ప్రాంచన
దొండపాటి కృష్ణ
మౌనం.. మౌనం.. మౌనం..అంతా మౌనం. గాలి శబ్ధమే వినిపించేంత మౌనం. తుఫాన్ వచ్చేముందు సముద్రం వహించే మౌనం. ప్రళయం వచ్చేముందు ప్రకృతి వహించే మౌనం. మౌనాన్ని చేధించాలంటే శబ్ధం తాండవం చేయాల్సిందే! ప్రాంచన మొహంలో అసహనం, కోపం, భయం. రాహుల్ మొహంలో చిరాకు, నిర్ల్యక్ష్యం, నిర్లిప్తత ప్రస్పుటంగా కన్పిస్తున్నాయి.
“నాన్న..! నాకొక బారుబీ బొమ్మ కొనివ్వవా!” ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చి రాహుల్ ను పట్టుకొని అడిగింది రంజని.
“మన జీవితాలు తగలబడిపోతుంటే నీకు బొమ్మలు కావాలా బొమ్మలు. అవతలికేళ్ళు” అంటూ పక్కకు నెట్టాడు రాహుల్.
తుఫాన్ వచ్చేసింది. ప్రళయం మీదపడిపోయింది. పాప రూపంలో నిశబ్ధం, శబ్ధ రూపాన్ని సంతరించుకుంది. మౌనం పగిలి కలహం రాజుకుంది.
“మీ కోపాన్ని పాపమీద చూపిస్తారెందుకండీ?” అడిగింది ప్రాంచన.
“నా పరిస్థితి నీకు అలాగే కన్పిస్తుందిలే. బిజినెస్ దెబ్బతిని నేను ఏడుస్తుంటే నీకు వెటకారంగా ఉంది కదా! ఏ పని చేయట్లేదని చులకనైపోయానులే. అందుకేకా తిడుతున్నావ్?” నిలదీశాడు రాహుల్.
“నా ఉద్దేశ్యం అది కాదండి”.
“ఏది కాదండి! నిన్న మొన్న జరిగిన గొడవలు సరిపోవని మళ్ళీ ఈ రోజు కూడా గొడవ పడుతున్నావ్. నిన్నేమనుకోవాలో అర్ధం కావడం లేదు. అసలు ఎలా పుట్టావో”.
“నాకర్ధమవుతుంది. మీ పనిని సాధించలేక నన్ను సాధిస్తున్నారు”.
“అవును నిన్ను సాధించడమే నా పని. నువ్వొచ్చిన దగ్గర్నుంచి అన్నీ ఆశుభాలే నాకు. ఏం చేస్తాం అది నా ఖర్మ రా బాబు”.
“మీరు చేసే బిజినెస్ ఏమిటో చెప్పరు. ఎందుకు దెబ్బతిందో చెప్పరు. ఏం జరిగిందో అది కూడా చెప్పరు. ఏదన్నా ఆలోచించడానికి వీలు లేదు. ఏమన్నా అంటే కోప్పడతారు, ‘నా మీద నమ్మకం లేదా’ అంటూ నిలదీస్తారు. ఇలా అయితే ఎలాగండి?”.
“చెప్తాను. ఎందుకు చెప్పను. నువ్వు పెద్ద సైంటిస్ట్ వి కదా.! పరిష్కారం చూపిస్తావని చెప్తాను”.
“అలా అంటారెంటండి. సమస్యను సాధించుకోవడానికి సైంటిస్ట్ కానవసరం లేదుకదా. మీ సమస్యలు తగ్గడం లేదు. ఇల్లు గడవడం లేదు. పాప ఫీజులు కట్టాలి”.
“మొరటోడి చేతికి పూలు ఇవ్వకూడదు, నువ్వు చెప్పే పరిష్కారం పాటించకూడదు. నువ్వు చెప్పినట్లు చేస్తే అడుక్కు తిన్నట్లే”.
“ఇప్పుడు మనం చేసేది అదేగా! పరిష్కారం వినకుండానే వాదిస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు. సవాలక్ష సమస్యలకు సవాలక్షకు పైగానే పరిష్కార మార్గాలున్నాయి. కాని మీకు మాత్రం ఒక్కటి కూడా దొరక్కపోవడం విడ్డూరమే!”.
“అంటే... అంటే... నీ దయా దాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నానా? ఇంట్లో కూర్చుని మూడు పూటలా మెక్కడం కాదు జీవితమంటే! సంపాదించే వాడికి తెలుస్తుంది ఆ బాధేంటో”.
“ఖాళీగా ఉన్నానని ఎవరు చెప్పారు? నేనేం ఖాళీగా లేను. ఉద్యోగం చేసే వాళ్ళకన్నా ఎక్కువగానే కష్టపడుతున్నాను. పాపను చూసుకోవాలి, మిమ్మల్ని చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి, అందరికీ సమాధానం చెప్పాలి. ఇవన్ని చేయడం ఎంత కష్టమో ఇంట్లో ఉండి పట్టించుకోని మీకేం తెలుస్తుంది మా కష్టాల గురించి”.
“అబ్బా... అబ్బా... ఇలా ఎదో ఒకటి మాట్లాడుతూ నన్ను విసిగించడమేనా నీ పని. ఇలా చేస్తే ఏదోరోజు చెప్పాపెట్టకుండా దూరంగా వెళ్ళిపోతాను, అప్పుడు తెలుస్తుంది నీకు”.
“ఆ మాట అనే ముందు ‘నేను వెళ్ళిపోతాను’ అని నేనంటే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి”.
“అయ్య బాబోయ్ నీ గోల పడలేకపోతున్నాను. అనవసరంగా పెళ్లి చేసుకున్నానురా దేవుడోయ్. ముందే బావుంది జీవితం”.
“ఇప్పుడు నాకూ అదే అన్పిస్తుంది. ఎలా ప్రేమించానో, ఎలా పెళ్లి చేసుకున్నానో అని”.
ఆవేశం పెరిగి, ఆగ్రహ రూపం దాల్చితే ఏమవుతుంది – చెంప చెళ్ళుమంటుంది. అదే జరిగింది. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ చెరోవైపు వెళ్ళిపోయారు. అది చూసి రంజని ఏడుపు లంకించుకుంది.
బాధపడుతుంది ప్రాంచన. ఏరి కోరి ఎంచుకున్న జీవితం ఎందుకిలా తలకిందులవుతుందని మధనపడింది. ఒకప్పుడు తన నిర్ణయానికి తిరుగే లేదు. కానిప్పుడు తన నిర్ణయమే తనని ఆలోచనల్లో పడేసింది. ఈ గొడవల నేపధ్యంలో ఆమె తల్లీ దండ్రులు లతో పడిన గొడవ గుర్తుకొచ్చింది.
******
డిగ్రీ పట్టా చేతికొచ్చిన రోజు, సంతోషంగా ఉండాల్సిన రోజు, సగం అశాంతిని మిగిల్చింది. డిగ్రీ చేతికొచ్చిన మహత్యమో లేక ఒక్కతే కూతుర్ని- నా మాటే విని తీరుతారు అన్న భ్రమో, తన నిర్ణయాల పట్ల ధైర్యమో, పెద్దదాన్నై పోయానన్న నమ్మకమో కాని తన మనసులో మాట తల్లీదండ్రుల చెవిన పడేసింది. మౌనం... మౌనం.. ఈ సారి భరించలేనంత మౌనం. ప్రకృతి ఒడిసి పట్టుకోలేని మౌనం- శబ్ధ రూపం దాల్చుకుంది.
“మైనారిటీ తీరిపోయిందని చెప్తూ నువ్వీ నిర్ణయం తీసుకోవడం ఎంతమాత్రమూ మంచిది కాదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయ్” సావధానంగా చెప్పింది కావేరి.
“ఇంతసేపూ ఎదురుచూసేది మీ నోటి నుంచి ఈ మాట వినడానికి కాదమ్మా! చిన్నపిల్లలా చూడొద్దు. మీ కంటికి మేమెప్పుడూ చిన్న పిల్లల్లాగే కనిపిస్తాం” అంది ప్రాంచన.
“నువ్వంతటికి నువ్వనుకుంటే సరిపోదు. పెళ్ళంటే నువ్వనుకున్నంత సులభమైన విషయం కాదు, ఒక గంటలో, ఒక రోజులో నిర్ణయించడానికి. మాట్లాడకుండా నీ గదిలోకేళ్ళు” అంది తల్లి.
“ఇందాకటి నుంచీ చెప్పిందే చెప్తున్నావ్! ఎందుకు నచ్చలేదో చెప్పవేంటమ్మా. అతనితో ఉంటె నాకేం ఇబ్బందులుండవ్. నేను సుఖంగా ఉంటానని చెప్తే అర్ధం చేసుకోరేంటి?” అభ్యర్ధించి ప్రాంచన.
“చెప్తుంది నీకు కాదా! అతను నీకు సరిపడడు అంటే అర్ధం కాదా! మాట్లాడకుండా వెళ్ళు” గద్దించింది తల్లి.
“మీ అభిమతం మీదే కాని నా మాట పట్టించుకోరేంటి? నాన్నా నువ్వైనా చెప్పు అమ్మకు” తండ్రిని అడిగింది ప్రాంచన.
“ఏం చెప్పమంటావ్ తల్లీ? ఎవరో ముక్కూ మొహం తెలియని వాడిని చూపించి అతనే మీ అల్లుడు అంటుంటే ఏం చేయగలం? మా పెంపకాన్నే ప్రశ్నించేలా చేసావ్! గారాభంగా పెంచడం తప్పని ఇప్పుడు తెలుస్తుంది తల్లి” అన్నాడు కమలాకర్.
“అదేంటి నాన్నా నువ్వు కూడా” అంటున్న కూతురు వంక చూస్తూ కమలాకర్ “సరైన చదువులేదు, ఒక జాబ్ లో స్థిరంగా పని చేయడు. నచ్చలేదంటూ ఎన్నో చోట్ల జాబ్ చేస్తున్నాడు. కాసేపు బిజినెస్ చేస్తానంటాడు. ఇలా చేసేదేంటో అతనికే క్లారిటీ లేకపోతే ఎలా? అలాంటి వాడితో పెళ్ళంటే ఎలా ఒప్పుకోగలం – ఇంకెలా మాట్లాడగలం” అన్నాడు.
“అతను చేసేదేదైనా నన్నూ, రేపు నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాడని పూర్తి నమ్మకముంది నాన్నా” చెప్పింది.
“నువ్వు కన్వీన్స్ అయ్యావని మమ్మల్ని కూడా కన్వీన్స్ చేయడానికి ప్రయత్నించకు తల్లీ, అది వృధా ప్రయాసే అవుతుంది” నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.
“కన్వీన్స్ చేయడం కాదు నాన్న కాన్ఫిడెంట్ గా ఉన్నాను, చెప్తున్నాను కూడా” నమ్మకాన్ని ప్రదర్శించింది.
“చాలా మంది అలా అనుకునే లోతులో మునిగిపోతున్నారమ్మా. నీకా పరిస్థితి వద్దు” చెప్పాడు.
“అలా కాదు నాన్న ఒకసారి అతని గురించి ఆలోచించి చూడండి మీకే తెలుస్తుంది” అంది ప్రాంచన.
“చదువుకున్నదానివి, చెప్తే అర్ధం కాదా? నాన్నగారినే ఎదురిస్తావేంటి? వెళ్ళు మాట్లాడకుండా” అంది కావేరి.
“నువ్వాగు కావేరి. ఏమని ఆలోచించమంటావ్? అసలు నువ్వేమి ఆలోచించావు? ఒకరోజులో అతనితో నువ్వు గడిపేది కొన్ని గంటలు మాత్రమే. మిగతా సమయంలో అతనెలా ఉంటాడో నీకు తెలుసా? నీతో ఉన్నత సేపూ నిన్ను మెప్పించాలనే నమ్మకంగా ఉండొచ్చు కదా! తర్వతెలా మారగలడో ఊహించావా? నీతో ఉండే తక్కువ సమయంలో ఒక మనిషితో కలిసి జీవించెంత విషయాలు తెలుసుకోవడం సాధ్యం కాని పని. ఒకవేళ తెలుసుకోకుండా చేసుకున్నాక, అది తప్పైందని తెలిస్తే తర్వాత తలెత్తుకుని తిరగ్గలవా? అందుకే పెద్దలు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి మరీ పెళ్లి చేస్తారు. ఇదంతా మీకు అర్ధం కాదు. ప్రేమ మైకం కమ్మేస్తుంది. చెప్తే వినరు. 20 సంవత్సరాల నుండి ఉన్న మాతో, ఒక సంవత్సరం పరిచయమున్న వ్యక్తీ గురించి పోడ్లాడుతున్నావ్. నీ వివేకం అంతా ఏమైపోయిందో అర్ధం కావడం లేదు. వెళ్ళు. నీ గదిలోకేళ్ళు. ఈ పెళ్లి మాత్రం జరగదు” కోపగించుకుంటూ వివరంగా చెప్పాడు కమలాకర్.
“నాకిప్పుడు అర్ధమైంది. మీ చివరి మాటను మీరు చెప్పారు. నా చివరి మాటను నేను చెప్తాను వినండి. రాహుల్ ను చేసుకోవాలనే నా నిర్ణయం ధ్రుడమైనది. దాన్నేవరూ మార్చలేరు. మీ చేతుల మీద జరగనప్పుడు నేనిక్కడ ఉండలేను. నేనేళ్తున్నాను, రాహుల్ ను పెళ్లి చేసుకునే తీరుతాను” బెదిరించింది ప్రాంచన.
“ఇది విని ఇంకా మేం బ్రతికే ఉన్నామంటే గట్టి పిండాలమే! ఏనాడు కోప్పడకుండా, దెబ్బ వేయకుండా గారాభంగా పెంచినందుకు మాకు మంచి శిక్షే వేశావమ్మా” అంటూ బాధపడింది కావేరి.
“ఏ పేరెంట్స్ కూ రాకూడని పెద్ద శిక్షే నమ్మా ఇది. ఇన్నాళ్ళూ నిన్నే విషయంలోనూ బంధించి పెంచలేదు, నీ స్వేచ్ఛకే వదిలేశాం – అది మా పెంపకం మీద నమ్మకంతో. కాని అది కాదని నువ్విలా అపరిపక్వమైన మనస్సుతో చెడు బుద్ధి చూపిస్తావనుకోలేదు. ఈ విషయంలో ఏదన్నా జరిగితే పరిణామాలు ఊహించినట్లు ఉండకపోవచ్చనేది గుర్తుంచుకోమ్మా!” చెప్పాడు కమలాకర్.
“కూతురి మీద ఇంత పగబడతారని నేనస్సలనుకోలేదు. తల్లీదండ్రులు అనాల్సిన మాటలు కాదు. నా రాహుల్ తోడున్నంత కాలం ‘దేహీ’ అని చేయి చాచను” కఠినంగా చెప్పింది ప్రాంచన.
“అవునమ్మా! పేరెంట్స్ అనాల్సిన మాటలేవో పిల్లలు చెప్పొచ్చు కాని పిల్లలు చేయాల్సినవి, చేయకూడనివి పేరెంట్స్ చెప్పకూడదు. అలా చెప్తే మాదే తప్పు కదా!” అన్నాడు. మరేం మాట్లాడలేదు ప్రాంచన. “తల్లీదండ్రుల మనస్సు అర్ధం చేసుకున్న దానివైతే నువ్విలా ప్రవర్తించవు. నీ ప్రవర్తనలో పరివర్తన వచ్చినప్పుడు నువ్వే గ్రహిస్తావు” అన్నాడు.
“అదేంటండి! పిల్లేదో తెలియక మాట్లాడుతుందే సర్ది చెప్పాల్సింది పోయి మీరే వదిలేస్తున్నారెంటండి? దాన్ని వెళ్ళకుండా ఆపండీ ప్లీజ్” అంటూ రోదిస్తుంది కావేరి.
తన తల్లీదండ్రులు, అత్తమామలు దగ్గరుండి జరిపించలేదన్న కారణం తప్ప మిగిలినవన్నీ ఆనందం కలిగించేవే. కొత్త జంట. కొత్త ఆశలు. కొత్త ఆశయాలు. కొత్త జీవితంలోకి కూతురు రంజని ప్రవేశించడంతో గతం గతమైపోతున్న వేళలు. రాహుల్ చూపించే ప్రేమకు ముగ్డురాలైపోతుంది. చేసే ప్రతి పనిలో రంజని పట్ల ప్రేమనే తెలియజేస్తున్నాయి. పేరెంట్స్ మాటవిని రాహుల్ ను వదులుకుంటే తన పరిస్థితి ఎలా ఉండేదో, ఇప్పుడున్న సంతోషం ఉండేదో లేదోనని ఆలోచించినప్పుడల్లా తన నిర్ణయానికి తిరుగులేదని ధ్రువీకరించుకునేది ప్రాంచన.
మార్పు అనివార్యమే అంటారు. అది నిజమే. కాని మనుషులంతా మారిపోతే పరిస్థితులన్నీ తలకిందులౌతాయి. రోజులు గడుస్తున్న కొద్దీ చిన్న చిన్న విషయాలకే కలహాలు చెలరేగుతున్నాయి. వడివడిగా సంసార జీవితంలో కలతలు మొదలైనాయి. రాహుల్ చేసే వ్యాపారాలు దెబ్బతినడం ఒక కారణమైతే, అతని ప్రవర్తన మరో కారణం. చీటికి మాటికి గొడవలు. సర్దుకుపోవడం. ప్రేమికులప్పుడు ఎప్పుడెప్పుడు కలిసి ఉందామా అని ఆరాట పడిన మనస్సు ఇప్పుడు అంత సమయం అవసరమా అని ఆలోచించుకునే స్థితికి చేరుకుంది. దగ్గరవ్వాలనుకున్న తపనలే చిరాకును కల్గిస్తున్నాయి.
ఒకప్పుడు పేరెంట్స్ మాట జవదాటేది కాదు. కానీ తన కూతురు రంజని మాత్రం తన ఆజ్ఞకు ఎప్పుడూ ఎదురుచేప్పడమే! మొదట్లో తండ్రి గారాభం అనుకుంది. కాని తర్వాత తెలిసింది – అది తన బుద్ధే ఇంకొన్ని రూపాంతరాలు చెందిందని. ఏదైతే జరగకూడదని ప్రార్ధించుకుంటుందో అదే జరుగుతుందేమోనన్న భయం వెంటాడుతుంది. ఆలోచనల్లోనే తెల్లారిపోయింది. పడుకుంది అన్న మాటే గాని, పట్టని నిద్ర రాత్రంతా మేల్కొనేలా చేసింది.
******
యధావిధిగా తన పనుల్లో మునిగిపోయింది ప్రాంచన. ఎంత పిలిచినా రాహుల్ పలకపోయేసరికి ఇల్లంతా వెతికింది. కనిపించలేదు. బయటకెళ్ళు౦టాడులే అని సర్దుకుంది. చీకటి పడింది. రాలేదతను. సమాచారం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్. గొడవ గురించి మందు త్రాగి పడిపోయుంటాడేమోనని తెలిసిన దుకాణాల దరిదాపుల్లోకి వెళ్లి ఆరా తీసింది. జాడ తెలీలేదు. తెల్లారిపోయింది. ఇంకా రాలేదు. ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు.. రోజులు గడుస్తున్నాయి. ఎవరో పక్కింటి వాళ్ళన్నారు ‘పారిపోయుంటాడని’. పట్టించుకోలేదు. కానీ నిజమేనేమోనని అనుమానమోస్తుంది. ఈ హడావుడిలో పాపను కూడా పట్టించుకోలేదు.
నిర్దారించుకుంది. అన్నంత పని చేశాడు. ఏడ్చింది. ఆవేశం కరిగేదాకా, బాధ తీరేదాకా ఏడ్చింది. భర్త దూరమయ్యాడు. సమాజం నిందించింది. భర్త లేని ఒంటరి జీవితంపై ఆశలు మొదలైనాయి కొందరికి. ఈసడింపులు మొదలైనాయి. తప్పుగా చూడడం మొదలైంది. పరిస్థితులు అనుకూలంగా లేవు. తప్పు జరిగాక తలెత్తుకొని తిరగలేమని తండ్రి చెప్పింది గుర్తేరిగింది. కూతురి భవిష్యత్ పై ఆందోళనలు మొదలైనాయి. పరిష్కార మార్గం ఒక్కటే – తిరిగి తల్లీదండ్రుల దగ్గరికే వెళ్ళడం. ఈ పరిస్థితుల్లో వాళ్ళు తప్ప ఎవ్వరూ ఆదుకోరని అర్ధమైంది. తిరిగి రానిస్తారో లేదో నన్న బెంగ లేదు ఎందుకంటే, తనూ ఇప్పుడు తల్లే. తల్లీదండ్రుల మనస్సును అర్ధం చేసుకోవాలంటే తల్లీదండ్రులైతే కాని అర్ధం చేసుకోలేరని గ్రహించింది. లగేజి సర్దుకుంది. కన్నవాళ్ళ ముందు రంజనితో సహా నిల్చుంది.
******
భయం, బాధ, అపరాధ భావం ప్రాంచన కళ్ళల్లో. కోపం, ప్రేమ, మొండితనం దంపతుల కళ్ళల్లో. కోపం, ప్రేమ, బాధ, ఆనందం, మొండితనం, అపరాధ భావం, నిరీక్షణ, నిర్ల్యక్షణ – వీటన్నింటికీ పోటీ పెడితే ప్రేమే గెలుస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రాంచనను చూస్తె భరించలేనంత కోపం, చెంప చెళ్ళుమనిపించాలన్న ద్వేషం. రంజనిని చూస్తె ఎత్తుకోవాలనే ఆరాటం, ‘తాత – మామ్మా’ అని పిలిపించుకోవాలనే తపన వెరసి ఇద్దరి దీనావస్థను కన్నపేగు, మమకారం ప్రాంచనను పుట్టింట్లోకి అడుగుపెట్టనిచ్చాయి.
కూతురు బాధను చూడలేక కమలాకర్ ఒక ప్రతిపాదనను తనముందు ఉంచాడు.
“ఇల్లాలు ఇంటికి వెలుగంటారు. తన కాళ్ళమీద తానూ నిలబడి ఇంటికో గౌరవం తెచ్చినప్పుడు దానికో సార్ధకత వస్తుంది. జరిగిందేదో జరిగింది. నీ చదువే నీకు శ్రీరామరక్ష. అదే మిమ్మల్ని కాపాడబోతుంది. తెలిసిన ఆఫీస్ లో అకౌంటెంట్ ఉద్యోగం చూశాను. రెండు నెలల టైం ఇచ్చారు. లేచి దానికి ప్రిపేర్ అవ్వు” చెప్పాడు కమలాకర్.
“నేనిప్పుడు సిద్ధంగా లేను నాన్నా” అంది ప్రాంచన.
“అందుకే రెండు నెలల టైం అడిగి తీసుకుంది. ఈ లోపు ‘టాలీ’ సాఫ్ట్ వేర్ నేర్చుకోవాలి. అప్పుడే అది నీకు కన్ఫిర్మ్ అవుతుంది” వివరించాడు.
“ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని బయట తిరగమంటారు నాన్నా? కొత్తగా నేర్చుకోవడమంటే సాధ్యమయ్యే పని కాదు. వదిలెయ్యండి” చెప్పింది.
“నేను చెప్పేది నీ గురించి కాదు. నీ కూతురు గురించి. మాకెలాగూ వయస్సు అయిపొయింది. రిటైర్ అయిపోయాను. లేక లేక పుట్టిన నువ్వు బాధపడుతూ కూర్చుంటే చూడదానికేనా మేమింకా బ్రతికుంది? నీ కూతురు భవిష్యత్ ఏమవుతుందో ఒకసారి ఆలోచించమ్మా!” అన్నాడు. ప్రాంచన మౌన౦ వహించింది. తనేం మాట్లాడకపోయేసరికి “మాతో బంధాన్ని తెంచుకుని రాహుల్ తో హాయిగా గడిపినప్పుడు లేదు కాని అతన్ని మర్చిపోయి ఇప్పుడు నీ కూతురు గురించి కొత్త జీవితాన్ని ప్రారంభించాలేవా తల్లీ?” ప్రశ్నించాడు.
రాహుల్... రాహుల్... రాహుల్.. ఒకప్పుడు ఎంత మధురంగా ఉండేదీ పేరు. మరిప్పుడు ఎంత ఆవేశాన్ని రగిలిస్తుంది. ఎంత ద్వేషాన్ని పెంచుతుంది. ఎంత కసిని పెంపొందిస్తుంది. తండ్రి నోట వెంట ఆ పేరు వినగానే కోపం నషాళానికి ఎక్కి “నాన్నగారు! నేనా జాబ్ చేయడానికి సిద్ధమే! రెండు నెలల్లో వాళ్ళు చెప్పినట్లు ‘టాలి’ నేర్చుకుని జాయిన్ అవుతానని వాళ్ళు చెప్పండి. నా పాపే నాకు ముఖ్యం. ఇంకెవ్వరూ కాదు” అంటూ చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయింది.
కావేరి, కమలాకర్ మనస్సు కుదుట పడింది. రంజనిని మళ్ళీ స్కూల్లో చేర్పించారు. ఆంగ్ల మాధ్యమానికి మార్పించారు. అడిగినవన్నీ సమకూర్చుతున్నారు. భర్త లేకుండా ఒక్కటే జాబ్ చేస్తూ నలుగురిలో ఎంత నలిగిపోతుందో అని ముసలి దంపతుల్లో ఆందోళన ప్రస్పటిస్తుంది.
******
రోజులు పరిగెడుతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నాయి. రంజని పెద్దదవుతుంది. ముసలి దంపతులు ఒకరి తర్వాత ఒకరు కాలం చేశారు. ప్రాంచన నడివయస్సులోకి ప్రవేశించింది. అయినా అందమేమీ తగ్గలేదు. అద్దంలో చూసుకున్న ప్రతిసారీ గతమే గుర్తుకొస్తూ బాధిస్తోంది. కాని కూతుర్ని చూస్తున్న ప్రతిసారీ తనకో బంగారు భవిష్యత్ ఇవ్వాలనే తపనే నడిపిస్తుంది.
‘నా పేరెంట్స్ కూడా ఇలాగే ఆలోచించి ఉంటారు కదా! వాళ్ళను కాదని తప్పు చేశాను. అప్పుడు ఎంత కుమిలి పోయుంటారో. బిడ్డలంటే పేరెంట్స్ కు ఎందుకంత ప్రేమో తెలియదు కాని రంజని అంటే చెప్పలేని ప్రేమ. బహుశా ప్రేమకు ఆది అంతం లేక పోవడమేనేమో! ఈ వివేకాన్ని అప్పుడే కల్గి ఉన్నట్లయితే నా జీవితం ఇంకోలా ఉండేది. కొద్దో గొప్పో చదువుకోబట్టి సరిపోయింది కాని లేకపోతే ఏ జాబ్ లేక క్షోభ పడే వాళ్ళు ఎంత మంది కనపడడం లేదు. వాళ్ళ స్థానంలో నేనూ ఉంటె వాళ్ళలాగే నుయ్యో గొయ్యో చూసుకోవాల్సి వచ్చేది. మార్పు అనివార్యమవుతున్న రోజుల్లో నేనిలా తొందరపడి, జీవితమంటే భయపడే ఓ పిరికి వాడిని, నిలకడలేని వాడిని, బంధాలకు తలోగ్గని వాడిని ప్రేమించి పెళ్లి చేసుకొని – తీరా తప్పు జరిగాక బాధపడుతూ జీవితాన్నిలా లాగుతున్న నేనే ఇలా ఉంటే రాబోవు కాలంలో మనుషులెంతగా మారతారో, సమాజమెలా రూపు సంతరించుకుంటుందో ఆలోచిస్తే అంతు చిక్కడం లేదు’ అనుకుంది మనస్సులోనే.
కూతురిలో ఎప్పుడూ చూడనంత ఆనదాన్ని చూస్తోంది ప్రాంచన.
‘తను సంతోషంగా ఉండాలనే కదా ఇంత సంపాదించింది. తన సంతోషమే నాకు కావాలి. తన స్వేచ్ఛను నేనెందుకు అడ్డగించాలి. నా పేరెంట్స్ నన్ను గిరిగీసి పెంచనప్పుడు నేనెందుకు అలా పెంచాలి’ అనుకుంటూ వదిలేసింది ప్రాంచన.
అనుకోని సంఘటనలే అతిధిలా వస్తే గందరగోళం మొదలౌతుంది. అనుమానాలు పెరుగుతాయి. అదే కొంప ముంచుతుంది. తల్లీబిడ్డల సంబంధమనేది స్నేహితుల్లా కలిసి ఉండాలని చెప్పేది నేటి సమాజం. అది లేని చోట వారిద్దరి మధ్యా అగాధాలు ఏర్పడతాయి. పిల్లల్లో వచ్చే మార్పులకు సగం తల్లీదండ్రులే కారణం. వీరేక్కడ కోప్పడతారోనని వాళ్ళు చెప్పకపోవడం, వాళ్ళెక్కడ దారి తప్పుతారేమోనని వీరు సవివరంగా మాట్లాడకపోవడం ప్రధాన కారణాలు.
ఎప్పుడూ ఒక జీవితానికి అలవాటు పడిపోయిన ప్రాంచన కూతుర్ని ప్రశ్నిచే ధైర్యం చేయడం లేదు. పేరెంట్స్, భర్త దూరమైపోయారు. ప్రశ్నిస్తే కూతురు కూడా దూరమైపోతుందని భయంతో ఏమీ అడగడం లేదు. స్మార్ట్ ఫోన్ వచ్చాక తన ప్రపంచమే మార్చేసుకుంది రంజని. నెల నెలకూ రంజని ఫోన్ బిల్లు పెరుగుతుంది. రాత్రి గదిలో లైట్ ఎక్కువసేపు వెలుగుతుంది. పుస్తకాలతో కుస్తీ పడుతుంది. సెలవుల్లో పార్టీలు పెరిగిపోయాయి. ఇవన్నీ ప్రాంచనను కుదురుగా ఉండనివ్వడం లేదు. తనకు సలహాలిచ్చి మునిపటిలా ఆడుకునే పేరెంట్స్ ఇప్పుడు లేరు. తనకి కావాల్సిన అసలైన సాయం, అండ ఇప్పుడేనని గుర్తేరిగింది. కాని ఏం లాభం. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తల్లి ప్రశ్నించలేని నిస్సహాయతను కూతురు బాగానే ఉపయోగించుకుంటుంది. చిన్నప్పుడు తల్లంటే ఒక భావన. కాని ఇప్పుడొక భావననేది తన ప్రవర్తనలో తెలుస్తుంది. తల్లికన్నా మరేదో ప్రపంచం పిలుస్తోందని పరుగులెడుతుంది రంజని.
* * * * * *
అంతా ఊహించినట్లే జరిగింది. ముప్పయ్యేళ్ళ క్రితం తన పేరెంట్స్ కు పెట్టిన మానసిక క్షోభే ఇప్పుడు తన కూతురు పెట్టింది. టేబుల్ పైనున్న లెటర్ ను తీసి చదివింది -
“అమ్మా! నువ్వంటే నాకెంతో ఇష్టం. నాన్న లేకపోయినా నన్నెంతో ప్రేమగా పెంచావ్. తండ్రి లేని లోటు తెలియకుండా చేశావ్. కాని కాలేజీలో చాలామంది నాకు తెలియకుండా నాన్న గురించి, నీ గురించి చెడుగా మాట్లాడుకోవడం తెలిసింది. నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక అవెప్పుడూ నీకు చెప్పలేదు. నేను ఎదురుపడినప్పుడు పలకరించి ఎదురుగా లేనప్పుడు తిట్టుకుంటున్న వాళ్ళందరి గురించి ఆలోచినప్పుడు నాలో నేనే బాధ పడేదాన్ని. ఆ బాధ తగ్గేది కాదు. చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోయేదాన్ని. సరిగ్గా అటువంటి సమయంలోనే యశ్వంత్ పరిచయమయ్యాడు. బాధ పడుతున్న నా జీవితానికి ప్రేమను రుచి చూపించాడు. నేనంటే బోల్డంత ప్రేమ కురిపిస్తాడు. మిగిలిన వాళ్ళలాగా అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడే వ్యక్తీ కాడు. అతనంటే నాకూ ఇష్టం పెరిగింది. ఎలాగైనా మా ప్రేమను గెలిపించుకోవాలనిపించింది. నీకు చెప్తే ఎక్కడ ఒప్పుకోవేమోనని ఈ పని చేస్తున్నాను. నేనెక్కడున్నా క్షేమంగానే ఉంటాను. నా గురించి వెతికించవద్దు. ఇలా చేస్తున్నందుకు నన్ను క్షమించమ్మా! కాని నన్ను ఆశీర్వదించు. ఇట్లు – రంజని”.
ఉత్తరం సారాంశమిది. చదవడం పూర్తవగానే కూలబడిపోయింది ప్రాంచన. రాహుల్ చెప్పాబెట్టకుండా జీవితంలోంచి వెళ్ళిపోయాడు, రంజని చెప్పి జీవితంలోంచి వెళ్ళిపోయింది. ప్రాంచన ఒక్కతే మిగిలింది. తప్పెవరిది.? ప్రతిసారీ కాలంతో పోరాడడమే! చేసిన ఒక్క తప్పును సరిదిద్దుకున్నా అనుకుంది కాని ఇంకా తప్పుకు శాంతి జరగలేదు. ఏం చేయాలో, ఏం చేయకూడదో తనకేం తెలియడం లేదు. ఏది తప్పవుతుందో, ఏది ఒప్పవుతుందో గ్రహించలేక పోతుంది. ప్రశ్నల ఆలోచనల పరంపరలో మునిగిపోయింది.
ఏదైనా తప్పును ఒకరిమీదే నేట్టివెయ్యడం సమంజసం కాదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ప్రమేయమున్నా లేకున్నా తప్పనేది రెండో వ్యక్తీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మనుషుల కన్నా వయసులదే తప్పనిపిస్తూ ఉంటుంది ప్రాంచనకు. అన్ని విషయాల్లో పేరెంట్స్ చెప్పినట్లే వినయంగా నడుచుకునే యువతీ యువకులు ప్రేమ విషయంలో మాత్రం ఎందుకు ఎదురిస్తారో తనకి అర్ధమవ్వని ప్రశ్న. ఇప్పటికీ సమాధానం దొరకలేదు.
ఏ బంధం ఎంతకాలం ఉంటుందో, ఎప్పుడు విడిపోతుందో ఎవ్వరికీ తెలీదు. బంధమెప్పుడు సంబంధాలు కలుపుకుంటుందో కూడా అంతుచిక్కని విషయమే. జీవితమొక కల. అది మనముందే కదులుతున్నట్లు అన్పిస్తుంది కాని మన చేతుల్లో ఉండదు. తూర్పెప్పుడూ అరుణోదయానికి, పడమరెప్పుడూ అరుణాస్తమయానికి మనం నిర్దేశించుకున్న సూచికలు. మనుషులు పుట్టాకే సంస్కృతి, సంప్రదాయాలు సృష్టించబడ్డాయి. నిర్దేశించుకున్న సూచికలు అప్పుడప్పుడు దారి తప్పినప్పుడు సంక్రమణం మొదలవుతుంది. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి సంప్రదాయాలు సంక్రమణం చెందినప్పుడు సంస్కృతి దారి తప్పుతుంది.
ఆచార వ్యవహారాలను, సంప్రదయాలను కలిపి సంస్కృతిని పెంపొందించిన మనుషుల పోలికలు తరువాత తరానికి సంక్రమించడం సహజం. తనలాంటి పోలికలు, బుద్దులు రంజనీకొస్తే అన్న మాట తలుచుకున్నప్పుడు గుండె గతుక్కుమనేది. కూతురిని తప్పటడుగు వేయనీయకూడదు అనుకునేది. కాని అనుకున్నదే జరిగింది. బంగారు జీవితమని వెళ్ళిన ప్రాంచన జీవితం, బంగారం మూలధాతువైన మట్టిలోకే వెళ్ళిపోయింది. అదే బంగారమని వెళ్ళిన రంజని జీవితం ఏ తీరాలకు చేరుకుంటుందోనని తెగ మధన పడిపోతుంది.
‘నా గతం గురించి కూతురు దగ్గర ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఒకవేళ చెప్పినట్లయితే తనలా తొందరపడి నిర్ణయం తీసుకునేది కాదేమో. రోజుకో కాసేపైనా ఏకాంతంగా తనతో గడిపితే ఇంకెంత బాగుండేదో. బంగారు భవిష్యత్ నివ్వాలన్న తాపత్రయంతో రాత్రింభవళ్ళు కష్టపడి సంపాదించినదంతా నిరుపయోగంగా వదిలేసి వెళ్ళిపోయింది. పేరెంట్స్ కు చెప్పి, వాళ్ళు ఒప్పుకోకపోతే ఎదురించి పెళ్లి చేసుకున్న తననే అపరాధిలా చూసిన సమాజం, ఇప్పుడు తన విషయంలో ఎలాంటి తీర్మానాలు చేస్తుందో, ఎటువంటి అభండాల్ని మోపుతుందో’ అంటూ బయటకు వినపడని రోదనతో యుద్ధం చేస్తుంది ప్రాంచన.
***
Nice Story...
ReplyDeleteKeep it up ...!!!