దాంపత్యంలో పరిపోషణము
ఆండ్ర లలిత
గోపాలం ఇంట్లోకి వస్తూ గుమ్మం దగ్గర తనకోసం ఎదురుచూస్తున్న మాలతికి పూలగుచ్ఛం ఇస్తూ చిరునవ్వుతో “నాకు ప్రొమోషన్ వచ్చిందోయ్, చివరి దశలోనన్నా డైరెక్టర్ కింద” అన్నాడు కనుబొమ్మలెగరేస్తూ.
“పోనీలేండి! మీ కష్టం వృధాగా పోలేదు. నా పూజలకి అమ్మ కరుణించింది. ఈ సంసారాన్ని సమర్థించటం ఎవరివశం! అత్తయ్యగారూ మావయ్యగారూ సంసారం నడిపే బాధ్యత నా మీద నమ్మకంతో నా మీద పెట్టారు. అంతా నేను నమ్మిన తల్లి శారదాంబ చలవ. ఈ రోజు ఈ సంసారాన్ని, ఒక కొలికి తెచ్చానంటే, ఎంత కష్ట పడ్డానో. ఆ సమయం అలాంటిది. ఆ అమ్మవారినే నమ్ముకుని ముందుకు సాగిపోయాను. మీరా చదువులు ఉద్యోగ భాద్యతలతో తల మునిగి ఉండేవారు. మావయ్యగారి దగ్గుకి అరకు దగ్గర నుండి పిల్లల చదువులు, ఆడపడచుల అలకలు, పెళ్ళిళ్ళూ, పురుళ్ళు పుణ్యాలు; ఇంకా మరుదుల చదువులు, వాళ్ళ ఉద్యోగాలు-పెళ్ళిళ్ళూ. ఇంకా ఎన్నెన్నో! అబ్బా, తలుచుకుంటేనే ఎలా చేసానా అనిపిస్తుంది. మాటలు కాదుకదా! ఒక్క త్రాడుపైన అందరిని నడిపించటం. చాలీచాలని సంపాదనలు. ఇవన్నీ ఒకఎత్తైతే, మనుషుల మనస్తత్వాలు వేరువేరు. ఎన్ని రోజులు మీరందరి కోసం, నిద్రాహారాలు మానానో. అంతా నా తల్లిని నమ్మి, నా మమకారంతో మీ అందరినీ ఆకట్టుకున్నాను. నాకు ఆ అమ్మవారు నా పూజలు ఫలించాయని సందేశం కూడా పంపించింది. మీద్వారా. ఎలాగో తెలుసా ! ఇదిగో ఇలాగ” అని పూల గుచ్ఛని చూపుతూ అంది మాలతి.
“ఏవిటీ? బానేఉంది చోద్యం. కష్టపడి మేము చదువుకుని ఉన్నతస్థితికివస్తే, అంతా నీ మూలంగానే అంటుంన్నావు! బానేవుంది వరుస. ఏవిటో నీ భ్రమ మాలతి. పోనీలే అలాగే కానీవోయ్” అన్నాడు గోపాలం నోరు వెళ్లపెట్టుకుని చూస్తూ మాలతి మాటలకి.
“ నాకెందుకు లేండి మెప్పు. ఏదో గతం గుర్తొచ్చిఅన్నాను. మొప్పు రాకుండా ఉంటే చాలు. అయినా నా పిచ్చికాని, ఈ రోజుకి కూడా, అందరి కోసంపాకులాడే నేనెవరికి కావాలి?” ప్రశ్నార్థకంగా గోపాలం కళ్ళల్లోకి మాలతి చూసింది.
“అలా ఎందుకు అనుకుంటావు మాలతి. అందరూ నిన్ను వాళ్ళ గుండెల్లో పదిలంగా దాచుకున్నారు” అన్నాడు గోపాలం మాలతి మనసుని సున్నితంగా తాకే ప్రయత్నంలో.
“ఏదో ఒకటి లేండి. మీ కష్టకాలం వెళ్ళిపోయిందని నాకు సందేశము పంపింది మా అమ్మ. నాకు ఇష్టమని రోజాపూల గుచ్ఛ మీ చేతికిచ్చి పంపిందండి. ఎంత బావుందో. ఈ రోజా పూలని చూస్తుంటే, మనం పడిన కష్టాలు మర్చిపోయి మనసు ఎక్కడికో వెళ్ళిపోవటం లేదూ? నాకైతే అలసి సొలసి అమ్మ వడిలో సేద తీర్చుకున్నంత ఆనందంగా ఉందండి. అదండీ మా శారదాంబ మహిమ” అంది మాలతి గోపాలంకేసి తిరిగి. ఎదో తన తల్లి గొప్పతనం వెల్లడిస్తూ, తృప్తిగా. మనసంతా నిండిన ఆనందంతో.
“అయితే మాలతీ నువ్వేంమంటావు? నా ప్రమేయం ఏమీ లేదా? అంతా నువ్వు కొలిచే ఆ జగత్జనని మహిమే అంటావా! ఆ తల్లి నీ ద్వారా మా అందరికీ జ్ఞానోదయం చేసిందన్నమాట. మేమంతా రోబోట్సా! నువ్వే మమల్ని రిమోట్ కంట్రోల్తో నడిపించావా! అహా! ఏమి ఈ వింత, మాలతీ! అంతా నీ భ్రమ” మాలతి చిన్న పిల్లల మనస్తత్వాన్ని ఆనందిస్తూ, ఆటపట్టిస్తూ మరియు ఉడికిస్తూ.
“అంతే! అంతే అంటే అంతే!”అంది మాలతి మూతి బిగిస్తూ.
“నేనే నెగ్గాను. ఇప్పుడన్నా ఒప్పుకోండి”అంది మాలతి బుంగమూతివేసుకుని గోపాలంతో.
“అంతేలే అంతా నీ నమ్మకం. నమ్మకంతో ముందడుగు వేసావు. నీ నమ్మకమే దేవుడు మాలతీ”అన్నాడు గోపాలం ఎదో మాలతికి తత్వం భోదనచేద్దామని.
“ఆ ఏమీకాదు! లెంపలేసుకోండి. నా తల్లి మనని కంటికిరెప్పలా కాపాడుతోంది. మనము ఈ రోజిలా ఉన్నామంటే అంతా ఆ తల్లి దయ. ఆ...అంతే..అయినా మనకి ఇంకేమి సంగతులు లేవా చర్చకి, ఇదేనా”అంటూ కోపంతో రుద్రమదేవి అయ్యింది మాలతి.
“అంత కోపం ఎందుకు? సరెలే అంతా నీమూలంగానే...”అన్నాడు గోపాలం.
“నామూలంగా కాదు. అంతా ఆ అమ్మ దయ. ఒప్పుకోండి”అంది మాలతి గోపాలం మాటలకి శాంతిస్తూ.
“సరేలే ఒప్పుకున్నానమ్మా. నీకు నా మాటలు అర్థం కావు. చెప్పితే విననవు. వెనకటికి వాడికి తెలియదు చెబితే వినడు అన్నట్లు”అన్నాడు గోపాలం మాలతితో.
“ ఏం కాదు. నాకన్నీ అర్థమౌతాయి.. మీకే అర్థం కావు. ఆ...అంతే! ఇలా మనమీద ఆ అమ్మవారి దయుంటే , మనకేమి కావాలి” అని పూలగుచ్ఛని అటుతిప్పి ఇటుతిప్పి మురిసిపోతు పూల కుంభంలో గుచ్చింది మాలతి.
మాలతి మనసున వెలసిన ఆనందం, తృప్తితో వచ్చిన చిరునవ్వు గోపాలంకి ఎంతో ఆనందం తెప్పిచింది. గోపాలం తనలోతాననుకున్నాడు. మాలతి ఈ చిరునవ్వే సంసారంలో, ఎన్ని సుడిగుండాలొచ్చినా, సునాయాసంగా దాటేలాచేసింది. మాలతికి నాకు అభిప్రాయ భేదాలు ఉన్నా, అవి తాత్కాలికం. తనలో ఎదో కళుంది. తను చేసే రోజూ పనులలో కూడా క్రొత్త దనము ఇంటిల్లిపాదిని మైమరిపింపచేస్తుంది. ఆ క్రొత్తదనము మరియు సృజనాత్మకత ఇంటిని వెలుగుతో నింపుతుంది” అలా అనుకుంటూ దేవుడి పటం దగ్గర నిలబడి ఒక్క నమస్కారం చేసాడు గోపాలం వంటగదిలో.
ఆ తరువాత పాలుకాస్తున్న మాలతితో, “నా మీద కోపం తగ్గిందా! కంగారు పడకు మాలతీ! ఈ విషయంకి సమాధానం వెతికేద్దాం. ముందో మంచి కాఫి ఇవ్వు. ఏదో అన్నానే అనుకో, అంత కోపం ఎందుకూ? నీ సహకారం లేనిదే నేను ఏమి చేయగలను. ఈ సంసారం ఈదగలనా. నీ సహకారం లేకపోతే జీవితం తాడు లేని బొంగరం లా ఉండేది” అన్నాడు గోపాలం.
“పోనీలెండి. కష్టాలు తరువాత సుఖాలు వస్తాయి కదండి” అంది మాలతి గోపాలం మాటలకి మంచు కొండలా కరిగిపోతూ.
ఇంకా ఏదో మాలతితో తన మనసులోని మాట పంచుకోవాలనే ఆతృతతో “ఒక వారం నుంచి మనసు కలత చెందింది మాలతి”అన్నాడు గోపాలం.
“అవును గమనించాను”అంది మాలతి అత్మీయతతో.
“ప్రమోషన్ వస్తుందో రాదో అనే ధోరణిలో నిన్ను కూడా విసికించాను. క్షమించు మాలతీ”అన్నాడు గోపాలం కాఫి ఆస్వాదిస్తూ.
“ఫర్వాలేదండి నాకు మీగురించి తెలియదా ఏమిటి!”అంది మాలతి భోజనాల బల్ల దగ్గర గోపాలం పక్కన కుర్చిలాక్కుని కూర్చుంటూ.
“కాని ఇవాళ నేను చాలా మధనపడి ఆ శారదాంబని మిమల్ని చల్లగా చూడమని వేడుకున్నానండి. మీ గురించి నాకు తెలుసుకాని, నాగురించి మీకేమి తెలియదు”అంది మాలతి బుంగమూతితో.
“అదేమీకాదు మాలతి. అంతా నీ భ్రమంతే”అన్నాడు గోపాలం.
“ఆ ....ఏమీ కాదు. నేను మీరు చల్లగా ఉండాలని ప్రార్థిస్తాను. అందుకేనేమో మనిద్దరికీ ఆ భగవంతుడు ముడేసాకే దారితెన్నూలేని మీ జీవితం ఒక దారిన పడింది”అంది మాలతి గర్వంగా గోపాలంతో.
“మరి నీదో! తొక్కుడు బిళ్ళ ఆడుకునే నిన్ను నేను ప్రేమతో కట్టేసి, ఈ సంసార సాగరంలో పడేయకపోతే, ఇలా బుద్ధిగా ఉండేదానివా. చెప్పు మాలతి”అన్నాడు గోపాలం. నేనొక ఆకు ఎక్కువ చదివానని నిరుపించడానికి చిరునవ్వు తో మాలతి కళ్ళలోకి చూస్తూ .
“అసలు అవేమికాదండి. వెనకటికి మహలక్షమమ్మ మామ్మగారు అన్నదే అక్షరాలా నిజం”అంది మాలతి తన చారడేసి కళ్ళు గిరగిరా తిప్పుతూ! గోపాలంతో.
“ఏమందేమిటి! ఏదో నిన్ను మెచ్చుకుని ఉంటుంది. నువ్వేమో మామ్మగారి మాటలకి ఉబ్బిపోయావు”అన్నాడు గోపాలం మాలతి కుందేలుకి మూడే కాళ్ళనే వాదనని ఆనందిస్తూ.
“ఒసే అమ్మడూ...నువ్వు ఎంతబాగా తీర్చిదిద్దావే నీ సంసారాన్ని. ఇంటిపేరు నిలబెట్టావమ్మ. వీళ్ళకి నువ్వువచ్చాకే అదృష్టం కలసివచ్చింది. నువ్వులేకపోతే ఏమైయ్యేవారో వీళ్ళంతా అమ్మడు”అనేదావిడ.
“ఏమైయ్యే వాళ్ళం? చక్కగా ఉండేవాళ్ళం”అన్నాడు గోపాలం
“అంటే నా ప్రమేయం ఏమిలేదా? నేను అసలు, ఏమీ చేయ్యలేదా? అంతేలేండి నాలాంటి అమాయకురాలికి తగిన శాస్తే జరిగింది. అందరు అంతే. ఓడ దాటే వరుకు ఓడ మల్లయ్య ఓడ దాటాక బోడి మల్లయ్య అనే వాళ్ళే. అంతేనండి ఈలోకం. మీతో వాదన అనవసరం. ప్రొద్దున్న మన అబ్బాయి బాబ్జీ ఫోన్ చేసి కులాసాగా ఉన్నానని చెప్పాడు. ఒక అరగంట మాట్లాడాడు. బిజీగా ఉన్నాడట. మీ ప్రమోషన్ గురించి తెలిసిన వెంటనే వాట్సఎప్ మెసేజ్ పెట్టమన్నాడు. మీరు శుభ వార్త చెప్పిన వెంటనే బాబ్జీకి మెసేజ్ చేసాను ” అంది బుంగమూతితో మాలతి గోపాలం కళ్లలోకి చూస్తూ.
“వాడు బానే ఉన్నాడు కదా. ఇంక మనం మాట్లాడుకునే విషయానికి వస్తే” గోపాలం అంటుంటేనే
మాలతి చేతులు జోడించి ఒక్క నమస్కారం పెట్టి “ఒద్దు మాహానుభావా!”అంటూ రుస రుస మంటూ వేరే పనిలోకి వెళ్ళిపోతున్న మాలతి చేయి పట్టుకుని గోపాలం ఆపి, ఒక్క 10నిమిషాలు కూర్చో అని సైగ చేసాడు గోపాలం.
“మాలతీ, నువ్వు మానట్టింట అడుగు పెట్టగానే చాలా మార్పులు జరిగాయి. నువ్వు ఇంటిలో ప్రతీ మనిషి ఎత్తరిల్లేటందుకు అనుకూల పరిస్థితులు ఏర్పరిచావు. ముళ్ళ బాట మీద కూడా మెత్తటి తివాచీ పైన పరిచి...మైమరిపించి, మమల్ని నడిచేలా చూసావు. ఆ వాతావరణం మూలంగా మా మానసిక స్తైర్యం పెంపొందింది. ఎవరికి వారు, వారి వారి ప్రతిభలను బహిరంగపరచేటట్లు అవకాశం కల్పించావు. కాని దీనికంతా కారణం ఇంట్లో వారు నీ మాటకి విలువిచ్చారు. స్వతహాగా ఆశావాదులు ప్రజ్ఞావంతులు కనుక, నీవల్ల కలిగిన అవకాశాన్ని వినియోగించుకోగలిగారు మాలతీ. నవ్వు తీర్చిదిద్దిన ఇల్లు, అదే మన ఇల్లు స్వర్గసీమలాగ మారింది. మనిషీ మనిషీ మనస్తత్వం వేరు. వారి వికాశానికి అనుకూలత కల్పించావు నువ్వు. ఎప్పుడూ ఎవరినీ ఆదేశించలేదు నువ్వు. నీ మమకారంతో వారు సరైన దిశలో పురోగమించేందుకు తోడ్పడగలిగావు. ప్రతీ వారి అవసరాలు నువ్వు సమయస్ఫూర్తితో గుర్తించి అనుకూల పరిస్థితులు సమకూర్చావు. ఇంక దైవం అంటావా, నమ్మాలి. మనం అనంతమైన సృష్టికి మార్గదర్శకుడైన ఆ అనూహ్యమైన శక్తిని నమ్మి ముందుకు సాగిపోవాలి నువ్వు అమ్మవారిని నమ్మినట్లు. అదే నమ్మకం మాలతీ. నువ్వు విగ్రహ రూపంలో ఆరాధిస్తే.... నేను ఈ సృష్టి స్థితి లయ కారకమైనటివంటి అనూహ్యమైన నిరాకారమైన శక్తి అని భావిస్తూ ఆరాధిస్తాను. ఎవరి అనుభూతి వారిది. అదే నమ్మకం. మన నమ్మకమే దేవుడని నా ఉద్దేశ్యం మాలతి.
మాలతికి గోపాలం మాటలు అర్థమై చంద్రబింబం లాంటి మొహం వికసించటం చూసి, మాలతికి తన భావం అర్థమైయిందని సంబరపడిపోయాడు గోపాలం.
“అవునండీ - నేనే చేసాను, నేనే కారణం, నావల్లే అందరూ పైకివచ్చారు అనుకోవడం నా అవివేకమండి. ఇలాంటి భావనలే మనుషులను వాళ్ళ మనసులను కష్టపెడతాయి గాయపరుస్తాయి. మనకి వాళ్ళు దూరమయ్యే పరిస్తితులను తీసుకువస్తాయి. అలా మరోకరి పురోగతికి మనం బాధ్యులమని వూహించేసుకోవడం అవివేకం, సమంజసం కాదు కూడా”
“అలాగే మన ఇద్దరి కలయిక ఆపై కలిగిన పురోగతి మనిద్దరం ఒకరికొకరు అనుకూలమైన పరిస్తితులు కలిగించుకున్నాం గాబట్టి, ఒకరికొకరు వారి వారి అంతరంగమైన బలాలను ప్రోత్సహించుకున్నాంగాబట్టి సంపాదించుకోగలిగాము ఈ పురోగతి కదా!”
“అంటే మనిద్దరము ఒకరి అభిరుచులు మరొకరు గమనించి పరిపోషణము చేసుకున్నామన్నమాట! నేనే అంతా చేయలేదన్నమాట!” అంది హృదయపూర్వకంగా గలగలా నవ్వుతూ”
మాలతి దగ్గరకొచ్చి తనని హత్తుకుని “ఏవోయ్ నీ మొహం మీద నవ్వు నేను తెప్పించానంటే నా ఆనందానికి హద్దులుండవు”అని అన్నాడు గోపాలం. ఇద్దరూ నవ్వుల జల్లులలో తేలిపోయారు.
***
చాలా బావుందండీ..ఒకరి కొకరు సహకరించుకొని..పరిపోషణం చేసుకోవటం వలనే కుటుంబం అభి వృద్ధి పదం లోకి వస్తుంది...మొత్తం అంతా ఒకరివలనే జరిగిందనే భావం తప్పు..అనే సందేశం చక్క గా అందించారు.. మంచి కధ..అభినందనలు
ReplyDeleteధన్యవాదాలండి
Deleteధన్యవాదాలండి
Delete