నెల 'వంక' -2 - అచ్చంగా తెలుగు
నెల 'వంక'
కంభంపాటి రవీంద్ర 

నా చిన్నప్పుడు ఓ ఐదు వాటాల ఇంట్లో ఉండేవారం . అంటే కింద నాలుగు వాటాల్లో అద్దెకుండేవారూ , పై ఫ్లోరులో ఇంటి ఓనర్లూ అన్నమాట . మా నాన్నగారు మార్గదర్శి చిట్స్ లో పనిచేసేవారు , కాబట్టి ప్రతి ఏడాదీ మార్గదర్శి క్యాలెండర్లు ఇంటికి తెచ్చేవారు, అవి చుట్టుపక్కలవాళ్ళకి ఇచ్చేవారం . ఇప్పటి తరానికి పెద్దగా తెలీదు కానీ అప్పట్లో క్యాలెండర్లంటే జనాలకి ఓ రకమైన క్రేజుండేది . మా పక్క వాటాలో ఉండే ఆయన  (పేర్లొద్దు లెండి ), ఓసారి మా నాన్నగారిని పక్కకి పిలిచి 'సార్ .. మీకెప్పుడైనా జయమాలిని క్యాలెండర్ వస్తే నాకు ఇవ్వరా ' అని అడిగేడు , 'లేదండీ .. మా ఆఫీసులో ఎప్పుడూ లక్ష్మీ దేవి క్యాలెండర్లే వేస్తారని ' మా నాన్నగారు చెప్పి వచ్చేసేరు . ఆ తర్వాత ఆయన్ని ఎప్పుడు చూసినా జయమాలినే గుర్తొచ్చేది . 

ఇదంతా ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే , రోజులు మారిపోయేయి .బూతు అనేది ఇలా గుట్టుగా అడిగే రోజులు పోయేయి ..  ప్రతీ వారి చేతుల్లోనూ ఓ స్మార్ట్ ఫోను , అందులో రిలయన్స్ వారి సౌజన్యం తో ఉచితంగా ఇంటర్నెట్టు .. దానితో వయోభేదాలు లేకుండా చిన్నా పెద్దా అన్నీ చూసేస్తున్నారు . వాట్సాప్ లో వచ్చే బూతు వీడియోలు  గట్రా మనుషుల మనస్తత్వాలని ఎంతో సులభంగా మార్చేస్తాయి . ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మన పిల్లల్తో  ఎవరైనా మగాడనేవాడు (వయసుతో పని లేదు) మాట్లాడుతున్నాడు అంటే , వాడిని ఓ కంట కనిపెట్టాల్సొస్తూంది . ఈ మధ్య చిన్నారుల పైనా , యువతుల పైనా , వయోవృద్ధుల పైనా అత్యాచారాలు పెరిగిపోడానికి స్మార్ట్ ఫోన్ మూలంగానే అంటే చాలావరకూ ఒప్పుకోక తప్పదు . 

ఆ మధ్య ఏదో గుడికెళ్తే , ఎక్కడా పూజారన్నవాడు కనబళ్ళేదు , సరేనని దణ్ణమెట్టుకుని వచ్చేస్తూంటే , ఓ చోట నలుగురైదుగురు పూజార్లు ఓ స్మార్ట్ ఫోన్లో ఏదో వీడియో చూసుకుంటూ తెగ నవ్వేసుకుంటున్నారు . నా దృష్టిలో రోజూ చేసే దేవతార్చన , పలికే మంత్రాలు మన మనస్సుని ఎంతో కొంత అదుపాజ్ఞలలో ఉంచుతాయి , అలాంటిది ఆ పూజారులే ఈ స్మార్ట్ ఫోన్ జాడ్యానికి బలైపోతే సామాన్యుడెంత ?
ప్రతి కుటుంబంలో ఎవరికి వారికి వేరే ఫ్రెండ్ లిస్టులు , ఎవరు ఎవరితో ఏమేమి మాట్లాడతారో తెలీదు . ఎవరికి వారు పిల్లలు ముత్యాలు , మొగుడు బంగారం , పెళ్ళాం స్వాతిముత్యం అనుకుని ప్రయోజనం లేదు , మనుషుల మధ్య ట్రాన్స్పరెన్సీ ఉండాలి లేకపోతే ఎవరి మనసు ఎంతెంత వికృత పోకడలు పోతూందో ఎలా తెలుస్తుంది ?
మన దురదృష్టం ఏమిటంటే ఈ స్మార్ట్ ఫోను దారుణాల్ని అరికట్టడానికి ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకున్నట్టు కనిపించదు . యూట్యూబ్ వంటి అప్లికేషన్స్ ని ఎంతైనా నియంత్రించాల్సిన పని ఉంది కానీ స్వయానా మంత్రులూ , శాసనసభ్యులు ఏకంగా అసెంబ్లీల్లో బూతు వీడియోలు చూస్తూ దొరికిపోతూంటే , ఇంకా వారేదో మన జాతి భ్రష్టు పట్టకుండా చర్యలు తీసుకుంటారని ఆశించడం అత్యాశ తప్ప వేరేమీ కాదు . 
కాబట్టి ప్రతీ కుటుంబం తగిన జాగ్రత్తలు తీసుకుని , తమ తమ ఫోన్లలోఎవరేం చూస్తున్నారో ఓ కన్నేసి ఉంచుకుంటే ఆరేళ్ళ పాపపై అత్యాచారం చేసిన వయోవృద్ధుడు లేక డెబ్భై ఏళ్ల ముసలావిడపై కర్కశంగా బలాత్కారం చేసిన యువకుడు లాంటి వార్తలు చదివే బాధ తప్పుతుంది.
***

1 comment:

  1. అవునండీ ఎదురుగా ఉన్నవారు ఏ ఉద్దేశంతో చూస్తున్నారో అనికూడా అందరూ భయపడాల్సిన రోజులివి , పిల్లలు చూసినా పట్టుబడకుండా clear history వంటి ఉపాయాలు బోలెడు .యూట్యూబ్ కు
    సెన్సారుండాలి , భక్తి స్తోత్రాల మధ్య బూతు వీడియోలు - దారుణంగా ఉంది

    ReplyDelete

Pages