వృక్షో రక్షతి రక్షితః - అచ్చంగా తెలుగు

వృక్షో రక్షతి రక్షితః

Share This
“వృక్షో రక్షతి రక్షిత”
(ఆటవెలదులు)

భానుమతి మంథా.

1.    సంపదెంత యున్న సార్ధక మెంతయొ
      నాకలినది దీర్చ ననువు గలదె
      కడుపు నింప జనుల గాసము కావలె
      కర్షకుని కరుణయె కలుగు భుక్తి.
2.    హలము చేత బట్టి హాలికులిలలోన
      దుక్కి దున్ని కలుపు తుక్కుతీసి
      చదును చేసి విత్తుఁజల్లి వెసులు చూసి
      మొఖము నెత్తి జూసు మొగులు కొరకు.
3.   ఎరువు విత్తు కొనగ ధరలాకశమునంటె
     ఆలి పుస్తెలమ్మి యంగడెల్తె
     కల్తి విత్తు మందు కర్షకులకు నురి
     మధ్య వర్తి ధరను మనగనీడు.
4.    వాన రాక లేక పంటలే పండక
      నేల బీట తీసె కాల మహిమ
      రైతు నింగి జూడ కౌతుకముననెంతొ
      కఱవు కమ్ముకొనియె నెఱవు గాను.
5.   పంట లెన్ని వేయ ఫలితమే కనరాదు
     రుణము తీర్చ, లేదు రొక్క మేమొ
     తాత లిచ్చినాస్తి తాకట్టులో పోయె
     కర్షకునికి దిక్కు కాన రాదు.
     
6.    చిన్నపల్లె లందు చితికెను వాసము
      వలస పోవు జనము వాసి బెరిగె
      యువత భవిత కొఱకు చవిగొన నంతనే
      పరుగు తీసి కదలె పట్నములకు.
7.   జీవ నదులు నెండి జీవము లేకనే
     మృత్తి యిసుక నంత మేట దీసె
     కారణముల వెదక కాలుష్యమేనని
     విశ్వమంత వెరగు వేత కలిగి.
8.   చెట్లు కొట్టి వేసి చెరువుల పూడ్పించి
     పెక్కు భవనములను పెంచె దివికి
     పేర్చి మేడ కట్టి పేరును చేకూర్చి
     పెంచె పట్టణముల ముంచె మురుగు.
9.   వాహనములు పొగను బాళిగ వదలగా
    ప్రాణ వాయు వంత పరుషమాయె
    కలుషతమయినట్టి గాలి యంతయు చేరి
    మేఘములను తరిమె మిగులకుండ.

10.   కానలకు బదులుగ కాంక్రీటు భవనాలు
     కానరావెచటను మానులేమొ
     భానుడు వదలగను బాలమునంతను
     చెట్లు చెరువులేమొ చెదరి పోయె.
11. రాచ బాటలెన్నొ రమ్యమున్ వేసిరి
    అంబరముల గట్టె హర్మ్యములను
    తరువుల నరికించి తలబెట్టిరిలలోన
    ముద్దు బిడ్డలుగద పుడమి కవియె.
     
12.  వసుధ తల్లడిల్లె భరియించ వేడిమి
     వనముల హరియించ వాన లేక
     వృక్షములను పెంచి రక్షింప యడవుల
     పూన దీక్ష మనము వాన గురియు.

No comments:

Post a Comment

Pages