జువ్వలు - అచ్చంగా తెలుగు
జువ్వలు
కంభంపాటి రవీంద్ర


ఉదయం పదవుతూండగా , టీవీఎస్ మోపెడ్డేసుకుని రత్నబాబు గాడు హడావిడిగా ఇంద్రపాలెం పంచాయితీ ఆఫీసు దాటిన తర్వాతొచ్చే మెరకవీధి ఆంజనేయ స్వామి పక్కనున్న పెంకుటింట్లో ఉండే నూలు జనార్దనం గాడింటికొచ్చి వీధి తలుపు దబదబా బాదేసరికి , అప్పటికే లోపల జనార్దన్ గాడితో గొడవ పడుతూన్న ఆడి పెళ్ళాం వెంకటదుర్గ విసురుగా తలుపు తీసి , కోపంగా అరవబోయి , రత్నబాబుని చూసి , 'నువ్వా ..ఎప్పుడొచ్చేవు హైద్రాబాదు నుంచీ ?.. పోనీలే ..టయానికొచ్చేవు .. మీ ఫ్రెండుకి కాస్త గడ్డెట్టు ' అంటూ లోపలికి దారిచ్చింది !
'ఏరోయ్ ..సెప్పాపెట్టకుండా వచ్చేసేవు .. ఏమిటి సంగతి ..' అని జనార్దనం అడగబోతా ఉంటే , వెంకట దుర్గ అందుకుని 'ముందు ఈయన సంగతి విని .. ఆ తర్వాత నీ సంగతి చెప్పు రత్నబాబూ .. మా పెద్దోడు పుట్టినప్పుడు నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టమని ఆడ్ని బన్నీ అని ముద్దుపేరెట్టేసేను .. ఇప్పుడు మా రెండోది పుట్టిందా .. దీన్ని అదెవత్తో సన్నీ లోనంట .. ఈనగారికి శానా ఇష్టం .. అందుకని మా పాప ముద్దు పేరు సన్నీ అని పెడదామంటున్నాడు .. ఇదేమైనా పధ్ధతి గా ఉందా అసలు ? నువ్వే చెప్పు ' అంది.
'సాల్లేవో సెప్పొచ్చేవు .. పెద్దోడికి నీకిష్టమని బన్నీ అని పేరెట్టొచ్చు గానీ , పిల్లకి సన్నీ అని పేరెడితే నీకెందుకు ఉలికిపాటు .. సెప్పరా రత్నబాబు ' అని రత్నబాబుని అడిగేసరికి , భోరున ఏడుపు మొదలెట్టేసేడా రత్నబాబు !
'సూసేవా .. ఆ పేరు విని మీ ఫ్రెండు కూడా ఏడుపాపుకోలేపోతున్నాడు ' అని వెంకటదుర్గ అంటే 'ఒరేయ్ .. జనార్దనూ .. నాకో వెయ్యి జువ్వలు కావాలి రా .. చాలా అర్జెంటు ' అంటూ రత్నబాబు ఏడుస్తూ చెప్పేడు.
'ఇంతర్జంటుగా జువ్వలేంట్రా బాబూ .. మొన్న అజ్ఞాతవాసి సినిమాకి పవన్ ఫాన్సు వారం ముందు చెప్పేరు నాకు .. ' అని జనార్దన్ గాడంటే , 'ఏమోరా ..నాకు తెలీదు .. ఎన్ని కుదిరితే అన్ని చెయ్యి .. కాకినాడ చరిత్ర లో ఎవ్వడూ అన్ని జువ్వలేసుండకూడదు .. అన్నోటి కావాలి మరి ' అంటూ విషయం చెప్పాడు రత్నబాబు .
విషయం విని షాకైపోయిన జనార్దన్ 'ఉండ్రా బాబూ .. ఇంట్లో ఓ రెండొందలు జువ్వలుండాలి .. అవట్టుకెళ్ళు .. సాయంత్రం లోపు మిగతావి సిద్ధం చేస్తాను ' అన్నాడు బాధగా !
******* 
సెవెంత్ డే అడ్వెంటిస్తు చర్చి వీధిలో ఆ దీపావళి రోజున  చాలా హుషారుగా జువ్వల పోటీలు  జరుగుతున్నాయి . వీధిలో ఉండే కుర్రాళ్ళకి పోటీగా జువ్వలేసేస్తూంది రవణ.
వాళ్ళాయన చింతా నాగబాబు మటుకు వాళ్ళ పాక  చూరు కింద నుంచుని చూస్తా 'ఏంటే బాబూ .. మగ కుర్రాళ్ళకి పోటీగా కాదు .. ఆళ్లందరినీ మించిపోయి ఏసేస్తున్నావు ' అని అంటే , 'మీకు పెళ్ళికి ముందే చెప్పా కదా .. మా మేడపాడు లో కూడా నాకు పోటీగా జువ్వలేసే కుర్రాళ్ళు లేరని! .. ' అంది రవణ.
'భలేదానివే  నువ్వు .. ఇంతకాలం నన్ను ఇస్త్రీ నాగబాబని పిలిచేవోరు .. నీతో పెళ్ళైన మొదటేడాదికే నన్ను జువ్వల రవణ మొగుడు నాగబాబని పిలుస్తారేమో .. కాస్త చూసుకునెయ్యి .. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు ' అంటూ పాక లోపలికి ఇస్త్రీ పెట్టట్టుకునెళ్లిపోయేడు.
ఆ వీధి చివరనున్న ఆరేడుగురు కుర్రాళ్ళ కన్నా రవణ వేగంగా జువ్వల్ని వదిలేస్తూంది , దానికి తోడు ఆ కుర్రాళ్ళ జువ్వల కన్నా రవణ వేసే జువ్వలు చాలా పైకెళ్తున్నాయి . ఇంక ఈవిడ సంగతి ఇలాక్కాదు , ఎలాగైనా భయపెట్టాలని డేవిడ్ రాజనే కుర్రాడు అడ్డంగా రవణ వేపు జువ్వేస్తే , అది దారి తప్పి రవణ  వాళ్ళ పాక మీదికెళ్లింది , సరిగా అప్పుడే రవణ చేతిలో ఉన్న జువ్వ కూడా చీదేసి అది కూడా డేవిడ్ రాజు గాడి జువ్వ తో పాటు వాళ్ళ పాక చూరులోకెళ్ళిపోయింది ! 'ఇదిగో తొరగా బయటికొచ్చేయి' అని నాగబాబు కోసం అరుస్తా పాక లోకెళ్లే లోపలే పాక మొత్తం అంటుకుపోయింది ! ఇంకప్పటి నుండి రవణ జువ్వలు ముట్టుకోలేదు !    
 ****** 
ఇంటి ముందు అడపా శేషారావు గారి షామియానా కొట్లోంచి తెచ్చిన కుర్చీల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న చుట్టాలందరికీ టీలందిస్తా  సాయిలక్ష్మి చెబుతూంది 'అత్తమ్మ కి ఏంటో అన్నీ ముందే తెలిసిపోతాయండి .. హైద్రాబాదు లో ఉన్నప్పుడే నాకు రోజులు దగ్గిరపడ్డాయి నన్ను కాకినాడ పంపేయని మా ఆయనగారికి రెణ్ణెల్ల ముందే చెబితే తీసికొచ్చి ఇక్కడ దింపేవండి .. వారం క్రితం ఫోన్ చేసి ఇంకో పది రోజులకన్నా ఎక్కువ బతకను అంటే ఇదిగో పది రోజుల క్రితమే ఒచ్చేవండి '.
ఆళ్లింటి పక్కన రేషన్ కొట్టు నడిపే పిల్లి శ్యామల అంది 'ఇలాంటాదడాన్ని నేనెప్పుడూ చూళ్ళేదు బాబూ .. బతికినంత కాలం పులిలా బతికింది .. అవసరం లేనప్పుడు ఓ మాట ఎక్కువనేది కాదు .. అవసరమైనప్పుడు ఓ మాట తక్కువనేదీ కాదు '.
సాయిలక్ష్మి చెల్లెలు  మల్లేశ్వరి తన చెవిలో అంది 'ఈవిడ మీ అత్తగారిని  తిడుతూందో తెలీదు .. పొగుడుతూందో తెలీడం లేదే ' అని అంటే , 'చాల్లేవే .. మా అత్తగారిని ఎవరైనా ఓ మాటంటే నేనూ మా ఆయనా అలా అన్నోళ్ళని మా అత్తగారి కన్నా ముందే పైకంపెత్తాం ' అని కోపంగా అంది సాయిలక్ష్మి !
'ఏవమ్మా .. ఎవరైనా డాక్టర్ని పిలవచ్చుగా .. ఆవిడకి ఒచ్చే ప్రాణం పొయ్యే ప్రాణం లా ఉన్నట్టుంది ' అని వాళ్ళ దూరబ్బంధువు అగిరి పైడిరాజు గారడిగితే 'నన్నీరోజే పైకంపేయ్యాలంటే డాక్టరు దగ్గిరికి తీసికెళ్ళండి .. మీతో పాటు ఇంకో నాల్రోజుల పాటు ఉండాలంటే నన్నిలా హాయిగా ఇంట్లోనే ఉండనియ్యండి .. నా పాట్లేవో నేను పడతాను అన్నారండి అత్తయ్యగారు ' అని సాయిలక్ష్మి బదులిచ్చింది.
'నిజమేననుకో .. కానీ నాల్రోజులనుండి ఉలుకు పలుకు లేదుగా ' అని పైడిరాజు గారు అంటే 'నిజమేననుకోండి .. కానీ ఇయ్యాల ఉదయాన్నే మా ఆయనగారి వేపు చూస్తా దగ్గిరికి పిలిచి ఓ కోరిక కోరేరండి ' అని చెప్పబోతూంటే , ఉరుములా వచ్చిపడ్డ రత్నబాబు 'అమ్మా .. నువ్వు పోయినతర్వాత నిన్ను తీసికెళ్తున్నప్పుడు వేయించడానికి జువ్వలు తెచ్చేను .. చూడు చూడు ' అని వాళ్ళమ్మ రవణకి చూపిస్తే , హాయిగా నవ్వుతూ కళ్ళు మూసుకుందా రవణ !


***

No comments:

Post a Comment

Pages