ఆడే బొమ్మలు వారు ఆడించే సూత్రము నీవు - అచ్చంగా తెలుగు

ఆడే బొమ్మలు వారు ఆడించే సూత్రము నీవు

Share This

ఆడే బొమ్మలు వారు ఆడించే సూత్రము నీవు (తాత్పర్య విశేషాలు)
తాళ్లపాక అన్నమాచార్య  శృంగార సంకీర్తన
రేకు: 1066-2   సంపుటము: 20-392
డా.తాడేపల్లి పతంజలి 

ఆడే బొమ్మలు వారు ఆడించే సూత్రము నీవు
యేడో ఇన్నాళ్లు నేను ఇదెఱఁగనైతిని            పల్లవి
నీవు చెప్పినబుద్దుల నెలఁతలు నడవఁగా
ఆవలివారి దూరితి నయ్యా నేను
చేవదేర తాలము చేయి నీచే నుండఁగాను
వేవేలుచోట్లను వెదకితి నేను  ఆడే
కన్నుగీఁటి నీవు వారి కైకొని మొక్కించఁగా
సన్నల వారి దొబ్బితి సాదించి నేను
పన్నినకూఁకటివేరై పారి నీవు వుండఁగాను
వున్నతిఁ గొనలకు నీ రొగ్గి నేఁ బోసితిని         ఆడే
కోరి పెండ్లాడిన పెండ్లి కొడకవు నీవుండఁగా
గారవించితిని వారిఁ గరుణ నేను
యీరీతి నన్ను శ్రీ వేంకటేశ నీవు గూడుండఁగా
కారణ మిందరునంటాఁ గడల మెచ్చితిని      ఆడే

(తాత్పర్య విశేషాలు)
ఆడే బొమ్మలు వారు ఆడించే సూత్రము నీవు
యేడో ఇన్నాళ్లు నేను ఇదెఱఁగనైతిని            పల్లవి
శృంగారార్థం
అలమేలుమంగవేంకటేశుని చుట్టూ ఉన్న చెలికత్తెలను చూస్తూ,  వేంకటేశుని దెప్పిపొడుస్తోంది.
ఈచెలికత్తెలందరూ నిన్ను రాసుకుపూసుకుని  తిరుగుతుంటేవాళ్ళే నీమీద మోహపడి వస్తున్నారనుకొన్నాను.
అసలు కథ తెలిసింది చెలికత్తెలు అందరూ ఆడే బొమ్మలునువ్వే నీమోహంలో వారిని పడేస్తున్నావ్.. అసలు తప్పంతా నీదే.
వారిని ఆడించే సూత్రం నువ్వే.
ఎక్కడ రహస్యం దాగి ఉందో !(యేడో ) ఇన్నాళ్లు నేను దీనిని తెలుసుకోలేకపోయాను.

ఆధ్యాత్మికార్థం
వేంకటేశా ! జీవులందరూ గుంపులు గుంపులుగా నీదర్శనార్థం వస్తుంటే- వాళ్ళు నీమీద విపరీతమైన ఆకర్షణతో వస్తున్నారనుకొన్నాను.
కాని అసలు కథ తెలిసిందిఈజీవులందరూ నువ్వు ఆడించే బొమ్మలు
జీవుడు నీ మాయ కల్పించే భ్రమలలో కీలుబొమ్మ అయి దేహం కంటె ఆత్మ వేరని, ఎప్పటి వరకు తెలుసుకోలేడో, అంతవరకు సారం లేని సంసారసాగరాన్ని దాటలేడు.అది నేర్పేందుకే ..నువ్వుకావాలని నీ భక్తులను  నీ చుట్టూ తిప్పుకొంటున్నావు.
వాళ్ళంతట వాళ్ళు  రావటంలేదు. నువ్వే రప్పించుకొంటున్నావ్.. ఎంత కరుణామూర్తివి నువ్వు.
ఎక్కడ రహస్యం దాగి ఉందో !(యేడో ) ఇన్నాళ్లు నేను దీనిని తెలుసుకోలేకపోయాను.

1 చరణం
నీవు చెప్పినబుద్దుల నెలఁతలు నడవఁగా
ఆవలివారి దూరితి నయ్యా నేను
చేవదేర తాలము చేయి నీచే నుండఁగాను
వేవేలుచోట్లను వెదకితి నేను  ఆడే
శృంగారార్థం
వేంకటేశా ! నువ్వు ఎలా చెబితే అలా   చెలికత్తెలు నడుస్తుంటే … “మీకు బుద్ధి లేదటే.. ఆయన ఎలా చెబితే అలా వింటారా..”అని వాళ్ళను ఇన్నాళ్ళు తిట్టాను. చేవదేరు( - బలపడు,) వశీకరణ శక్తి అనే  తాళం చెవి నీచేతిలో ఉంది మహాప్రభో ! అదెక్కడుందో తెలియక..అనేక చోట్ల వెతికాను నేను.
ఆధ్యాత్మికార్థం
యల్లబ్ధ్వా పుమాన్సిద్ధోభవతి, అమృతో భవతి, తృప్తో భవతి (నారద భక్తి సూత్రాలు -04 వసూత్రం) ఆత్మకు, శరీరేంద్రియాలకు అనుసంధానమై ఉన్న పురుషుడే''నేను'' అనే జీవుడు. ''నేను'' శరీర తాదాత్మ్యతను విడచుటకు,ఆత్మతో అనుసంధానం చేసుకొనుటకు సాధన చేయాలి. దీనికోసం తాను శరీరం కాదనే విషయాన్ని విచారణ చేయడం ద్వారా నిర్ణయించుకొని ప్రాపంచిక విషయాలందు వైరాగ్యం చెందాలి. తాను ఆత్మ అనే నిజాన్ని ఋజువు చేసుకొని భక్తి ద్వారా భగవంతుని అనుగ్రహం పొందాలి.  వేంకటేశా ! నువ్వు ఎలా చెబితే అలా   ఇంద్రియాలను కొంతమంది నిగ్రహిస్తుంటేనీ అన్వేషణకొరకు నీలో కలవాలనినీ బుద్ధితో సమాధి స్థితిలో వారు  తాపత్రయపడుతుంటే … “మీకు బుద్ధి లేదటే.. ఆయన ఎలా చెబితే అలా వింటారా..”అని వాళ్ళ ఇంద్రియనిగ్రహాలను -భౌతిక ఆకర్షణలలో పడి - ఇన్నాళ్ళు తిట్టాను. వెక్కిరించాను. కాని   చేవదేరు(సత్వం కలదయినసత్వ గుణం కలదయిన ) వశీకరణ శక్తి అనే  తాళం చెవి    నీ అభయ హస్తంలో ఉంది! అదెక్కడుందో తెలియక..అనేక చోట్ల వెతికిన పాపిని నేను.  నన్ను క్షమించు.

రెండవచరణం
కన్నుగీఁటి నీవు వారి కైకొని మొక్కించఁగా
సన్నల వారి దొబ్బితి సాదించి నేను
పన్నినకూఁకటివేరై పారి నీవు వుండఁగాను
వున్నతిఁ గొనలకు నీ రొగ్గి నేఁ బోసితిని         ఆడే
శృంగారార్థం
మహానుభావా ! వేంకట నాయకా ! కన్ను గొట్టి నువ్వు ఆడవాళ్లని బుట్టలో వేసుకొని , వారిని గ్రహించి(కైకొని) నీ మొక్కులు తీర్చుకొని ఖుషీచేసుకొంటుంటే- సైగలు చేసి వారిని నేను తిట్టాను. సాధించాను. కాని వేరుని కదల్చకుండా కొమ్మలని వంచటం వల్ల (ఒగ్గు) ప్రయోజనమేముంది? నువ్వు  ప్రధానమైన వేరుగా అంతటా లోపలపాకి ఉన్నావు. అలా నువ్వు ఉండగా చెట్టుకొమ్మ చివరల (కొనలకు) వంటి  షోకిల్లాల  మొగాలపై  నీళ్ళు  పోయటం వల్ల ఏమి ప్రయోజనం ఉంది?
ఆధ్యాత్మికార్థం
మహానుభావా ! వేంకట నాయకా ! మనసారా సేవించిన  నీ భక్తులతో నీ అర్థ నిమీలిత నేత్రాలను  కదిపి, నిన్ను  కన్నులలో నింపుకొమ్మని నువ్వు చెబుతుంటే -  నేను అర్థం  చేసుకోలేక   సదా నీధ్యానమేనా .. ఆసైగలేనా..”అని నేను భక్తులను నిందించాను.  నారాయణుడివి నువ్వు. (నీటియందు ఉండేవాడు నారాయణుడు)   సర్వత్రా వ్యాపించిన నిన్ను భక్తితో సాధించాలి కాని- ఉక్రోశంతో  నీ అనుగ్రహం పొందిన భక్తులను నిందించటం వల్ల  ఏమి ప్రయోజనం ఉంది?


మూడవ చరణం
కోరి పెండ్లాడిన పెండ్లి కొడకవు నీవుండఁగా
గారవించితిని వారిఁ గరుణ నేను
యీరీతి నన్ను శ్రీ వేంకటేశ నీవు గూడుండఁగా
కారణ మిందరునంటాఁ గడల మెచ్చితిని      ఆడే
శృంగారార్థం
నిన్ను నేను కోరి పెళ్ళాడాను.అయినా నువ్వు నిత్య పెండ్లి కొడుకువు. ఎందరో భార్యలు నీకు. విషయం తెలిసి కూడా  నా సవతులను  దయతో  గౌరవించాను. అదుగో..ఎప్పుడు దొంగలా వచ్చావో.. ఇలా అందమైన బంధాలతో నన్ను కలిసావు.. ఇక ఎవరిని తిట్టమంటావు. నువ్వు దూరంగా ఉన్నంతసేపు నిన్ను తిట్టాలనిపిస్తుంది. నువ్వు దగ్గరకు రాగానే, నీస్పర్శ తగలగానే-  నాతో కలిసిన తర్వాత - నా అపూర్వమైన కలయికకు(విరహానంతర కలయికకు) కారణం వీరందరూ అనినా  కనుబొమల చివర సవతులను  మెచ్చుకుంటున్నాను అని అలమేలుమంగమ్మ అంటున్నది.

ఆధ్యాత్మికార్థం
తిరుమల శ్రీవారి ఆనంద నిలయంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలగ్రామమూర్తి దివ్యమంగళ స్వరూపం మొదటిది కాగా... రెండోది 'మనవాళ ప్పెరుమాళ్' అని పిలిచే భోగశ్రీనివాసమూర్తి. మూర్తికే వైఖాన ఆగమశాస్త్రం ప్రకారం కౌతుకమూర్తి, పురుషబేరం అనే పేర్లు వ్యావహారికంలో ఉన్నాయి. శ్రీవారి ఆలయంలో రోజూ రాత్రి ఏకాంతసేవ భాగ్యాన్ని పొందుతున్నది భోగశ్రీనివాసమూర్తే. 'మనవాళన్' అనగా పెండ్లి కొడుకు అని అర్థం. అందుకే నిత్యం రాత్రి చివరగా ఏకాంతసేవ సమయంలో భోగశ్రీనివాసమూర్తి పట్టుపానుపుపై శయనించే భోగభాగ్యాన్ని పొందుతూ నిత్య శోభనమూర్తిగా వెలుగొందుతున్నారు.”అని పెద్దలు చెబుతున్నారు. విషయాన్ని అన్నమయ్య ఈచరణంలో భంగ్యంతరంగా అవిష్కరించారు.
భోగశ్రీనివాసమూర్తి !  నిన్ను నేను కోరి పెళ్ళాడాను.( నీతో కలయిక కొరకు తపించి నీలో కలిసాను) అయినా నువ్వు నిత్య పెండ్లి కొడుకువు. ఎందరో జీవులనే  భార్యలు నీకు. (మధుర భక్తి సంప్రదాయం)  నీకు జీవులు  ఇష్టమని తెలిసి   జీవులను   దయతో  గౌరవించాను. నా అపూర్వమైన కలయికకు(విరహానంతర కలయికకు) కారణమని నా  కనుబొమల చివర   జీవులను  మెచ్చుకుంటున్నాను(అని అలమేలుమంగమ్మ భక్తులమైన మనలను ఆశీర్వదిస్తున్నది)
                                                                        ****

No comments:

Post a Comment

Pages