మాతృభాష మాధుర్యం - 2 - అచ్చంగా తెలుగు
మాతృభాష మాధుర్యం - 2
ఆదూరి హైమావతి

మాతృభాష పట్ల - అవంతి  ప్రీతి
"బామ్మా! ఈరోజు ఇన్ని వంటకాలేంటి బామ్మా!నాకు సెలవనా!" అంటూ బామ్మ ను చుట్టేసుకుని ,ఆమెవండి దేవుని ముందు ఉంచి, నివేదన చేసిన వంటకాలు చూసి సంతోషంగా అడిగింది అవంతి.
"పిచ్చీ ! ఈ రోజు 'కృష్ణ జయంతి'.అందుకే ఆయనకు ఇష్టమని ఇవన్నీ చేశాన్రా!" 
"ఏంటీ కృష్ణ జయంతా! ఆయన గానీ రాత్రికల్లో కొచ్చి అడిగాడా ఏం  బామ్మా!"
" ఛ నోర్ముయ్! చూపులు ఆయనకు త్రేనుపులు నీకూ!పేరు దేవునిది,  తినేది మనమే ."
"పోన్లే బామ్మ !ఈరోజు సెలవుకావటాన తీరుబాటుగా అన్నీ తింటాను. రోజూ ఈ బాక్స్ భోజనం తో నోరు చెడి పోయిందనుకో.ఇలా వారానికో  కృష్ణ జయంతి వస్తే బాగుండే బామ్మా!"
"మన భారతీయ సంస్కృతిలో అందరు దేవుళ్ళ పుట్టు పండుగలకూ  సెలవులున్నాయి"
"ఓహ్ ! నాలాంటి వారికి విందుభోజనం బాగాదొరుకుంతుందంటావ్! ఇంకా ఏఏదేవుళ్ళ జయంతులు వస్తాయో చెప్పు బామ్మా!గుర్తుంచుకుంటాను, అందరికీ జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను.హేపీ బర్త్ డే అన్నమాట."
"ఓసీ పిచ్చీ! దేవుళ్ళకు శుభాకాంక్షలేంటే!నీ స్నేహితులకు చెప్పుకో.”
" నాస్నేహితులకు మైల్ లో కార్డ్ పంపుతాలే. లేదా వాట్స్ అప్ ఉండనే  ఉంది "
"ఏమి అప్పులో డవున్లో కానీ కనీసం జన్మము అనేతెలుగు మాట  కుండే అర్ధాలు, పర్యాయపదాలూ తెలుసా!"
" ఎలాతెలుస్తుంది బామ్మా !నాకు తెలుగు.ఏదో నీతో ఇలా మాట్లాడు తుండటాన మాట్లాట్టమైనా వస్తు న్నది. ఎల్ కేజీలోనే నన్ను ఇంగ్లిష్ మీడియమని,హాస్టల్లోపడేశా రాయే, డాడీ మమ్మీనీ,  ఏదో నీవు న్నావుగనుక ఇంతమాత్రం తెలుగు వస్తున్నది.మాక్రిస్టియన్ స్కూల్లో ఏ హిందువుల పండుగలూ
జరగవుకదా! ఎలాగో బయట పడి ఈ ఉద్యోగంకారణంగా  నీవిలా  నాదగ్గరుండటాన  కాస్తకాస్త తెలు స్తున్నది.ధాంక్యూ బామ్మా!" అంటూ బామ్మను వాటేసుకుంది ,మనవరాలు  అవంతి.  
"అన్నట్లు బామ్మా! నాకు కాస్త కాస్త తెలుగు నేర్పవూ! రిటైర్డ్  టీచరమ్మవుకదా  !నాకూ అచ్చంగా తెలుగమ్మాయిని కావాలని ఉంది  బామ్మా !"
"దాందేముంది బంగారూ ! నేను నీదగ్గరున్నాది అందుకేగా! ఎటూ మొద లెట్టాం కనుక ఈ రోజు 'పుట్టుక '  అనే పదానికున్న పర్యాయపదాలు చెప్తావిను."
"చెప్పు బామ్మా! నా ఫోన్ లో రికార్డ్ చేసేసుకుంటాను".అంటూ తన ఫోన్ తెచ్చి బామ్మ ముందు పెట్టింది రికార్డ్ చేసుకోను.
" బంగారూ! నీవు పుట్టినపుడు బంగారు రంగులో మెరుస్తూ ఉంటే  అచ్చంగా లక్ష్మిదేవి మా ఇంట ‘ఉద్భవించిం’దని మురిసిపోయాం.  తాతగారు మాత్రం అచ్చం సరస్వతీ మాత మనింట ‘ఆవిర్భూత’ మైందని  తెగ  మురిశారు.ఆతర్వాత నీతమ్ముడు పుట్టినపుడు తాతగారు 'ఓహో ! ఆ షణ్ముఖుడే మనింట ‘ప్రభవించాడ’ని సంబరపడ్దాడు. 
మీ మామకు మొదటి సారి కొడుకు పుట్టినపుడు అచ్చం గణపతి’ప్రాదుర్భావం ’చెందా డని అంతా సంతోషించాం. మన ఇంట్లో  చాలా కాలంగా పని చేసే పార్వతికి నీతర్వాత బిడ్దపుడితే , ఆమె 'అమ్మగారూ మీ అవంతమ్మ కు నీళ్ళుపోస్తూ ఉగ్గుపెడుతూ ఉన్న పుణ్యానికి  నాకు బిడ్డ ‘జనన’మైందని సంతోషించింది.ఇలా తెలుగులో 'పుట్టుక' అనే మాటకుచాలాపదాలున్నాయిరా పిచ్చీ! --అభినిష్పత్తి, ఆత్మలాభము, ఆవిర్భావము,  ఆవిర్భూతము, ఉత్థానము, ఉత్పతనము, ఉత్పత్తి, ఉత్పాదము, ఉద్ఘతి,  ఉద్గమము, ఉద్భానము, ఉపజనము, కనుబడి, కలిమి, జనువు, జన్మము,  జాతము, పుట్టు, పుట్టువు, పుట్టుబడి, పుట్టువ, ప్రభూతి, , బాము,  విజననము, సంభవము, సంభూతి,  సముత్పత్తి - --- ఇంకాబోలెడన్ని పదాలు తెలుగు నిఘంటువు తెరిస్తే  ఉంటాయిరా, సరే పద వంట లన్నీ చల్లారిపోతున్నాయి."అంటున్న  బామ్మ ఉందునుంచీ ఫోనందుకుని లేచింది అవంతి నోరూ రించే పదార్ధాలకేసి చూస్తూ. 
 ***

No comments:

Post a Comment

Pages