ఆత్రం - అచ్చంగా తెలుగు
ఆత్రం
                                                                           -సాయి సోమయాజులు

నన్ను నేను పరిచయం చేస్కోవడానికి టైం పడుతుందండి... ఒక్కసారి బస్ ఎక్కాక నా గురించి మీకు చెబుతాను. ప్రస్తుతం నేను రోడ్ మీద ఉస్సేన్ బోల్ట్ లా పరిగెడుతున్నాను. రాత్రేమో పొద్దుపోయేదాక నిద్ర పట్టదు, పొద్దున్నేమో నిద్ర లేవబుద్ధి కాదు. అసలు అలార్మ్ కని పెట్టినవాడే, స్నూజ్ బటన్ ఎందుకు పెట్టాడో ఆ దేవుడికే తెలియాలి! ఐదింటి నుంచి మోగే అలార్మ్ ని స్నూజ్ చేస్తూ.. చేస్తూ ఏడున్నరకి లేచాను. ఇంకేముంది, రోజూ జరిగే రామాయణమే! అరగంటకి ఓసారొచ్చే బస్‍ని అందుకోడానికి రోడ్ మీద  పరిగెడుతున్నా! ఈ బస్ కనక మిస్ చేస్తే, మళ్లీ నెక్స్ట్ బస్ పట్టుకోవడానికి ఇంకో అరగంట పడుతుంది. ఆఫీసుకి చేరేసరికి గంట ఆలస్యం అవుతుంది. ఆలస్యమైనప్పుడల్లా ప్రతినెలా నా జీతంలో కొంత  తెగ్గోయడమే కాదు, ఈ నెల నుంచి ఆఫీసుకు రావడం ఆలస్యమైతే ఉద్యోగం నుంచే తీసేస్తానని బాస్ వార్నింగ్ ఇచ్చాడు. అందుకే ఈ పరుగు...
హతోస్మి! వెనకాల ఎంత పరిగెత్తినా బస్ ను అందుకోలేకపోయాను. ఒక్క నిమిషం ముందు వచ్చినా ఈ పాటికి దర్జాగా బస్ లో కూర్చునుండేవాడిని. చేసేదేం లేక బస్ స్టాప్ లో ఆయాసంతో ఈసురో మంటూ నుంచుని ఉండగా ఆటో హార్న్ వినపడింది. 
శుభోదయం గురువు గారు, రండి రండి... మీకోసమే ఎదురుచూస్తున్నా.. అని ఆటో వాడే వెటకారంగా అన్నాడో, లేక నాకే అలా అనిపించిందో తెలీదు.
ఇక చేసేదేం లేక ఆటోలో కూర్చున్నా. బస్ లో వెళితే పది రూపాయలతో పోయేది, ఇప్పుడు డెబ్భై అవుతుంది.
ఆటో బయలుదేరింది. గమ్యానికి చేరే లోపల నా పరిచయం చేస్కోనా మరి?
నా పేరు అశ్వత్. నాకు తొందర చాలా ఎక్కువ. ఎంత తొందర అంటే, ఓ సారి పర్స్ లోంచి ఆఫీస్ ఆక్సెస్ కార్డ్ స్కాన్ చేస్తే తలుపు తెరుచుకోకపోవడంతో ఆఫీస్ స్టాఫ్ పై మండి పడ్డా. తర్వాత తెలిసిందేంటంటే నేను స్వాప్ చేసింది బ్యాంక్ డెబిట్ కార్డని. అప్పటి నుంచి నన్ను కొలీగ్స్ అందరూ ఆత్రం అశ్వత్ అని పిలుస్తారు. ఇలా నాకున్న తొందరతో ప్రతిరోజూ ఏదో విషయంలో నవ్వుల పాలు అవుతూనే ఉంటాను. ఇవాళ కూడా!
నేను బస్టాప్ కు రోజూ ఆలస్యంగా రావడం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందాంటే, అది ఈ ఆటో అతనికే. రోజు నేను కచ్చితంగా బస్ మిస్ చేస్తానన్న నమ్మకంతో ఇక్కడ నాకోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. ఏదో రోజు నా నుంచి వచ్చే ఆదాయంతో ఓ క్యాబ్ సర్వీస్ స్టార్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
సార్... ఇవాళైనా అన్ని సవ్యంగా తెచ్చారా లేక ఏదైనా మర్చిపోయారా? అని అడిగాడు ఆటో అతను నవ్వుతూ.
లేదు లే అని చిరాకుగా జవాబు చెప్పా.
మొబైల్? 
ఆఁ... అని నా కుడి జేబుని తడుముకుని చెప్పాను.
కర్చీఫ్?
ఉంది. నా ఎడమ జేబుని తడుముకుని చెప్పాను.
వాచ్? 
వెంటనే నా చేతికున్న గడియారం అతనికి కనపడేలా సైడ్ మిర్రర్ లో చూపించా.
మరి మీ కళ్ళజోడు?
అంతే. ఒక్క సెకండు పాటు గుండె ఆగింది. నా బ్యాగ్ తెరిచి లోపలేమైన పెట్టానేమో అని చూసుకునేసరికి కనబడలేదు. రోజూ ఏదో ఒకటి మర్చిపోనిదే పొద్దు గడవదు. ఇవాళ రోజంతా కళ్ళజోడు లేకుండా ఎలా గడపాలో అర్ధం కావట్లేదు.
సార్... మరి కళ్ళజోడు? కొంపతీసి ఇవాళ కూడా... అని ఆటోవాడు పూర్తిచేసే లోపల, ఉంది.. ఉంది అని అబద్దం చెప్పాను.
ఐతే సార్! ఇవాళ ఏదీ మర్చిపోలేదన్నమాట! 
నేను ఏం మాట్లడలేదు. 
మెల్లగా ఆఫీసుకు చేరుకున్నా. దిగి ఆటోవాడికి డబ్బులిద్దామని పర్స్ నుంచి నోట్లు తీస్తుంటే మసక మసకగా కనపడుతూన్నాయి. ఏ నోటేంటో తెలుసుకోడానికి ఒక్కో నోటుని వెలుతురులో దూరంగా పెట్టి చూసుకోవాల్సొచ్చింది. ఇది చూసి పగలపడి నవ్విన ఆ ఆటో డ్రైవర్ కళ్ళజోడు పెట్టుకోండి అని ఓ ఉచిత సలహా ఇచ్చాడు. నేను ఏం మాట్లాడకపోయేసరికి, నిజం చెప్పండి... ఇవాళ మీరు కళ్లజోడు మర్చిపోయారు కదా! అని మరింత గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. 
ఇందా తీసుకో, ఇంకో ఇరవై ఇవ్వడానికి చిల్లర లేదు. అని చేతికి డబ్బులిస్తూ అన్నాను. 
పర్లేదులే సార్... రేపు తీసుకుంటా అన్నాడతను.
అంటే, రేపు కూడా నేను బస్ మిస్ చేసి ఆటో పట్టుకుంటాననేగా?! ైతని ధీమా. ఎలాగైనా రేపు ఇతనికి నేనేంటో చూపించాలని అప్పుడే గట్టిగా మనసులో అనుకున్నాను.
***
పొద్దున్నే అలార్మ్ మోగింది. స్నూజ్ కొడదామని మొబైల్ ని తడుముతున్నప్పుడు గుర్తొచ్చింది... ముందు రాత్రి నేను నా మొబైల్ ని నాకు దూరంగా పెట్టానని. దెబ్బకి నన్ను నేనే తిట్టుకుంటూ సగం తెరిచిన కళ్ళతో లేచి వెళ్ళి మొబైల్ ని స్నూజ్ చేసి వచ్చి పడుకుందామనుకునేసరికి నాకు నిన్న ఆఫీస్ లో కళ్ళజోడు వేసుకోనందుకు కొలీగ్స్ ఎగాతాలి చెయ్యడం, అన్నిటికంటే ముఖ్యంగా ఆ ఆటో అతని నవ్వు గుర్తొచ్చేసరికి నాకు నిద్ర మొత్తం ఒక్క సెకండులో ఎగిరిపోయింది. కళ్ళజోడు మర్చిపోకూడదని నిన్న రాత్రే బ్యాగ్ లో పెట్టేసుకున్నాను. కర్చీఫ్ ఎక్కడ మర్చిపోతానోనని ఇవాళ వేసుకోవాల్సిన ప్యాంట్ జేబులో పెట్టేసుకున్నాను. నేను ప్రశాంతంగా తయారయి వాచీ పెట్టుకుని బస్టాప్ కు బయల్దేరాను.
***
బస్ స్టాప్‍లో నుంచుని ఉండగా ఆటో వచ్చి కొద్ది దూరంలో ఆగింది. బస్ స్టాప్ లో నన్ను బస్ కంటే ముందు చూసిన ఆ డ్రైవర్ కి మతి పోయినట్టుంది. కొంత సేపటికి బస్ వచ్చి నా ముందు ఆగింది. కాని నేను ఎక్కలేదు. బస్ వెళ్ళిపోగానే ఆటో అతని దగ్గరికి వెళ్ళాను.
ముందే వచ్చి కూడా బస్ ఎందుకు ఎక్కలేదో తెలుసా? నా కోసం వచ్చావు కదా, నిన్ను ఖాళీగా పంపించడం ఇష్టం లేక! ఇవాళ్టికి పద...రేపటి నుంచి నువ్వు ఇక్కడికి ఎలాగో రానక్కర్లేదు. అంటూ లోపల కూర్చున్నా. ఏం మాట్లాడకుండా ఆటో స్టార్ట్ చేసి నడపడం మొదలుపెట్టాడు. 
డ్రైవర్ర్ నన్ను సైడ్ మిర్రర్ లో చూస్తూ ఉండగా నేను బ్యాగ్ నుంచి కళ్ళజోడు తీసి, దానిని నా కర్చీఫ్‍తో తుడవడం మొదలుపెట్టాను. వాచిలో టైం చూసి, తొందరెందుకు? చాలా టైం ఉంది లే, మెల్లగా వెళ్ళు.. అని చెప్పాను. దెబ్బకి ఆఫీస్ చేరుకునేంత వరకు నా వంక ఇంక చూడలేదు.
సార్... పొద్దున్న పొద్దున మీ ఏరియాలో ఎవ్వరూ రాకపోయినా, నేను మాత్రం రోజూ కేవలం మీ కోసమే వచ్చా సార్...మీ కొసమే వచ్చా! రోజూ నా బోనీ మీతో మొదలవ్వందే నాకు పొద్దు గడవదు సార్... అలాంటిది... అలాంటిది... రేపటినుంచి నేను...... అంటూనే కళ్ళు తుడుచుకున్నాడు ఆటోడ్రైవర్.
ఆఫీస్ వచ్చింది. ఆటో దిగాను.
ఇవాల్టి డెబ్బై, నిన్నటి ఇరవై. మొత్తం తొంబై. ఇదిగో... వంద తీస్కో! అని డబ్బులిద్దామని నా బ్యాక్ పాకెట్ మీద చెయ్యి పెట్టినప్పుడు తెలిసొచ్చింది.... నేను పర్స్ మర్చిపోయానని !!!
ఆటో అతను న..వ్వా..పు.. కుం..టూ..ఆపుకుంటూ..బిగ్గరగా నవ్వేసాడు.
*********

No comments:

Post a Comment

Pages