సినీగేయ రచయత 'చంద్రబోస్' గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

సినీగేయ రచయత 'చంద్రబోస్' గారితో ముఖాముఖి

Share This
 సినీగేయ రచయత 'చంద్రబోస్' గారితో ముఖాముఖి 
భావరాజు పద్మిని 

పాటతో 22 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం ఆయనది. స్పూర్తిదాయకమైన గీతాల్లో సాటిలేని ప్రతిభ వారిది. అక్షరాలతో జీవితాలకు కొత్త ఊపిరిపోస్తూ, పాటతో జీవితంలోని ఆటుపోట్లను తట్టుకునే శక్తిని ఇస్తూ, పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న సినీగేయ రచయత ‘చంద్రబోస్’ గారితో ప్రత్యేక ముఖాముఖి ఈ నెల మీకోసం...
మీ కుటుంబంలో కళాకారులు, సాహితీవేత్తలు ఎవరైనా ఉన్నారా?
మా కుటుంబంలో ఎవరూ లేరండి. మాది సాధారణ వ్యవసాయ ఆధారిత కుటుంబం. మా అమ్మవైపు కాని, మా నాన్నవైపు కాని అసలు చదువుకున్నవారే లేరు.
మరి మీకు సాహిత్యం పట్ల అభిరుచి ఎలా కలిగింది?
ఇదంతా దైవదత్తంగా వచ్చిందని నేను భావిస్తున్నాను. మాది వరంగల్ జిల్లా, చిట్యాల మండలంలోని చల్లగరిగె అనే కుగ్రామం. అక్కడ మా ఇంటి ప్రక్కన ఒకే ప్రాంగణంలో ఒకవైపు శివాలయం, మరోవైపు గ్రంధాలయం ఉండేవి. గ్రంధాలయంలో నేను బాగా పుస్తకాలు చదివేవాడిని. చిన్నప్పుడు చదివిన ఆ బాలసాహిత్యమే ఈరోజు ఇలా ఈ రంగంలో నిలబడేలా చేసింది. చందమామ, బాలమిత్ర, బుజ్జాయి, బొమ్మరిల్లు, చంపక్, యోజన, ప్రజ్ఞ వంటి పత్రికలు తప్పనిసరిగా చదివేవాడిని. ఇలా రోజూ వచ్చే దిన పత్రికలు, వారపత్రికలు తప్పనిసరిగా చదివేవాడిని. అప్పటికి వాస్తవిక దృక్పధంతో రాసే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు లేవు. కేవలం కధలు, కవితలు, నవలలు, కధానికలు వంటివే ఉండేవి. చదివి, దాంట్లో నుండి ఆ భాషా సంపద, పద సంపద నేను సంపాదించాను.
ఈ గ్రంధాలయంలో పుస్తకాలు చదవడం, శివాలయంలో రోజూ పొద్దున్నే మైక్ లో పాటలు వేసేవారు. 4 -6 గం. వరకు ఆ పాటల్ని మగత నిద్రలో వినేవాడిని. ఆ ప్రాతః కాలంలో విన్న ఆ పాటలన్నీ నా మనసులోకి వెళ్ళిపోయాయి. వేంకటేశ్వర సుప్రభాతం, ఘంటసాల గారి భగవద్గీత, భక్తి పాటలు, బాలు గారి లింగాష్టకం, మంగళంపల్లి వారి విఘ్నేశ్వర ప్రార్ధనలు, ఎం.ఎస్ రామారావు గారి సుందరాకాండ, సుబ్బలక్ష్మి గారి భజగోవిందం, శోభారాజు గారి అన్నమాచార్య కీర్తనలు ఇలా అన్నీ వినేవాళ్ళం. నా ప్రమేయం లేకుండా ఆ పాటలన్నీ నేర్చేసుకుని, పాడేవాడిని. ఇలా కొన్నేళ్ళ పాటు ఆ గ్రంధాలయంలో పుస్తకాలు, శివాలయంలో పాటలు, ప్రతి సోమవారం శివాలయంలో జరిగే భజనలో పాడడం చేసేవాడిని.
మీరు చేసిన మొట్టమొదటి రచన ఏమిటి?
రచన అంటే ముందు పాట రాయలేదండి. ముందు నేను వార్తలు రాసాను. ఈ గ్రంధాలయంలో కొన్నేళ్ళపాటు ఈ పుస్తకాలు, పత్రికలూ చదివాకా, ‘నేనే రాయచ్చు కదా’ అన్న ఆలోచనతో ఒక లిఖిత పత్రిక ప్రారంభించాను. 33 ఏళ్ళ క్రితం నేను దానికి పెట్టిన పేరు ‘వార్తావాహిని.’ ఇదొక స్థానిక పత్రిక. నేను స్వహస్తాలతో ఈ పత్రిక రాసి, రోజూ గ్రంధాలయంలో పెట్టేవాడిని. రోజూ మా గ్రామపెద్దలు ఒచ్చి, ఇతర పత్రికల కంటే ముందు నా పత్రికే చదివేవారు. ఇలా రచన పట్ల, సృజన, కొత్తదనం పట్ల, ఆ వయసులోనే ఆ స్థాయిలో నాలో అంకురించింది. ఏదైనా విభిన్నంగా చేసి, అందరి దృష్టినీ ఆకర్షించి, మంచి పేరు తెచ్చుకోవాలన్న తపన అప్పట్లోనే మొదలయ్యింది. దాన్ని ఇలా బహిర్గతం చెయ్యడం జరిగింది.
సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది?
నేను హైదరాబాద్ లో డిప్లమా చదివే సమయంలో చాలామంది స్నేహితుల పుట్టినరోజులకి వెళ్ళినప్పుడు, అందరూ బహుమతులు ఇస్తే, నేను వారి పేరుతో ఒక పాట రాసి బహుమతిగా ఇచ్చేవాడిని. వాళ్ళ గుణగణాలు, వ్యక్తిగత విశేషాలు, ప్రవర్తన అన్నీ పాటలో పొందుపరచే వాడిని. మిత్రులు అభినందించేవారు.
అయితే ఇక్కడ గమించాల్సింది ఏమిటంటే పాడడం అనేది నా మొదటి ఇష్టం. పాడడం కోసమే రాసుకునేవాడిని. రాసుకున్న పాట పాడాలంటే స్వరరచన కూడా చెయ్యాలి కదా ! ఇలా రాసి, పాడి, బాణీ కట్టి పాడడం ముప్పేటలా అల్లుకుపోయింది. దీన్నే ‘వాగ్గేయకారత్వం’ అంటే వాక్కుకు గేయ రూపం ఇవ్వడం అంటారు. ఈ లక్షణాలు నాలో పెరుగుతూ వచ్చాయి.
తర్వాత సినీరంగంలోకి వెళ్దామని అనుకున్నప్పుడు, పాటలో నేను శాస్త్రీయమైన శిక్షణ తీసుకోలేదు. డిప్లమా చదువుతూ ఉండగా నాకు జగన్ అనే మిత్రుడి ద్వారా శ్రీనాథ్ అన్న మిత్రుడు కలిసారు, ఆయనకు సినీరంగంలో చాలా పరిచయాలు ఉన్నాయి. ఆయన నా పాట విని, వాళ్ళ స్నేహితుల పుట్టినరోజులకి కూడా నన్ను ఆహ్వానించి, నా చేత పాటలు రాయించి, పాడించి ఆనందపడేవారు. తమ్ముడూ, నువ్వు తప్పకుండా పైకొస్తావని శ్రీనాథ్ అన్నయ్య నన్ను ప్రోత్సహించేవారు. ఆయనకు పరిచయం ఉన్నవాళ్ళందరి దగ్గరకూ తీసుకువెళ్ళి పాడించేవారు. అందరూ విన్నారు, కాని ఆ దిశగా అవకాశాలు ఏమీ రాలేదు. ఒకటి రెండు సంవత్సరాలు ఇలా తిరిగాకా ఏం చెయ్యాలా అని తీవ్రంగా ఆలోచించాము. అప్పుడు ఆ అన్నయ్య ఒక సలహా ఇచ్చారు. అదే నా జీవితాన్ని మార్చింది. అదేమిటంటే-
“తమ్ముడూ, పాడడం అనేది నిర్మాత ఖర్చుతో  కూడుకున్న వ్యవహారం. స్టూడియో బుక్ చెయ్యాలి, వెళ్ళాలి, పాడాలి అంటే ఖర్చే కదా. అయితే నువ్వు పాడడం కోసం రాసుకున్న పాటలు కూడా బాగున్నాయి. ఆ రాయడానికే కాస్త పదును పెట్టి, మెరుగు పెడితే ఫలితం వచ్చేలా ఉంది. రాయడం మీద దృష్టి కేంద్రీకరించు” అని చెప్పారు.
“సరే అన్నయ్యా, రాయడం అనేది మన శ్రమతో కూడుకున్న వ్యవహారమే కాబట్టి, అందువల్ల ఇతరులకు ఏ నష్టం లేదు కాబట్టి తప్పకుండా అలాగే చేద్దాం,” అని చెప్పాను. సరే, కొన్ని పాటలు రాసాను. ఆ పాటలు పట్టుకుని, మళ్ళీ కొత్తరకంగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. అప్పుడు మాకు ముప్పలనేని శివ గారు అప్పాయింట్మెంట్ ఇచ్చారు. నేను రాసిన పాటలు విని, బాగుందని, అప్పుడు ఆయన రాస్తున్న తాజ్మహల్ అనే సినిమాలో నా పాటలు పెట్టేందుకు గాను నన్ను రామానాయుడు గారి వద్దకు తీసుకుని వెళ్ళారు. ఆయన నాకు కధ చెప్పి, కొన్ని పాటలు రాయమన్నారు. ఆ పాటలకు నేనే ఏదో బాణీ కట్టుకుని రాసుకుని వెళ్లాను, బాగున్నాయని సంగీత చర్చలకు పిలుస్తామని అన్నారు. ఆ సినిమాకు శ్రీలేఖ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఆవిడ మళ్ళీ కొత్తగా బాణీలు ఇచ్చారు. చిన్నప్పటి నుంచి నాకు ఉన్న పాటలు రాయడం, పాడడం అన్న అలవాటు వల్ల ఆ సందర్భానికి, బాణీకి తగ్గట్టు చక్కగా రాసాను. అది “మంచుకొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో, మెచ్చి మేలుకున్న బంధమా అందమంత అల్లుకో’ అనే పాట. అక్కడినుండి ఆ చిత్రం, పాట విజయవంతం కావడంతో రామానాయుడు గారే ధర్మచక్రం అనే వెంకటేష్ గారి సినిమాలో నాలుగు పాటలు రాసే అవకాశం ఇచ్చారు. తర్వాత సురేష్బాబు గారు అప్పుడు ఆ స్టుడియోలో రాఘవేంద్రరావు గారుంటే పరిచయం చేసారు.
రాఘవేంద్రరావు గారి గురించి చెప్పండి.
మొదట రాఘవేంద్రరావు గారు నాకు పెళ్ళిసందడి సినిమాలో పాటలు రాసే అవకాశం ఇచ్చారు. ఇక అక్కడినుండి ఆయనతో నా ప్రస్థానం పెళ్ళిసందడి నుంచి నిరంతరంగా మొన్నమొన్న ‘ఓం నమో వేంకటేశాయ’ అనే సినేమావరకు కొనసాగుతోంది. అలాగే ఆయనతో పాటు కీరవాణి గారితో కూడా పెళ్ళిసందడి నుంచి నా ప్రయాణం కొనసాగింది. మా ముగ్గురి కాంబినేషన్ లో ఎన్నో మంచి పాటలు ఒచ్చాయి.
రాఘవేంద్రరావు గారు ‘పాటకు పట్టాభిషేకం’ చేసే దర్శకులు. తెలుగులో పాట యొక్క అందాన్ని, లోతుని, గొప్పతనాన్ని ఆవిష్కరించిన దర్శకులు ఆయన. అందుకే ఆయనవద్ద పాటలు రాస్తున్నానని అనగానే అందరూ అవకాశాలు ఇచ్చారు. అలా 22 ఏళ్ళుగా నా ప్రయాణం కొనసాగుతోంది.
ఈ రంగానికి వచ్చాకా ఏవైనా ఒడిదుడుకులు ఎదుర్కున్నారా? అంటే ఎప్పుడైనా మీకు ఉద్యోగమే చేసుకుని ఉంటే బాగుండేది అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
ఏ క్షణమూ అనిపించలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను కలగన్నది, ఊహించినది, ఊహాలోకంలో విహరించినది, ఆశించింది ఇదే కాబట్టి ఈ రంగమే నా సర్వస్వం. ఇంజనీరింగ్ చేసి, ఉద్యోగాలు చేసేవారు చాలామందే ఉన్నారు. కాని, నేను నా కలను జీవిస్తున్నాను. అందుకే ఇదంతా నా అదృష్టంగా భావిస్తున్నాను.
‘మౌనంగానే ఎదగమని’ పాట గురించి చెప్పండి.
ఆ సినిమాలో చిన్న చిన్న అపజయాలను ఎదుర్కుని నిరాశలో ఉన్నప్పుడు, కధానాయకి దివ్యాంగులను వాద్య బృందంగా తీసుకుని, ఒక పాట పాడుతుంది. ఆ పాట ఎలా ఉండాలంటే నిరాశలో ఉన్న హీరోలో ఒక కొత్త జీవాన్ని, చైతన్యాన్ని నింపే విధంగా పాట రాయాలి. ఇదీ సందర్భం. శరీరంలో ముఖ్యమైన ఇంద్రియం నయనం కాబట్టి, ఆ నయనేంద్రియాలే పని చెయ్యనివారు కూడా కృంగిపోకుండా జీవితాన్ని ఎంత ఆనందంగా గడుపుతున్నారనే నేపధ్యంలో పాటని రాయాలి. కాబట్టి, వీళ్ళు పాడే పాట, “వీళ్ళే ఇంత గొప్ప స్పూర్తితో ఉంటే, అన్ని అంగాలు ఉన్న మనం ఎందుకు సాధించలేకపోతున్నాము “ అన్న చిన్న ఆలోచనను హీరోలో రేకెత్తించాలి. ఆ సందర్భానికి కీరవాణి గారు ఇచ్చిన బాణీకి నేను పాట రాసాను.
“మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది - ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది - ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
“దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా  -దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా - బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగర మధనం మొదలవగనే విషమే వచ్చింది - విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది
అవరోధాల దీవుల్లొ ఆనంద నిధి ఉన్నది - కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది
తెలుసుకుంటె సత్యమిది - తలచుకొంటె సాధ్యమిది  “ – ఇలా ఈ పాట ప్రజల్లో కలకాలం నిలిచిపోయే పాటగా పేరు తెచ్చుకుంది.
ఈ 22 ఏళ్ళలో మీరు బాగా కష్టపడి రాసిన పాట ఏదైనా ఉందా?
ఒక్క పాట మాత్రం ఒక్క రోజు పట్టిందండి. “వన్ – నేనొక్కడినే “ అనే సినిమాలో చివరి పాట అది. అది కవిత్వం స్థాయిలో ఉంటుంది.
"నా వెంటే నువ్వుంటున్నా ఒంటరిగా నేనుంటున్నా.. దాని అర్ధం నువ్వు నేను ఒకటి అనీ...
ఎవ్వరితో ఏమంటున్నా నీతో మౌనంగా ఉన్నా .. మనకి ఇంకా మాటలతోటి లేదు పనీ...
లోకంలో చోటు ఎంతున్నా చాలదనీ.. నువ్వు నాలో నేనే నీలో ఉంటే చాలనీ...
నా చుట్టూ వెలుగు ఎంతున్నా వదులుకునీ.. నేనే నీ నీడై నీ కూడా కూడా కూడా ఉండనీ..."
చరణాలు ఇలా రాసాను...
"ఒకే క్షణం జన్మించడం.. ఒకే క్షణం మరణించడం.. ప్రతీ క్షణం ప్రేమించడం.. అదే కదా జీవించడం...
ప్రేమంటేనే బాధ.. బాధ ఉంటేనే ప్రేమ.. ఆ బాధకి మందు మళ్లీ ప్రేమే..
ప్రేమే ఒక వల.. ప్రేమే సంకెల.. సంకెళ్ళతో స్వేచ్ఛగా ఎగరడమే........"
"పెదాలిలా విడిపోవడం విరహం కాదు.. చిరునవ్వడం.. పాదాలిలా విడిపోవడం దూరం కాదు.. అడుగెయ్యడం..
నువ్వూ నేనూ విడిగా ఉన్నామంటే అర్ధం ఆ చోటులో ప్రేమకు చోటివ్వడమే...
నువ్వూ నేనూ కలిసి ఉన్నామంటే అర్ధం ఆ ప్రేమగా మనమే మారడమే."
చాలా లోతైన ఈ భావాన్ని బాణీలో పొందుపరచాను. కనుక కొంచెం సమయం పట్టింది. ఇలా కవిత్వ స్పర్శతో, కావ్య స్పర్శతో ఎన్నో పాటలు రాసాను. దాంట్లోనే “నిశ్శబ్దంలోనా నీ గుండె చప్పుడై ” అనే పాట కూడా రాసాను. ప్రియురాలు బాధపడుతుంటే అది కూడా చాలా హిట్ అయింది.
"నిశ్శబ్దంలోన నీ గుండె చప్పుడై ఉంటా .. తోడుంటా
శబ్దలేన్నున్నా నీ రెప్పల చప్పుడే వింటా .. నే వింటా
చేదుకలలకు మెలకువ లాగా వస్తా
బాధ మేలుకుంటే నిదరై కాపు కాస్త
వేదనలకింక వీడుకోలు పలికే చివరి కన్నీటి చుక్కై పోతా"
సినిమా పాటల్లో సాహిత్యం ఎంత ఉత్కృష్టమైన స్థాయిలో ఉందో దీన్నిబట్టి ఆలోచించండి.
మరిప్పుడు సినిమా పాటల్లో తెలుగు కంటే అన్యభాషా పదాలే ఎక్కువగా ఉంటున్నాయి కదా. దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి ?
దీనికి నా దగ్గరొక మంచి సమాధానం ఉంది. మన తెలుగులో ఏ పదమైనా అచ్చులతో అంతం అవుతుంది. కనుక అజంత భాష . ఇటాలియన్ అజంత భాష . హలంత భాషలు ఇంగ్లీష్, హిందీ. బాణీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదో భాషలో వాళ్ళు పాడి ఇస్తారు. అంటే, వాళ్ళు హలంత భాషలో ఇచ్చిన బాణీకి మనం అజంత భాషలో సాహిత్యం రాయడం అసాధ్యం. కాబట్టి ఆ బాణీని, ఆ వేగాన్ని అందుకోవాలంటే మనం ఖచ్చితంగా హలంత భాషను ఆశ్రయించాలి. కాబట్టి, కొన్ని కొన్ని మాటలు హిందీ, ఇంగ్లీష్ లో ఇస్తూ ఉంటాము.  
తర్వాత, తెలుగులో పాటలు చాలా వస్తున్నాయి. 80% పాటలు తెలుగులోనే ఉంటున్నాయి. 20% యూత్ అని, ట్రెండ్ అనీ అదనీ, ఇంగ్లీష్ లో హిందీలో మాట్లాడుకునే మాటలు వాడి రాయాల్సి ఒస్తోంది. దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. బయట మనం మాట్లాడుకునే భాష కూడా చాలా కలుషితం అయిపొయింది. బయట కూడా అందంగా, స్వచ్చంగా తెలుగు మాట్లాడేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి. కొంత బయట కూడా క్లిష్టమైన తెలుగు వాడకం తగ్గింది కనుక, ప్రజలకు అనువుగా అర్ధం అయ్యేందుకు పాటలు కూడా మారాయి. పాటల రచయతలు ఇప్పటికీ తెలుగులోనే పాటలు రాయాలని చూస్తున్నారు. అలా రాయగల సమర్ధులు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రేక్షకులు కూడా మంచి పాటల్ని, భాషని ఆదరిస్తున్నారు.
ఇంకొక సంగతి చెబుతున్నాను. తెలుగు భాషకు వచ్చిన ముప్పు, ఆపద ఏమీ లేదు. ఇంకో 20 ఏళ్ళలో అంతా తెలుగు మాయమై పోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని చోట్లా తెలుగు మాట్లాడతారు, తెలుగుకే పెద్ద పీట వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సంగీతం, నాట్యం, వాద్య నైపుణ్యం, ఇవన్నీ కూడా ఇదివరకు అంతగా ఆదరణ లేకుండా ఉండేవి. ఇప్పుడు ఏ కాలనీ లోకి వెళ్ళినా కళా శిక్షణాలయాలు ఉన్నాయి. మా ఇంటి దగ్గర కమ్యూనిటీ హాల్ లో ఇద్దరు డాన్స్ టీచర్లు, ఒక సంగీతం టీచర్ ఉన్నాయి. ప్రజలకు కళల పట్ల ఆసక్తి పెరిగింది. సంగీతం, నాట్యం తర్వాత అందరూ ఖచ్చితంగా సాహిత్యం వైపే మళ్లుతారు. మనోవికాసం అనేది మాతృభాషలోనే జరుగుతుంది, మాతృభాషలో పట్టు సాధించినవాడు ఏ భాషలోనైనా రాణించగలడు. ఎందుకంటే వ్యాకరణం బిడ్డకు తల్లి కడుపులో ఉండగానే తెలిసిపోతుంది. పదాలు నేర్పుతామే కాని, వాక్యాలు నేర్పము కదండీ. కాబట్టి మాతృభాష జన్యువుల ద్వారా సంక్రమిస్తుంది. ఆ భాష అలా రాణిస్తూనే ఉంటుంది. భవిష్యత్తు అంతా తెలుగు భాషే !
పాత వాటిని, విషయాలను, పల్లెటూళ్ళను, ఆర్గానిక్ ఆహారాన్ని, రోటి పచ్చళ్ళను అందరూ ఇష్టపడుతున్నారు. సంస్కృతిని పునరుద్ధరిస్తున్నారు. అంటే, మనం ఒక మంచివైపు వెళ్తున్నాము. ముందు పైకి రావాలంటే కాస్త క్రిందికి వెళ్ళాలి. కాబట్టి మనం మంచివైపే ప్రయాణిస్తున్నాము, చేరుకుంటాము కూడా.  చాలామంది భాష గురించి ఉద్యమాలు వస్తున్నాయి కాని, అందరి కలలు నిజమై తెలుగు నిలబడుతుందని ఖచ్చితంగా చెప్పగలము.
ఇన్నేళ్ళ మీ సినీజీవితంలో మీరు అందుకున్న మర్చిపోలేని ప్రశంస ఏమైనా ఉందా?
మర్చిపోలేని ప్రశంసలు చాలానే ఉన్నాయండి. లాస్ ఏంజెల్స్ లో ఇర్విన్ అనే ఊళ్ళో ఒక  నాలుగేళ్ల  చిన్నపాప ఉంది. ఆ పాప నా అభిమాని అని వాళ్ళమ్మ ఆ కార్యక్రమానికి తీసుకుని వచ్చింది. నాకోసం వేచి ఉండి, నేను రావడం ఆలస్యం అయ్యేసరికి కంగారు పడి, నేను రాగానే గట్టిగా వాటేసుకుంది. నా పాటలు వాటి అర్ధాలు, భావాలు ఆ పాపకు తెలీవుకదా, మరి నీకు ఏం నచ్చింది – అని అడిగితే, టీవిలో సూపర్ సింగర్ కార్యక్రమంలో నా వ్యాఖ్యానం ఆమెకు నచ్చిందట. నేను గాయకులను ప్రోత్సహించే విధానం, నా మాటతీరు నచ్చిందని చెప్పింది. ఆమె నాకొక బాలాభిమాని.
అలాగే ఒక సంగీత దర్శకులు ఇంటికి వచ్చేసరికి వాళ్ళ పాపలు ఏదో సినిమా పాట రాసుకుంటున్నారట. ఈయన ఒచ్చేసరికి వాళ్ళు పుస్తకాన్ని దాచేస్తున్నారట. అది గమనించి, “ఏం రాస్తున్నారు, చూపించండి” అని అడిగితే కంగారుపడి, “స్కూల్ లో పాడేందుకు సినిమాపాట రాస్తున్నాము” అని చూపించారట. చైనాలో “ఇన్విసిబుల్ వింగ్స్” అనే సినిమాని తెలుగులో “నింగీ నేలా నాది” అనే పేరుతో తీసారు. అందులో నేనొక పాట రాసాను. ప్రమాద వశాత్తూ చేతులు కోల్పోయిన ఒకమ్మాయి, చేతులు చేసే పనిని కాళ్ళతో చెయ్యడం... అంటే చదవడం, రాయడం, కంప్యూటర్ ఆపరేట్ చెయ్యడం... అలా ఆమె మెడికల్ కాలేజి సీట్ , పతకాలు సాధించడం ఇక్కడి నేపధ్యం. దానికి నేను రాసిన పాట...
ఆరాటం ముందు ఆటంకం ఎంత సంకల్పం ముందు వైకల్యం ఎంత
ధృడచిత్తం ముందు దురదృష్టం ఎంత ఎదురీత ముందు విధిరాత ఎంత
నమ్మకము, పట్టుదల నా రెండు రెక్కలుగా
ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకశాన్నంతా
చేజారెను చేతులు చెరిగేను గీతలు (2)
ఎదిరించిన బాధలే వివరించెను బోధలు
పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా (2)
మలిచేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా //ఆరాటం //
పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం
చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం సహనంతో ఉంటే దొరికింది సైన్యం
చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం //ఆరాటం //
ఆయన ఈ పాట చూసి, ముగ్ధులై, ఎవరు రాసారు అని ఆరా తీస్తే, చంద్రబోస్ అని చెప్పారు. వెంటనే నాకు ఫోన్ చేసారు. అమ్మాయిలు సినిమా పాట రాస్తున్నారంటే కంగారు పడ్డాను, కాని పాట సాహిత్యం చూసాకా అద్భుతంగా అనిపించింది. సినిమా పాటను టీచర్లే పాఠశాలలలో పిల్లలకు నేర్పి పాడమనే స్థాయికి తీసుకుని వెళ్ళడం చాలా గొప్ప సంగతి. అది మీరు రాసారని తెల్సి ఫోన్ చేసానని చెప్పిన విషయం జీవితంలో మర్చిపోలేను.
మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటండి?
ప్రణాళికలు ఏమీ లేవండి. మరిన్ని మంచి పాటలు రాయాలని ఉంది. చక్కటి పాటలు రాయడం, నాకు ఎంతో ఇష్టమైన పుస్తకాలు చదవడం, ఇంకా ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చెయ్యాలి, ఎంతో మంది అభిమానం పొందాలి, ఎంతో మందికి సినిమా పాటల ద్వారా స్పూర్తి దాయకమైన, కలకాలం నిలిచిపోయే పాటలు రాయాలని నా కోరిక. ఎందుకంటే సినిమా పాటకు అంత శక్తి ఉంది.
ఇప్పుడు ప్రణీత అనే అమ్మాయి ఆసిడ్ దాడికి గురై, 70% కాలిన గాయాలతో చావుబ్రతుకుల్లో ఉన్నప్పుడు, నా జీవితంలో మృత్యు ముఖం నుంచి బయటపడేందుకు భగవంతుడిని ప్రార్ధించడంతో పాటుగా నేను రెండు పాటలు విన్నాను అని చెప్పింది. ఒకటి మౌనంగానే ఎదగమని, మరొకటి చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని. ఎలాగైనా నేను పోరాటాన్ని ఆపకూడదని, శక్తిని కూడగట్టుకునేందుకు, కొత్తగా జీవించేందుకు నా పాటలు ఉపయోగపడ్డాయి అంటే ఇంకేం కావాలండి?
అలాగే గత సంవత్సరం ఒక ఊళ్ళో హోటల్ నుంచి ఒక సభకు నడిచి వెళ్తున్నప్పుడు మధ్యలో చాలామంది నవ్వుతూ, పలకరిస్తూ ఉన్నారు. ఒకబ్బాయి హఠాత్తుగా వచ్చి, నా కాళ్ళకు దణ్ణం పెట్టి, “మీవల్ల, మీ పాటల వల్లే నేను జీవితంలో ఇంత సాధించగలిగాను. మీరు నాకు వివేకానందుడితో సమానం” అని ఇతర వివరాలేమీ చెప్పకుండా నమస్కరించి వెళ్ళిపోయాడు. ఒక మంచి మాట, ఒక మంచి కవిత, ఒక మంచి వాక్యం జీవితాలనే మారుస్తుంది.
“తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని 
తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందు కేళ్లాలని 
కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని 
కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని 
గుండెతో తో ధైర్యం చెప్పెను...చూపుతో మార్గం చెప్పెను 
అడుగు తో గమ్యం చెప్పెను నేనున్నానని 
నేనున్నానని నీకేం కాదని...నిన్నటి వ్రాతని మార్చేస్తానని...”

ఇటువంటి పాటలు ఇంకా రాయాలన్నదే నా కోరికండి.
శ్రీ చంద్రబోస్ గారు ప్రజల్లో చిరకాలం నిలిచిపోయే పాటలు రాసి, మరిన్ని విజయాలను సాధించాలని మనసారా ఆశిస్తోంది ‘అచ్చంగా తెలుగు.’
చంద్రబోస్ గారితో నా ముఖాముఖిని క్రింది లింక్ లో వినండి.

No comments:

Post a Comment

Pages