హీనదశల బొంది యిట్ల నుండుటకంటె - అచ్చంగా తెలుగు

హీనదశల బొంది యిట్ల నుండుటకంటె

Share This
హీనదశల బొంది యిట్ల నుండుటకంటె
తాళ్లపాక అన్నమాచార్య అధ్యాత్మ సంకీర్తనకు తాత్పర్య విశేషాలు
డా.తాడేపల్లి పతంజలి 

రేకు: 1-3  సంపుటము: 1-3

హీనదశల బొంది యిట్ల నుండుటకంటె
నానావిధులను నున్ననాడే మేలు॥పల్లవి॥

అరుదైన క్రిమికీటకాదులందు బుట్టి
పరిభవములనెల్ల బడితి గాని
యిరవైనచింత నాఁడింతలేదు యీ-
నరజన్మముకంటె నాడే మేలు॥హీన॥

తొలఁగక హేయజంతువులయందు బుట్టి
పలువేదనలనెల్ల బడితిగాని
కలిమియు లేమియు గాన నేడెఱిగి
నలగి తిరుగుకంటె నాడే మేలు॥హీన॥

కూపనరకమున గుంగి వెనకకు నే
బాపవిధులనెల్లబడితిగాని
యేపున దిరువేంకటేశ నా కిటువలె
నాపాల గలిగినాడే మేలు॥హీన॥
తాత్పర్యము

కష్టమైన దశలను పొంది ఈ రకంగా  ఈ మానవ జన్మలో  బాధలు పొందుటకంటె- అనేకమైన హీన  జన్మలలో ఉండుట మేలు.
1.ఆశ్చర్యకరమైన (అరుదైన)  క్రిమికీటకాదుల జన్మలు ఎత్తి , అనేక అవమానాలు పడ్డానుగాని (పరిభవములనెల్ల బడితి గాని)స్థిరమైన (యిరవైన) బాధ   ఈ మానవ జన్మలో ఉన్నంతగా  (ఈనాడున్నంతగా ) ఆనాటి జన్మలలో ఇంత లేదు.  ఈ మానవ జన్మ కంటె   ఆనాటి  క్రిమికీటకాదుల జన్మలు మేలు ( నాడే మేలు)
2. జనన మరణ చక్రంలో తప్పుకోవటానికి వీలు కాక ( తొలగక) హీనమైన జంతుజన్మలు ఎత్తి   అనేకమైన బాధలు పడ్డాను కాని –ఆ జన్మలలో  ఈనాడు మానవ జన్మలో ఉన్న ఐశ్వర్యము, పేదరికము మొదలైన  బాధలు తెలియవు . కనుక  ఈ జన్మలో   ఐశ్వర్యము, పేదరికము గురించి తెలుసుకొని శ్రమపడి    తిరుగుట కంటె (  అలగితిరుగుకంటె)  ఆనాటి  క్రిమికీటకాదుల జన్మలు మేలు
3.నరకమనే పెద్ద బావిలో(కూపనరకమున) దిగబడి – మరలా వెనకకు వచ్చి – నేను అనేక పాపజన్మలను ఎత్తాను కాని- ఈనాటి మానవ జన్మలో ఉన్నన్ని బాధలు పూర్వ జన్మలలో - ఆనాడు లేవు.(అయితే ఒకే ఒక్క అవకాశం ఈ మానవ జన్మలో ఉంది.) అతిశయించి(ఏపున) శ్రీ వేంకటేశుడు నాకు ఈరకంగా , నా గానానికి అనుకూలంగా, నన్ను రక్షిస్తూఉంటే అది నాకు  ఈ మానవ జన్మలో  శుభమవుతుంది. 
(కనుక మానవ జన్మ సార్థకత కొరకు వేంకటేశుని పూజించమని  ఈ కీర్తనలోని  భావం)

No comments:

Post a Comment

Pages