అమృతమూర్తి - అచ్చంగా తెలుగు
 అమృతమూర్తి
అయ్యలసోమయాజుల సుభద్ర 

"నేనేనే ... కానీని.మాట్లాడుతున్నా.. ", అని  ఫోన్ లో ఎవరితోనో అంటున్న మనవరాలిని చూసి "కానీ , అణా  ఏమిటే ? కాత్యాయనీ  అని చక్కని పేరు ఉండగా," అంది సరస్వతి ముద్దుగా కాత్యాయని నెత్తి మీద మెల్లగా మొట్టుతూ .   జుట్టు చెరిగి పోయిందేమో నని చూసుకుంటూ, మూతి ముడుచు కుంటూ "మరీ అంత  పెద్ద పేరు ఏంటి నాన్నమ్మా ? అందుకే దాన్ని షార్ట్ చేసేశా ", అంది ఎదో కొత్త విషయం కనిపెట్టిన సైన్టిస్ట్ లా మొహం పెట్టి .

"అదా ! మా  వంశంలో మూడు తరాల తరువాత పుట్టిన ఆడపిల్లవి.  అమ్మ వారి స్వరూపంలా భావిస్తూ మీ తాతయ్య పెట్టారా పేరుని.  అయినా పేరులో ఏముందమ్మా ?  మన నడవడిక  ముఖ్యం. అదే మనల్ని ముందుకు తీసుకెళుతుంది," అంది ,   ముఖం  నవ్వుతూ వెలుగులు చిమ్ముతుండగా.  నాన్నమ్మని చూసినప్పుడల్లా చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంటుంది కాత్యాయినికి .  ఏ రోజైనా ఏ వేళైనా తప్పని టైం టేబుల్ తో ఆరోగ్యంగా , ఆనందంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ డెబ్భయ్ ఏళ్ల వయసులో కూడా అందంగా మెరిసిపోతూ, ఎప్పుడూ చికాకు  ఎరుగని, అలుపెరుగని ముఖముతో అందరితో కలివిడిగా మాట్లాడే సరస్వతిని చూస్తే కాత్యాయినికి ఎంతో ఆశ్చర్యం  అనిపిస్తుంది . చక్కటి గొంతుతో శ్రావ్యంగా పాడుతుంది. తాను ఏదైనా నాట్యం ప్రాక్టీస్ చేస్తుంటే ముద్ర  సరిగ్గా పెట్టలేదని, భంగిమ కుదరలేదని సరిచేస్తుంది.  టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ చూసి హిందీ నేర్చేసుకుని చక్కగా పక్కింటి వాళ్ళతో మాట్లాడేస్తుంది. అప్పుడు ఒకసారి ఉత్తర భారత యాత్ర కు వెళ్ళినప్పుడు సౌకర్యంగా ఉండాలని చుడిదార్ వేసుకున్న నాన్నమ్మను చూసి  కాత్యాయనికి అమ్మ అనుకున్నారందరూ. 

ఒక్కోసారి సరస్వతిని చూస్తే కోడలు ఉమకి అసూయగా అనిపిస్తుంటుంది.  అయినా అమ్మలా ఆదరించే ఆవిడంటే గౌరవం, భక్తి, ప్రేమ కోడలు ఉమ కి.  అసలు నాన్నమ్మలా ఉండటం అందరికీ సాధ్యం కాదేమో అనుకుంటూ సోఫాలో నిద్ర పోయింది కాత్యాయని.  మెలకువ వచ్చేసరికి పక్క గదిలో నుండి మాటలు వినిపిస్తున్నాయి. 

లక్ష్మి ఆంటీ, అమ్మ ఉమా మాట్లాడుకుంటున్నారు.  "మీ అత్తగారి లా ఉండటానికి పెద్ద ప్రయత్నం అక్కర్లేదు.  ఆవిడకి మీ ఆయన ఒక్కడే కొడుకు. ఒకటే కాన్పు. తర్వాత మీ మావగారు పోయారు.  ఒక్క కొడుకుని పెంచుకుని హాయిగా ఉంది. ఏ బాదరబందీ లేని జీవితం. అదీ కారణం," అంటోంది.  ఉమ మాత్రం, "లేదు మా అత్తగారి సంగతి మీకు తెలియదు.  ఆవిడ చాలా ఉన్నత వ్యక్తిత్వం ఉన్న మనిషి. అయినా నాకు చాలా పని ఉంది. ఏమనుకోకండి," అంటూ ఆవిడకి బొట్టు పెట్టింది.   అంటే వెళ్ళమని అర్థం చేసుకుని ఆవిడ వెలిగించిన పుల్ల రాజు కోలేదని చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయింది.  

మొహం కడుక్కుని హాల్లోకి వచ్చిన కాత్యాయనికి సోఫాలో నానమ్మ ప్రక్కన కూర్చుని క్షమార్పణార్థంగా ఆమె చేతులు పట్టుకుని ఆవిడ భుజంపై తలవాల్చుకున్న తల్లిని చూస్తే ఆశ్చర్యం వేసింది.  వీళ్లిద్దరూ తల్లికూతుళ్లా,   అత్తాకోడళ్లా అనుకుంది ఆశ్చర్యంగా.  

రాత్రి భోజనాలయ్యాక తల్లీ, తండ్రీ  పడుకున్నాక  మెల్లగా నాన్నమ్మ ప్రక్కన చేరింది కాత్యాయని.   "నాన్నమ్మా ! నిన్ను ఒకటి అడుగుతాను చెప్తావా?", అంది.   "అడుగు తల్లీ !  నా దగ్గర నీకు జంకు దేనికి?", అంది సరస్వతి.   "మరి మరీ , తాతయ్య చనిపోయేటప్పటికి నీకు ఎన్నేళ్ళు నానమ్మా ?", అంది అపరాధ భావనతో తలదించు కొంటూ.  "అంతేనా దానికి ఇంత వెనకాడడం ఎందుకు? అందరికీ  తెలిసిందే.   నాకప్పుడు పదహారేళ్లు.  మీ నాన్నని కడుపులో మోస్తున్నాను.  ఆరవనెల", అంది.  

అది విని, "అదేంటి", అంది. కాత్యాయని మనవరాలి కేసి దీర్ఘంగా చూస్తూ, "పదిహేనేళ్ల కి పెళ్లి అయింది.  అత్తగారింటికి వెళ్లిన ఎనిమిది నెలలకే ఆరవ మాసం గర్భిణిగా ఉండగా మీ తాతయ్య విషజ్వరంతో చనిపోయారు.  అప్పటినుండీ మీ నాన్నని చూసుకుంటూ బతుకుతున్నాను," అంది  సరస్వతి.  "మరి నువ్వు ఎంతో విశాల హృదయంతో, చాలా ఉన్నతంగా, ఆధునికంగా ఆలోచిస్తావు కదా! మరి మళ్లీ

పెళ్లి ఎందుకు చేసుకోలేదు?," అని అడిగింది.   "అదా! చాలామంది అన్నారు, మళ్లీ పెళ్లి చేసుకోమని.  మా చుట్టాలబ్బాయి ముందుకు వచ్చి అడిగాడు కూడా.  కానీ మా అత్తగారిది కలిగిన కుటుంబం. ఆస్తిపరులు.  మా పుట్టింటి వాళ్ళు సామాన్యులు. పైగా సంతానం ఎక్కువ మా నాన్నకి.   నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే మీ తాతయ్య ఆస్తిలో భాగం ఏమి ఇవ్వమన్నారు మా మామగారు.  అందుకని అక్కడే ఉంటూ , ఆస్తిని కాపాడుకుంటూ, మీ నాన్నని, మా తమ్ముళ్లని కూడా చదివించుకుని, నా చెల్లెలు పెళ్లి బాధ్యత కూడా తీసుకున్నాను. 

అందరూ వృద్ధిలోకి వచ్చారు.  చక్కగా జీవితం సాగిస్తున్నారు.  మా నాన్న అంటుండేవాడు, సరసూ,  నీ రుణం తీర్చుకోవడానికి నీ మనవడిగా పుడతాను తల్లీ  అని. చూడాలి అది నీ చేతుల్లోనే ఉంది కాత్యాయనీ. మా నాన్నని  ఎప్పుడు ఇస్తావు నాకు?", అంది అల్లరిగా నవ్వుతూ.   "పో నాన్నమ్మా ! మళ్లీ నాకే విసిరేస్తావ్ నీ మాటల్ని," అని వెళ్ళిపోయింది.

మంచం పై పడుక్కుని ఆలోచిస్తూ తన వాళ్లకోసం తన జీవితాన్ని త్యాగం చేసి, భర్త ఆస్తిని కాపాడుకుని,. అందరికీ సహాయకారిగా నిలిచిన నానమ్మ వ్యక్తిత్వం చాలా గొప్పగా అనిపించింది. మాటలు చెప్పడం కాదు ఆధునికత అంటే, చేసి చూపించడం, అని అర్థం అయింది. ఇంతలో ఫోన్ మ్రోగింది.   "హలో కాత్యాయనీ హియర్," అంటున్న మనవరాలి గొంతు విని తృప్తిగా తలపంకించి నిద్రకు ఉపక్రమించింది సరస్వతి, ప్రొద్దున టిఫిన్ తయారు చేయాలి కదా, దానికోసం తన కొడుకుకి ఇష్టమైనవి గుర్తుకుతెచ్చుకుంటూ....
***

1 comment:

  1. "ఆధునికత అంటే మాటలు చెప్పడం కాదు, చేసి చూపించడం" అనే విషయాన్ని చాలా సూక్షంగా చెప్పారు రచయిత.
    బావుంది.!
    అభినందనలు..!!

    ReplyDelete

Pages