గొప్పవారి పేదరికం
ఆండ్ర లలిత
రాహుల్ మాట కాస్త కటువు. ఆ రోజు రాహుల్ పుట్టినరోజు. మంచి ధగ ధగ మెరిసిపోయే దుస్తులు వేసుకున్నాడు. రోజుకి ఒక కార్లో వచ్చే రాహుల్,ఆ రోజు Mercedes-Benz S class కార్లో దిగాడు. రాహుల్ ఏదైనా అడగాలే కానీ, వాళ్ళ నాన్న ఎంత ఖరీదైనా కొనిపెట్టేస్తాడు. రాహుల్ది గొప్పగా బతికే కుటుంబం. ధనవంతుడు. కానీ వాళ్ళింట్లో బీద వాళ్ళంటే ఈసడింపు అందరికీ. రాహుల్ దురదృష్టవశాత్తు చిన్నవాడయినా అదే తత్వం రాహుల్కికూడా అబ్బింది. అదే రాహుల్ పేదరికం.
పుట్టినరోజు సందర్భంగా మంచి ఖరీదైన chocolates ఇంటి నుంచి అందరికీ పంచటానికి రాహుల్ తెచ్చాడు. రాహుల్ నేస్తం శ్రీ రామ్ కూడా అదే తరగతిలోనే చదివేవాడు. శ్రీరామ్ రాహుల్కివున్న తక్కువ నేస్తాలలో ఒకడు. శ్రీరామ్ మటుకు మాములు మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు, అయినా సరే రాహుల్కి శ్రీరామంటే ఎందుకో అభిమానం. శ్రీ రామ్ కి కూడా ఎందుకో రాహులంటే ఒక అభిమానం, కొన్నింటిలో రాహుల్ ప్రవర్తన నచ్చక పోయినా. ఆ రోజు పుట్టినరోజు సందర్భముగా అందరికి బడిలో chocolates రాహుల్ పంచాడు. శ్రీ రామ్ కి కూడా chocolate ఇస్తూ “ఒరే శ్రీరామ్ దీని ఖరీదు ఎంతో తెలుసా 10 డాలర్లు. నీ జీవితంలో ఎప్పుడైనా తిన్నావా? ఔనులే, మీ నాన్న ఎలా కొనగలడూ? మీ నాన్న దగ్గర అంత డబ్బు ఉండదుగా. తిను తిను. అలా జేబులో పెట్టుకుంటావే? ఓ! మీ చెల్లికి ఇద్దామనా! మీ చెల్లికి కూడా ఇస్తాను”అన్నాడు రాహుల్ శ్రీరామ్ తో. రాహుల్ మాటలు శ్రీరామ్ లేత హృదయంలో శూలాల్లా గుచ్చుకున్నాయి. కానీ ఇది శ్రీరామ్ కి కొత్తకాదు. రాహుల్కి తన అంతస్తు కన్నా కిందున్న వాళ్ళని ఏదో ఒకటి అనటం అలవాటు. శ్రీరామ్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
“ఒద్దురా, ఈ chocolate ఒకటి చాలు. మేమిద్దరం పంచుకుని తింటాము”అన్నాడు శ్రీ రామ్ నెమ్మదిగా.
“మళ్ళీ తినగలవో లేదో. మా నాన్న Switzerland నుంచి నా కోసం ప్రత్యేకంగా తెప్పించారు. మళ్ళీ తినలేవు. నాకు తెలుసు కదరా. అంత డబ్బుంటే మీ cousins దుస్తులు దర్జీ దగ్గర సరి చేయించుకుని ఎందుకు తొడుగుకుంటావు. మీ నాన్నది చాలా చిన్న ఉద్యోగమని మా నాన్న అన్నారు. నేను తినే ఒక chocolate ఖరీదుతో మీ ఇంటిల్లిపాది పప్పూ అన్నం వండుకుని తింటారని. అందుకే నేను చెప్తున్నాను విను”అంటూ రాహుల్ శ్రీ రామ్ కి ఇంకోక రెండు chocolates ఇస్తుంటే,
“వద్దురా చాలు నాకు. Thanks రా” అంటూ శ్రీ రామ్ అక్కడనుంచి వెళ్ళిపోయి తన తరగతి గదిలోనున్న కిటికీలోంచి బయటకి చూస్తూ కళ్ళు తుడుచుకున్నాడు. ఇంతలో రాహుల్ “ఒరే! శ్రీరామ్ ఇవాళ నా పుట్టినరోజు పార్టీకి రావాలి నువ్వు”అని పిలిచాడు. అన్నీ మరచి శ్రీరామ్ రాహుల్ని పుట్టినరోజు నాడు బాధ పెట్టటం ఇష్టంలేక ఒప్పుకున్నాడు. సాయంత్రం అమ్మతో చెప్పి, ఉన్నవాటిలో మంచి చొక్కా నిక్కరు వేసుకుని ముస్తాబైయి అమ్మిచ్చిన బహుమతి తీసుకుని వెళ్ళాడు రాహుల్ ఇంటికి. అక్కడ రాహుల్ శ్రీరామ్ రాక గమనించి పరుగు పరుగున శ్రీరామ్ను లోపలికి తీసుకెళ్ళి, అందరికీ వీడు నా స్నేహితుడు శ్రీరామ్ అని సంబరపడిపోతూ పరిచయం చేసాడు. తరువాత పుట్టినరోజు వేడుకలు మొదలైయాయి. అందరూ రాహుల్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి పెద్ద పెద్ద బహుమతులు ఇస్తుంటే తన దగ్గర ఉన్న బహుమతి పదే పదే తన చొక్కా జేబులోంచి మాటి మాటికి తీసి చూసుకుని, తను తెచ్చిన బహుమతి ఇవ్వదగినదో లేదో సందిగ్ధములో పడి రాహుల్కి ఇవ్వాలో లేదో తెలీయక, ఏమి చేయ్యాలో తోచక పదే పదే సిగ్గుపడ్డాడు, అమ్మ ఇచ్చిన రంగు కాగితంలో చుట్టిన రెండు pencils బహుమతి ఇవ్వాలంటే. ఎందుకంటే పొరపాటున రాహుల్ తనిచ్చిన బహుమతి విప్పి హేళన చేస్తాడేమో అనే భయంతో. అదీకాకుండా, మళ్ళీ రహుల్ అందరి ముందు ఎక్కడ నిష్టూరంగా మాట్లాడతాడేమోనని. అందుకని రాహుల్ ఇచ్చిన కేక్ తినేసి ఎవ్వరికీ తెలీయకుండా మెల్లిగా వెళ్ళి తను తెచ్చిన బహుమతి అందరూ బహుమతులు పెట్టే బల్లమీద పెట్టాడు శ్రీరామ్. దానితరువాత ఎవరికీ తెలియకుండా బయటికి జారుకుని ఇంటికి వచ్చేశాడు శ్రీరామ్. శ్రీరామ్ వెళ్ళి పోయాడని తెలిసి రాహుల్కి కూడా ఎందుకో మనసు చివుక్కుమంది.
ముభావంగా వాడిపోయిన శ్రీరామ్ ముఖం అమ్మ చూసి శ్రీరామ్ని దగ్గర తీసుకుని, ఏమైందని అడిగింది. శ్రీరామ్ అమ్మని పట్టుకుని రాహుల్ మాటలు నాకు ఇష్టంలేదమ్మా. నా నేస్తమే కదా! ఎందుకలా మాట్లాడతాడు? మా స్నేహితుల్లో కూడా అందరూ రాహుల్ కంట పడకుండా తిరుగుతారు. వాడే కాదు అమ్మా. ఇవాళ రాహుల్ వాళ్ళ నాన్నకూడా మీ బీద స్నేహితుడు అఖరికి వచ్చాడన్నమాట అని నన్ను చూసి రాహుల్ తో అన్నారు. తట్టుకోలేక పోయానమ్మా అంటుంటే అమ్మ కళ్ళు చెమర్చాయి.
“బాధ పడకురా శ్రీరామ్. కొంత మంది అలా నోరు పారేసుకుంటారు. కానీ ఆ మాటలు ముందువాళ్ళని బాధపెటుతున్నాయని వాళ్ళకి తెలియదు. అదీ రాహుల్ కూడా అభం శుభం తెలియని చిన్నవాడు. వాడేదో వాడు చేసే పని చాలా గొప్పదని భావిస్తాడు. వాడిది తప్పు కాదు. వాడు పెరిగే వాతావరణమది.”
శ్రీరామ్ ఎందుకు చెప్పకండా వెళ్ళి పోయడని రాహుల్ కి అర్ధం కాలేదు. ఎప్పడూ చాలా ప్రేమగా వుండే నేస్తం కదా, ఎందుకు వాడు ఇంత మంచి పార్టీ ఎంజాయ్ చెయ్యకుండా వెళ్ళపోయాడు? పార్టీ అయిపోయినా రాహుల్కి ఎందుకో వెలితి అనిపింస్తోంది. ఎందుకో ఏదో తప్పుచేసానేమో అనే భావనతోనే రాహుల్ నిద్రపోయాడు.
మర్నాడు శ్రీరామ్నిబడిలో రాహుల్ చూసేటప్పటికి ఏదో మంచి అనుభూతి కలిగింది. శ్రీ రామ్ నిన్న నువ్విచ్చిన పెన్సిల్తోనే నేను రాసుకుంటుంన్నాను చూడని రాహుల్ తెలియకుండా అనేసాడు. అలా రాహుల్ అన్నప్పడు ఎందుకో రాహుల్ మనసులో చాల భారం తగ్గనట్లనిపించింది. “శ్రీ రామ్!! నీకొకటి తెలుసా ఇప్పుడే నాకు అనిపించింది, నోరు బావుంటే ఊరు బావుంటుందని”అంటూ రాహుల్ వాళ్ళ మాస్టారి మాట గుర్తు చేసాడు.
అప్పటినుంచి శ్రీ రామ్ రాహుల్ స్నేహం చాలా బలపడింది.
No comments:
Post a Comment