ముల్లు - అచ్చంగా తెలుగు
 ముల్లు 
ఎం .వి.ఎస్.ఎస్.ప్రసాద్


“ఏమిటిరా  అంత ఆదుర్దాగా ఉన్నావు!!??. అమ్మకి బాగా లేదా ఏమిటి!!??” అని అడిగాను నా స్నేహితుడు రవిని.
“లేదురా. ప్రస్తుతానికి ఏ సమస్యాలేదు.కానీ వస్తుంది ఏమోనని భయంగా ఉంది” అన్నాడు రవి ఆదుర్దాగానే.
నాకేమి అర్థం కాలేదు.భ్రుకుటి ముడి వేసాను. నా కళ్ళు చిన్నవి అయ్యాయి.
“అంటే డాక్టర్ ఏమైనా అన్నాడా!!??. అదే కండిషన్ బాగా లేదని లేదా సమస్యలు ఏమైనా రావచ్చని ....” అర్తోక్తిలో ఆగిపోయాను.
“అసలు సమస్య డాక్టర్లు!! “ అన్నాడు రవి సాలోచనగా.
“కాస్త అర్థం అయ్యేటట్టు చెప్పు .పెద్ద యుగంధర్ నవలలోలా సస్పెన్సు తో చంపకు.” నా కంఠంలో నాకు 
తెలయకుండానే విసుగు ధ్వనించింది.
“కోపం తెచ్చుకోకురా ప్రసాద్ ... ఆవిడ పది రోజుల నుంచి ఐ సి యు లో ఉంది నీకూ తెలుసుకదా . ఆవిడ కండిషన్ చెప్పరు.ట్రీట్మెంట్ గురించి మాట్లాడరు.అసలు డాక్టర్ దొరకడమే గగనం.రోజుకు ఇంత అని డబ్బు మాత్రం గుంజేస్తున్నారు.” తన బాధ వెళ్ళగ్రక్కుకున్నాడు రవి.
“అంటే ఏమిటి వాళ్ళ ఉద్దేశ్యం!!??” నా సందేహం వెలిబుచ్చాను.
“ఏముంది. బాగా ముదర బెట్టి ఇంకా ఖరీదు  అయిన మందులు , వీలైతే వెంటిలేటర్ దాక లాగిద్దామని వాళ్ళ ఉద్దేశ్యం అని నాకు అనిపిస్తోంది” అన్నాడు రవి.
“ఏరా అంత దుర్మార్గమంటావా  ఆ ఆసుపత్రి!!??”
“అందుకు సందేహం లేదురా .ఏదో పేరు ఉన్న ఆసుపత్రి కదా మంచి ట్రీట్మెంట్ జరుగుందని అక్కడ పెట్టాము.” అన్నాడు రవి.
“పోనీ ఆసుపత్రి మారిస్తే !?” అన్నాను నేను.
“అదే నేను అనుకుంటున్నాను.మా నాన్నగారు అంటుండేవారు మనిషిని బ్రతికించరు, చావనివ్వరు అని.
అది కూడా అయన స్వయంగా డాక్టర్ అయి ఉండి “ అంటూ అదోలా నవ్వాడు రవి.
“అయన మనీషి .”అంటూ  మనస్సు లోనే ఆయనకు నమస్కరించాను.
ఎందుకంటే రవి నాన్నగారు చిన్నప్పటినుంచి నాకు బాగా తెలుసు. అయన డాక్టర్ రూపంలో మసిలిన నారాయణుడు. ఏదో సినిమాలలో అరుదుగా చూసే డాక్టర్ లాంటి వ్యక్తిత్వం కలిగిన మహానుభావుడు  అయన. 
అటువంటి డాక్టర్, గొప్ప వ్యక్తి అయిన అయన భార్య, నా స్నేహితుడు రవి తల్లి ఏదో చిన్న సమస్యతో వెళితే సరాసరి ఐ సి యు లో పెట్టేసారు. అన్ని రకాల టెస్టులు చేసారు.సమస్య ఏమిటో  చెప్పరు.ఏం చేస్తున్నారో చెప్పరు.ఎప్పుడు ఇంటికి పంపిస్తారో చెప్పరు. డబ్బుకు డబ్బు బోల్డు పోతోంది .పాపం రవి బాధ పడుతున్నాడు.
“రవి ఒక పని చేద్దాంరా. నాకు తెలిసిన  పెద్ద డాక్టర్ ఒకాయిన ఉన్నాడు.అయన కొన్ని ఆసుపత్రులకి  వేళతాడు.అయన సలహా తీసుకుని ఎదో  ఒక ఆసుపత్రిలో చేర్పిద్దాం .ఏమంటావు!!??” అన్నాను నేను.
“ అదే మంచిదిలా  అనిపిస్తోంది రా. పద మాటలాడుదాం.”అన్నాడు రవి . 
నేను కారు తీసాను.
***
మేము ఆసుపత్రికి వెళ్లేసరికి  సరి అయిన  సమాధానం చెప్పే వాళ్ళు ఎవ్వరూ లేరు.
దాదాపు రెండు గంటలు కూచున్న తరువాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అట వచ్చాడు.
నేను, రవి విషయం వివరించాము.
అయన ఎవరో డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళాడు.
మేము చెప్పినది విన్న డాక్టర్ ముఖం కంద గడ్డలా మారిపోయింది.
“ఏమండి అసలు డాక్టర్స్ అంటే ఏమిటి అనుకుంటున్నారు. కేసు స్టడీ చెయ్యాలి, టెస్ట్స్  చెయ్యాలి . చాలా పని ఉంటుంది ఒక పేషెంట్ ని ట్రీట్ చెయ్యాలంటే “
“అంటే డాక్టర్ గారూ పది రోజులు అయ్యింది....” ఏదో చెప్పబోయాడు రవి.
“ ఆఫ్టర్ ఆల్ పది రోజులకి కంగారు పడుతున్నారు.కొన్ని కేసులు నెలలు పడతాయి.” విసుక్కున్నాడు డాక్టర్.
‘అందుకే కదా మీరు కార్ల మీద కార్లు కొంటున్నారు, బిల్డింగుల మీద బిల్డింగులు కడుతున్నారు’ మనస్సులోనే  గొణుక్కున్నాను నేను.
“పోనీ డాక్టర్ మా అమ్మగారిని ఇంటికి తీసుకు పోతాం.” అన్నాడు రవి
“ ఏమిటి!!?? ఇంటికి తీసుకుపోతారా!!!? .అసలు మతి ఉండే మాట్లాడుతున్నారా !!?? ఆవిడని ఇంటికి కాదు కదా బెడ్ మీద నుంచి కదిపేందుకు కూడా  ఒప్పుకోను.” తీవ్రమైన స్వరంతో అన్నాడు డాక్టర్.
మరలా “ఏమిటి మాకు ట్రీట్మెంట్ చేత కాదు అనుకుంటున్నారా!!?? మాది టౌన్ లోనే బెస్ట్ ఆసుపత్రి. ఎవరిని అడిగినా చెపుతారు”
“కాదు అనటల్లేదు.కానీ ఆవిడని పంపించ్చెయ్యండి డాక్టర్ “ రవి అభ్యర్ధించాడు.
“అరె!! .అలా ఒక పేషెంట్ ని పంపించేస్తే రేపు ఏదయినా జరిగితే ఎంత కష్టం.”
“అదే డాక్టర్ .మీ సలహాకి వ్యతిరేకంగా మేము తీసుకు వెళుతున్నట్టుగా రాసిస్తాం.”
“ అదెలా కుదురుతుంది!!?? మా పరువు పోదు .ట్రీట్ చేయలేక పంపించేసామని అనరూ!!??”. అన్నాడు డాక్టర్.
“మేము రాసి ఇస్తాం కదా!?? “అన్నాను విసుగ్గా .
“ఏదైనా  కుదరదు . ఇంకా కొన్ని టెస్ట్ లు  చెయ్యాలి” అంటూ ఏమిటేమిటో మాట్లాడసాగాడు డాక్టర్.
“ ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు !?  అయినా మీ బిల్ చెల్లిస్తాం .ఇంక అభ్యంతరం ఏముంది.” నాకు తెలయకుండానే నా కంఠంలో కోపం ధ్వనించింది .
“ మా రూల్స్ ఒప్పుకోవు.అంత క్రిటికల్ కండిషన్ లో ఉన్న పేషెంట్ ని బయటకు పంపే ప్రసక్తి లేదు “ మూర్ఖంగా వాదించసాగాడు డాక్టర్. 
నేను  గొడవ పడ దలుచుకున్నాను.గట్టిగా  అరవసాగాను.
అంతలో ఎవరో చీఫ్ అట వచ్చాడు.
“మీరు అంతగా కావాలనుకుంటే తీసుకు పొండి. కానీ ఇంతవరకు మీరు కట్టింది కాక , ఐ సి యు చార్జెస్ కింద అయిదు లక్షలు కట్టి, లెటర్ ఇచ్చి  పేషెంట్ ని తీసుకు పొండి.”
“అయిదు లక్షలా !!??” నోరు వెళ్ళ బెట్టాడు రవి.
“అదేమిటి !!?? రోజూ చార్జెస్ అంటూ కట్టించుకుంటున్నారు కదా!!??” అని అడిగాను కోపంగా.
“అవి డైలీ చార్జెస్. మీరు డబ్బు కడితేనే పేషెంట్ బయటకు కదిలేది” అంటూ నిష్కర్షగా  వెళిపోయాడు అతను.
రవి గుడ్ల నీరు గ్రక్కుకొంటూ కూచున్నాడు. నాకేమి పాలు పోలేదు.ఎందుకంటే ఆ ఆసుపత్రి వాళ్ళకి ట్రీట్మెంట్ తో పాటు అవసరమొస్తే పేషెంట్ ల  మీద , బంధువుల మీద  చెయ్యి చేసుకునే అలవాటు కూడా ఉందని వినికిడి. అయితే ధన బలం వల్ల , పలుకుబడితో  ఏమి బయటకు రాకుండా చూసుకుంటారుట.
“ఏం చేద్దాంరా? ఏమి లేనిదానికి అయిదు లక్షలు ... “ అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు రవి. నాకు ఏం చెయ్యాలో తోచక అతని భుజం మీద , అనునయంగా , సాలోచనగా చెయ్యి వేసాను.
***
మరునాడు రవి అమ్మగారిని  మేము అనుకున్న విధంగా వేరే ఆసుపత్రిలో చేర్పించాము.డాక్టర్ గారు వచ్చి చూసి పెద్ద జబ్బేమి లేదని , నాలుగు రోజులు కొద్దిపాటి ట్రీట్మెంట్ తో ఆవిడ పూర్తిగా మామూలు మనిషి అయిపోతారని, కానీ ఐ సి యు లో  చాల కాలం ఉన్నారు కదా ఆ నాలుగు రోజులు ఆసుపత్రిలోనే ఉండడం మంచిది అని   చెప్పడం తో రవి, నేను ఎంతో సంతోషించాము.
ఇద్దరం కాంటీన్ లో టీ తాగుతుంటే “చాల థాంక్స్ రా “అంటూ నా చేతులు పట్టుకున్నాడు రవి.
“నోరు ముయ్యరా థాంక్స్ అట థాంక్స్. అమ్మ కోసం ఆ మాత్రం చేయలేనా??” అన్నాను నేను నవ్వుతూ.
“ఇంతకీ ఏం మంత్రం వేసావేమిటి !!??” కుతూహలంగా అడిగాడు రవి.
“ నేను సి. ఏ. కదా. వృత్తిపరంగా నా క్లయింట్ అయిన ఒక  పెద్ద  పొలిటిషియన్ కి అంతా  వివరించి చెప్పాను. అయన వెంటనే ఆసుపత్రికి ఫోన్ చేసాడు.ఆ లోపలే అక్కడకు ఒక టీ . వి. చానల్ వాళ్ళు చేరుకున్నారు. ఇక చూస్కో ఆసుపత్రి వాళ్ళు పరుగులు, ఉరకలు  మీద అమ్మని పంపించేసారు.అక్కడ నువ్వు కూడా ఉన్నావు కదా!? తమాషా తెలుసా మనం ఒక రూపాయి కూడా అదనంగా  కట్టలేదు. ఆసుపత్రి వాళ్ళకు బాగా చమురు వదిలింది.
ముళ్ళ కంప లాంటి ఆ ఆసుపత్రిలో పడ్డాం కదా . కనుక ముల్లుని ముల్లుతోనే తీసాను. ” అన్నాను నవ్వుతూ.
రవి నా నవ్వుతో శ్రుతి కలిపాడు...

No comments:

Post a Comment

Pages