ప్రే'మంటే' - అచ్చంగా తెలుగు
ప్రే'మంటే'
కంభంపాటి రవీంద్ర 

అసలే డిసెంబర్ నెలేమో  తెల్లవారుజామునే కాదు , సాయంత్రప్పూట కూడా ఊరంతా  మంచు కప్పేస్తూంది . వీధి దీపాల్లేకపోతే ఎవరిల్లు ఆళ్ళు కనుక్కోడం కూడా కష్టంగా ఉంటూంది . ఉదయాన్నే పొలాలమ్మట చెంబట్టుకునెళ్ళే వాళ్ళైతే , ఎందుకైనా మంచిదని ఓ చేత్తో చెంబు, ఇంకో చేత్తో లాంతరు పట్టుకునెళ్తున్నారు .  

డిగ్రీ ఫైనలియర్లో ఉన్నా ముగ్గురికీ (నేనూ , అల్లం బుజ్జి గాడు , చిట్టిరాజు గాడు) కూడా అందరి ముందూ సిగరెట్టు కాల్చే ధైర్యం లేదు మరి , అందికే సాయంత్రప్పూట ఏసుబాబు గాడి ముంత పప్పు బండి దగ్గిర మిక్చరు పొట్లాలు కట్టించుకుని అలా రైల్వే ట్రాకమ్మట నడుస్తా తింటూ,  మా సిగరెట్ల పని మొదలెట్టేసేవాళ్ళం . ఈ పొగమంచొకటి కలిసొస్తూండడంతో , ఇంకా ధైర్యం గా రెండేసి ప్యాకెట్లు కాల్చేస్తున్నాం . 

ఆ రోజు సాయంత్రం  కూడా ఎప్పట్లానే  అన్నపూర్ణా టాకీసు వెనకున్న రైలు కట్ట దగ్గిరకి చేరిపోయేము .

చిట్టిరాజు గాడన్నాడు 'ఒరేయ్ .. దుర్గ  నన్ను ప్రేమించలేనని చెప్పేసిందిరా .. చచ్చిపోవాలనుంది '

'ఎవరూ ?.. ఆ చర్చి పక్కీదిలో ఉండే శెట్టి గారమ్మాయి దుర్గా ?.. దానికెప్పుడు లైనేసేవు ?' అడిగాను 

'ఆ మధ్య మా ఇంటికొచ్చి  గోరింటాకు కోసుకోవచ్చాండీ అని అడిగిందని చెప్పా కదా .. అప్పట్నుంచీ ప్రతీ రెండు వారాలకి వచ్చేస్తూంది గోరింటాకు కావాలని .. ఖచ్చితంగా నాకోసమే గోరింటాకొంక పెట్టుకుని వచ్చేస్తూందని నా ఫీలింగు ' అన్నాడు చిట్టిరాజు గాడు 

'అలా ఎందుకనుకోవాలి ..రెండు వారాలైంది కదా .. చేతికున్న గోరింటాకు వెలిసిపోయుంటుంది .. మళ్ళీ పెట్టుకుందామని వచ్చిందనుకోవచ్చుగా ' పాయింటు లాగాడు  అల్లం బుజ్జి గాడు 

 చిట్టిరాజుగాడు ఉడుకుమోతు మొహమెట్టుకుని అన్నాడు 'సర్లేవో  .. నువ్వంటే డబ్బున్నోడివి కదా .. నీకు ప్రేమ అర్ధం కాదు '

అల్లం బుజ్జి గాడాళ్ల నాన్నకి ఊళ్ళో చాలా వ్యాపారాలే కాక , కాకినాడెళ్లే  రోడ్డులో కోళ్లఫారాలు కూడా ఉన్నాయి, ఆ రోజుల్లోనే ఆళ్ళింట్లో ఓ అంబాసిడరు కారే గాక , కొత్తగా వచ్చిన చిన్న కారు మారుతి అంట, అది కూడా ఈళ్ళ కాంపౌండు లో కొనేసెట్టేరు . 

'గాడిద గుడ్డేమీ కాదూ .. ఎదవ గోరింటాకు కోసం వొచ్చే అమ్మాయి కోసం  చచ్చిపోతానంటూ ఇంతకాలం నిన్ను చూసుకున్న అమ్మాబాబుల్ని మర్చిపోయేవాడివి..  నువ్వు ప్రేమ గురించి నాకు చెప్పడం! ' చిరాకుపడ్డాడు బుజ్జిగాడు 

'నువ్వు ఎవర్నీ ప్రేమించవా ?' అడిగాను బుజ్జి ని 

'ఎందుకు ప్రేమించనూ ?.. ఎదురుగా వచ్చే ప్రతీ అమ్మాయినీ ప్రేమిస్తాను .. కాపోతే ఆ అమ్మాయి నన్ను దాటెళ్లిపోగానే మర్చిపోతాను ' అన్నాడు 

'అదేంటీ ??' ఒకేసారి అడిగాం నేనూ , చిట్టిరాజు గాడూ 

'అదంతేలే ..సరే .. ఇప్పుడా పిల్ల నేను నిన్ను ప్రేమించేస్తున్నాను .. నన్ను ఇప్పుడే పెళ్లి చేసుకో అంటే ఏం చేస్తావేంటీ ?' అన్నాడు బుజ్జి 

'నువ్వు మరీనేహే .. అప్పుడే పెళ్ళనేస్తుందేంటీ ?' చిట్టిరాజు గాడి డవుటు 

'ఒకవేళ అందే అనుకో .. అప్పుడు ?

'అంత దాకా ఆలోచించలేదొరే.. కొంత కాలం ప్రేమించుకోడం , అప్పుడు పెద్దోళ్ళతో చెప్పడం గట్రా ఉంటాయిగా ' అన్నాడు చిట్టిరాజు గాడు 

'అదే మరి .. ఆ తర్వాత త్యాగాలు కూడా ఉంటాయి .. అందికే నువ్వు  ఇష్టపడే పిల్లని పోషించే స్తోమత  లేనంత వరకూ ప్రేమ దోమా లాంటి ఎదవాలోచన్లు పెట్టుకోకురా ఎదవా... ఈడెవత్తినో ప్రేమించేసేడంట... దాని కోసం చచ్చిపోతాడంట. ఏం .. బతుకంటే అంత   చులకనైపోయిందేంటీ ' కోపంగా బుజ్జిగాడంటూంటే దూరంగా వస్తూన్న రైలు తాలూకా లైటు కనిపించింది. 

రైలు దగ్గిరకొస్తున్నకొద్దీ దాని లైటు వెలుగు ఎక్కువవుతూంది . రైలు దాదాపుగా మా దగ్గిరకి వచ్చేసినప్పుడు , బుజ్జి గాడు అరిచేడు 'రైలు పట్టాల అవతలి పక్క ఆ అమ్మాయి, అబ్బాయి ఎవర్రా ?' అంటూ. 

'సరిగా చూడలేదెహే ' అని చిట్టిరాజుగాడంటే, 'ఏమో .. చింతాకు రంగు వోణీ లా కనిపించింది ' అన్నాన్నేను, ఆ రైలు సౌండులో మేమన్న మాటలు బుజ్జి గాడికి వినిపించేయో లేదో తెలీదు .

రైలెళ్ళి పోయిన తర్వాత పట్టాలకటువేపు పరిగెత్తేడు బుజ్జి గాడు , అక్కడెవరూ కనపళ్ళేదు . 'నేనింటికెళ్తానొరే ' అంటూ గబగబా పెద్ద పెద్ద అడుగులేసుకుంటా వెళ్ళిపోయేడు బుజ్జి గాడు, మా మాట కూడా వినకుండా !

మర్నాడు కాలేజీలో కలిసినప్పుడు చెప్పేడు బుజ్జి గాడు 'ఒరేయ్ ... రాత్రి మనం చూసినమ్మాయి నా చెల్లేమో అని డవుటు , ఇంటికి పరిగెత్తుకునెళ్ళి అడిగితే , ఇప్పుడే మా ఫ్రెండు సుధావాళ్ళింటికెళ్లి వస్తున్నానంది .. దాని మీదో కన్నేసుంచాలి ' అన్నాడు, ఆడి చెల్లి సుజాత మా కాలేజీలోనే రెండో ఏడాది బీఏ చదువుతూంది .

ఆ తర్వాత రోజుల్లో ఆ రైలు పట్టాలమ్మట ఎప్పుడెళ్ళినా నాలుగు వేపులా చూస్తా నడిచేవాళ్ళం కానీ మాకెప్పుడూ బుజ్జి గాడి చెల్లి కనిపించలేదు . 


ఓ రోజు సాయంత్రం కోటగుమ్మం పక్కనున్న శేషాద్రి కొట్లోంచి మా అమ్మ నెయ్యట్టుకురమ్మంటే ,అటేపెళ్తూ చూసాను . కోట గోడ పక్కనుంచి గబగబా నడిచెళ్ళిపోతూంది సుజాత . ఇదేంటీ ..ఇంత స్పీడుగా వెళ్తూంది , అని డౌటేసి అక్కడే ఉన్న పల్లి బాబురావు కొట్టెనకాల దాక్కుని చూస్తే , కోటగుమ్మం దాకా వెళ్లిన సుజాత , ఎప్పట్నించి వెయిటింగు చేస్తున్నాడో ఆ చిల్లం ప్రసాదు గాడితో కోటలోకెళ్ళిపోయింది !

గబగబా మా అమ్మ చెప్పిన నెయ్యి పని కానిచ్చేసి , అల్లం బుజ్జిగాడింటికెళ్లి  విషయం చెబితే , వెంటనే ఆడు ఇండ్ సుజుకి బండేసుకుని కోట వేపెళ్ళిపోయేడు . కోటలోకెళ్లిన బుజ్జి గాడికి ఆ సుజాతా , ప్రసాదు కనపళ్ళేదు. వెంటనే ఆ ప్రసాదుగాడు పన్జేసే శ్రీదేవీ కట్ పీసెస్ కొట్టుకెళ్ళి , ఆడొచ్చే దాకా ఆగి , 'నాకేం చెప్పకు .. చెప్పినా వినను .. మా చెల్లి తో ఇంకో సారి కనిపించేవంటే నిన్ను కట్ పీసెస్ చేసేస్తానని ' వార్నింగిచ్చొచ్ఛేడు . 

ఇంటికెళ్లిన తర్వాత ఆ సుజాత ని కూడా గూబ మీద కొట్టేసేడంట!

ఓరోజు కాకినాడ సత్య గౌరీ టాకీసులో కయామత్ సే కయామత్ అనే సినిమాలో హీరోయిను బావుందని టాకొస్తే , కాలేజెగ్గొట్టి మాట్నీకెళ్లిపోయేము , ఇంటర్వెల్లో లైట్లేసేసరికి మాకు రెండు వరసల ముందు కూచుని కనిపించేరు ఆ సుజాతా , ప్రసాదు . ఇంకేం చూసుకోకుండా , బయటికెళ్లి ఓ కిస్మత్ సీసా కొనుక్కొచ్చి, దాంతో  ఆ ప్రసాదు నెత్తి మీద కొట్టేసి అరిచేడు 'నీకెన్ని సార్లు చెప్పాలి మా చెల్లి తో తిరగొద్దని ' అంటూ !

ప్రసాదు గాడి నెత్తి మీద రక్తం చూసిన సుజాత అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది, ఆ పిల్లని మళ్ళీ కారు మాట్లాడి దాంట్లో ఆళ్ళింటికంపేసేరు  సత్యగౌరి టాకీసు మేనేజరు మేకా బాపినీడుగారు !

ఇంక ఉండబట్టలేక , ఆ రోజు సాయంత్రం సిగరెట్లు కాల్చుకోడానికెళ్లినప్పుడు బుజ్జిగాడిని అడిగేసేను , 'మీ చెల్లి ప్రేమిస్తే ..నీకెందుకంత నొప్పీ ' అని. 

ఆడోసారి నాకేసి చూసి 'చెల్లి కాబట్టి ' అన్నాడు !

'మీ చెల్లైతే? ప్రేమించకూడదేంటీ? ' అని అడిగితే   'ప్రేమించొచ్చు ..అది నెలకోసారి కొత్త బట్టలు కొనుక్కుంటాది , అది అడిగినప్పుడల్లా మా అమ్మ ఏఏయో నగలు చేయిస్తాది , ఇది గాకుండా ప్రతి నెలా మా చెల్లి  స్నోలూ , క్రీములూ, కాకినాడ లోని బ్యూటీ పార్లర్లు అంటూ పెట్టే ఖర్చతో మీ కుటుంబం మూణ్ణెల్ల పాటు బతకొచ్చు .. మరి ఇన్ని సరదాలున్నదాన్ని ఆ ప్రసాదు గాడు పోషించగలడేంటీ ? ' అన్నాడు బుజ్జి గాడు. 

'ఆయన్నీ నీకెందుకు ? మీ నాన్నగారొప్పుకుంటే ఆ కుర్రాణ్ణి ఇల్లరికం తెచ్చుకుంటారేమో , మద్దెలో నీకెందుకూ నొప్పీ ' అని అడిగితే 'భలేవోడివే .. దానికి రాజా లాటి సంబంధాలొస్తూంటే , ఆయన్నీ ఒదిలేసి ఈ అణా కాణీ గాణ్ణి మా నాన్న ఇల్లరికం తెచ్చుకుంటాడంటావా , అవకాశమే లేదు !' అన్నాడు. 

మా డిగ్రీ అయిపోయినా , బుజ్జి గాడు వీలైనప్పుడల్లా కాలేజీ వేపెల్లి ఆళ్ళ చెల్లి సుజాత మీద ఓ కన్నేసి ఉంచుతున్నాడు, ఆ పిల్ల కూడా వీడు ప్రసాదు నెత్తిన కొట్టిన దెబ్బకి భయపడో మరేమో ఆ ప్రసాదు గాడి ఊసెత్తలేదు . 

ఓసారి బుజ్జిగాడాళ్ల నాన్న అల్లం బోసు గారు హైదరాబాదులో ఏదో పనిమీదేళ్తూ , కోరంగి దాటిన తర్వాతొచ్చే యానాం వెళ్లే రోడ్డులో ఏయో కోళ్ల ఫారాలు అమ్మకానికున్నాయంట  ,ఓపాలి చూసి రా అని బుజ్జి గాడికి పురమాయిస్తే , ఆడు నన్ను కూడా లాక్కెళ్ళిపోయేడు . 

ఆయన చెప్పిన కోళ్లఫారాలు యానాం రోడ్డులో సైడు తీసుకుని బాగా లోపలికెళ్తే వొచ్చే తాళ్లరేవు దగ్గిరున్నాయి ,  మాటిమాటికీ కూలీలు పనెగ్గొట్టేస్తున్నారంట దాంతో  కోళ్లకి బొత్తిగా సంరక్షణ లేదు . సరే ఏ విషయం మా నాన్న హైదరాబాదు నుంచొచ్చిన తర్వాత చెబుతామని ఆళ్ళతో చెప్పి , బండెక్కి కూచున్నాడు బోసుగాడు . కోరంగి దగ్గిరికొస్తూంటే , 'ఆపాపు ' అని అరిచేడు . ఏవైందని అడుగుతా బండాపితే ,'జాగ్రత్తగా చూడు .. ఆ తాటి తోపెనకాల కనబడుతున్న ఎర్ర మారుతి కారు మాదేమోనన్న అనుమానం ' అని మెల్లగా అటేపు అడుగేసేడు . ఆడనుమానం నిజమే .. ఆ కారు వాళ్లదే , కాపోతే ఆ కారెనక సీటులో సుజాతా , ప్రసాదు సరసాలాడుకుంటా కనిపించేరు . మంటెక్కిపోయిన బుజ్జి గాడు చేతికందిన రాయట్టుకుని ఆ కారు వేపు విసిరేస్తే , కారద్ధం పగిలిపోయింది , ప్రసాదు గాడైతే ఉన్న పళాన డోరు తెరిచి పారిపోయేడు , సుజాత అలా షాకైపోయి చూస్తూంటే , ఈడెళ్ళి ఆ పిల్ల చెంపలు వాయించేసేడు . 

ఆ తర్వాత ఊళ్ళో పెద్ద గొడవే జరిగింది , ప్రసాదు గాడి అమ్మానాన్నల్ని పిలిచి పిఠాపురం మున్సిపల్ చైర్మను వెన్నా కామేశ్వర్రావు గారి సమక్షం లో హెచ్చరించేరు . సుజాత ని ఇంట్లోంచి బయటకంపడం మానేసేరు , తన ఒంతుగా ఆ పిల్ల అన్నం తినడం మానేయడాలూ , ఒచ్చిన సంబంధాలు తిరగ్గొట్టడాలూ మొదలెట్టింది . 

నాకు బెజవాడ నార్ల తాతారావు పవర్ ప్లాంటులో ఉద్యోగమొచ్చింది , వారంలో  జాయినవ్వాలనగా , బుజ్జి గాడాళ్ల నాన్న బోసుగారు మా ఇంటికొచ్చేరు . 

'మా అమ్మాయి ఎంత చెప్పినా వినడం లేదు .. ఇంక దానికి ఆ ప్రసాదు గాడితో పెళ్లి చేయక తప్పేలా లేదు .. మీ ఇష్టం మీరేం చేసుకుంటారో చేసుకోండి .. నాకు సంబంధం లేదు .. అని బుజ్జి గాడు పట్టించుకోడం లేదు .. నాకూ ఇష్టం లేదనుకో .. కానీ తప్పేలా లేదు ..రేపు  అన్నవరం కొండ మీద పెళ్లి చేద్దామనుకుంటున్నాం ..  ఆ పనుల్లో కాస్త చెయ్యేసి పెడుదూ ' అన్నాడాయన. 

సరేనండాయనకి చెప్పి , బుజ్జి గాడికి ఈ విషయం చెబితే 'దాని పెళ్లితో నాకు సంబంధం లేదు .. నువ్వు మా నాన్నకి సాయం చేస్తానంటే నేనెవర్ని అడ్డుపడ్డానికి ? ఏం చేసుకుంటారో చేసుకోండి .. దాని పెళ్ళైతే గానీ మీకెవరికీ విషయం బోధపడదు ' అన్నాడు. 

అన్నవరం కొండ మీద సుజాత పెళ్లి ఘనంగానే చేసేరు బోసుగారు . ఆయన వేపెవ్వరూ పెళ్ళికి రాలేదుగానీ , ప్రసాదు వైపు చుట్టాలందరూ తెగొచ్చేసేరు . సుజాత వాళ్లందరితో తెగ జోకులేసేస్తా ఉంటే , 'పోన్లే .. ఇది ఆళ్లందరితో కలుపుగోలుగా ఉంటే అదే చాలు' అన్నాడాయన. 

ఆ పిల్లకోసం చేయించిన బంగారం , ఫ్యామిలీ పెట్టుకోడానికి కావాల్సిన సారె , ఇద్దరూ హనీమూను తిరగడానికి డబ్బు అన్నీ బానే ఇచ్చారాయన . పెళ్ళైన తర్వాత ఆ ప్రసాదు గాడింటికి టీవీ , ఫ్రిజ్జు , సోఫాసెట్టు , డబల్ కాటు గట్రా పంపడమే గాకుండా ఈ పిల్ల నెల ఖర్చులకి సరిపోయేందుకు ప్రతి నెలా వడ్డీ వచ్చేలా ఫిక్సడ్ డిపాజిట్టు కూడా వేసేరు . 

బెజవాడెళ్ళిన నేను కొత్త ఉద్యోగం లో కుదురుకునే సరికి ఓ రెండేళ్లు పట్టింది . ఆ ఏడాది పెద్ద పండక్కి పిఠాపురం వెళ్లాలని ముందే లీవెట్టేసేను . పండగ ముందు రోజు పిఠాపురం లో సింహాద్రి ఎక్సప్రెస్స్ లో దిగాను . స్టేషన్ కి బుజ్జి గాడొస్తాడనుకున్నా రాలేదు . పెద పండగలు దగ్గిరికొచ్చేసేయేమో , దట్టంగా ఉండే మంచు కూడా పోయింది . సాయంత్రం బుజ్జి గాడాళ్ల ఇంటివేపెల్తే , ఆడు ఎదురొచ్చి 'సారీరా బాబూ .. ఇయ్యాల సాయంత్రానికి సుజాతా , బావగారూ దిగుతున్నారు .. అందికే బట్టలు కొనడానికి కాకినాడెళ్ళేను .. రావడం కుదర్లేదు ' అంటూ బయటకి బయల్దేరదీసేడు . 

భలే షాకైపోయిన నేను 'అదేంటీ .. ప్రసాదు గాడంటే తెగ చిరాకు పడిపోయేవాడివి .. ఇలా మారిపోయేవేంటీ ??' అని ఆశ్చర్యంగా అడిగితే 'ప్రసాదు గాడంటే నాకెప్పుడూ చిరాకు కాదు .. జాలి .. మా చెల్లి ఆడ్ని పెళ్లి చేసుకున్న మూణ్నెళ్లకే తిరిగొచ్చేసింది ..ఆడితో ఉండలేనంటూ .. బోల్డు కట్నం ఇచ్చి పాలకొల్లు శీలంశెట్టాళ్ల  సంబంధం తెచ్చి మళ్ళీ పెళ్లి చేసేం .. ఇప్పటికైనా అర్థమైందా ప్రేమంటే ?' అన్నాడు బుజ్జిగాడు !
***

1 comment:

  1. హమ్మ! మళ్ళీ దెబ్బేసేసారు. కాకపోతే సుఖాంతం సుజాతకు మళ్ళీ పెళ్ళి చేసేసి. వాడి చెల్లి మనసు ఆడికి తెలుసుకాబట్టే ముందు జాగ్రత్తగా చెప్పేడు. వినకపోయినా ఆడికి జరగబోయేది తెలుసు కాబట్టి ఊరుకున్నాడు. మొత్తానికి ఇంకో ఆణిముత్యం తెచ్చారు. చాలా బాదింది.

    ReplyDelete

Pages