శివమ్మ కధ -12 - అచ్చంగా తెలుగు
 శివం -36
శివమ్మ కధ -12
రాజ కార్తీక్ 

(మహాదేవుడు శివమ్మ పెట్టిన ముద్దలను తింటూ అందర్నీ అలరిస్తాడు ..బాలుడి వలె అల్లరి చేస్తాడు ..ఇంతలో నంది ముద్ద అయ్యిన పిమ్మట నంది ఒక చిన్న కోరిక... అన్నట్లు చూస్తాడు .....[నేను అనగా శివుడు])
నేను "చెప్పు నంది, ఏమిటి ఏమి కావాలి? " అని అడిగాను.
నంది "స్వామి, నేను ఒక పశువుని ఏమో ..ఎందుకంటే ,నాకు ఎప్పుడూ శివమ్మ తల్లి లా ఇలా కోరిక రాలేదు.నాకు ఒక చిన్న కోరిక " అన్నాడు.
నేను "చెప్పు నంది .." అన్నాను.
నంది "ప్రభు, కడుపు నిండింది అనకుండా ఈ మీ నంది పెట్టే ముద్దలు కూడా తినండి స్వామి "అని బ్రతిమాలాడు.
నేను "అయ్యో నంది, ఏమిటయ్యా నువ్వు అనేది? అసలే కడుపు నిండి పోయింది ."అని చమత్కారంగా అన్నాను.
అప్పుడు నంది శివమ్మకి ఒక సంఘటన చెప్పాడు ,నేను, అందరూ వింటున్నాం. 
నంది శివమ్మతో  "అమ్మా, మరి ఒకనాడు మహాదేవుడు కైలాసంలో అమ్మవారు పెట్టింది తినట్లేదు ...అప్పుడు..."
పార్వత మాత, విష్ణు దేవుడు, నంది ఏం చెబుతాడా అని చూస్తున్నారు.
పార్వతి మాత శివయ్యతో, "స్వామి, మరి మీరు ఎందువల్లనో పరధ్యానం లో ఉన్నారు", అని అంది. అప్పుడు శివయ్య "అదేమీ లేదు. నా భక్తులు పెట్టే నైవేద్యాలు ఆస్వాదిస్తున్నా," అని అన్నారు. "అదేంటి ప్రభు !" అని నేను అడిగాను. అప్పుడు వారు "నా భక్తులు ఎంత మంది నాకు తిని పించినా ..మరొక భక్తుని నైవేద్యం కోసం చూస్తూనే ఉంటా" అని అన్నారు.
"ఇప్పుడు నేను కూడా మీకు అటువంటి మరో భక్తుడనే కదా!" అని నా వైపు చూసాడు.
అందరు ఈ నంది మాత్రం భలే చెప్పాడూ అని అంటున్నారు.
నేను "నంది ...ఏమిటి ..ఇప్పుడు నేను తినాలా?" అనడిగాను.
శివమ్మ "శివయ్య పోనిలే ఒక 2 ముద్దలు తిను ."
అంది.

"సరే ,పెట్టు నంది," అన్నాను. అంతే,  నంది కూడా ఆనంద బాష్పాలతో నాకు అన్నం పెడుతున్నాడు.
నంది ఏమీ మాట్లాడట్లేదు. "ఏమిటి నంది నిన్నే పిలిచా, పలకవే?" అని అడిగాను.
"రోజూ మీతో ఉండి కూడా ఈ ఆలోచన రాని ఈ పశువుకి మాట రావట్లేదు ప్రభు " అన్నాడు నంది.
నేను  "అలా ఏమి లేదు నంది, ఎల్లప్పుడూ నన్నే తలిచి, నువ్వు ఎన్నడో పరిపూర్ణుడివి అయ్యావు. ఇంక నువ్వేమి బాధపడాల్సిన అవసరంలేదు, నీకన్నా నాకు ఇష్టుడైన మరో కైలాస వాసి ఎవరు .." అన్నాను ప్రేమగా.
నేను నంది కంట నీరు నా చేతితో తుడిచా.
ఈ సంఘటన  చూసి అందరూ ఆనందపడుతున్నారు.
విష్ణు దేవుడు , పార్వతి మత "నందిది  పూర్ణ భక్తీ ..నందికి మ్రొక్కి తే ఈశ్వరుడు వారిని అనుగ్రహిస్తాడు .."అన్నారు.
నంది ఎందుకో ఆరాధనతో కనుల వెంట  నీటితో నన్నే చూస్తూ ఏడుస్తున్నాడు.
నేను "ఏమైంది నంది నేను ఉన్న గా," అంటూ సముదాయించాను.
శివమ్మ తన కొంగు తీసుకొని నంది కంట నీరు తుడుస్తూ "నంది స్వామి, ఏంటయ్యా ఇది ...అయినా నీది ఏముందిలే, నా బిడ్డ నుండి వచ్చే మాధుర్యం అది "అంది.
 అక్కడ ఉన్న నాగరాజు మరియు భృంగి కూడా  నైవేద్యం పెట్టారు. 
భోజనం అయ్యింది, అందరు ఉల్లాసంగా ఉన్నారు.
విష్ణు దేవుడు "ఇంకా ఎదో జరగబోతుంది ఒక గొప్ప  భక్త లీల" అన్నాడు.
నేను మా అమ్మ ఒడిలో పడుకున్నా .ఉయ్యాల ఊగుతున్నా.
నేను "అమ్మా చెప్పు ..ఇంకా ఏమి కావాలి ..నీ మనసుకి ఏమి కావాలో నాకు తెల్సు " అన్నాను.
శివమ్మ "శివయ్య నేను ఒక పరిపూర్ణ జీవితాన్ని అనుభవించలేదు. ఏమి పాపం చేసానో ఈ జన్మ కి నాకు బిడ్డలు లేకుండా చేసావ్. అన్ని నువ్వే చేస్తావ్. నీ ఆజ్ఞ లేనిది చీమ ఐనా కుట్టదు కదా. నేను గొడ్రాలిని ఎందుకు అవుతా? ఇప్పటికి నా పిలుపు నీకు వినిపించి, నా దగ్గరకు వచ్చావ్ . ఏమి చేసైనా సరే, నిన్ను నమ్మిన ఈ జీవిని కొంచెం అనుగ్రహించు." అనడిగింది.
మా అమ్మ అలా బాధ పడుతుంటే ..నాకు కనులు చమర్చాయి.
ఆమె ఒడిలో పడుకొని ఉన్నా,  ఉయ్యాల ఉగుతూ.
శివమ్మ "శివయ్య ..నిన్ను నమ్మిన వాళ్ళకి కష్టాలు పెడతావ్,  పరీక్షల పేరుతో అన్ని చూస్తూ ఉంటావ్ .  నువ్వు కాక ఎవరు ఆదుకుంటారు  మమ్మల్ని ? ఈ కన్నతల్లి ప్రేమ ను తెల్సుకో శివయ్య ..  "అంది.
నా  తలపై ఉండాల్సిన గంగ కంటి నిండా పారుతోంది.
నేను "మహాదేవుడిగా నాకు అన్ని ఒకటే. కానీ ఇప్పుడు నీ బిడ్డలా ఆలోచిస్తుంటే,  నాకు నీ కోరిక తీర్చాలి అనిపిస్తుంది ..చెప్పు అమ్మ " అన్నాను.
శివమ్మ "నాది ఒక చిన్నకోరిక శివయ్య. కోరిక కాదు ..అది కమ్మని కల తీర్చు  "అంది.
నేను "మహాదేవుడిని, నేను నీ బిడ్డని కూడా .." అన్నాను.
శివమ్మ "శివయ్యా, నాకూ అదే కావాలి .." అంది.
ఆమె మనసులో కోరిక నాకు తెల్సు .."చెప్పమ్మ, ఇప్పుడు నీ బిడ్డను కదా. నాతో కైలసం వచ్చెయ్యి, నిన్ను నేను చూసుకుంటాను " అన్నాను.

అందరి మొహం లో ఆనందం...

భృంగి "నంది, శివమ్మ తల్లి కైలసంలో ఉంటే మనకి, మన గణాలకు ఏ లోటు ఉండదు పార్వతి మాతకు కూడా ఏ లోటు ఉండదు కదా .."అన్నాడు.
ఆమె రాక కోసం పార్వతి మాత కూడా ఎదురుచూస్తోంది.
విష్ణు దేవుడు "ఇంకా ఏదో లీలా ఘట్టం ఉంది ..",అంటున్నాడు.
శివమ్మ "నీతో కైలసం వస్తాను శివయ్య .."అంది.
నేను "మా అమ్మ నాతో కాక ఎవరితో ఉంటుంది ? నువ్వు ఉంటే నాకు రోజు పాయసం చేసి గోరుముద్దలు పెడతావ్..కదా .."అన్నాను.
నా మొహంలో ఆనందం చూసి అందరు ఆనందపడుతున్నారు.
శివమ్మ "కైలసానికి రాబోయేముందు ఒక షరతు ," అంది.
అందరు విస్తుపోయారు, నేను తప్ప.
అందరూ "యుగ యుగాలుగా భక్తుల గమ్యం కైలసం, శివ సాన్నిధ్యం కదా! ఏమిటి శివమ్మ అడగకుండా మహాదేవుడు ఆ వరం ఇచ్చినా షరతులు పెడుతుంది " అనుకున్నారు.
ఏమి జరగబోతుందా అని చూస్తున్నారు నంది, భృంగి నాగరాజులు.
నేను "చెప్పమ్మా, నువ్వు ఏమి అడిగినా చేస్తా. అది నా బాద్యత " అన్నాను.
శివమ్మ "నా కోసం నువ్వు నా..........."
నేను "చెప్పమ్మ ..నీ ఈ బిడ్డను నీ నోటితో ఆజ్ఞాపించు .." అన్నాను.
శివమ్మ కనులలో ఏదో ఆరాధన ..తీవ్రమైన అసంత్రుప్తి.
నేను "చెప్పమ్మ .." అన్నాను మళ్ళీ.
శివమ్మ తీరబోతున్న కల , ఎప్పటి నుంచో ఉన్న ఆశ, నెరవేరబోతున్నట్లు ఆనందంగా కనిపించింది.
"నా వజ్రాల మూట వరాలదండ శివయ్య .నాకోసం ఒక కోరిక తీరుస్తావా, " అనడిగింది.
నేను "తథాస్తు, కొరుకోమ్మా, నీ ఈ వాత్సల్యం  కోసం  ఏదైనా చేస్తా "అన్నాను.
(సశేషం)

No comments:

Post a Comment

Pages