆలోచన. వీటికి తోడు ఊర్లోనే వుండే తోడికోడలు మహాలక్ష్మమ్మ గారి హితబోధలు. ఆవిడ గురించి ఊర్లో తెలియని వారు లేరు. ఆవిడకి జూనియర్ సూర్యకాంతం అని పేరు. పనివాల్లు ఆ ఇళ్లంటేనే పారిపోతారు. కోడళ్లను రాచిరంపాన పెట్టడంలో phD. అందుకే ఇద్దరు కొడళ్ళు వేరు కాపురాలు పెట్టేసారు. రాజ్యం గారు ఈ కోడలితో ఎక్కడ సుఖపడిపోతారో అని సగం బెంగ. అందుకే వీలు చిక్కినప్పుడల్లా బ్రెయిన్ వాష్ చేస్తుంటారు.
ఆవిడకు కష్టకాలంలో సహాయం చేయలేదు సరికదా... ఆవిడ గురించి అంత తెలిసినా, చూడమ్మా రాజ్యం చిన్నతనంలో భర్తనికోల్పోయి ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచి పెద్దచేశావ్. ఈ కోడలు నిన్ను ఎలా చూస్తుందో ఏమో, అసలే స్థితిమంతుల, అమ్మాయి బాగా చదువుకుంది. 
కొత్త కోడలు తెల్ల కాగితం లాంటిది. మనమేం రాస్తే అదే. కాబట్టి గ్రిప్ లో ఉంచుకో అమ్మ. నీకన్నా పెద్దదానిని వయసులో. నీ మంచి కోరి చెప్తున్న. నా పరిస్థితి చూస్తున్నావుగా, కోడలు కోడలు అనుకున్నందుకు నా నెత్తినెక్కి తైతక్కలాడుతున్నారు. నా ఖర్మ.... అని నిట్టూర్పు విడిచింది.
సాటి అత్తగారిగా ఈ మాటలు రాజ్యంగార్కి బాగా తల కెక్కినయి. దీంతో సాధింపుకు గుర్తుగా మారిపోయారు ఆవిడ.
దీనికి తోడు ఓ రోజు పక్కింటి అనసూయమ్మ గారి కోడలు నీళ్లొసుకుంది అని తెలిసింది. ఇంక చూసుకోండి. ఆ రోజు పెద్ద డ్రామానే నడిచింది. పెళ్లై నాలుగు నెలలు అయ్యింది. ఇంతవరకు రాధ నీల్లోసుకోలేదు. పోయిన నెలలో పెళ్ళైన అనసూయమ్మ గారి కోడలు నెలతప్పింది. అందుకే అంటారు పిల్లను తెచ్చుకునేప్పుడు ఎంచి చూసుకోవాలి. ఒక్కగానొక్క మగబిడ్డవి, నీకు పిల్లలు పుట్టే యోగం ఉందొ లేదోరా రామం. రాధని స్పెషలిస్ట్ డాక్టర్కి చూపెడుదాం. ఇంకా ఆలస్యం చేయవద్దు అని శోకాలు మొదలెట్టారు. 
ఊరుకో అమ్మ! ఎవరైనా వింటే నవ్విపోతారు. నాలుగు నెలలే కదా పెళ్లై, అయినా ఇంకొకళ్ళతో పొలికేంటి? ఆ మాటకొస్తే మేము నీకు పెళ్ళైన అయిదు ఏళ్లకి గాని పుట్టలేదు. మేము ప్లానింగ్ లో ఉన్నాం.
అమ్మో అమ్మో ఎంత మాటన్నావ్రా? నా సంగతి వేరు. ఎదో పెద్దదానిని అయిపోయా. నీ పిల్లల ముచ్చట్లు చూడాలని నాకు ఉండదా? నువ్ ఎన్నైనా చెప్పు, రాధకి ఎదో ప్రాబ్లెమ్ ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంతే అని డిసైడ్ చేసేశారు. తల్లికి ఎదురు చెప్పలేక విసుగ్గా ఆఫీసుకి వెళ్ళిపోయాడు రామం.
డాక్టర్ దగ్గర అన్ని టెస్టులు నార్మల్ అని తెలిసి ఊపిరి పీల్చుకుంది రాధ. ప్లానింగ్ లు పక్కన పెట్టి అత్తగారి కోర్కె తీర్చింది. 
అక్కడినుంచి పిల్లల పెంపకంలో, ఇంటి విషయాల్లో, పనిలో, ఆర్థిక వ్యవహారాల్లో అందరితో పోల్చి రాధని కావాలని చిన్నబుచ్చేవారు రాజ్యంగారు. రాధకి పుట్టింటి వారు ఏం పెట్టినా ఘనంగానే పెట్టేవారు. దానికోపక్క సంతోషిస్తున్నా మరోపక్క తన ఆడపిల్లలకి తాను అలా పెట్టలేక పోయినందుకు బాధనంతా అక్కసుగా రాధ మీద వెళ్లగక్కేవారు. ఇంటా బయటా అందరితో ఎంతో కలుపుగోలుగా ఉంటూ బాధ్యతగా మెలిగే రాధ ఆంటే అందరూ ఎంతో ప్రేమగా చూసేవారు. అయిన సరే రాజ్యం గారికి రాధ అంటే తన కొడుకుని తన నుంచి విడదీస్తుందని, తనపై పెత్తనం చేలాయిస్తుందని అభిప్రాయం. 
అన్నీ తెలిసినా తల్లి మీద ప్రేమతో ఏమి చేయలేక రామం, అత్తగారి మీద గౌరవంతో రాధ భరిస్తుండేవారు.
అలా కాలం గడుస్తుండగా ఓ మారు విజయనగరంలో ఉండే వాళ్ళ పొలం మంచి రేట్ రావటంతో అమ్మే పని మీద తల్లి కొడుకులు విజయనగరం చేరారు. పనులు అయ్యి బైటికి వస్తుండగా రాజ్యం బాగున్నావా అంటూ పలకరించింది ఆవిడ చిన్ననాటి స్నేహితురాలు కనకం. 
ఆనందంతో రాజ్యంగారి కళ్లు మెరిశాయి. కనకం బాగున్నావా? ఎన్నాలకు కలిశామే. ఏంటీ ఇలా చిక్కి శల్యమయ్యావ్? నీ పిల్లలు బాగున్నారా? ఎక్కడ ఉంటున్నారు? కృష్ణుడు నీదగ్గరే ఉన్నడా? అంటూ శరపరంపరగా ప్రశ్నలు సంధించింది రాజ్యంగారు.
ఆ అంతా బానేఉన్నారు. చాన్నాళ్లయింది మనం కలుసుకొని, రామం ఈ పూట మా ఇంట్లో ఉండి పొద్దున్నే వెళ్లిపోదురు. నా మాట కాదనకు అంది కనకంగారు.
అలాగేలే పిన్నీ. నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తున్నా నిన్ను కలవటం కుదరలేదు. అలాగేలే చిన్నానాటి ఫ్రెండ్స్ కదా మీరు... సరదాగా కబుర్లు చెప్పుకుందురు అన్నాడు రామం.
ఇంట్లోకి వెళ్ళాక కనకంగారి కోడలు సవిత వీళ్ళని ఎగాదిగా చూసి మొహం చిట్లించింది. నా చిన్ననాటి స్నేహితురాలు రాజ్యం, దాని కొడుకు రామం. మాకు కొడుకులు పుడితే ఒకళ్ళు రామం అని, ఇంకొకళ్ళు కిష్ణ అని పెట్టుకోవాలనుకున్నాము. అలాగే మీ ఆయనకి కృష్ణ అని పెట్టాం అమ్మా అని లేని నవ్వు తెచ్చుకుని కొడలుకు చెప్పుకొచ్చింది ఆవిడ. 
ఎమ్మా బాగున్నావా..? నీకు ఎంతమంది పిల్లలు? ఎం చదువుతున్నారు? అడిగారు రాజ్యంగారు. విసురుగా బెడ్రూంలోకి వెళ్లిపోయిన సవితని చూసి తెల్లబోయారంతా.
కొంచం తనకి తలనొప్పిగా ఉంది అందే.... కాళ్లు చేతులు కడుక్కురండి. భోజనాలు వడ్డించేస్తా అన్న కనకంగారి మాటలతో ఈ లోకంలోకి వచ్చి మొహాలు చూసుకున్నారు తల్లి కొడుకులు.
భోజనాల దగ్గర కూడా సవిత రాలేదు. వంట చేయడం, గిన్నెలు సర్దటం పని అంతా కనకమే చేయటం గమనించారు ఇద్దరూ. ఇంతలో కృష్ణ బయటినుంచి వచ్చాడు. కృష్ణా... రాజ్యం పిన్నిరా, రామం కూడా వచ్చాడు. నాకు బయట కనిపించారు. చాన్నాళ్లయింది చూసి. మనింటికి తీసుకొచ్చా అని కొడుక్కి ఆనందంగా చెప్పారు కనకంగారు.
ఆహ! అన్నాడు నిర్లిప్తంగా. ఏం ఇన్నాళ్ళకి ఇటువైపు? పొలం అమ్ముదామనిరా అన్నాడు రామం. అవునా.. ఎంత వచ్చిందేమిటీ? ఎవరు కొన్నారు? అని కుతూహలంగా అడిగాడు కృష్ణ. ఎంతడబ్బువచ్చిందేమిటీ అని ఆత్రంగా బయటికి వచ్చింది సవిత.
ఆ ఎంతా... ఒక్క ఎకరానికి ఎంత వస్తుంది.. పైగా నీటి ఎద్దడి కదా. 10 లక్షలు వచ్చాయి. అంతేనా.. నిట్టూర్చారు మొగుడు పెళ్లాలు. మాట్లాడినంతసేపూ డబ్బు గోలే.
ఇద్దరు స్నేహితురాళ్ళు రూంలో కూర్చొని మాట్లాడుతుండగా సవిత అత్తగార్ని కేకేసింది. ఇప్పుడే వస్తా రాజ్యం అంటూ ఖంగారుగా కోడలి రూంలోకి వెళ్లిన కనకాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది రాజ్యంగారు. ఏంటీ రాత్రికి ఇక్కడే ఉంటారా వాళ్ళు, రెండుపూటలు పెట్టడానికి మేవేవి కోటీశ్వరులమా? మీరు ఏం ఆస్తి పాస్తులు ఇచ్చారు కనక. పలకరింపులు చాలు ఇంకా బయలుదేరమని చెప్పండి. తమర్ని పోషించడమే ఈ ధరల్లో ఎక్కువైతే వీళ్ళు కూడానా. అయినా కూరలు తెమ్మంటే రోడ్డు మీద ఎవరు కనిపిస్తే వాళ్ళని ఇంటికి తెస్తే కుదరదు. మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా?
చిన్నగా మాట్లాడు సవితా. వాళ్ళు వింటే బాధపడ్తారు. నా చిన్ననాటి స్నేహితురాలు. చాన్నాళ్ల తర్వాత కనిపించింది అందుకే. నేను ఏదో చెప్తాలే. అని గద్గద స్వరంతో అన్నారు కనకం గారు.
బయటకు రాగానే బ్యాగ్ తో సిద్ధమైన రాజ్యంగార్ని
చూసి ఏమిటే ఇదీ అంది. ఏం లేదు రామునికి ఫోన్ వచ్చింది. అర్జంట్ పనిపడింది. రేపు పొద్దునే ఆఫీస్ కి వెళ్లాలట. అందుకే అంటూ బయలుదేరారు.
బయటి దాకా వచ్చిన కనకంగారు రాజ్యంగార్ని వాటేసుకుని భోరుమన్నారు. క్షమించవే నిన్ను ఒక్క పూట ఉంచుకోలేని ఆశక్తురాల్ని. కోడలు పెత్తనం. ఆయన పోగానే పిల్లలు ముగ్గురూ ఆస్తి గోడవలలో కోర్టుకెక్కారు. ఆడపిల్లల్ని ఇంటికి రానివ్వదు. లేని ఇంటి నుంచి చదువు తక్కువ పిల్ల అని తెచ్చుకుంటే అణిగిమనిగి ఉంటుందని ఏరికోరి కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు ఏకుమేకై కూర్చుంది. ఇంట్లో పనంతా నేనె చెయ్యాలి. కృష్ణ పూర్తిగా పెళ్ళాం చాటు మొగుడైపోయాడు. అది ఎంతంటే అంతే. దిక్కుమాలిన బ్రతుకు అయిపోయిందే రాజ్యం అని బాధ పడ్డారు. అందం పాడైపోతుందని పిల్లల్ని వద్దనుకుంది. నాకీమధ్య ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్లలేని ఆశక్తుడు నా కొడుకు. ఏ క్షణంలో అయిన నన్ను ఓల్డ్ ఏజ్ హోం లో పడేస్తారు. దిక్కుమాలిన బ్రతుకైపోయిందే అని ఏడ్చేశారు ఆవిడ. 
ఒక్కసారి బుర్ర తిరిగిపోయింది రాజ్యంగార్కి. నాకంతా అర్థమైపోయిందే కనకం. నీకు అభ్యంతరం లేకపోతే నాతోపాటు మా ఇంటికి రా. ఆశ్చర్యంగా చూసారు కనకంగారు. 
ఆంత ఆశ్చర్యపోకు. నా కొడుకు కోడలు నా మాట కాదనరు. నా కోడలు బంగారం. నన్ను ఎంతో గౌరవంగా చూస్తుంది. నాతో సమానంగా నిన్నూ. నాకు నా కోడలిపై సంపూర్ణ విశ్వాసం ఉంది. ఇంకా మాట్లాడకు. ఈ క్షణమే పదా. ఎవ్వరికీ ఏమీ చెప్పేది లేదు అని కనకంగారి చెయ్యి పట్టుకొని తడిసిన కళ్ళతో రాధని తలుచుకుంటూ బయలుదేరారు రాజ్యం గారు.
అవును పిన్ని. నాకు నువ్వు వేరు కాదు పదా అంటూ తల్లిలో మార్పుకు ఆ దేవుడికి మనసులోనే దండం పెట్టుకున్నాడు రామం.
  ***** 

No comments:

Post a Comment

Pages