నేటి యువత - నాటకం - అచ్చంగా తెలుగు
నేటి యువత - నాటకం 
శ్రీ రవి భూషణ్ శర్మ కొండూరు  
శ్రీమతి ఇందు కిరణ్ కొండూరు

ఆధునికత పేరుతొ సొంత కొడుకు కోడలు మధ్య విభేదాలు, సినిమా కదానాయకులే దేవుడులా భావించే మరొకడు,  ఇలా చిన్నాభిన్నంగా ఉన్న కుటుంబాన్ని ఒక తండ్రి (మన కధానాయకుడు సుబ్బారావు) ఎలా చక్క దిద్దాడు అన్న ఇతి వృత్తంతో వ్రాయబడిన నాటకం ఇది.


పాత్రలు:
కధా నాయకుడు: సుబ్బారావు
సుబ్బారావు గారి భార్య: మహాలక్ష్మి
పెద్ద కొడుకు: విశాల్
పెద్ద కోడలు: సుగుణ
రెండో కొడుకు: హరీష్
చిన్న కొడుకు: <పేరు లేదు>
పెద్ద కోడలు (సుగుణ) తండ్రి (బావ గారు): <పేరు లేదు>
పెద్ద కోడలు (సుగుణ) తల్లి (బావ గారి భార్య): <పేరు లేదు>
పై ఫ్లాటు ఓనరు: పరంధామయ్య
డాక్టరు గారు: డాక్టరు <పేరు లేదు>
స్టేజిలు:
శ్రీ సాయి మేపిల్ టవర్స్ అపార్ట్ మెంట్ లో
సుగుణ ఇంట్లో
సుబ్బారావు గారు కోడలిని ఇంటికి తెచ్చుకున్నాడు ఇంటికి వెళ్ళాక


స్టేజి #1:  శ్రీ సాయి మేపిల్ టవర్స్ అపార్ట్మెంట్లో
[అది శ్రీ సాయి మేపిల్ టవర్స్ అపార్ట్ మెంట్, అందులో 2వ అంతస్తులో ఉన్న 202 అపార్ట్ మెంట్, విద్యుత్ శాఖలో ఇంజనీరుగా చాలా కాలం పని చేసి, ఇటీవలే ఉద్యోగ విరమణ తీసుకున్న సుబ్బారావు గారిది. ఆ రెండో అంతస్థు కారిడార్ నుంచి సుబ్బారావు గారి గొంతు పెద్దగా వినబడుతోంది]
సుబ్బారావు గారు:
[విసుగ్గా]
ఐదు రోజుల క్రితం ... విశాల్ కి ... 
ఆఫీసు నుంచి వస్తూ ... వస్తూ ... ఐదు వేల రూపాయలు...
నా బ్యాంకు నుంచి డ్రా చేసుకు రారా ... అని అడిగి.... 
నా ATM కార్డు, పిన్ నెంబరు కూడా చెప్పాను....
ఇప్పటివరకు… నాకు డబ్బూ ఇవ్వలేదు? ...
పోనీ .. నేను వెళ్లి తెచ్చు కుందామా...  అంటే.... 
ఆ కార్డు నాకు ఇవ్వలేదు.... 
ఇంతకీ …. ఎక్కడకి పోయాడు … ఇంత పొద్దున్నే? 
మహాలక్ష్మి:
[కొంచెం అసహనంతో]
అబ్బ!...  అబ్బా!! ... 
మీకు అన్నీ సమస్యలేనా? 
ఎక్కడికి పోతాడు? ... వస్తాడు లెండి!.... 
కాస్త ఓపిక పట్టండి.
సుబ్బారావు గారు:
[కొంచెం అసహనంతో]
ఏంటి .... ఓపిక పట్టేది.... 
రెండు రోజుల క్రితమే .... 
నా BP మాత్రలు....  నీ షుగర్ మాత్రలు .... 
అయిపోయాయి....
మహాలక్ష్మి:
[విసుగ్గా]
అబ్బ! అబ్బా!! .... ఒక్క పూట మందు పడక పొతే .... 
ఏమి నష్టం లేదని .... 
మన డాక్టరు గారు .... 
చెప్పారు కదండీ? .... 
ఇంకా ... అంత టెన్షన్ పడతారు ... ఎందుకూ?
సుబ్బారావు గారు:
[కొంచెం కోపంగా]
నువ్వు అసలు మాట్లాడకు.
నీ గారాబం, నీ అమిత ప్రేమే వాళ్ళని పాడు చేస్తుంది. 
ఇప్పుడు మధ్యాహ్నం 12.30 అయింది ... 
స్నానం లేదు... పానం లేదు... తిండి లేదు.... 
ఆదివారం పూట కూడా ఇంటి పట్టున ఉండనే ఉండడు.... 
ఇంతకీ ఎక్కడి వెళ్ళాడు .... ఇంత పొద్దున్నే?
మహాలక్ష్మి:
[విసుగ్గా]
అబ్బ! అబ్బా!! .... పొద్దున్నే.... 6:00గంటలకి లేచి.... 
ఎవరో స్నేహితులతో కలసి .... 
ఎదో ఆట ఆడటానికి వెళ్ళాడు..... 
10-11 గంటల కల్లా వస్తాను అన్నాడు..., 
వస్తూ ఉండవచ్చు.... 
మీరు కాస్త లోపలికి వొచ్చి .... 
TVలో చాగంటి వారి ... 
ప్రవచనం వస్తుందట .... కాస్త పెట్టండి.... 
నా వంట ముగుంచి .... నేను కూడా .... కాసేపు చూస్తాను....
సుబ్బారావు గారు:
[వ్యంగ్యంగా]
చాగంటి వారిది, గరికపాటి వారిది ... 
ప్రవచనం వినటమేనా? ... 
దానికి తగ్గట్టు ... ఆచరణ ... ఏమైనా ఉందా? 
[అంటూ TVలో భక్తి ఛానల్, పెట్టాడు సుబ్బారావు.]


[ఈ లోపు పెద్ద కొడుకు విశాల్, 
ఇలా జాలీగా పాట పాడు కుంటూ ఇంట్లోకి వచ్చాడు]
విశాల్:
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది....
సుబ్బారావు గారు:
[ఇంట్లోకి వచ్చీ రాగానే సుబ్బారావు గారు విశాల్ మీద కోపంగా]
ఈ మధ్య ఎవరో సినిమాలో హీరో లాగే ఉన్నావు....  
అన్నారుట... 
అప్పటి నుంచి ఆ గడ్డం, మీసాలు పెంచాడు.... 
ఇప్పుడు ఎక్కడ  చూసినా .... ఈ వయసు వాళ్లందరూ  ....
ఇలాగే రోగిష్టి మారి వాళ్ళలాగా,.... 
అన్ని పోగుట్టుకున్న వాళ్ళలా....  ఆ మొహాలు ... పెద్ద గడ్డలు .... 
మీసాలు పెట్టుకొని, ... చింపిరి జుత్తుతో .... తిరుగుతున్నారు.... 
ఓ శుచి శుభ్రం ఏమిలేదు .... 
ఏరా ఏమిటి .... నీ పధ్ధతి .... ఏమన్నా మార్చుకుంటావా లేదా?... 
నేను ... వారం రోజుల .... క్రితం ... 
అడిగిన డబ్బు తెచ్చావా? .... నా ATM కార్డు ఏది?
[అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు సుబ్బారావుగారు]
విశాల్:
[కొంచెం అసహనంతో]
అబ్బా ... నాన్న ... వూరుకో.... 
ATM కార్డు నా జేబులోనే ఉంది.... 
డబ్బు ఈ రోజు సాయింత్రం బయటకి వెళ్లి నప్పుడు తెచ్చి ఇస్తాను..... 
ఐనా .... ఇలా .... నన్ను నిలదీసి ... అడుగు తున్నారు ....
నా వయసు ఎంతా?
సుబ్బారావు గారు:
[వ్యంగ్యంగా ఇలా అన్నారు]
ఏమోరా నీ జన్మ వృత్తాంతం అంత బాగా తెలుసుకోలేదురా నేను 
విశాల్ :
[విసుగ్గా]
చాల్లే నాన్నా, విసిగించకు
సుబ్బారావు గారు:
[వ్యంగ్యంగా]
వొరేయ్... 
నీ వయసు నాకు తెలీదు సరే... 
“ఎంతో" .... నువ్వు చెప్పు పోనీ?
సిగ్గు లేదట్రా ... ఈపాటికి .... 
ఒక కొడుకో .... కూతురో పుట్టేది..... 
పెళ్లి అయి మూడేళ్ళయింది.
పేరుకి ... ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగం .... 
ఇంకా ... 
ఎప్పుడు మారుతావు  రా?
విశాల్ : 
[కొంచెం అసహనంతో, కొంత కోపంతో]
ఇదిగో నాన్న.... 
నా ... పెళ్లి .. విషయంలో .... 
నన్ను ఎమి అనకు
మంచి ... సంబంధం అని .... 
నువ్వే .... చేసావ్... 
అదే .... నన్ను .... వదిలి పోయింది
దానికి నేనేమి చేస్తాను?
సుబ్బారావు గారు: 
[కొంచెం అసహనంతో, కొంత కోపంతో]
అదుగో .... మళ్ళీ అదే .... కూత కూస్తున్నావు?
మహాలక్ష్మి: 
[కొంచెం అసహనంతో, ఇలా ప్రాధేయపడింది]
అబ్బా! ... వూరుకోండి ....
ఇహ ఆ వివాదం లోకి వెళ్తే.... 
మీ వాద-ప్రతివాదాలు .... ఇక .... తెగవు
సుబ్బారావు గారు:
[కొంచెం అసహనంతో]
చూడు .... ఎంత .... తప్పుడు మాటలో... వాడు చెప్పేది.
ఆ అమ్మాయి బంగారం... 
మంచి సాంప్రదాయ కుటుంబం... 
వీడు ... మామూలు ... ఇంజనీరింగ్ కాలేజిలో చదివితే ... 
మరి...  ఆ పిల్ల ... JNTUలో .... MTECH ... గోల్డు మెడలిస్టు.
పెళ్లి అయినప్పటి నుంచి .... 
ఎంతో ప్రేమగా.... వీడి బైక్ దగ్గరినుంచి తుడిచి...
వంట చేసి ... బాక్స్ సద్ది పెట్టి .... 
తనూ ఉద్యోగానికి వెళ్ళేది. 
పెళ్లి చేసుకున్నప్పటినుంచి ... కంటికి రెప్పలా ... చూసు కుంది ... వీడ్ని.
వీడు ... మగ మహారాజులా ... ఇటు ... పుల్ల ... దీసి ... అటుపెట్టడు.
ఉద్యోగం ... సద్యోగం ... అంటూ ... 
రాత్రి 1, 2 .. దాక .. ఇంటికి వొచ్చేవాడు...  కాదు.
అది సరిపోదు .... అన్నట్టు ... వీడు స్నేహితులు... ఫేసు బుక్... 
వీడియోలు... ఆటలు... పార్టీలు  అంటూ.... 
ఈ అమ్మాయితో .... కాపురం సరిగా ... వెలగ బెట్టే ... వాడు కాదు. 
పై పెచ్చు ... అమ్మాయిని ... ఎడిపించుకు ... తిన్నాడు.
మహాలక్ష్మి: 
ఆ... ఆ...  
మరీ అంత .... వెనుక వేసుకు రాకండి.... 
ఆ ... అమ్మాయిని.
[అంటూ కొడుకుని సమర్ధించే ప్రయత్నం చేసింది, మహాలక్ష్మి]
సుబ్బారావు గారు:
[కొడుకు మీద అసహనంతో, కోడలు మీద ప్రేమతో ఇలా అన్నాడు]
నేను .... ఆ .. అమ్మాయిని ... 
వెనుక వేసుకు రావటం కాదు.... 
నీ....  మనస్సాక్షికి .... తెలియదా?
మనం ఎన్నిసార్లు .... పిల్లలగురించి (వాళ్ళ కాపురం గురించి) అడిగినా? 
తన సంసారం బయట పడకుండా.... 
మనవాడి...  వ్యవహారం (నిర్వాకం) చెప్పలేక... 
మనసులో దుఃఖ పడి.... 
ఏదో గుట్టుగా .... ఇన్నాళ్ళు లాక్కొచ్చింది.
ఏదో .... మూడో వాడ్నికుడా ... ఇక్కడే .... 
ఇంజనీరింగ్ కాలేజిలో చేర్పించాము కదా, 
మనమూ ... కాస్తంత విశ్రాంతి జీవితం ... 
కొడుకు కోడలుతో గడుపు దామని ....
ఇక్కడికి వస్తే.. మన వాడి విషయం (నిర్వాకం) .... 
మనకు .... ఆర్థం అయ్యింది....
విశాల్ ... ఆ పిల్లతో... 
“మా నాన్నాకు నచ్చావని ఈ పెళ్లి చేసు కున్నా... 
నువ్వు అస్సలు మోడరన్ గా ఉండవు” అని ఒకటికి పది సార్లు అంటే.. 
పాపం .... తట్టుకోలేక .... ఆ పిల్ల .... భర్తకు ఇష్టం లేని కాపురం ....
చేయలేక వెళ్లి పోయింది.
ఇదేమిటిరా?....  అని అడిగితే .. 
"ఎంటీ నాన్నా నా చేతులు ఇంకా నీ చేతుల్లో వున్నాయిగా" అంటూ ....  ఎదో ... సినిమా డైలాగులు రెండు చెప్పి ... 
“అన్నీ నీ ఇస్టాలేనా? .... మా ఇష్టాలతో పనిలేదా?” అంటాడు.
ఇంకా నయం .... వాళ్ళ తల్లితండ్రులు .... చాలా మంచి వాళ్ళు
మనం వెళ్ళినా .... మంచిగా .... పలకరిస్తున్నారు.
మన అబ్బాయిని .... అమ్మాయిని ... మళ్ళీ కలపాలని... 
వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
మహాలక్ష్మి : 
ఆ.. ఆ... ప్రయత్నిస్తారు... 
ఇంకా వాళ్ళకి ఆడ పిల్లలు ఉన్నరుగా? 
మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవద్దూ?... 
అందుకే అణిగిమణిగి ఉన్నట్టు పెద్ద నటన.
[అంటూ చేతి వేళ్ళను టప టప అని విరిచింది మహాలక్ష్మి]
సుబ్బారావు గారు:.
[భార్య మీద కోపంతో]
అదే... అదే... ఆ...  గోరోజనమే మానుకో... 
వంటికి ఇంటికి మంచిది.
నీ కొడుక్కి కాస్త బుద్ధి చెప్పు,
మొగ పిల్లల తల్లితండ్రులం ... అనంగానే ... 
వస్తుంది లోపల్నుంచి ఎక్కడా...  లేని అహం.
ఇది వరకు రోజులు కావు ఇవి. 
మొగ  పిల్లల్ని ఆడ పిల్లలు సెలెక్ట్ చేసుకునే రోజులు. 
ఆడ పిల్లలదే ఇప్పుడు హవా...
వాళ్ళు చక్కగా ఉంటారు, 
మంచి చదువులు చదివారు, 
వారికి పెళ్ళిళ్ళు కాకుండా పోవు అది గుర్తు పెట్టుకో.
ఏ... ఆ అమ్మయిని...  నువ్వు కన్నట్టు... 
నవ మాసాలు మోసే కనలేదా ? వాళ్ళమ్మ కూడా....
అంతకన్నా ... నువ్వేమన్నా ప్రత్యేకత చేసావా?
అసలు నువ్వు చెడగొడుతున్నావ్ వీళ్ళని బాగా వెనుక వేసుకు వొచ్చి.
విశాల్:
[ఇలా తల్లిని సమర్ధించే ప్రయత్నం చేశాడు, విశాల్]
ఎంటి నాన్న పాపం అమ్మని తిడతావ్
అసలు నీకు ఏమి తెలుసు?
ప్రపంచం అంతా ముందుకి వెళ్ళిపోతోంది.. 
ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అంతా పేస్ బుక్కు, 
వాట్సాప్, ఫ్రెండ్స్, లేట్ నైట్ పార్టీలు...
ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండు అంటే, మీ కోడల్లా పాత చింత కాయ పచ్చడిలా ... 
ఎవ్వరు ఉండటం లేదు.
భర్త తోనే కాదు భర్త ఫ్రెండ్స్ తో పార్టీలు పబ్బులలో తిరగాలి.
పెళ్లి చేసుకొంగానే పిల్లలూ, ఒక కుటుంబరావు లాగ తయారవడం
ఇది కాదు నాన్నా...
సుబ్బారావు గారు:
[వ్యంగ్యంగా]
ఆ ... ఆ... మేము కూడా ... TVలలో చూస్తూనే ఉన్నాము...
ఈమధ్యే ... ముందు పార్టీలు... ఆ తరువాత ... ప్రొఫైల్ ఫోటోల్లో ...
మొగుడి ఫోటో బదులు ... మొగుడి ఫ్రెండ్స్ ఫోటోలు .... 
ఆ తరువాత ... ఆత్మ హత్యలు ... మేము చూస్తూనే ఉన్నాము.... 
ఈ మాత్రం నాలెడ్జి... మాకు ఉంది....
[అంటు వుండగా రెండో కొడుకు హరీష్ వొచ్చాడు]
హరీష్ :
[వెటకారంగా]
అబ్బో!! ఏంటి అన్నా?... 
ఈ రోజు ... 100 days ఆడిన మూవీలా ... నాన్న....
హాట్... హాట్... గా వున్నాడు?
సుబ్బారావు గారు:
[కొంత కోపంతో కొంత వ్యంగ్యంగా సుబ్బారావు ఇలా గారు]
ఏమి నాయనా.... తమరి నిర్వాకం కొంచెం చెప్పండి?
అదిగోవే....  నీ కొడుకు.... హావభావాలు వేషంలో....
యేక్కడైనా ..... ఇంజనీరింగ్ చదివిన వాడిలా వున్నాడా?
హరీష్ : 
[వెంటనే హరీష్ వెటకారంగా]
ఎంటి నాన్నా టై కట్టుకుని తిరగాలా?
సుబ్బారావు గారు: 
[కొంత కోపంతో కొంత అసహనం తో]
లేదురా!! ఓ నల్లగుడ్డ తలకు చుట్టి ...  కన బడుతోందిగా, 
ఆ గడ్డం, ఆ చెమట...  అబ్బో  చాలు నాయన చాలు...
ఏమేవ్ .... చూసావా నీ కొడుకుని? 
వీడికే చిన్నప్పుడు కృష్ణాష్టమికి వేషం వేసి మురిసి పోయావ్
వీడు రేసుగుర్రం వచ్చినప్పుడు  అల్లుఅర్జున్ లాగా
ఇప్పుడు బాహుబలి చూసి ... ప్రభాస్ లాగా....  ఎప్పటి కప్పుడు మారుతూ ఉంటాడు... 
ఏదో ఒకసారి ఆడియో ఫన్క్షంలో .... అరిచే వాళ్ళల్లో ..... 
వీడి మొహం ఒక క్షణం  అలా TVలో కనబడిందిట 
ఇక అ అరిచే వాళ్ళ బ్యాచ్ లో చేరిపోయాడు.
చిన్నోపోన్నో వుద్యోగం చూసుకొరా? పెళ్లి చేస్తాను అంటే
దీక్షట... ప్రభాస్ లాగా ... అని  ఏళ్ళ బట్టి చెప్పుతున్నాడు.
వీడి వాలకం చూస్తె... వీడికి పెళ్లి ఈ జన్మకి అవదు.. వీడు చేసుకుంటాను అన్నా? 
పిల్ల తల్లిదండ్రులు ముందుకు రావద్దూ?
మహాలక్ష్మి : 
మరీ... విడ్డూరం కాక పొతే.. ఊరుకోండి... వాడికి ఇప్పుడే పెళ్లి ఏంటి...
పది మంది వింటే మీ వాలకం చూసి నవ్వి పోతారు.
[అంటూ హరీష్ జుత్తు కొంచెం సవరించింది తల్లి]
హరీష్:
నాకు సినిమాలంటే ఇష్టం అందులో నన్ను చేరనీయవ్ 
సుబ్బారావు గారు:
[కొంచెం అసహనంతో]
అబ్బో... ఇవన్నీ... నేను చేయనిస్తున్నా ననేనా?
అయినా అప్పుడేమో...  మా ఫ్రెండ్స్ ... లాంగ్ టర్మ్ కోచింగు లో చేరారు... 
అందరూ ఇంజనీర్లు అవుతారు... 
నువ్వేమో... చేర్పించవు.... 
నేనే ఇలా మిగిలి పోతున్నా... అని ఏడిస్తే...  
ఒకటి కాదు రెండు కాదు ... ఐదు లక్షలు పోసి .... చేర్పించా...
నువ్వు బయటికొచ్చి 4  ఏళ్ళు అయింది
ఇప్పుడు కొత్తగా, "అదేదో సినిమాలో హీరో కుక్ (Chef) అయ్యాడుట” .... 
అది చూసి వీడికీ పుట్టింది.... 
ఆ సినిమా వాళ్ళు ఇట్లాంటివి చూపించి  నేషనల్  అవార్డు తీసుకుంటారు
వీడి లాంటి  వాళ్ళు డైలాగు ఒక్కటే తీసుకొని కాలం గడుపుతారు.
దీన్నే పులిని చూసి నక్క వాత పెట్టు కోవడం అంటారు    
హరీష్:
[కొంచెం అమాయకంగా]
అప్పుడు  నా ఇంట్రస్తు ... ఇది ... అని తెలుకో లేక పోయాను ....
సుబ్బారావు గారు: 
[కొంచెం అసహనంతో]
అది సరేరా...  ఈ రోజు నీకు సినిమా అంటే ఇంటరెస్ట్.
ఇంకో రెండు మూడు ఏళ్ళు అయ్యాక ... 
నీ ఇంటరెస్ట్ ఏది అవవచ్చో కొద్దిగా...
చూచాయగా చెప్పావంటే?
ఇప్పటినుంచే నేను ... మీ అమ్మా .... మెంటల్ గా ప్రిపేర్ అవుతాము.
అయినా ... నీ గ్రూపులో అందరూ నీ బాపతేనా? 
ఎవడన్నా .... చక్కగా చదివి ... ఉద్యోగం చేస్తున్నారా?
హరీష్: 
[కొంచెం అయోమయంగా]
అంటే? ఏంటి ... మీ ఉద్దేశ్యం?
సుబ్బారావు గారు: 
[కొంచెం వెటకారంగా]
అదే, నీ స్నేహితులందరూ ... ఇంజనీరింగ్ అయింది అనిపించి.. ఖాళీగా గాలికి తిరిగే సుందోప సుందులేనా? అని... 
హరీష్:
[కొంచెం విసుగ్గా]
అబ్బా, అమ్మా బయట ఉన్నంత సేపు ఫ్రెండ్స్ అందరం ఎంత సంతోషంగా వుంటామో
మూవీ రివ్యూస్, కలేక్షన్స్ గురించి తలచుకుంటూ ఉంటాము.
నాన్నని .... చూసి  .... ఫ్రెండ్స్ ఎవరు అపార్ట్ మెంట్ సైడే రావటం లేదు
ఛీ.. ఛీ.. ఛీ... ఇది ఇల్లా నరకమా?
[అంటూ కోపంగా స్నానాల గది వైపు నడిచాడు హరీష్]
మహాలక్ష్మి:
[కొంచెం నీరసంగా ... ]
ఏవండీ 2గంటలు అయింది భోజనం చేద్దామా? నీరసంగా వుంది.
సుబ్బారావు గారు:
[కొంచెం వెటకారంగా]
నాదేముంది, నేను రెడీ... 
మరి నీ ప్రబుద్ధులు ... అలాగే వస్తారా? .... 
భోజనానికి, వేషాలేమన్నా మారుతాయా?
[అందరూ స్నానాలు చేసి భోజనానికి వొచ్చారు]
సుబ్బారావు గారు:
[వెటకారంగా]
ఏడీ....  నీ .... మూడో రత్నం?
మహాలక్ష్మి:
[కొంచెం పెద్ద గొంతుతో]
ఒరేయ్!!! రా...  రా... మీ నాన్న పిలుస్తున్నారు 
సుబ్బారావు గారు:
[వెటకారంగా]
వాడికి వినబడడం మానేసి చాలా కాలం అయిందిగా?
మహాలక్ష్మి :
[కొంచెం అయోమయంగా]
అదేమిటండీ?
సుబ్బారావు గారు:
[వెటకారంగా]
అవునే ... 24 గంటలు.. 
ఆ చెవుల్లో ... యేవో దారాలు ... పెట్టుకుని ఉంటాడు కదా?
ఒరేయ్ ... విశాల్ .... వాడికి ఒక మెసేజ్ కొట్టరా?
భోజనానికి  రమ్మనమని... 
[విశాల్ మెసేజ్ కొట్టాడు]
సుబ్బారావు గారు:
[కొంచెం వెటకారంతో ..  కొంచెం ఆశ్చర్యంతో]
వాడు నడుస్తూ... ఫోను లో ఎదో నొక్కుకుంటూ...  నవ్వుకుంటూ ... వస్తున్నాడు.. 
వాడి కళ్ళు 3 గజాల లోతుకి పోయి... 
కళ్ళకు సంబంధిచిన ఎదో వింత వ్యాధి వచ్చిందేమో అన్నట్టుగా వున్నాడు.
నాయనా కొద్దిగా కిందా పైనా పక్కనా చూసుకొ
కంచంలో చెయ్యి పెట్టాల్సింది పులుసు గిన్నెలో పెడుతున్నావ్
మూడో కొడుకు:
చూస్తున్నా లే, అమ్మా .... 
నాకు కలిపి బాక్స్ లో ... 
ఇచ్చేయక పోయావా?
నా రూములొ తినేవాడిని గాదా.
సుబ్బారావు గారు:
[వెటకారంగా]
తమరు ... అన్నం తినే ... ఈ కాస్త టైములో .... 
ఎవడి మెసేజ్ .... అన్న మిస్సవుతావా? 
ఏమేవ్... వీడిని రాబోయే అతి తక్కువ కాలంలో .... 
మంచి కళ్ళ డాక్టరుకి చూపించాల్సి వోచ్చెట్టు ఉంది.


[సుబ్బారావుగారు తినడం అయిపోతోంది కానీ మిగత వాళ్ళు ఎవరి మొబైల్ ఫోన్ తో వాళ్ళున్నారు అలాగే ఇంకో 20 నిమిషాలు గడిచింది]
సుబ్బారావు గారు:
[తన భార్యతో..  మెల్లగా ఇలా అన్నాడు... ] 
ఏమేవ్, చూస్తున్నావా ... వీళ్ళ వాలకం...
ఎవరికీ వారు...  వారి మొబైల్ ఫోనులు చూసు కుంటూ... 
వాళ్ళల్లో వాళ్ళే వీడియోలు చూసు కుంటూ ... ఉన్నట్టుండి నవ్వుకుంటు....
ఎదో మానసిక వ్యాధి గ్రస్తుల్లగా ప్రవర్తిస్తున్నారు... 
వీళ్ళని మనం ఇలా పెంచ లేదే ... 
వీళ్ళు ... మంచి చెడు మాట్లాడు కోవడం లేదు.. 
ఒక సంతోషం లేదు... 
ఒక మాట లేదు.. 
ఇంతకాడికి అందరూ కలిసి భోజనం చేయటం.. ఎందుకు... ?


[ఇలా ఆలోచన చేసి  సుబ్బారావుగారు]
సుబ్బారావు గారు:
[ఆ రోజు రాత్రి, సుబ్బారావు గారు భార్యతో పడక గదిలో]
ఇది ఇలా కొనసాగా రాదు... 
మనం వెనక ఉండి ఏదో ఒక పరిష్కారం ఆలోచన చేయక పొతే... 
పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు విడిపోతున్నారు... 
సొంత నిర్ణయాలు బెడిసి గొట్టి ... 
కుటుంబాలు చెల్లాచెదురు అయి ... 
ఆత్మహత్యలు చేసుకుంటారు...
పెళ్ళిళ్ళు చేసుకోరు...  సహా జీవనం అంటున్నారు.
నలుగురితో మెలగటం, కలవటం తగ్గి....
ఒక మానసిక వ్యాధి గ్రస్తులవుతారు


నేను ఒక సీనియర్ సిటిజెన్ గా ... 
ఈ దేశానికి బాధ్యత లేని కొడుకుల్నిచ్చి ద్రోహం చేశానని పించు కోకుండా,
కనీసం నా ఇల్లు నేను మార్పు  కుంటానని అనుకుంటూ 
ఈ సమస్య పరిష్కార వేటలో బడ్డాడు.
సుబ్బారావు గారు:
ఏమేవ్ ... నువ్వు నాకో మాట ఇవ్వాలి, మన కొడుకులకి బాధ్యత నేర్పించటం లో సహకరించాలి, మనం పెద్ద వాళ్ళమయ్యాము, 
వాళ్ళకి ఒక దారి చూపించే బాధ్యత మన మీదుంది అవునంటా వా? కాదంటావా?
మహాలక్ష్మి:
అవుననే అంటాను 
సుబ్బారావు గారు:
అయితే ఇక పైన నేను ఏది చేయమంటే అదే చేయి.
మహాలక్ష్మి:
సరే అలాగే మీకు మాట ఇస్తున్నాను
[అంటూ చేతిలో చేయి వేసింది]
సుబ్బారావు గారు:
సరే రేపు పొద్దున్నే మనం బయలు దేరి కోడలు దక్కరికి వెళ్లి తీసుకొద్దాము.
మహాలక్ష్మి:
[కొంచెం ఆశ్చర్యంగా]
అయ్యో!! ఇదేమి చోద్యం... మనం మగ పిల్ల వాళ్ళం.
సుబ్బారావు గారు:
[కొంచెం కోపంగా]
అదే ... ఆ... ఆలోచనే వద్దు అన్నది...
మనకు మన కొడుకు సంసారం ముఖ్యం
ఆ పిల్లని బాధ పెట్టింది మన వాడు
సత్యం, న్యాయం, ధర్మం అలవాటు చేసుకో
వూరికే పూజాలు చేస్తే, ప్రవచనాలు వింటే పుణ్యం రాదు
తప్పుడు పనులు ఆలోచనలు మానుకుంటే దేవుడు సహకరిస్తాడు
ఆ పిల్ల దుఃఖము మన కుటుంబానికి క్షేమం కాదు.
ఈ విషయం విశాల్ కికూడా తెలియనివ్వకు.
నేను చెప్పినదాంట్లో ఏది నువ్వు ఆచరించక పోయినా పతి ద్రోహానికి వొడి కట్టినట్టే.
[అలాగే అంటూ తలకాయ ఊపి... కిక్కురుమన లేదు మహాలక్ష్మి]


స్టేజి #2: [కోడలు ఇల్లు ఇంటి దగ్గర... ]
సుబ్బారావు గారు:
అమ్మా నువ్వు చక్కగా చదువుకున్నావు
మంచి ఉద్యోగం చేస్తున్నావు
మనవి సమాజంలో పరువు మర్యాద గల కుటుంబాలు
సంసారం అన్నాక యేవో చిన్న పొన్నా పోరపత్సాలు ఉంటూనే వుంటాయి
కాబట్టి మనందరం కలసి కుటుంబాన్ని నిలబెట్టు కుందాం మన ఇంటికిరా తల్లీ.
బావగారు మీరైనా చెప్పండి.
[అంటూ ప్రాధేయపడ్డారు సుబ్బారావు గారు, వెంటనే బావ గారు]
బావగారు:
మీరు రెండు రోజుల క్రితం ఫోను చేసి అత్తగారు కూడా మరీ మరీ తలుచుకుంటున్నారు  అన్నప్పటినుంచి ... అమ్మాయికి ... సర్ది చెప్పి ఒప్పించము.
మీ మావా గారు వొచ్చారు... ఇంకోసారి ఇంత దూరం ... రానీయరని చెప్పాను.
సుబ్బారావు గారు:
అమ్మ నువ్వు వాడిని మన దారిలోకి తెగలవని నాకు గట్టి నమ్మకం
వాడు మారాడని చెప్పను కానీ ఇంత చదువుకున్నావు 
నీ ప్రేమతో ఇన్నాళ్ళు గడిపావు
నువ్వు మార్చగలవని ... నాకు, అత్తగారికి అపరిమిత నమ్మకం.
బావగారు:
వస్తుంది లేండీ.. బావగారు మీరు దిగులు పడకండి
ఆ కాఫీ తాగండి, ఏమే ... దీని బట్టలు సర్దావా?
బావగారి భార్య:
ఆ...  అ... అంతా...  రెడీ.


స్టేజి #3: [సుబ్బారావు గారు కోడలిని ఇంటికి తెచ్చుకున్నాడు ఇంటికి వెళ్ళాక]
సుబ్బారావు గారు:
అమ్మా నువ్వు వాడికి కావలసినట్టు ఎప్పుడూ  ఉంటూనే వున్నావు
కానీ ఇప్పుడు వాడి మార్గంలో వున్నట్టు ఉంటూ
మన మార్గంలోకి వాడ్ని తీసుకొద్దాము.. సరేనా?...
కానీ కొంచెం సమయం పట్టొచ్చు, ఏమంటావు?
సుగుణ:
తప్పకుండా అండీ
మీరు ... అత్తయ్య గారు ... 
అండగా ఉంటే... 
విశాల్ ని మన మార్గంలో పెట్టు కుంటాను...


సుబ్బారావు గారు:
అయినా నీ చేతి కాఫీ తాగి చాలా రోజులయింది ఒక కప్పు కాఫీ ఇవ్వు.
అచేత్తోనే కొంచెం టీవీ పెట్టి వెళ్ళు ... 
సుగుణ:
తప్పకుండా మ్మవయ్య గారు...  
సుబ్బారావు గారు :
మహాలక్ష్మితో --  కోడలు  ఇంట్లో కనబడుతుంటే ఒక సమస్య తీరినట్టుంది.
మహాలక్ష్మి:
అవునండీ... మీరు అంటే... మొదట్లో అర్ధం కాలేదు కానీ .... 
ఇప్పుడు అనిపిస్తోంది
ఫ్లాట్లో అందరూ కోడలు వొచ్చిందిగా? అంటున్నారు
సుబ్బారావు గారు:
ఆ...  ఆ... అంటారులే ... 
అప్పుడు వెళ్ళింది అన్నారు....  
ఇప్పుడు వచ్చింది అంటారు
అయినా అవన్నీ పట్టించుకోకు
ఆ అమ్మయి మీద ... అయిన దానికి... కానిదానికీ ... విరుచుకు పడకు.
కొడుకు సంసారం ముఖ్యం వాళ్ళిద్దరూ వొకరికి వొకరు కావాలి
మనం శాశ్వతం కాదు
బాగా గుర్తు బెట్టుకో
నాకు నువ్వు నీకు నేను మాత్రమే 
కొడుకులు, కోడళ్ళు ... వాళ్ళు వాళ్ళు ఒకరికి ఒకరు 
మహాలక్ష్మి:
సరే నండి... నేను ఏమీ ... మాట్లాడను... సరేనా?
అదుగో ... టీవిలో చూడండి.. హడావిడి, ఏదో సినిమా ఆడియో ఫన్క్షన్ లో ఎవరో కుర్రాడికి తీవ్ర గాయాలు, ఫాన్స్ అసోసియేషన్ తగవు బ్రేకింగ్ న్యూస్.
అయ్యో... అయ్యో... మన వాడే నండీ ... 108లో తీసుకెల్లటం కనబడుతోంది.
సుబ్బారావుగారు:
[వెంటనే]
అయ్యో ... ఏంటీ ఘోరము... నేను హాస్పిటల్ కి వెళ్లి వస్తా... 
[మహాలక్ష్మితో చెప్పి బయలు దేరి వెళ్లి పోయారు సుబ్బారావుగారు.]
[హాస్పిటలు ట్రీట్మెంటు అన్నీ అయ్యి ... ఒక వారం తరువాత ... కొడుకుని  బ్యాండేజిలతో ఇంటికి తీసుకొచ్చాడు].
సుబ్బారావుగారు:
[తన భార్యతో]
హీనపక్షంగా ఒక నెల రోజుల పాటు బెడ్ రెస్ట్ ట
[అంటూ దుఃఖపడ్డారు సుబ్బారావుగారు]
[అలా కొడుకుకి సేవచేస్తూ వున్నాడు, 
ఒక రోజు పరామర్శకి  
పై ఫ్లాటు పరంధామయ్య గారు వచ్చారు] 
సుబ్బారావు గారు:
[తను కూర్చున్న .. సోఫా లోంచి లేస్తూ... ]
రండి... రండి ... పరంధామయ్య గారు..  ఎలా ఉన్నారు? 
పరంధామయ్య గారు:
మేము కులాసానే.. మీ అబ్బాయి ఎక్కడా?  వాడు ఎలా ఉన్నాడు?....
సుబ్బారావు గారు:
ఇప్పుడే కాస్త కోలుకుంటున్నాడు .. 
ఆ గదిలో ఉన్నాడు .... లోపలి రండి ... చూద్దురు గాని.
పరంధామయ్య గారు:
[హరీష్ పడుకున్న మంచం దగ్గరికి వొచ్చి..... ]
ఏ... నాయనా ... హరీష్...   ఎట్లా ఉంది ఆరోగ్యం? 
ఎన్ని రోజులలో నడవచ్చు ... అన్నారు .... డాక్టరు?
హరీష్:
ఏమో అంకుల్...  
కానీ ఇలాగే ... పడుకోవడం ... చాలా కష్టంగా వుంది.
పరంధామయ్య గారు:
[అది వింటూ హరీష్ కి ....  ఇలా హిత బోధ చేసాడు ...]
అవును...  నాయనా...  ఎంతో కష్టం.
ఇప్పటికే... నెల రోజులయింది
బయట... నువ్వులేక పోయినా... 
ఆడియో ఫన్క్షన్లు బాగానే జరుగుతున్నయే?
అయినా మీ కుర్రాళ్ళకి పెద్ద వాళ్ళు చెప్తే నచ్చుతుందా?
నా బుర్ర ... ఏమి అనుకోవకు బాబు.... 
ఏదో పెద్ద వాడిని కదా అడుగుతుంటా... అంతే.
అయినా మీకు పోలీసుల దెబ్బలు....
మీ హీరోలకేమో పోలీసు ప్రోటేక్షను... అదేమిటో.... 
నెల రోజుల బట్టి మీ నాన్న నీపై దిగులుతో సగం అయ్యాడు....
ఎంత సేవ చేస్తున్నాడొ? ఈ వయసులో.... 
మహానుభావుడయ్య మీనాన్న...
అయినా మీ హీరో గారు మాత్రం .... నువ్వున్నా లేక పోయినా
ఇంకో సినిమా కూడా రిలీజ్ చేశాడు నీకు తెలుసా?
ఆ శతకోటి బోడి జంగాల్లో నువ్వొకడివి......


నువ్వేమో ఆ సదరు హీరోని భుజానేసుకోని తిరిగావు...
నీకు గాయాలయితే మాత్రం మీ నాన్న ...
నిన్ను భుజానేసుకొని బాత్రూమ్ కి ... వాటికీ....  తీసుకెళ్తున్నాడు ఎందుకంటావ్?


నీ పిచ్చి భ్రమ కాకపొతే? 
నీ తండ్రికి నీ మీద  ఉన్నంత ప్రేమ, 
నీ హీరోకి నీ మీద ఎందుకుంటుంది, చెప్పు?
అ సదరు హీరోకి వాడి తండ్రి మీద
వాడి పిల్లల మీద ప్రేమ వుంటుంది కాబట్టి 
వాడు నటన అనేది వృత్తిగా భావించి 
వాడి ఇల్లు వాడు పోషించు కుంటున్నాడు.
మీరు అంతే చేయాలి... 
ముందు మీ తండ్రి తరువాత నీ పిల్లలు అని ఆలోచన చేస్తే... 
మీ హీరోల మీద అంత మమకారాలు పెరగవు.
అయినా ఏదో పెద్ద వాడిని అన్యధా భావించకు ... వస్తాను...
[అని చెప్పి ... వెళ్ళిపోయాడు పరంధామయ్య]
హరీష్ :
[అంతా విని... హరీష్ ... తనలో తాను ... ]
ఏమిటి వచ్చి పరామర్శించే వాళ్ళందరూ....
నాన్న ... గురించి ...... మంచిగా ... చెప్తున్నారు?
అవును ... ఈ టైములో ... నాన్న ... లేకపోతె ... 
నాకు ... ఎంతో... కష్టమయ్యేది.... 
నేనూ ... తొందరగా ... కోలుకోవాలి .... 
నాన్నని ... ఇక ... ఇబ్బంది పెట్టకూడదు....
సుబ్బారావు గారు:
[ఇంతలో సుబ్బారావు గారు కొంచెం ఆశ్చర్యంగా]
అయ్యో పరంధామయ్య గారు ... కాఫీ తెచ్చే లోపు వెళ్ళారా?
సరే గాని పెద్దవాడుకదా... ఆయన నీకు చాలా బోరు కొట్టించారేమో?
హరీష్:
[కొంచెం బాధతో, కొంచెం సంతోషంగా]
లేదు నాన్నా  .... ఆయన ... భలే తెలివిగా.... 
మీ హీరో సినిమా ఇంకోటి రిలీజు అవుతోంది.... 
నువ్వు లేక పోయినా...  సినిమా ఆగలేదని ... 
చమత్కారంగా ... చెప్పడు నాన్నా.
[హ హ హ ... తండ్రీ కొడుకులు ఇద్దరూ తృప్తిగా నవ్వుకున్నారు]


[సుబ్బారావు గారు, తరువాత ఒక సారి డాక్టరు దగ్గరికి వెళ్ళినప్పుడు తన మూడో కొడుకు గురించి చెప్పారు. ఆ డాక్టరు ఒక మంచి మానసిక నిపుణుడు దగ్గరికి చూపనమి సలహా ఇచ్చారు.]
డాక్టరు:
మంచి సమయానికి తీసుకొచ్చారు మీ అబ్బాయిని
ఇంకా ఆలస్యమయితే  చూపుకి కూడా ప్రమాదం వచ్చేది.
ఈ Smart Phoneలో, FaceBookలు, WhatsApp Chatingలు, Videoలు, ఫోటోలు, లైకులు కొట్టాలి అనే ఆత్రంతో 24గంటలు  ఫోనులోనే ఉండి మానసికంగా బలహీన పడి “FAD- Facebook Adiction Disorder” అనే వ్యాదికి గురిఅయ్యి. ఈ కాలం యువత చూపుని కూడా కోల్పోతున్నారు. ఇటీవల ఒక సంస్థ చేసిన పరిశోధనలో 2020 కల్లా 40% యువతకి ఈ FAD జబ్బుకి గురి అయ్యే అవకాశాలున్నాయని తేలింది.
సుబ్బారావు గారు:
[కృతజ్ఞతాపూర్వకంగా]
చాలా మంచి విషయం తెలియ జేశారు డాక్టరు గారు. 
నాకు తెలిసిన వారందరికీ ఈ విషయం తెలియ జేస్తాను.


[ఆ ... తరువాత .... కొన్ని రోజులకి.... ఒక ఆదివారం మధ్య్యన్నం 
భోజన సమయంలో  అందరూ కలిసి సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా]
సుబ్బారావు గారు:
[సంతోషంగా ఇలా అన్నారు]
నాగరికత, సాంకేతిక విప్లవాలు సంసారల్లోకి చొరబడి సమస్యాత్మకం కాకూడదు
మావన జీవన శైలిని అపసవ్య మార్గం లోకి మళ్ళించ కూడదు... 
ఈ FBలు, WAలు,ఆడియోలు, వీడియోలు, మూవీస్ అన్నీ అవసరమే...
కానీ...  మానవ సంబందాలకు.. అవి ఎన్నటికీ ...   ప్రత్యామ్నాయము..
ప్రతిబంధకము కాకూడదని.... 
ఈ విషయం .... మీరు.. మీ పిల్లలకి కూడా నేర్పించండి... 
[అంటూ ... ఇంకా ఏదో చెప్ప బోగా ... ]


కుటుంబ సభ్యులందరూ:
[ముక్త కంఠంతో]
వామ్మో!!! నా....న్న.... మళ్ళీ .... క్లాసు పీకుతున్నాడు .... బాబోయి ... 
అంటూ ... అందరూ .... 
మనసారా నవ్వుకున్నారు...


[కధ కంచికి మనం ఇంటికి...]
***

No comments:

Post a Comment

Pages