నాకు నచ్చిన నా కధ(ఇదీ నా కధే)- యవ్వనపు తొలిమెట్లు - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన నా కధ(ఇదీ నా కధే)- యవ్వనపు తొలిమెట్లు

Share This
నాకు నచ్చిన నా కధ(ఇదీ నా కధే)- యవ్వనపు తొలిమెట్లు
శారదా ప్రసాద్ 

అలా  స్కూల్ లో సరదాగా స్నేహితులతో గడపటాన్ని నేను ఇప్పటికీ తలచుకుంటాను.ఆ రోజుల్లో సత్తెనపల్లిలో పత్రి నరసింహారావు మెమోరియల్ బ్యాడ్మింటన్ పోటీలు జరిగేవి.ప్రఖ్యాత క్రీడాకారులు వచ్చేవాళ్ళు.ఆ సందర్భంగా స్కూల్ కు ఒక వారం సెలవు ఇచ్చేవారు.ప్రఖ్యాత  క్రీడాకారులైన పిళ్ళై,పిచ్చయ్య,ఖాన్ ..లాంటి వారి ఆట తీరు చూసి ఆనందం పొందేవారము.పిచ్చయ్య గారి పేరుతో  ఆ రోజుల్లో పిచ్చయ్య బ్యాట్స్ అని మార్కెర్ట్లోకి వచ్చేవి.ఈ ఆటలతో పాటుగా కబడ్డీ పోటీలను కూడా నిర్వహించేవారు.ఈ బాడ్మింటన్ పోటీల స్ఫూర్తితోనేమో మిత్రుడు పండా వీర వెంకట కుమార్ ,వెల్లా రామ్మోహన్ లాంటి మిత్రులు నేటికీ కూడా ఆ ఆటను ఆడుతున్నారు.కుమార్ వెటరన్ ఆటగాడిగా చాలా బహుమతులను గెలుచుకున్నాడు.అలా స్కూల్ అంటే ఆటపాటలకు నిలయంగా ఉండేది,ఇప్పటి స్కూల్స్ లాగా కాకుండా!వార్షికోత్సవ సమయాల్లో అన్ని రంగాల్లోని విజేతలకు బహుమతి ప్రదానం చేయటానికి రమారమి రెండు గంటల సమయం పట్టేది.మిత్రుడు కొమ్మూరి సాంబశివరావు ఫుట్ బాల్ ఆటలో ప్రవీణుడు.ఏ మూల నుంచైనా గోల్ కొట్టటం వాడి ప్రత్యేకత.ఇక నేను వాలీ బాల్ ఆడేవాడిని.నా ఎత్తుకు ఆ ఆట బాగా నప్పింది.ఆ విధంగా మానసిక వికాసాన్ని ఆ స్కూల్ లో పొందాం!అందుకే ఆ స్కూల్ అన్నా, ఆ ఉపాధ్యాయులన్నా ఇప్పటికీ మక్కువ ఎక్కువ.సినిమాలను కూడా బాగా చూసేవాళ్ళం!స్కూల్ లో జేసుదాస్ అనే మాస్టర్ ఉండేవారు.ఆయన సోషల్ స్టడీస్ చెప్పేవారు.ఆయన చుట్టలు ఎక్కువగా కాల్చేవారు.ఆయన్ను చూసిన తర్వాత పొగాకుకు పుట్టిన ఇల్లు అమెరికా అనే బిట్ ప్రశ్నకు అందరూ కరెక్ట్ గా సమాధానం వ్రాసేవాళ్ళు! నాగయ్య గారు నటించిన భక్త రామదాసు సినిమా అప్పుడు విడుదలైంది.అందులో రామదాసును  బందీఖానాలో పడెయ్యటానికి తీసుకొని పోతుంటారు భటులు.ఆ దృశ్యం అప్పుడు రామలక్ష్మణులు గుర్రాలమీద వెళుతూ, 'రామదాసు గారూ!ఇదిగో రసీదు అందుకోండి!'అనే పాటను పాడుతూ వెళుతుంటారు.ఆ పాట స్ఫూర్తితో మా బ్రహ్మిగాడు (నేటి ప్రఖ్యాత హాస్యనటుడు బ్రహ్మానందం) ,'జేసుదాసుగారూ!ఇదిగో చుట్టనందుకోండీ!'అనే పారడీ పాటను పాడేవాడు.అది ఆ నోటా ఈ నోటా పడి జేసుదాసు గారికే చేరింది.ఆయన వెంటనే బ్రహ్మానందాన్ని పిలిచారు.దండిస్తారేమోనని వాడు భయపడ్డాడు.జేసుదాసు గారు వాడి భుజాన్ని తట్టి,వాడి టైమింగ్ కు మెచ్చుకొని,"శెభాష్!keep it up !అని   ఆయన జేబులోని కలాన్ని బహుమతిగా వాడికిచ్చారు.నెమ్మదిగా SSLC లోకి వచ్చాం.ఇక అందరమూ చదువుమీద దృష్టి పెట్టాం.మేము కొంతమంది మిత్రులం కోటివీరయ్య గారి వద్ద ట్యూషన్ కు చేరాం.ఆయన కాంపోజిట్ మాథెమటిక్స్ బాగా చెప్పేవారు.యవ్వనపు తొలిమెట్లలో అడుగిడిన వయసది.ఆ ఛాయలు పొడచూపటం మొదలయ్యాయి.అయితే వాటిని బయటపడకుండా లోపలనే దాచుకునేవాళ్ళం!కాకపోతే ,ఆంతరంగీకులతో పంచుకునేవాళ్ళం!కమలకుమారి అనే అమ్మాయి కూడా మాతోనే ట్యూషన్ చదువుకునేది.ఆ అమ్మాయిని ఆ అమ్మాయికి తెలియకుండా బాగా ఆటపట్టించేవాళ్ళం.ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రిన్సిపాల్ గా  పనిచేసి ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ను ఆనందంగా గడుపుతుంది.ఇప్పటికీ ఆవిడతో మాకు సంబంధాలు కొనసాగుతున్నాయి.ఇక తెలుగు మాస్టర్ గారు అయిన దేసు రామకోటయ్య గారు పాఠం చెప్పే తీరే వేరు.నోట్స్ చెప్పండి ,వ్రాసుకుంటాం అంటే అందుకు ఆయన ,"నేను చెప్పేది ఏముందిరా!ఉద్దండ పండితులు ఎనిమిదిమంది కలసి ఒక గైడ్ ను వ్రాసారు.అది కొని చదువుకోండి !"అనే వారు .ఆ రోజుల్లో Eight  పండిట్స్ గైడ్ చాలా ప్రసిద్ధి.ఇంగ్లీష్ ను లక్ష్మోజీ బాబూ గారు బోధించేవారు.ఆయన అంటే విద్యార్థులకు భయం ఎక్కువ.హిందీని వాసిరెడ్డి సుబ్బారావు గారనే వారు చెప్పేవారు.ఆయన టీచర్ మాత్రమే కాదు.ప్రఖ్యాత రంగస్థల నటుడు.ఆ రోజుల్లో ఆయన మాయల ఫకీర్ గా ప్రసిద్ధి.ఆయన చేసే వికటాట్టహాసం నేటికీ మా చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది.ఆ రోజుల్లోనే D S రాధాదేవి అనే స్త్రీ మాయల పకీరుగా ప్రసిద్ధి చెందింది.ఒకసారి పోటీల్లో మా మాస్టర్ గారికి మొదటి బహుమతి,ఆవిడకు రెండవ బహుమతి వచ్చింది.ఇక సంగుగా షహీదా అనే ఒక అందాలరాశి నటించేది.ఈవిడ కుమారుడే నేటి ప్రముఖ నేపధ్య గాయకుడు మనో !(అప్పట్లో నాగూర్ బాబు). SSLC లో గోల చేయటం కొద్దిగా తగ్గింది. అందరమూ మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యాము!కొంతమంది పాలిటెక్నిక్ కోర్స్ కు వెళ్లారు.మిగిలినవాళ్లు PUC లో చేరారు.పాలిటెక్నిక్ చదివిన వారిలోని గణపతి ఆ మధ్య ఎందుకో ఆత్మహత్య చేసుకున్నాడు.మురళీని ఈ మధ్యనే కలుసుకున్నాం!ఎవరెవరికి అనుకూలమైన ఊళ్లలో వాళ్ళు పీయూసీలో చేరారు. బసవయ్య, నేను, కొమ్మూరి, కృష్ణప్రసాద్, శివరాంబాబు, హబీబుర్ . నరసారావుపేట లో చేరాం. యూసఫ్ భాయ్ నెల్లూరు లో చేరాడు. బాబూరావు ఏలూరులో చేరాడు. బ్రహ్మానందం అత్తిలిలో చేరాడు. అలా మాధ్యమిక విద్యను ఆటపాటలతో పూర్తి చేసాం! మరికొన్ని విశేషాలు మరొకసారి!

2 comments:

  1. Thanks for sharing your student experiences. Glad to know Brahmanandam is schoolmate

    ReplyDelete

Pages