టెక్నాలజీ - అచ్చంగా తెలుగు
టెక్నాలజీ (చిన్న కధ)
పెయ్యేటి శ్రీదేవి

1. ఒకప్పటి రోజుల్లో..............
           ' అన్నయ్యా!  ఇంకో రెండురోజులుండన్నయ్యా!  బాబిగాడు బెంగ పెట్టుకుంటాడు నీకోసం.'
           ' లేదమ్మా, అర్జంటు పనుంది, వెళ్ళాలి.  ఒక్క ఉత్తరం ముక్క రాయి.  వెంటనే బయలుదేరి వచ్చేస్తా.'
       2. ఇంకొన్నాళ్ళు పోయాక................
           ' అన్నయ్యా!  ఇంకో రెండురోజులుండన్నయ్యా.  చిట్టితల్లికి నువ్వంటే ప్రేమ.  బెంగపెట్టుకుంటుంది.'
            ' లేదమ్మా.  వెళ్ళాలి.  అమ్మకీ ఆరోగ్యం బాలేదు.  కాకిచేత కబురంపినా రెక్కలు కట్టుకు వాల్తా.  సరేనా?'
3. మరికొన్నాళ్ళు పోయాక
           ' అన్నయ్యా!  ఇంకో రెండురోజులుండన్నయ్యా.  మీబావ ఊరెడతారు.'
           ' లేదమ్మా, వెళ్ళాలి.  ఒక్క ఫోనుకొట్టు.  వెంటనే నీ ముందుంటా.  
4. కొన్నేళ్ళు పోయాక
           ' అన్నయ్యా!  పిల్లలిద్దరూ వివాహాలయి, అమెరికా వెళిపోయారు.  ఒంటరితనం బాధిస్తోంది.  ఒక్కసారి రా అన్నయ్యా.'
            ' ఎందుకమ్మా బెంగ?  చక్కగా టివి.చూడు.  మంచి కాలక్షేపం. ఎస్.ఎమ్‌.ఎస్. చెయ్యి, వచ్చేస్తా.'
5. ఇప్పటి రోజులకి వచ్చేసాం.
          ' అన్నయ్యా!  ఒక్కసారి రావూ?  నీతో తనివితీరా మాట్లాడలనుంది.'
          ' అయ్యో, పిచ్చితల్లీ!  ఎందుకమ్మా బెంగ?  ఇంటర్‌నెట్‌లో మౌస్ క్లిక్ చెయ్యి.  చాట్‌లో అనేక విషయాలు మాట్లాడుకుందాం.'
6. తాజాగా.............
          ' అన్నయ్యా!  నిన్ను చూసి చాలా ఏళ్ళయింది.  ఒక్కసారి రావూ?  నాకు ఒంట్లో బాగుండటంలేదు.'
          ' అయ్యో, బంగారుచెల్లీ!  రోజులు మారాయి.  ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగింది.  ఎందుకమ్మా బెంగ, ఇంటర్‌నెట్ మనచెంతనుండగా? రాత్రి స్కైప్‌లోకి రా.  తనివితీరా చూసుకుంటూ మాటాడుకుందాం. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా చక్కగా స్కైపులో మాట్లాడుకోవచ్చు, ఒక్క దేముడితో తప్ప.
7. కొద్ది క్షణాలక్రితం..............
          ' అన్నయ్యా!  నిన్ను లైవ్‌లో చూడాలనుందన్నయ్యా. మనశ్శాంతి లేదు.'
          ' అయ్యో, ఎందుకమ్మా దిగులు?  ఈ వయసులో హాయిగా రామాయణం, భాగవతం,భగవద్గీత చదువమ్మా.  మనశ్శాంతిగా వుంటుంది.'
8. ఆఖరిమజిలీ...........
          ' చెల్లీ!  చెల్లీ!  స్కైప్ ఆన్‌ చేస్తున్నా, రా.'
          ఇంకెక్కడి చెల్లి?  ఈ లోకం విడిచి వెళిపోయింది!

No comments:

Post a Comment

Pages