గొప్ప(కొప్పు)దనం - అచ్చంగా తెలుగు

గొప్ప(కొప్పు)దనం

Share This

(జ)వరాలి కధలు - 21

గొప్ప(కొప్పు)దనం 
 గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి (సోమసుధ)

"అక్కయ్యా! బావ తయారయ్యాడా?" వరాలి పిన్ని కొడుకు శ్రీధర్ వచ్చి ఆమెను అడగటం వినిపించింది.
  "ఆయన సంగతి సరే! నీ సంగతేమిటి?" వరాలు అతన్ని అడిగింది. 
  " నా ముస్తాబు యింతే! మరి నీది?" 
  "నేను సిద్ధమే! అయినా మాదేముందిరా! పెళ్ళిచూపులికెళ్ళేవాడివి నువ్వు బాగా ముస్తాబయితే చాలు. అవును.  టక్ చేయలేదేరా?"
 "నాకిష్టం లేదే!"
  "అలాగంటే ఎలారా? లోకం చాలా మారిపోయింది. ఈ దేశంలో టక్ చేసే జనాలే ఎక్కువ.  ఇలా టక్ చేసి అంతర్జాతీయబాంకుల్లోకి పోయి తన టక్కుటమారాలతో కోట్ల రూపాయలు ఋణం తీసుకొని, విదేశాలకు పారిపోయినా ప్రభుత్వాలేం చేయలేకపోతున్నాయి. కారణం యీ "టక్"  లే.  టక్ చేసినవాడు  పెద్దమనిషిలా, సంస్కారవంతుడిలా కనిపిస్తాడు.  అలా కనిపించిన వాడిపై యీ దేశంలో యీగ కూడా వాలదు.  ఇక అమ్మాయిలు సులువుగా బోల్తా పడాలంటే టక్కే మూలకారణం"  
  "పోవే! నువ్వు సలహా యిస్తున్నావా? సంఘాన్ని తిడుతున్నావా? రచయితకి భార్య అయ్యాక నువ్వు మాటలు బాగానే నేర్చావ్! బావగారిని త్వరగా తయారవమను. అమ్మ కంగారు పడుతోంది" అని వెళ్ళిపోయాడు. 
  "ఏమండీ!" అంటూ వరాలు నేను ఉన్న గదిలోకి వచ్చింది.
  అద్దం ముందు నిలబడి జుట్టును వివిధకోణాల్లో నుదుటిపై పడేలా చేసి చూసుకొంటున్నాను.
  "హాయిరాం! పెళ్ళిచూపులు మీకనుకుంటున్నారా? జుట్టును అటూ యిటూ లాగి చూసుకొంటున్నారు. మీకు పెళ్ళయిపోయిందని గుర్తు తెచ్చుకోండి" అని నా చేతిలో దువ్వెన లాక్కుని చంటిపిల్లాడికి సర్దినట్లు జుట్టు సర్దింది.
  "పూలరంగడు సినిమాలో నాగేశ్వర్రావులా యీ స్టయిల్ బాగుంది కానీ మీరా టక్ తీసేయండి" అంది.
  "నువ్వే కదోయి మీ వాడికి టక్ చేస్తే హుందాగా కనిపిస్తారని అన్నావు"
  "అన్నీ విన్నారా? ఆ సలహా చెప్పింది వాడికి.  టక్ చేసి ఆ అమ్మాయిని ఆకర్షించాల్సింది వాడు కానీ మీరు కాదు.  ఆల్రెడీ మీరు నన్ను పడేశారు. అవునూ! మీరు మన పెళ్ళిచూపులకు వచ్చినప్పుడు యింత భారీ ఎత్తున ముస్తాబు అవలేదే! మరి యిప్పుడెందుకంటా?" 
  "అప్పుడు సరిగా ముస్తాబవలేదని, ఆ ముచ్చట యిప్పుడు తీర్చుకొంటున్నా! సరేనా?" 
  "భర్త తీర్చుకొనే ముచ్చట భార్య కూడా సరదాపడేలా ఉండాలి. ఆ అమ్మాయి వాణ్ణి గాక మిమ్మల్ని చేసుకుంటాననేలా తయారవుతున్నారు.  అయ్యో ఖర్మ!" ప్రక్కనున్న కుర్చీపై తువ్వాలు తీసి నా ముఖాన్ని తుడిచింది.    
  "ఏయ్! ఏం చేస్తున్నావ్?"  
  "ముఖానికి కొంచెం పౌడరెక్కువయ్యిందని తుడుస్తున్నాను. ఎంత ముస్తాబైతే మాత్రం  పగటివేషగాడిలా తయారయితే ఎలా? ఆ చొక్కామీద ఏంటో పాకుతున్నట్లుంది" వరాలు చూపించగానే ఇన్షర్ట్ ని కంగారుగా పైకి లాగేశాను. 
 చొక్కా చివర దులిపినట్లు నటించి "పోయింది లెండి. పదండి" అంది.
నాకు నేలమీద పురుగేమి కనపడలేదు. ఆలోచించగా నా ఇన్షర్ట్ ని పైకి లాగించాలనే అలా నటించిందని అర్ధం అయింది.
  "అన్నవరం చూసి వెళ్ళిపోతుంటే దగ్గరే వెలగతోడులో మా పిన్నిని చూసి వెడదామన్నావు. సరే! ద్వారపూడిలో రైలు దిగి ఆటోలో యీ లోపలకి వచ్చాం. ఈ లోపున వాళ్ళు ద్వారపూడిలో పెళ్ళిచూపులు పెట్టుకొన్నారు. వాళ్ళు వెళ్ళి అమ్మాయిని చూస్తే బాగుంటుంది గాని మనం కూడా వెళ్ళాలా?" మెల్లిగా నసిగాను.
  "మనం మీరన్నట్లే చుట్టపుచూపుగా వచ్చాం. వాళ్ళు వెళ్ళేది ఎవరింటికో పెళ్ళికి అయితే మనల్ని వదిలేసే వెళ్ళేవారు. కానీ మావాడికి పిల్లని చూడ్డానికి వెళ్తున్నారు. అలాగని మనల్ని యింటి కాపలా పెట్టి వాళ్ళు పెళ్ళిచూపులకు పోతే మనల్ని అలా వదిలేసిపోయారని మనమే అంటాం.  అలా యింటిని చుట్టాల చేతిలో పెట్టి వెళ్ళటం సంప్రదాయం కూడా కాదు. అయినా అనుకోకుండా మా బాబయ్య రాజమండ్రి కాంపు కెళ్ళాట్ట. మాట్లాడ్డానికి మగవాడిగా మీరు ఉంటారని పిన్ని రమ్మని చెప్పింది. అమ్మాయి వివరాలు కనుక్కోండి చాలు.  అమ్మాయి నచ్చితే మిగిలినవి వాళ్ళే తరువాత మాట్లాడుకుంటారు.  సినిమాల్లోలాగ పెళ్ళిచూపులరోజే నిశ్చయతాంబూలాలు ఎవరూ పెట్టుకోరుగా" అంటూండగా శ్రీధర్ రావటంతో  మేము వాళ్ళని అనుసరించాం.
   పెళ్ళిచూపుల్లో వరాలు, వరాలి పిన్ని ఒక సోఫాలో కూర్చుంటే, నేను, శ్రీధర్ మరో సోఫాలో కూర్చున్నాం. వరాలు భయపడినట్లే అమ్మాయి ఓరకంట నావైపే చూస్తుంటే నా గుండె ఝల్లుమంది. వెంటనే శ్రీధర్ భుజం మీద కొట్టి "అమ్మాయిని ఏదన్నా అడగాలనుకుంటున్నావా?"  అన్నాను. వెంటనే ఆ అమ్మాయి పెళ్ళికొడుకు ఎవరో గ్రహించి అటు చూట్టం మొదలెట్టింది. 
  వరాలూ, ఆమె పిన్ని, మధ్యమధ్యలో నేను ప్రశ్నలు వేసి వాళ్ళనుంచి పిల్ల తాలూకు వివరాలు కొంత రాబట్టాం. అక్కడ అరగంట సేపు కాలక్షేపం చేసి మెల్లిగా యింటికి చేరాం. ఆ రాత్రంతా వరాలు, తన  పిన్ని ఆ పిల్ల గురించే చర్చించుకున్నారు.  శ్రీధర్ కి అమ్మాయి నచ్చినట్లే అనిపించింది.  రెండురోజులు అక్కడ గడిపాక వరాలితో కలిసి మా ఊరికి వచ్చేశాం. నగరంలో అడుగుపెట్టాక, ఆ పెళ్ళిచూపుల విషయమే మరిచిపోయాం. ఆరునెలల తరువాత శ్రీధర్ పెళ్ళికార్డు అందుకొని పెళ్ళికెళ్ళాం.
               @        @        @ 
"ఒకప్పుడు స్త్రీని విలాసవస్తువుగా చూసేవారు. దేవతగా ఆరాధించేవారే ఆమె అంగాంగవర్ణనతో తమ కామవికారాలను కొంతమంది కవులు వెళ్ళగక్కారు. కాలం మారింది.  కొంతమంది సంస్కర్తల ప్రోత్సాహంతో స్త్రీలు గడపదాటి బయటకొచ్చారు.  తమలోని సృజనాత్మకశక్తిని యింటి ముందు ముగ్గులు, యింటి అలంకరణల రూపంలో పెంపొందించుకోవటం మొదలెట్టారు.  ప్రస్తుతం అనేకరంగాల్లో తమ ప్రతిభను చాటుకొంటూ మగవారితో సమానంగా పోటీపడుతున్నారు.  అయినా సరె! ఆదది తనకన్న ఎందులోను గొప్పదానిగా కనిపించకూడదని మగవాడి ఆరాటం. ఆమె తన కన్నా పైస్థాయిలో ఉంటే తనకే పాఠాలు చెబుతుందేమోనని భయం. చివరికి సినిమాలు, కధల్లో కూడా స్త్రీని మగవాడికన్నా చదువులో కానీ, ఆర్ధికస్థాయిలో గానీ ఎక్కువ అన్నట్లు చూపకూడదు. పల్లెటూరి యాస మాట్లాడే సినిమాహీరో గారే, న్యాయశాస్త్రం చదివిన నాయికతో చివర్లో యింగ్లీషులో దంచేసి "ఐ యామె పోస్టుగ్రాడ్యుయేట్" అంటాడు. అలా అనకపోతే తెలుగు ఆడపడుచులే ఊరుకోరు. తమకు తిండి లేకపోయినా బాధపడరు కానీ తమ కధానాయిక తన హోదా కన్న దిగువస్థాయివాణ్ణి పెళ్ళాడితే ఊరుకోరు. ఆమె ఎప్పుడూ కాసులు ఉన్న కుర్రాడితో కానిపనులు చేస్తూ, కార్లలో తిరుగుతూంటే ఆ వైభోగాన్ని తామే అనుభవిస్తున్నట్లు బహు ముచ్చట పడిపోతారు"
   "ఏమండోయి!" వరాలి కేకతో కాగితాన్ని ఖరాబు చేస్తున్న నేను త్రుళ్ళిపడ్డాను. 
  "శ్రీధర్ పెళ్ళికని వచ్చి యీ సందులో వేశారేంటి బిచాణా? చుట్టాల జాబితా తయారుచేస్తున్నారా?" అంటూ నేను చేస్తున్న పనిని చూసింది.
  "ఖర్మ. .పెళ్ళికి బయల్దేరుతూ పుస్తకం, పెన్ను సర్దుతూంటే ఎవరివైనా ఎడ్రసులు వ్రాయటానికేమో అనుకున్నాను.  అయినా తప్పంతా నాదే! మీ సంగతి తెలిసి బట్టలతో పాటు పుస్తకం సర్దటం నాదే పొరపాటు. వ్రాసింది చాలు గాని లెండి.  అందరూ పెళ్ళికి తరలిపోతున్నారు" అంటూ నాకు మాట్లాడే అవకాశం యివ్వకుండా హడావిడిగా వెళ్ళిపోయింది. నాకు అలా మధ్యలో ఆపేయటం బాధగా  ఉన్నా, 'యిక్కడికొచ్చింది కళ్యాణం చూట్టానికే గాని కధలు వ్రాయటానికి కాదుగా' అనుకొంటూ కలం కట్టేశాను.  
అరగంటలో రెండు వానుల్లో మగపెళ్ళివారితో బాటు వెలగతోడు నుంచి ద్వారపూడికి బయల్దేరాం. ద్వారపూడి ఊరు చిన్నదేమో, ఊర్లో జనాలే కాదు ఊరికుక్కలు ఆ సందట్లో పాలుపంచుకొంటూ పెళ్ళివారి వెంటపడ్డాయి. పెళ్ళిపందిట్లో పసిపిల్లలు లగాయితూ అందరూ హడావిడిగా తిరుగుతున్నారు.  ప్రతివాళ్ళు తాము కలగజేసుకోకపోతే పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందోనని పరుగులు తీస్తున్నారు. పురోహితుడి సంగతి సరేసరి.  అక్కడ జరిగే వేడుకంతా ఒక ప్రక్కన నిలబడి గమనిస్తున్నాను.  లోపల గదిలో గౌరీపూజ నడుస్తూంటే, మంటపంలో పెళ్ళికొడుకు హడావిడిగా ఉన్నాడు. 
   "ఏమిటో యీ ఆర్భాటాలు?  హాయిగా పిల్ల, పిల్లాడు ప్రేమించుకొని, విదేశాల్లోలాగ ఉంగరాలు మార్చేసుకొంటే పోయేది కదా?" పాతికేళ్ళ కుర్రాడి సణుగుడు విని ప్రక్కనున్న ముసలాయన అందుకున్నాడు.
  "ఎందుకు పోదూ? ఖచ్చితంగా పోతుంది. నిక్షేపంలాంటి ఆడపిల్ల బ్రతుకు సర్వనాశనమైపోతుంది. ఈ రోజు ఉంగరం మార్చిన నీలాంటి కుర్రనాగన్న, రేపు ఊరే మార్చేస్తే ఆ ఆడపిల్ల భవిష్యత్తు అంధకారమైపోతుంది.  అదే యీ మోడల్ పెళ్ళనుకో! పెళ్ళికొచ్చిన మేమంతా కలిసి తోకజాడించే మగాడి తోక కత్తిరించే అవకాశం ఉంటుంది. అందుకే నాన్నా! మన దేశంలో యీ పెళ్ళితంతు"
  "ఈ పెళ్ళివల్ల ఎంత ఖర్చు? ఎంత హైరానా?" ఆధునికవాది సమర్ధించుకోబోయాడు.
  "అయితే? విదేశీ సంస్కృతి దిగుమతి కావాలంటావా? నీకు పెళ్ళయిందా?" ముసలాయన మాటలకు లేదన్నట్లు తలూపాడా కుర్రాడు. 
  "సరె! నువ్వు విదేశీతరహాలోనే ఉంగరాల మార్పిడి పెళ్ళి చేసుకో! మేమంతా పెళ్ళికొచ్చి, పెళ్ళికూతుర్ని దగ్గరికి తీసుకొని బుగ్గమీదో, నుదుటిమీదో ముద్దులెట్టి ఆశీర్వదిస్తాం. అలా ముద్దులెట్టడం కూడా విదేశీ సంస్కృతే! దానికి నువ్వు గంగవెర్రులెత్తిపోక సర్దుకోవాలి" ముసలాయన మాటలకు చుట్టుప్రక్కలవాళ్ళు నవ్వారు. దానితో ఆ కుర్రాడికి తల కొట్టేసినట్లయింది. 
  "వాట్ నాన్సెన్స్ యూ ఆర్ టాకింగ్?" అంటూ కళ్ళెర్రజేశాడు.
  "ఐ యాం టాకింగ్ యిన్ ద ఫారిన్ సెన్స్! డూ యూ నో హూ ఐ యాం?  ఐ యాం లివింగ్ యిన్ లండన్. అవర్ యిండియన్స్ లివింగ్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఆర్ క్రేవింగ్ ఫర్ అవర్ కల్చర్! వేరాజ్ యూ పీపుల్ లివింగ్ హియర్ ఆర్ ఇన్సల్టింగ్ అవర్ కల్చర్! మాకు అక్కడ పురోహితుడు దొరక్కపోతే  వేంకటేశ్వర సుప్రభాతం కేసెట్ పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకొంటాం.  ఈ కాలం కుర్రాళ్ళు యిలా తయారయ్యారేంటయ్యా?  మాట్లాడితే ఫారిన్ కల్చరంటారు. ఫారిన్లో ఏముందయ్యా? పిల్లలు అమ్మానాన్నల ప్రేమపంచుకొనే కుటుంబవ్యవస్థ ఉందా? అక్కడ పిల్లలు హైస్కూలు చదువులు అవగానే ఉద్యోగాలు చేస్తూ చదువుకొంటారు.  కానీ యిక్కడ? మీ కడుపులో చల్ల కదలకుండా తల్లిదండ్రులు అప్పో, సప్పో చేసి చదివిస్తారు. తమ పిల్లలకు జీవనోపాధి దొరికేవరకూ అంటిపెట్టుకొనే ఉంటారు. అక్కడ తల్లిదండ్రులు డేటింగులంటూ, వీకెండ్లంటూ విచ్చలవిడిగాపోతారు. ఇక్కడ తాము అలా తిరగరు సరికదా తమ పిల్లలు రాత్రి వేళకి యిల్లు చేరకపోతే కళ్ళలో వత్తులేసుకొని మరీ చూస్తుంటారు. విదేశీ సంస్కృతి అంటున్నావు కదా! అక్కడ అమ్మాయి పదిమందితో చనువుగా మసిలినా పెళ్ళి చేసుకొంటారు.  మరి యిక్కడ అలా మసిలే అమ్మాయిని నువ్వు చేసుకొంటావా? ఏం? విదేశీసంస్కృతిని నువ్వే తప్ప నీ భార్య అనుసరించకూడదా? ఏ దేశంలోనైనా అక్కడి వాతావరణం, భూగోళపరిస్థితులను బట్టి సంస్కృతీ సంప్రదాయాలుంటాయి. వాటిని గౌరవించటం ఆ దేశప్రజలైన మన విధి.  డూ యూ నో? ఇండియన్స్ లవ్ స్టార్ట్ విత్ మేరేజ్ వేరాజ్ వెస్ట్రన్స్ లవ్ ఎండ్స్ విత్ మారేజ్"  ముసలాయన అలా దంచి పారేస్తూంటే ఆ కుర్రాడు అక్కడనుంచి తప్పుకొన్నాడు.
   "ఊరుకోండి" ప్రక్కాయన ముసలాయనతో అన్నాడు.
   "నా దేశసంస్కృతిని ఎవ్వరేమన్నా ఉండలేనండి.  ఈ రోజుల్లో దేశాన్ని కించపరుస్తూ మాట్లాడటం పెద్ద దురలవాటైపోయింది. ఈ ఛానల్ వాళ్ళొకళ్ళు.  దేశాన్ని ఉద్ధరించేవాళ్ళలా మేధావులని చెప్పుకొనే మేళాన్ని కూర్చోపెట్టి మన సంస్కృతిని భ్రష్టుపట్టించే చర్చలు పెడుతూంటారు.  అలాంటివారి వల్లే యిలాంటి కుర్రాళ్ళు మన దేశాన్ని చులకన చేస్తూ మాట్లాడే స్థాయికి దిగజారిపోతున్నారు"  అంటున్నాడు.   
   ఈలోపున పెళ్ళిపీటలమీద హడావిడి విని అటువైపెళ్ళాను. పురోహితుడు నుదుటిపై పట్టిన చెమటను కండువాతో తుడుచుకొంటున్నాడు.  
  "ఏమిటోయి గొడవ?" అంటూ మంటపంపై ఉన్న వరాలి ప్రక్కన చేరి మెల్లిగా అడిగాను.
   "పురోహితుడు మంత్రం మరిచిపోతే పెళ్ళికూతురు గుర్తు చేసింది" వరాలు గొణిగింది.
  పెళ్ళికూతురు పంతులుగారికి మంత్రం గుర్తు చేయటమా? ఇదేదో బాగుందే!అనుకొంటూ అక్కడ సర్దుకొన్నాను.
   "ముహూర్తం వేళయింది.  భజంత్రీలు" పురోహితుడి అరుపుతో మేళతాళాలు గోల చేశాయి. పురోహితుడు వధూవరుల తలలపై జీలకర్ర, బెల్లం పెట్టించి, శ్రీధర్ చేత మంత్రం చెప్పించాడు.  
తరువాత శాస్త్రప్రకారం కాడిని వధువు తలపై ఎత్తి పట్టి దాని కన్నంగుండా వరుడి చేత నీళ్ళు పోయించబోయాడు.  
    "దక్షిణం" అంది పెళ్ళికూతురు. 
శ్రీధర్ చేతులు వణికాయి. తప్పు తెలుసుకొన్న పురోహితుడు దక్షిణంవైపు కన్నం గుండా శ్రీధర్ చేత  నీళ్ళు పోయించాడు. తరువాత మంగళసూత్రాన్ని పెట్టి నీళ్ళు చల్లారు.  వధువుకి నూతన వస్త్రాలిచ్చారు. శ్రీధర్ వధువు నడుముకు తాడు కడుతూండగా పురోహితుడు మంత్రం చదువుతున్నాడు.
ఆశాసానా సౌమనసం ప్రజాం సౌభాగ్యం తమం" అంటూ ఆగిపోయాడు. పదేపదే పెళ్ళికూతురు ఆడ్డు తగులుతూండటంతో  ఆయన ఏకాగ్రత దెబ్బ తిన్నట్లుంది. ఎంతకీ మంత్రం గుర్తు రాక అతని నుదుట చెమట పట్టింది. ఆయన పరిస్థితిని పెళ్ళికూతురు గమనించినట్లుంది.
"అగ్నేరనూరతాభూత్వా సన్నహ్యే సుకృతాయనం" అంటూ మంత్రాన్ని అందించింది. చుట్టూ ఉన్న అమ్మలక్కలు బుగ్గలు నొక్కుకున్నారు. శ్రీధర్ మొహం వెలవెలబోయింది. పెళ్ళికూతురు మాత్రం తలెత్తలేదు.
పురోహితుడు భయపడుతూనే మంగళసూత్రానికి పూజ చేయించాడు.  సూత్రాన్ని పందిట్లో అందరూ చూశాక మంగళసూత్రధారణ జరిగింది. తలంబ్రాల తంతు మొదలైంది. శ్రీధర్ పురోహితుడు చెప్పిన మంత్రాన్ని చెప్పి, పెళ్ళికూతురు తలపై తలంబ్రాలు పోశాడు. వధువు చేతిలో కొబ్బరిచిప్ప ఉంచి, బియ్యంపోసి పురోహితుడు ఆమెచే మంత్రం చెప్పించబోయాడు.  కానీ అప్పటికే ఆమె ""పశవోమే కామస్సమృధ్యతాం" అంటూ శ్రీధర్ తలపై తలంబ్రాలు పోసేసింది.  ఇలాగే పెళ్ళిలో జరిగే ప్రతీ తంతులోను ఆమె పురోహితుడి తప్పులను సరిదిద్దుతూనే ఉంది.  ఆమె పరిజ్ఞానానికి పురోహితుడు ఖంగు తిన్నాడు. నాకు రెండురోజుల కన్నా సెలవు దొరక్కపోవటంతో పెళ్ళయిన మరునాడే మేము బయల్దేరి వచ్చేశాము.  వచ్చే ముందు వరాలు వధూవరులను మా ఊరికి రమ్మని చెప్పింది.
              @     @       @
పదిహేను రోజుల తరువాత శ్రీధర్ ఒక్కడే మా ఊరు వచ్చాడు.  
"అమ్మాయిని తీసుకురాలేదేరా?" వరాలు అడిగింది.
"నక్షత్రాలు నప్పలేదని శోభనాన్ని నెల్లాళ్ళు వాయిదా  వేశారక్కా!" చెప్పాడు. 
" ఇప్పుడు అమ్మాయి ఎక్కడుంది?" వరాలి ప్రశ్న.
"వాళ్ళింట్లోనే!  నీతో ఒక విషయం చెప్పాలే!" అన్నాడు.
"బావగారు ఉన్నారని సందేహిస్తున్నావా? నీకేదైనా సమస్య ఉంటే ఆయన సలహా చెబుతారు. చెప్పు" 
మాటల్లో అప్పుడప్పుడు నన్ను తీసిపారేసే వరాలు నన్ను పొగిడేసరికి ఆనందంతో పొంగిపోయాను. 
శ్రీధర్ కొన్ని క్షణాలు తటపటాయిస్తూనే అసలు సంగతి బయటపెట్టాడు.
"ఏం లేదే! పెళ్ళిపీటల మీద ఆమె ప్రవర్తన చూశావుగా! ఆ పురోహితుడు అమ్మకి ఏమి చెప్పాడో? అమ్మ తనని యింటికి తీసుకురావటానికి భయపడుతోంది" 
"అలాగని వదిలేస్తే వాళ్ళు ఊరుకొంటారా? అయినా అంత కాని పని తానేం చేసిందిరా?" 
"పదిమందిలో పురోహితుడికే మంత్రాలు చెప్పటం. . ."
"తప్పేముంది?  ఆ అమ్మాయికి పెళ్ళిమంత్రాలు వచ్చేమో! పంతులుగారు కంగారులో మర్చిపోతుంటే గుర్తు చేసింది"
"ఈ రోజు పురోహితుడయ్యాడు.  రేప్పొద్దున్న నన్ను కూడా అలా నలుగురిలో నిలబెట్టి తప్పులెత్తి చూపితే నా పరువేం కావాలే?  అమ్మ ఆ అమ్మాయికి నట్టు లూజేమో, వదిలించుకొందామంటోంది" 
"ఏం? పెళ్ళానికి మొగుడి తప్పులెత్తి చూపే అధికారం లేదంటావురా?" వరాలి ప్రశ్నకు జవాబు నా దగ్గరే లేదు. . .ఇంక శ్రీధర్ ఏం చెప్పగలడు? 
  "నువ్వే అలాగంటే ఎలాగే?"
  "ఆ అమ్మాయిని మనమే గాక నీ స్నేహితులను, బంధువులను తీసుకెళ్ళి పదిసార్లు చూశావట.  మీ అమ్మే చెప్పిందిలే!  అప్పుడు చూసుకోలేదా అమ్మాయికి నట్టు లూజేమో?" ఆమె ప్రశ్నకు అతని ముఖాన చెమట్లు పట్టాయి.
  " అన్నానని కాదు గానీ! మీకు హోదాలో ఉన్న అమ్మాయి కావాలి, రెండు చేతులా సంపాదించి మీ చేతుల్లో పోయాలి. అడిగినప్పుడల్లా తన పుట్టింటినుంచి మీకు దోచిపెడుతూండాలి. కానీ  ఆమె మీ తప్పుల్ని ఎత్తి చూపకూడదు. తన పట్ల మీరెంత నిర్లక్ష్యంగా ఉన్నా నోరెత్తకూడదు.  జిల్లాని పాలించే కలెక్టరైనా మీ అడుగులకు మడుగులొత్తాలి. అధికారంలో గాని, ఆర్ధికంగా కానీ మీకు కలిసి వచ్చినరోజు మాత్రం నలుగురు స్నేహితులను పోగేసుకొని మీరు బజార్లో జల్సా చేసినా తప్పులేదు;
కానీ ఆ ఆనందాన్ని మొదట  భార్యతో పంచుకోవాలని ఏ మగాడైనా ఆలోచిస్తున్నాడ్రా!" 
వరాలు ధాటికి నా నరాలే పట్టు సడలినట్లయ్యాయి ఇంక శ్రీధర్ సంగతి చెప్పాలా?
"చూడు.  అమ్మ పాతకాలం మనిషి. మగవాడి అడుగులకు మడుగులొత్తుతూ ఆడది పడి ఉండాలనే ఆలోచనలోనే ఉంటుంది.  వాళ్ళ అమ్మ కూడా అదే పద్ధతిలో పెరిగింది, పెంచింది. కానీ కాలం మారుతోంది.  భర్త కష్టంలో భాగం పంచుకోవాలని ఆడది భుజాన బేగ్ వేసుకొని, మీలాగే రెక్కలు ముక్కలు చేసుకొని యింటికి వస్తోంది. అయినా సరే! అరగంట విశ్రాంతి తీసుకొని తిరిగి వంటపనిలో మునిగిపోతోంది. తానెంత హోదాలో ఉన్నా తన యింటిని తీర్చిదిద్దటంలో నిర్లక్ష్యం చేయటం లేదు. కానీ మగాళ్ళు చేస్తున్నదేమిటి?  అదేంటో నీకూ తెలుసు.  నేను వేరే చెప్పనక్కరలేదు. స్త్రీకి మగవాళ్ళలా శారీరకబలాన్ని యివ్వలేదా దేవుడు.  అయినా కష్టపడుతోంది.  ఇంట్లో ఏదైనా సమస్య వస్తే పరిష్కరించే మానసికవికాసాన్ని మాత్రం ఆడదానికే యిచ్చాడు.  దాన్ని సక్రమంగా వినియోగించుకోవటానికి మీరామెకు అవకాశాన్ని యివ్వండి. అప్పుడు మీలో మనిషిలా కలిసిపోయి మీ యింటి గౌరవప్రతిష్టలను పెంచుతుంది. అంతేగానీ మీ అభిప్రాయాలను బలవంతంగా ఆమెపై రుద్దాలని చూసినప్పుడే ఘర్షణ మొదలై, కాపురాలు రోడ్డున పడతాయి.  ఈ కాలం కుర్రకారు ఆ అహంభావాలతోనే రోడ్డెక్కుతున్నారు. ఏదైనా సమస్యకు మధ్యలో ఆమె సలహాను కూడా తీసుకొన్నావనుకో! ఆమె నిన్ను రోడ్డున పెట్టే పని చేయదు.  మీ పెళ్ళయ్యాక ఆమెను కలిసి మాట్లాడాను. తాను పి.జి. చేశాక, మన వివాహవ్యవస్థ మీద పి.హెచ్.డి. చేస్తోందట. ఆ సందర్భంలోనే పెళ్ళి మంత్రాలను, పెళ్ళి చేసే పద్ధతిని తెలుసుకొందట.  పురోహితుడు కంగారులో మంత్రాలను, సంప్రదాయాన్ని తప్పుగా చెబుతూంటే, తనకు తెలుసు గనుక సరిదిద్దింది. దానికి ఆ పురోహితుడికి కోపం రావటం సహజం. మనసులో ఏ కల్మషం లేదు గనుక తనకు తెలిసిన విషయాన్ని చెప్పాలనుకొంది. అలాంటి నీ భార్య విజ్ఞానానికి మెచ్చుకోవలసింది పోయి నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలారా? కొప్పు ఉన్నంతమాత్రాన ఆడది మీకన్నా గొప్పది కాగూడదా? చెప్పరేంటండీ!" ఉపన్యాసం దంచేస్తున్న వరాలు ఒక్కసారి నావైపు తిరిగేసరికి కంగారుపడ్డాను. 
  "నేను చెప్పాలనుకున్నది నువ్వే చెప్పేస్తూంటే ఏం మాట్లాడను.  చూడు శ్రీధర్! అలనాడు ఆడదని అలుసు చేయక రుద్రమ్మకు ఆమె తండ్రి సాయపడ్డాడు గనుకే ఆమె కాకతీయసామ్రాజ్యాన్ని విజయవంతంగా పరిపాలించగలిగింది.  శృంగార సాధనంగా భావించబడే స్థాయినుంచి స్త్రీని సాటి మనిషిగా గుర్తించే స్థితికి ప్రపంచం పరిణతి చెందింది. ఇంకా మనమీ పాతకాలపు భావజాలాన్ని పట్టుకు కూర్చుంటే ఎలా?  మగవాడి విజ్ఞానం మరొక నాలుగురాళ్ళు ఎక్కువ సంపాదించటానికే ఉపయోగపడుతుంది. కానీ ఆడదాని విజ్ఞానం? ముందు తన కుటుంబానికి, తద్వారా సమాజ పరిణతికి దోహదం చేస్తుంది.  అందుకే ఆడదాన్ని సమాజం అణగత్రొక్కేయక, ఎదగనివ్వాలి. ఆమె విజ్ఞానానికి మనం విలువ యిస్తున్నంతకాలం ఆడది ఎదురుతిరగదు.  కానీ పెళ్ళయిన కొత్తలోనే భర్త తనను చులకన చేస్తున్నాడని ఆమె గ్రహిస్తే మాత్రం జీవితాంతం నరకమే! చెప్పుడుమాటలు విని భార్యను చులకన చేయకు.  ఇంకా ఏదైనా సమస్య వచ్చిందంటే అప్పుడు చూద్దాం.  అంతేగానీ పెళ్ళిలో మంత్రాలు చెప్పిందని ఆమెను అవమానపరచాలని చూడకు"  అంటూ వరాలు వైపు చూశాను.   దానికామె మెచ్చుకోలుగా నవ్వింది.               రెండురోజులు మా ప్రవచనాలు విన్న శ్రీధర్ తన మనసు మార్చుకొని భార్యను యింటికి తెచ్చుకొందుకే నిర్ణయించుకొన్నాడు.
  జీవితంలో ఏ ఆడపిల్లా తన సంసారాన్ని కావాలని  నాశనం చేసుకోదు.  మగడనే మగాడు ఆమె కొప్పుదనాన్నే కాదు గొప్పదనాన్ని కూడా గుర్తించగలిగితే, ఆమె  జీవితాంతం అతనిపట్ల తను  కృతజ్ఞురాలై ఉంటుంది. ఆ సంసారం  ఆనందమయం అవుతుంది. కాదంటారా?

***

1 comment:

Pages