అనుబంధం - అచ్చంగా తెలుగు
అనుబంధం
మా బాపట్ల కధలు – 17
భావరాజు పద్మిని

“వాట్ గ్రానీ? ఈ విల్లేజ్ లో నేను పాడడం ఏమిటి? అసలిక్కడ మ్యూజిక్ సెన్స్ ఉన్నవాళ్ళు ఉంటారా?” విసుగ్గా అడిగింది శృతి. అమెరికాలో జరిగిన ఒక ప్రముఖ తెలుగు ఛానల్ షోలో ఆమె పాల్గొని, పాటలు పాడడంతో 16 ఏళ్ళ వయసున్న ఆ పాప ,గాయినిగా మంచి పేరు తెచ్చుకుంది. సెలవలకు బాపట్ల వచ్చిన ఆమె ప్రస్తుతం పటేల్ నగర్లో వాళ్ళ అమ్మమ్మ పద్మావతి గారి ఇంట్లో ఉంది. 
“చూడు శృతి, నువ్వొచ్చావని, నీ పాట వినాలని ఇక్కడి వాళ్ళు ముచ్చట పడుతున్నారు. అందుకే ఇక్కడ నీ కార్యక్రమం ఏర్పాటు చేద్దామని అనుకున్నాను. శ్రీ కోనా ప్రభాకరరావు కళాక్షేత్రం వారితో మాట్లాడి వేదిక కూడా బుక్ చేసాను. నువ్వనుకుంటున్నట్టు ఈ బాపట్ల విల్లెజ్ కాదు, ఇక్కడి వాళ్ళు ‘కళా హృదయం’ అంటే నీ భాషలో, ఆర్టిస్టిక్ సెన్స్ లేని వాళ్ళూ కాదు... ఇక్కడ విలసిల్లిన కళల గొప్పదనం గురించి చెప్పాలంటే చాలా ఉంది. “ సాలోచనగా శృతి వంక చూస్తూ రోట్లో పచ్చడి నూరసాగింది ఆవిడ. 
“ ఇస్ ఇట్... ఐ డోంట్ థింక్ సో... ఇక్కడికి రావాలంటేనే డైరెక్ట్  ట్రాన్స్పోర్ట్ లేదు. బసెస్, ట్రైన్స్ మారి మారి రావాలి. ఇలాంటి విలేజ్ లో పెద్ద విశేషాలు ఏముంటాయ్ గ్రానీ ! ఐ వాంట్ టు నో...” చనువుగా బామ్మ దగ్గరకి వచ్చి కూర్చుంటూ అంది శృతి. 
“ఉదాహరణకు నీ షో కోసం మనం మాట్లాడిన కోనా ప్రభాకరరావు కళాక్షేత్రమే తీసుకో. దీన్ని గతంలో టౌన్ హాల్ అనేవారు. సుమారు వందేళ్ళ చరిత్ర గల ఈ టౌన్ హాల్ లో మహాత్మాగాంధీ 1920, 1929 సం . రాలలో రెండుసార్లు ప్రసంగించారట. 1913 లో బాపట్ల లో 'ఆంద్ర మహాసభ' తొలి సమావేశం జరిగింది. ఇందులో అనేక రంగాల్లో ప్రముఖులైన 800 మంది తెలుగు ప్రతినిధులు, రెండువేల మంది సదస్యులు హాజరయ్యారు.”

“టౌన్ హాల్ ఇన్ అ విల్లెజ్...? ఇంటరెస్టింగ్ గా ఉంది... దీన్ని ఎవరు కట్టారు?” అడిగింది శృతి కాస్త పచ్చడి తీసుకుని, రుచి చూస్తూ...
“ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు అప్పటికే వాళ్ళకు అలవాటైన ‘క్లబ్ కల్చర్’ ను ఇక్కడ ప్రవేశపెట్టాలని అనుకున్నారు. అప్పట్లో మద్రాస్ నుంచి కలకత్తా దాకా సముద్ర తీర ప్రాంతమంతా వారి అధీనంలో ఉండేది. వాళ్ళుండే ఊళ్లలో సాంస్కృతిక, సాంఘిక  కార్యక్రమాలు చేపట్టడానికి, వారు టౌన్ హాల్స్ కట్టిస్తూ వచ్చారు. కాని, బాపట్లలో కట్టిన టౌన్ హాల్ కు మరో విశేషం ఉంది. 1901  కింగ్ ఎడ్వర్డ్ ను ఇంగ్లాండ్ కు, భారత్ కు  రాజుగా పట్టాభిషేకం చేస్తున్నప్పుడు భారతదేశమంతా సంబరాలు మిన్నంటాయి. రాజు పట్టాభిషేకానికి గౌరవ సూచకంగా అప్పట్లో తహసీల్దారుగా ఉన్న శేషాచలపతి పంతులు గారి నేతృత్వంలో 1902 లో ఒక కమిటీ ఏర్పడింది. వీరు ప్రతిపాదించిన టౌన్ హాల్  ఏర్పాటుకు చోరగుడి రామకృష్ణ గారు , దేశిరాజు వారు స్థలం ఇచ్చారు. 17 జూలై 1905 నాటికి దీని నిర్మాణం పూర్తయ్యింది. ‘ఎడ్వర్డ్ కారోనేషన్ మెమోరియల్ టౌన్ హాల్’ అని దీనికి పేరు పెట్టారు. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చాకా దీని పేరు ‘ఇండియన్ ఇండిపెండెన్స్ మెమోరియల్ టౌన్ హాల్ అని మార్చారు.” పద్మావతి గారు చెబుతూ ఉండగా అక్కడికి ఆమె భర్త సదాశివం గారు వచ్చారు.
“ఏంటి శృతి? మీ బామ్మ టౌన్ హాల్, టౌన్ హాల్ అంటూ హల్చల్ చేస్తోంది. కొంపదీసి మా లవ్ స్టొరీ కానీ చెప్తోందా?” అని అడిగారు కొంటెగా.
“చిన్నపిల్ల ముందు ఏమిటా మాటలు...” ఒకింత సిగ్గుతో కూడిన కోపంతో కసిరారు ఆవిడ.
“ఇవన్నీ మాకు అమెరికాలో చాలా కామన్ గ్రానీ. చెప్పనీ. తాతా, మీ లవ్ స్టొరీ టౌన్ హాల్ లో మొదలైందా? ఎలాగో చెప్పవా ప్లీజ్...” పడక్కుర్చీలో కూర్చున్న సదాశివం గారి పక్కకు చేరింది శృతి.

“నా బంగారు తల్లివి, నువ్వడిగితే చెప్పనా, విను... నేను చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉండేవాడిని. ఈ టౌన్ హాల్ లో రీడింగ్ రూమ్, క్లబ్, సాంస్కృతిక వేదిక, టెన్నిస్ కోర్ట్ అన్నీ ఉండేవి. మద్రాస్ నుంచి ఆటగాళ్ళు, పోటీలకు వచ్చేవారు. టౌన్ హాల్ టెన్నిస్ కోర్టు రోడ్డు పక్కనే ఉండేది. రోడ్డుకూ, కోర్టుకూ మధ్య ఓ ఎత్తయిన గోడ ఉండేది – బాల్స్ బయటకు ఎగరకుండా ఉండటానికి. అయినా చెయ్యి తిరిగిన ఆటగాళ్ళు వచ్చినప్పుడు బంతి గోడ దూకేది. నేను, కొంతమంది స్నేహితులతో అక్కడే కాపేసి, బంతి దొరకగానే పట్టేసుకుని, ఎవ్వరికీ దొరక్కుండా పారిపోయి దాక్కునే వాడిని. అలా దాక్కునే ప్రయత్నంలో ఒకసారి గోడ దూకి మీ నాయనమ్మ  పెరట్లోకి జారి పడ్డాను. అంతే, ఆ పడ్డం పడ్డం ఇక ఇంతవరకూ లేవలేకపోయానంటే నమ్ము. “ అప్పుడే కాఫీ గ్లాసుతో వచ్చిన పద్మావతి గారిని చూసి కళ్ళు ఎగరేస్తూ అన్నారు ఆయన.
“ఓహో, చెప్పేవాడికి వినేవాడు లోకువనీ ! కొయ్యండి కోతలు. శృతి, ఆ పడ్డప్పుడు అయ్యగారి వయసెంతో అడగవే ! మహా ఐతే నీ వయసు ఉంటుందేమో! నాకేమో పదేళ్ళు. గోడ దూకి గేదెల కుడితి తొట్లో పడ్డ పిల్లాడు, ఆ గేదె నోట్లోకి వెళ్ళిపోతాడేమోనని కంగారు పడ్డ మా వాళ్ళు, ఈయన్ని బైటికి లాగి, నూతి దగ్గర నీళ్ళోసి,  ఎవరా ఆరా తీసారు. ఈడు-జోడు సరిపోతుందని లేక్కలేసి, లక్కపిడతలతో ఆడే వయసులో, ఇదిగో ఈ రాలుగాయి పిల్లాడికిచ్చి నాకు పెళ్లి చేసేసారే ! అప్పట్లో పెళ్ళిళ్ళు ఇలాగే చేసేసేవారు తెల్సా? ” అందావిడ సదాశివం గారిని చూసి మూతి తిప్పుతూ.
“గేదె నోట్లోకి వెళ్ళినా బాగుండేది, నెమరేసేటప్పుడు ఎలాగో బయట పడేవాడ్ని. కాని మీ బామ్మ నోట్లో పడ్డాను చుసావూ. అప్పట్నుంచీ నవుల్తూనే ఉంది...” నాలుక బైటపెట్టి వెక్కిరిస్తూ అన్నారు సదాశివం గారు.
“మీ ఇద్దరి గొడవలూ భలే ఇంటరెస్టింగ్ గా ఉన్నాయ్ గ్రానీ. సరే టౌన్ హాల్ గురించి చెప్పావు. కాని, ఇక్కడ నా ప్రోగ్రాం పెడితే, హిట్ అవుతుంది అంటావా? ఇక్కడ ఆర్టిస్టిక్ సెన్స్ ఉన్నవాళ్ళు ఉన్నారా?” అడిగింది శృతి తాతగారి ఒళ్లో తల వాలుస్తూ.
ఆమె తల ప్రేమగా నిమురుతూ, ఇలా చెప్పసాగారు సదాశివం గారు...“నీకో గమ్మత్తైన విషయం చెప్తానే అమ్మాయ్. ఒకప్పుడు ఆడవాళ్ళు ఇంటి గడప దాటి రావడం తప్పుగా భావించేవారు. ఇందాక చెప్పినట్లు చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవారు. మరి, కట్టుబాట్లు ఎక్కువగా ఉన్న అటువంటి సమయంలో నాటకాలు, నాట్యాలు చేసేవారికి స్త్రీ పాత్రలు చేసేందుకు ఎవరు దొరుకుతారు చెప్పు? అందుకే స్థానం వారి వంటి కళాకారులు ఆడ వేషాలు వేసి, ఆ లోటు తీర్చేవారు. అప్పట్లో బాపట్లలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్ద వేదిక ఈ టౌన్ హాల్. రాఘవ(బళ్ళారి రాఘవ) నాటక కళా పరిషత్, ఈలపాట రఘురామయ్య పరిషత్ , కోనా కళా పరిషత్ వంటి అనేక పరిషత్తులు ఇక్కడే విలసిల్లాయి.
స్థానం వారు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు, బుర్రా సుబ్రహ్మణ్య శర్మ గారు , సి.ఎస్.ఆర్ గారు , గంగా కనక లింగేశ్వర రావు గారు వంటి ఎందరో కళాకారులు బాపట్ల వచ్చి నాటకాలు వేసేవారు. స్థానం వారి తర్వాత స్త్రీ పాత్రలకు పేరెన్నిక గన్న  బుర్రా సుబ్రహ్మణ్య శర్మ గారు చంద్రమతి వంటి స్త్రీ పాత్రలు వేసేవారు.

ఒకసారి ఇక్కడి టౌన్ హాల్ లో నాటకం వేసేందుకు వచ్చిన బుర్రా వారికి సన్మానం చేసినప్పుడు, వారు ఇలా అన్నారు. ‘ఈ బాపట్ల సరస్వతీ క్షేత్రం వంటిది. ఇక్కడి వారికి అక్ష్యరాస్యత శాతం తక్కువైనా, శబ్ద జ్ఞానం ఎక్కువగా ఉంది. చదవలేరు కాని, పద్య నాటకాల్లో తప్పు పాడితే ఆడియన్స్ వెంటనే లేచి, తప్పు పట్టుకుని అడిగేస్తారు. బాపట్ల ప్రేక్షకులతో జాగ్రత్తగా ఉండాలి సుమా !” అని. ఇది నూటికి నూరుపాళ్ళు నిజం శృతి, ఈ గడ్డ  మంచి సాంస్కృతిక నిలయం. ఇక్కడి ప్రదర్శనలకు స్థానికులు, చుట్టుప్రక్కలి గ్రామాల ప్రజలు విరగబడి వస్తారు.”
“ఓహ్, థట్స్ గ్రేట్ గ్రాండ్ పా. మరి ఇక్కడ నుంచి వచ్చిన మ్యుజీషియన్స్, ఫిలిం పర్సనాలిటీస్ ఎవరైనా ఉన్నారా?” అడిగింది శృతి.
“ఓ లేకేం తల్లీ, బ్రహ్మం గారనే సంగీత విద్వాంసులు అప్పట్లోనే మల్లీశ్వరి సినిమాకు హార్మోనియం వాయించారు. నటన, సంగీతంతో విశ్వవిఖ్యాతి గడించిన పద్మశ్రీ ఈలపాట రఘురామయ్య గారిదీ ఈ ఊరే. ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి వందలాది లలిత గీతాలు రచించిన డా. కె.వి.ఎస్.ఆచార్య గారు, సినీ గేయ రచయత సాయి శ్రీ హర్ష, సినీ దర్శకుడు ముప్పలనేని శివ, నిర్మాతలు కోనా వెంకట్, ముప్పలనేని శేషగిరిరావు గారు,... ఇలా చెప్తూ పొతే డబ్బింగ్ ఆర్టిస్ట్ లు, సినీ సెట్స్ వెయ్యటంలో నిపుణులు, సంగీత దర్శకులు, టీవీ రంగంలో ఉన్నవారు ఎందరో ఈ బాపట్ల ఒడిలో మసలినవారే ! అంతెందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడే పుట్టారట తెలుసా నీకు? చిరంజీవి ఇక్కడ చదువుకున్నారట!”
“వావ్... అయితే నేనే ఇది చిన్న ఊరని అండర్ ఎస్టిమేట్ చేసాను. ఐ ఆం సారీ టు హార్ట్ యు బోత్ . ఇక్కడే పుట్టి పెరిగిన మీకు నా మాటలు కష్టం కలిగించి ఉంటాయి కదూ ! మీరు ప్రోగ్రాం కి ఓకే చెప్పండి. ఇంతమంది గొప్పవారు ప్రదర్శనలు ఇచ్చిన ఈ చోట పాడడం నా అదృష్టంగా భావిస్తాను. “పక్కనే ఉన్న బామ్మను అల్లుకుంటూ అంది శృతి.
“శృతి, మనుషులు గొప్పవారా, లేక వారికి తిండి, బట్ట, నీడ, వసతులూ కల్పించిన, మరో అమ్మ వంటి ఊరు గొప్పదా? అంటే... ఎంత ఎత్తుకు ఎదిగినా ఊరితో తనకున్న అనుబంధాన్ని మరచిపోని మనుషులే గొప్పవారు అవుతారని నేనంటాను. ఒక మనిషి విజయంలో, సొంత ఊరి పాత్ర ఖచ్చితంగా ఉండి తీరుతుంది. సమాజం ముందు ఈ విజేతలు తలెత్తుకు నిలబడి, తమలోని కళను లోకానికి వెల్లడించే  ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని, విద్యను, వికాసాన్ని అన్నింటినీ ఇస్తుంది సొంతఊరు. అందుకే మనిషికి తన ఊరితో ఉన్న అనుబంధం గొప్పది.  ఆ అనుబంధం గుండె లోతుల్లో బలంగా పాతుకు పోయినప్పుడు, చిగురులేసిన వారి హృదయలతలు, కళా పుష్పాలై పరిమళిస్తాయి. అందుకే కాలం ఎంతగా మారినా అనుబంధాలు, మమతలూ మారవు తల్లి. ఆ బంధాన్ని వెతుక్కుంటూనేగా నువ్వింత దూరం వచ్చింది! నువ్విక్కడ ఇవ్వబోయే ప్రదర్శన ఈ ఊళ్ళో నీకు మరింతమంది ఆప్యాయతల్ని పొందేలా చేస్తుంది. నువ్వు తిరిగి మీ ఊరెళ్ళే లోపు ఈ బాపట్ల నీ మనసులో కూడా ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. నీ మూలాలు కూడా ఇక్కడే ఉన్నాయని మర్చిపోకు. ఈ ఊరికీ, నీ వారికీ మంచి పేరు తీసుకురావాలి తల్లీ ! అన్నారు పద్మావతి గారు మనవరాలి గడ్డం పట్టుకు బ్రతిమాలుతూ.
“అలాగే గ్రానీ ! ఇక నుంచి నిన్ను అందరూ శృతి గ్రానీ అని పిలిచేలా చేస్తాను...” అంది శృతి.
“సరిపోయింది, మళ్ళీ నన్ను మరిచారూ? లాభం లేదు. ఏమేవ్, మీ ఇంట్లో ఆ కుడితి తొట్టి ఇంకా ఉందా? మరోసారి దూకి రంభా ఊర్వశులు ఏమైనా దొరుకుతారేమో చూస్తాను... “ నవ్వుతూ అన్నారు సదాశివం గారు. ఆయన నవ్వులతో శృతి కలిపారు ఇద్దరూ. 
***

1 comment:

  1. బాగుంది. నాకు తెలియని అనేక విషయాలు తెలిసాయి.రచయిత్రికి శుభాభినందనలు.

    ReplyDelete

Pages