సామ్రాజ్ఞి – 12 - అచ్చంగా తెలుగు
సామ్రాజ్ఞి – 12
భావరాజు పద్మిని(జరిగిన కధ : ప్రస్తుత కేరళ ప్రాంతంలోని సువిశాల సీమంతినీ నగరాన్ని పరిపాలిస్తూ ఉంటుంది స్త్రీ సామ్రాజ్ఞి ప్రమీల. ఆమె రాజ్యంలో అంతా స్త్రీలే ! అందంలో,కళల్లో, యుద్ధ విద్యల్లో ఆమె ముందు నిలువగల ధీరుడు లేడని ప్రతీతి. ఆమె ఉత్సాహభరితమైన మాటలతో తన సైన్యాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. తమతో అనవసరంగా వైరం పెట్టుకున్న కుంతల రాజు విజయవర్మతో మల్లయుద్దంలో గెలిచి, అతని రాజ్యం అతని రాణులకు, కుమారులకు అప్పగించి, అతడిని బందీగా తమ రాజ్యానికి తీసుకువస్తుంది ప్రమీల. రాజ నియమాల ప్రకారం అతను విలాసపురుషుడిగా మార్చబడతాడు. పరిణామ, వ్యాఘ్ర సరోవరాలలో మునిగిన యాగాశ్వం పులిగా మారిపోవడంతో, దిక్కుతోచక శ్రీకృష్ణుడిని ధ్యానిస్తూ ఉంటాడు అర్జునుడు. కృష్ణుడు ప్రత్యక్షమై యాగాశ్వానికి పూర్వపు రూపును తెప్పించి, ఆర్జునుడిని దీవించి, మాయమౌతాడు. పంపా నదీ తీరాన సీమంతినీ నగరాన్ని కావలి కాస్తున్న వారికి దొరుకుతుంది ధర్మరాజు యాగాశ్వం. దాన్ని సామ్రాజ్ఞి తన అశ్వశాలలో కట్టేయించి, యాగాశ్వం కావాలంటే తనతో యుద్ధం చేసి, విడిపించుకోమని, తన దండనాయకి వీరవల్లితో అర్జునుడికి లేఖ పంపుతుంది. తమ రాజ్యంలోని వివిధ బలాబలాలను గురించి అర్జునుడి సర్వసేనానియైన ప్రతాపరుద్రుడితో చెబుతూ ఉంటుంది వీరవల్లి. ఈలోపు విదూషకుడు చతురుడు అక్కడికి వచ్చి, వారికి వినోదాన్ని కల్పిస్తాడు. సంధిచర్చలకు సీమంతిని నగరానికి రావాలన్న కోరికతో వీరవల్లి ద్వారా సామ్రాజ్ఞికి ఒక లేఖను పంపుతాడు అర్జునుడు. ఆమె ఆహ్వానంపై అర్జున సేన   స్ర్తీ సామ్రాజ్యం చేరుకొని, అక్కడి అద్భుత నిర్మాణ వైశిష్ట్యానికి, వన శోభకు ఆశ్చర్యపోతారు . ఇక చదవండి...)

విశాలమైన ఆ రహస్య సమావేశ మందిరాన్ని భూగర్భంలో విశిష్టంగా నిర్మించారు. లోపల ఎవరేమి మాట్లాడినా బయట కాపలా కాసేవారికి ఇసుమంత కూడా వినిపించదు. సీమంతినీ సామ్రాజ్యంలో గోప్యంగా ఉంచదగ్గ కీలకమైన రాచ వ్యవహారాలన్నీ ఇక్కడే మాట్లాడుకుంటారు. ఆ నిర్మాణ విశేషాలను వీరవల్లి చెబుతుండగా, ఆశ్చర్యంతో అక్కడికి చేరుకున్నారు అర్జున సేన. మిగతా వారంతా నగర పర్యటనకు వెళ్ళగా,
అర్జునుడు, ప్రతాప రుద్రుడు సామ్రాజ్ఞితో సంధి చర్చలకు ఆ భవంతిలో ప్రవేశించారు.
కాసేపటికి అట్టహాసంగా తన రధంపై అక్కడికి వచ్చిన సామ్రాజ్ఞి, కేవలం తన గుర్విణి శక్తిసేన, దండనాయకి వీరవల్లి  వెంట రాగా, ఆ రహస్య మందిరంలోకి ప్రవేశించింది.
ముస్తాబైన ముత్యంలా, నింగి నుంచి జారిన మెరుపు తీగలా కళ్ళు జిగేల్ మనిపిస్తున్న సామ్రాజ్ఞి అందానికి ఒక్క క్షణం రెప్ప వెయ్యడం కూడా మర్చిపోయాడు అర్జునుడు. గుర్విణి శక్తిసేనను చూసి, తెప్పరిల్లి, ఆమెకు అభివాదం చేసాడు. ఆమె దాన్ని స్వీకరిస్తున్నట్లుగా తలూపి, చెయ్యెత్తి “ఇష్టకామ్యార్ధ సిద్ధిరస్తు !”అంటూ ఆర్జునుడిని దీవించింది.
అంతటి కిరీటి వినయాన్ని ఆశ్చర్యపోతూ చూడసాగింది సామ్రాజ్ఞి. ఏమి అందం, ఏమి వర్చస్సు, ఏమి రాజసం ! ఎంతటి ముగ్ధ మనోహర రూపం... బంగారం వంటి ఆ రూపంలో వజ్రాలు పొదిగినట్టు ఇమిడిన శౌర్యం, వినయం... అనుకుంటూ అతడినే చూడసాగింది. ఆ రోజు అతడు ధరించిన నీలి రంగు వస్త్రాలు, నీలాల ఆభరణాలు అతని రూపానికి మరింత శోభను కూరుస్తున్నాయి.
“పార్ధా ! ఈమె మా సీమంతినీ సామ్రాజ్ఞి ప్రమీల... ప్రమీలా, వీరే సవ్యసాచిగా పేరు గాంచిన అర్జునుల వారు, వారి సేనాని ప్రతాప రుద్రులవారు...” పరిచయం చేసింది వీరవల్లి.
పరస్పర అభివాదాలు ముగిసాకా, “అర్జునా ! మీ హస్తినలో అంతా కుశలమే కదా ! కురుక్షేత్ర సంగ్రామం ద్వారా కలిగిన కష్టనష్టాలు తీరి, ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు కదా !” కుశల ప్రశ్నలు వేసింది గుర్విణి.
“శ్రీకృష్ణ భగవానుల దయవల్ల అంతా కుశలమే పూజ్య గుర్విణీ ! మీ దేశ ప్రజలు శాంతి సుభిక్షాలతో ఉన్నట్లేగా !” బదులు చెబుతూ అడిగాడు అర్జునుడు.
“నా శిష్యురాలైన మా సామ్రాజ్ఞి ఉండగా మాకొచ్చిన లోటేమీ లేదు...” స్వరంలో ఒకింత గర్వం తొణికిసలాడుతుండగా చెప్పింది శక్తిసేన.
“అన్నట్టు, మా రాజ్యం, ఆతిధ్యం మీకు అనుకూలంగా ఉన్నాయి కదా ! ఇబ్బందులు ఏమీ లేవు కదా !” అడిగింది వీరవల్లి మాట కలుపుతూ.
“నిజం చెప్పాలంటే మీ రాజ్యం భూతల స్వర్గంలా ఉంది... మీ రాజ్య మన్ననలు, ఆతిధ్యం మహదానందం కలిగించాయి... “ఆనందంగా చెప్పాడు అర్జునుడు.
“ అర్జునా ! ఇక విషయానికి వద్దాము. అశ్వమేధ యాగాశ్వాన్ని మీరు లేఖతో విడచినప్పుడు, ఆ లేఖలో “మాతో తలపడగలిగే దమ్మున్న వీరుడు ఎవరైనా ఈ అశ్వాన్ని నిరోధించవచ్చు...” అని రాసారు కదా ! అంటే స్త్రీలు ఎవ్వరూ మీ అశ్వాన్ని నిరోధించలేరని మీ అభిప్రాయమా?” అడిగింది గుర్విణి గంభీరంగా.
“పూజ్య గుర్విణీ ! ఇటువంటి ఒక గొప్ప రాజ్యం ఉంటుందనీ, అందులో అన్నిటా మేటి అయిన మీ సామ్రాజ్ఞి వంటి రాణి ఉంటుందనీ ఎన్నడూ మేము ఊహించలేదు. అందువలన జరిగిన పొరపాటే ఇది. సామ్రాజ్ఞి శక్తి సామర్ధ్యాలను గురించి ఎంతో విని ఉన్నాము. నిస్సంశయంగా మీతో తలపడే వీరులు భూమండలం మీద లేరు. మీరు కోరుకునేది కూడా మీ వీరత్వాన్ని మేము అంగీకరించాలనే కదా ! ఇప్పుడా కోరిక తీరింది కదా ! ఇక అశ్వాన్ని మాకు అప్పగించేస్తే సమస్య తీరిపోతుంది.” పెదవులపై చిరునవ్వు చెక్కు చెదరకుండా మాట్లాడుతున్నాడు అర్జునుడు. యుక్తి బాణాలను వారిపై ప్రయోగిస్తున్నాడు.
“మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజమే అర్జునా !” నోరు విప్పింది ప్రమీల.
“శక్తి సామర్ధ్యాలలో, సైనిక బలంలో, గుండె ధైర్యంలో ఈ సీమంతినీ స్త్రీలు పురుషులకు ఏ మాత్రం తీసిపోరు. కాని, మీ మాటలకు మురిసిపోయి, యాగాశ్వాన్ని అప్పగించేస్తే, ఈ విషయం మన ఐదుగురికి తప్ప, బయటి లోకానికి తెలీదు. సామ్రాజ్ఞి పోరాడలేక అశ్వం ఒప్పగించి సంధి చేసుకుందన్న అపవాదు వస్తుంది... అదే మీతో యుద్ధం చేసి గెలిచి, తర్వాత అశ్వాన్ని అప్పగిస్తే... నేల నాలుగు చెరగులా ఎప్పటికీ మా పేరు నిలిచిపోతుంది...” తన నిశ్చయాన్ని ధృడంగా తెలిపింది ప్రమీల.
“సామ్రాజ్ఞి ! స్త్రీలతో పోరాటం శాస్త్ర సమ్మతం కాదు. అదీకాక మేము కురుక్షేత్ర సంగ్రామంలో జరిగిన రక్తపాతానికి ఉపశమనం పొందేందుకే ఈ అశ్వమేధ యాగం చేస్తున్నాము. ఇప్పుడు అశ్వాన్ని విడిపించుకోడానికి మళ్ళీ యుద్ధం చెయ్యమంటే మా మనస్సు అంగీకరించట్లేదు. లోకంలో లభించబోయే కీర్తి కోసం అనవసరంగా అమాయక ప్రాణాల్ని సమిధలు చెయ్యడం, మీవంటి యుక్తి గల పరిపాలకులకు భావ్యమా? ఆలోచించండి...” అన్నాడు అర్జునుడు అభ్యర్ధనగా.
“నిజమే అర్జున మహారాజా ! అనవసర రక్తపాతానికి మేమూ విరుద్దులమే. కాని, పరస్పర పోరుకు కాదుగా ! మీరు మా సామ్రాజ్ఞితో పోరాడండి... గెలిస్తే అశ్వం మీది, లేకపోతే మాది... సమ్మతమేగా !” అంది గుర్విణి.
“అసలు యుద్ధమే ఎందుకంటాను. మీకు కావలసినవి ఏమైనా ఉంటే చెప్పండి, ఇచ్చేసి సంధి చేసుకుందాము...” అన్నాడు అర్జునుడు.
“నెయ్యానికైనా కయ్యానికైనా సమఉజ్జీలు ఉండాలి,” అని పెద్దలు చెబుతూ ఉంటారు కదా అర్జునా ! సవ్యసాచితో సమానంగా బాణాలు వెయ్యగల ప్రతిభ ఈ సామ్రాజ్ఞికి ఉందని, అందరికీ తెలియాలిగా. అందుకే మీకు నాకు మధ్య విలువిద్యా పోరు జరగాల్సిందే!” నిశ్చయంగా చెప్పింది సామ్రాజ్ఞి.
ఇక వారితో మాట్లాడి ఉపయోగం లేదని నిర్ధారించుకున్నాడు అర్జునుడు.
అక్కడితో ఆ రహస్య సమావేశం ముగిసింది. ప్రమీలార్జునుల యుద్ధానికి రంగం సిద్ధమవ్వసాగింది.

(సశేషం)

No comments:

Post a Comment

Pages