పుష్యమిత్ర - 20 - అచ్చంగా తెలుగు
పుష్యమిత్ర - 20
- టేకుమళ్ళ వెంకటప్పయ్య


జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ ఐ" అనే అతిశక్తివంతమైన రాడార్ ను నిర్మాణ సమయంలో  హిమాలయాలపైన  బయటపడ్డ ఓ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్పి గతంలోకి వెళ్తాడు. పుష్యమిత్రుడు అగ్నిమిత్రునికి రాజ్యం కట్టబెట్టి హిమాలయాలలో జ్ఞాన సమాధిలో ఉన్నప్పుడు బాబాజీ ద్వారా తను కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి మీద సంచరించాలని  ఆదేశించడంతో ఆశ్చర్యపోతాడు.   శ్రీహరికోట(షార్) పై బాంబింగ్ చెయ్యడానికి రెండు సబ్మెరైన్స్ కృష్ణాపట్నం ఓడ రేవు వైపు వస్తున్నట్టు తెలుసుకున్న  భారత్ నేవల్ అధికారులు వారిని సజీవంగా పట్టుకుని బంధిస్తారు. వారిని మిలిటరీ అధికారులు ఇంటరాగేట్ చేసి కొన్ని నిజాలు బయటికి కక్కిస్తారు. సబ్మెరైన్ల జాడ తెలియక పాక్ మిలిటరీ ఛీఫ్ ఖయూం అనే అండర్వాటర్ స్పెషలిస్ట్ను పంపుతాడు. ఖయూం మైపాడు రేవులో ఫిష్ బోట్  వారికి లంచం ఇచ్చి  ఎక్కి కృష్ణాపట్నం వేపు సాగిపోవడాన్ని గమనించిన కోస్టు గార్డు చెన్నై షిప్-యార్డ్ కు విషయం అందజేస్తాడు. ఖయూం ఇండియన్ అధికారులకు దొరకకుండా బోట్లో వాళ్ళలో ఇద్దర్ని చంపి తప్పించుకుంటాడు. షార్పై దాడిని భారత అధికారులు ధృవపరచగా పాక్ అధ్యక్షుడు దాన్ని ఖండిస్తాడు.  (ఇక చదవండి) 
(మళ్ళీ గతంలోకి ప్రయాణం)
పుష్యమిత్రుడు జ్ఞాన సమాధిలోకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలయిందో తెలీదు. శరీరం బాగా శుష్కించి పోయింది. తలజడలు కట్టాయి. ఏదో ఒక తేజస్సు తనపై పడడంతో గుహలో ఘోర జ్ఞాన సమాధిలో ఉన్న పుష్యమిత్రుడు కళ్ళు తెరచి చూసే సరికి మొత్తం బూజుతో నిండిపోయి ఉంది. కొన్ని జంతువులు నేలమీద పడుకుని ఉన్నాయి. ఎదురుగా ఒక ఇంద్రధనువు లాంటి కాంతిపుంజం. రెండు నిముషాలు గడిచాక బాబాజీ గా దర్శనమిచ్చాడు. 
"పుష్యమిత్రా! నీవు సమాధిలోకి వెళ్ళి 20 సంవత్సరాలయింది" అనే సరికి ఆశ్చర్యపోయాడు "బాబాజీ!  నాకు ఇప్పటికైన ముక్తిని ప్రసాదిస్తారని ఆశిస్తున్నాను".
"నిజమే! పుష్యమిత్రా! కానీ మనం ఆసర్వేశ్వరుడు చెప్పినదానిని ఆచరించవలసినదే! నీకు త్వరలోనే ఒక పరిష్కారం చూపిస్తాను."
"ఆ పరమేశ్వరుని తలంపు ప్రకారం నీవు భరతఖండంలో నిర్వర్తించవలసిన పనులు ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి"
"నిజమే బాబాజీ..దానికి నేను వేరొక జన్మ ఎత్తవచ్చు గదా!"
"ఎత్తవచ్చు కానీ..ఈ జన్మలో నీకున్న దేశభక్తి, నిబద్ధత వచ్చే జన్మలోనూ మిగిలిఉంటాయన్న నమ్మకం లేదు. అవి చాలా అంశాలమీద ఆధారపడి ఉంటాయి"
"అర్ధం కాలేదు బాబాజీ! వివరంగా చెప్పండి"
"నీవు ఒక బ్రాహ్మణుడయి ఉండి యావద్భరత ఖండాన్ని ఏకఛ్చత్రాధిపత్యంగా ఏలగలిగావు. దానికి నీ శక్తియుక్తులు, వేదపఠన జ్ఞానం లాంటి ఎన్నో అంశాలు తోడ్పడ్డాయి. అవి మరుజన్మలో అంత పద్ధతిగా ఉండకపోవచ్చు."
"అవును. జన్మకూ జన్మకూ చాలా బేధాలు ఉండి తీరుతాయి"
"త్వరలో ఇక్కడ మంచు తుఫాను రాబోతున్నది. అంటే బహుశ: వచ్చే పౌర్ణమి నాటికి రావచ్చు. ఆ నాటికి నిన్ను మళ్ళీ భరతఖండం మీదకు పంపేందుకు యేర్పాట్లు చెయ్యాలి. అవి ఏమిటో ఆ పరాత్పరుణ్ణి అడిగి తెలుసుకుంటాను. నీ ధ్యానం లో నీవు ఉండు. నేను మరలా వచ్చి నీకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తాను. శుభం. శెలవు" అంటూ అంతర్ధానమయ్యాడు బాబాజీ.
*   *   *
(వర్తమానంలో)
పాకిస్తాన్ ప్రెసిడెంటు అగ్గిమీద గుగ్గిలంలా మండి పడుతున్నాడు. భారత్ పై పగతీర్చుకోడానికి చేస్తున్న, అనుకున్న పధకాలన్నీ తిరగబడుతున్నాయి. చైనా దేశం ఎంత సహాయం చేస్తున్నప్పటికీ సబ్మెరయిన్ల విషయంలో "రెడ్-హ్యాండెడ్" గా చిక్కడం అవమానకరంగా ఉంది. ఆ పట్టుబడ్డ క్రూ ఎలా బయటకొస్తారో తెలీదు. అసహనంగా చిందులు తొక్కుతున్నాడు. పక్కరోజు మతపెద్దలతో సమావేశం ఉంది. వారికి ఏమిచెప్పాలో తెలీదు. ఈ విపత్తు నుండి బయటపడడం ఎలా? అని అలోచిస్తూ ఉండగా త్రిదళాధిపతి మిలిటరీ జనరల్ వచ్చాడు. కూర్చోమని సైగ చేసి తలపట్టుకుని "జనరల్! మనం రోజురోజుకూ సమస్యలతో కూరుకుపోతున్నాం.  బయటపడే మార్గం కనిపించడంలేదు. ఇదివరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం అయితే ఇంత భయపడాల్సిన పనిలేదు. వాళ్ళు కేవలం అధికారం కోసం ఏమైనా చేసే వాళ్ళు. ఇప్పుడు ఉన్న ప్రైంమినిస్టర్ ఆవులిస్తే పేగులు లెక్కపెడుతున్నాడు. ఆయన ధాటికి భయపడి అమెరికా వాళ్ళు సైతం ఏమీ చేయలేక చేతులు ముడుచుకు కూర్చున్నారు.  చైనాతో వారి సంబంధాలు మళ్ళీ మెరుగుపడడం మనకు ప్రమాదం. మనం చైనా వాళ్ళతో మాట్లాడాలి. ఒకసారి అమెరికా ప్రెసిడెంటుకు రింగ్ చేస్తాను ఏదైనా ఉపాయం చెబుతాడేమో! చూద్దాం.
"గుడ్ ఈవెనింగ్ ప్రెసిడెంట్. పాక్ ప్రెసిడెంట్ను మాట్లాడుతున్నాను"
" హా.. చాలా జోరుగా మీరు చేసే పనులు అందరినీ ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ఇండియన్ ప్రైం ను తక్కువ అంచనా వేశావ్. "
" నిజమే వాళ్ళ దగ్గర మా సబ్మెరయిన్లు ఉన్నాయి. కానీ అవి ఎక్కడ దాచారో మా క్రూ ఎక్కడ ఉన్నారో తెలీడంలేదు ".
" రెండు సబ్మెరయిన్స్ ఏ కంట్రీ మేక్? "
" అవి చైనా వాళ్ళు తయారు చేసి ఇచ్చారు మాకు రెండేళ్ళ క్రితం "
" ఓకే! మరి మీ క్రూ దగ్గరనుండి వాళ్ళు ఏమి ఆధారాలు తీసుకున్నారో! "
" నిజమే! కానీ వాళ్ళవి డూప్లికేట్ పాస్-పోర్టులని వాళ్ళు పాక్ వాళ్ళు కాదని బుకాయిద్దామని అనుకుంటున్నాము. మేము ఖండన ఇచ్చేశాము కూడా. వాళ్ళు ఏ దేశంవాళ్ళో మాకు తెలీదు అని చెప్పాలి. మా పేరు చెడగొట్టడానికి ఏదో దేశం పన్నిన కుట్ర అని చెబ్దామని అనుకుంటున్నాం ".
" ఎస్. ఏదైనా ఉంటే చైనా మేక్ కనుక వాళ్ళమీద అనుమానం రావచ్చు. వాళ్ళూ ఎలాగూ మా వాళ్ళు కాదని ఖండిస్తారు. వాళ్ళను ఉరితీసినా సరే! మీరు మాత్రం బయటపెట్టవద్దు ఈ విషయం. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యండి."
"ఇంటర్నేషనల్ కోర్టు అంటూ భయపెడుతున్నాడు ప్రైం"
"అక్కడ ఫర్వాలేదు. మీరు డెనై చేస్తారు కాబట్టి కేసు ఇంకో 10-15 సంవత్సరాలు సాగదీస్తాం. దానికి భయపడకండి. కేసు తేలే సమయానికి ఏ ప్రభుత్వం ఉంటుందో. ఎవరు అధికారం లో ఉంటారో ఎవరికెరుక. డొంట్ వర్రీ మచ్"
"యిప్పుడు చాలా హ్యాపీ గా ఉంది ప్రెసిడెంట్"
"కానీ ఇకనుండి ఇలాంటి దుందుడుకు పనులు చెయ్యకండి. ఏమైనా ఉంటే మాకు చెప్పండి అయిడియా ఇస్తాం. వాళ్ళు అంతరిక్ష రంగంలో దూసుకుని పోవడం మాకూ విచారంగానే ఉంది. కానీ పైకి అభినందించక తప్పదు"
" ఎస్సార్ కరక్టే!"
"బీ కేర్ఫుల్.  మీ సబ్మెరయిన్ క్రూకు ఇంటర్నేషనల్ కోర్టు ఏమి శిక్ష విధించినా మీరు తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోవాలి. నోరు మెదిపితే ప్రమాదం.  మీరు బయటపడకండి. బై"
*   *   *
ప్రైం మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆంతరంగిక సమావేశమందిరం.
ఎయిర్ కండిషన్ గదిలో కూడా వాతావరణం చాలా వేడిగా ఉంది. ప్రైం మినిస్టరు గొంతు సవరించుకొని  "క్రూ 16 మందిని ప్రత్యేక సెల్ లో వేశాము బాగానే ఉంది. కానీ పాక్ ఇప్పుడు మా సబ్మెరయిన్లే కాదని బుకాయిస్తున్నారు. ఏమి చెయ్యాలి?"
"అదే అర్ధం కావడం లేదు సార్!" డిఫెన్సు మినిస్టర్ అనడం తో ప్రైమ్మినిస్టర్ "ఒకసారి అమెరికా ప్రైం మినిస్టర్ తో మాట్లాడదాం" అన్న సలహాకు అందరూ సరే నని తల వూపారు.
అమెరికన్ ప్రెసిడెంటు లైనులోకి రాగానే "గుడ్ మార్నింగ్ ప్రెసిడెంట్. ఎలా ఉన్నారు?"
"ఫైన్. చెప్పండి."
"ఈ పాక్ వాళ్ళతో చాలా ప్రమాదం గా ఉంది ప్రెసిడెంట్. 2 సబ్మెరయిన్స్ మా అంతరిక్ష కేంద్రాన్ని సర్వనాశనం చెయ్యడానికి పంపిన విషయం మీకు తెలుసుకదా!"
" ఎస్. చూసాను. అవి పాక్ లో తయారయిన సబ్మెరయిన్సా?"
"నో. చైనా మేక్. కానీ క్రూ పాక్ వాళ్ళే కదా!"
"వాళ్ళు అలా చెప్పారా?"
"లేదు పాస్పోర్టులు ఎవిడెన్సు గా తీసుకొన్నాం"
"అవి దొంగ పాస్-పోర్టులో కాదు చెక్ చేయించండి. పాక్ కు జెరాక్సు కాపీలు పంపడి. వాళ్ళు కన్ఫాం   చేసేంతవరకూ మనం  ఏమి యాక్షన్ తీసుకోగలం ప్రైం.  చెప్పండి?"
"నిజమే! ఏమి చెయ్యమంటారు? అర్ధం కావడం లేదు"
"మీరు తొందరపడి ఏమీ చెయ్యకండి. ఇంటర్నేషనల్ కోర్టులో కేసు పెట్టినా మ్యాటర్ డినై చేస్తే మనం ఈ విషయంలో ముందుకు వెళ్ళలేము. సరయిన ఎవిడెన్సు లేనిదే మీరు ఐక్యరాజ్యసమితిలో చెప్పినా ప్రయోజనం ఉండదు. వాళ్ళు అల్రెడీ ఖండన స్టేట్మెంటు ఇవ్వనే ఇచ్చారు. మీరు ఆచి తూచి అడుగెయ్యాలి. లేకపోతే కక్షకొద్దీ అన్నీ మా మీద మోపుతున్నారని వాళ్ళు అంటే మనదగ్గర సమాధానం ఉండదు. నేను మళ్ళీ చెప్పే వరకూ క్రూ ను సెల్ లో ఉంచండి. అంతే! ప్రస్తుతానికి మనం ఏమీ చెయ్యలేము. ప్లీజ్ వెయిట్.  బై ". (సశేషం)
*   *   *

No comments:

Post a Comment

Pages